Wednesday, 27 July 2011

చిరునవ్వులతో బ్రతకాలి...

డియర్ ఫ్రెండ్స్!
 నవ్వు నాలుగు విధాల స్వీటు అనడం మీకు తెలిసినదే. స్వర్గీయ జంధ్యాల గారు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగమని చలోక్తి విసిరారు. నవ్వడం వలన కలిగే లాభాలను తెలుసుకుందామా! మనసారా సదా నవ్వుతూనే ఉందామా?
1. నవ్వుతూ ఉందటం వలన మనలో ఆకర్షణ శక్తి పెరుగుతుందిః
సదా నవ్వుతూ ఉండటం వలన చిరునవ్వు చిందించడం వలన మన ఆకర్షణ శక్తి పెరుగుతుందనేది అక్షర సత్యం. కొత్తవారెవరైనా ఏదైనా విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించేటపుడు ఎవరైతే నవ్వు ముఖం కలిగి ఉంటారో వారి దగ్గరకి వెళ్ళి ఆ విషయం అడుగుతారు. సీరియస్ గా ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి విముఖత చూపుతారు. చిరాకుగా, కోపంగా లేదా ఏడుపుగొట్టు మొహాన్ని ఎవరూ ఇష్టపడరనేది మనందరికీ తెలిసిందే. అదే నవ్వుతూ సరదాగా కనపడే వారు అందర్నీ తనవైపు ఆకర్షించుకుంటారు. మీరు ఏ హైదరాబాదో, ముంబాయో వెళ్ళారనుకోండి  ఎవరి ఎడ్రస్  తెలుసుకోవాలనుకోండి ఎడ్రస్ కాగితం పట్టుకొని నిల్చున్నారు. ఎదురుగా బస్ స్టాప్ లో ఇద్దరు వ్యక్తులున్నారు   ఒకడేమో చిరాకు మొహమేసుకొని ఉన్నాడు. మరొకతను నవ్వుతూ  ఆహ్లాదంగా ఉన్నాడు మరి మీరు ఎడ్రస్ అడగటానికి ఎవరి దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడతారు?
2. నవ్వు మన మూడ్ ని మారుస్తుంది;
ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు గట్టిగా నవ్వడానికి ప్రయత్నించండి. తప్పని సరిగా అన భావోద్వేగాలు అదుపులోకి వచ్చి తేలికవుతాం. మనసంతా నిండియున్న బరువు తీరి నట్టు అవుతుంది. శంకర్ దాదా సినిమాలో లాఫింగ్ థెరపీ ని మన లింగం మామ అదే హిరోయిన్ తండ్రి అయిన కాలేజ్ డీన్ ఎలా ఉపయోగించేవాడో చూసాం కదా! మరేం మూడ్ బాగోలేదనిపించినపుడు మంచి జోక్ ని ఫ్రెండ్ తో పంచుకోవడమో , కార్టూన్ చానల్ ని చూదటమో చేసి బరువు దించుకుందాం. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలతోనే బలి చేయవద్దని పెద్దయన చక్కగా పాడి మరీ చెప్పారు కదా! మనం విని నడుచుకోక పోతే ఆయన మూడ్ మారిపోవచ్చు.
3. నవ్వు ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుంది.;
కళ్ళకలకలు వచ్చినపుడు ఒకరికి సోకితే అందరికీ ఎలా వ్యాపిస్తుందో అలాగే నవ్వుకూడా అంతే. ఒక గ్రూప్ లో అంతా నవ్వుతూ ఉన్నప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి చేరితే వారికి సందర్భం మరియు విషయం తెలియకపోయినప్పటికి ఆందరితో కలసి తెగ నవ్వేస్తాడు. ఎందుకు నవ్వుతున్నామని మనం అడిగితే మీరు నవ్వుతున్నారు కదా అంటాడు. మనకి తెలియని వాళ్ళు ఏదైనా విషయానికి నవ్వుతుంటే మనం కూడా శ్రుతి కలుపుతాం. తెలియని వ్యక్తి చచ్చి ఏడుస్తుంటే వారితో పాటు  మనం ఏడవం సరికదా జాతస్య ధ్రువో మృత్యు; అని వేదాంతం చెప్పడానికి రెడీ అవుతాం. అంటే నవ్వడం ద్వారా మన సైన్యాన్ని పెంచుకుందాం.
4. నవ్వు మన మానసిక శారీరక ఒత్తిడి ని తగ్గిస్తుంది;.
తీవ్రమైన పని ఒత్తిడితో మానసికంగా శారీరకంగా అలసిపోయినపుడు మనసారా నవ్వగలిగితే మంచి సరదా అయిన సంభాషణ పంచుకుంటే మనసంతా తేలికై ఆహ్లాదంగా ఉంటుంది. మన ఆలోచనలలో మార్పు కలిగి మన అలసట గురించి చికాకుల గురించి మరచి ప్రశాంతత పొందగలుగుతాం. మన ఒత్తిడి తగ్గి మన పని పై ధ్యాస పెట్టగలుగుతాం. ఒత్తిడియొక్క చిహ్నాలు మన మొహం పై మాయమై మందహాసం తొణికిసలాడుతుంది.
5. నవ్వు మన రోగ నిరోధక శక్తిని పెంచుతుందిః
నవ్వడం వలన మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఫ్లూ మరియు జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాక రిలాక్స్ అయ్యేందుకు నవ్వు బాగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యం మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
6. నవ్వడం వలన మన రక్తపోటు తగ్గుతుందిః
ఈ మధ్య జరిగిన పరిశోధనలలో నవ్వడం వలన అధిక రక్తపోటుతో బాధ పడుతున్నవారిలో చాలా మెరుగుపడే అవకాశం ఉంటుందని తేలిందట. స్పిగ్మో మానో మీటర్ లో మీ రక్తపోటు కొలుచుకునే ముందు ఒక నిమిషం పాటు హాయి గా నవ్వి తర్వాత మరల రక్తపోటు కొలిస్తే మార్పు ఉండే విషయం మీరే స్వయంగా చూడవచ్చును.
7. నవ్వు సహజమైన నివారిణిః
నవ్వడం వలన మన అంతఃస్రావీ గ్రంథులలో ఎండో ఫైన్స్ మరియు సెరోటోనైన్ మరియు నొప్పి నివారణ కు ఉపకరించె రసాయనిక హార్మోన్లు స్రవించి మన ఆరోగ్య స్థాయిని పెంచుతాయి. మనలో అనారోగ్యాన్ని తరిమికొడతాయి.
8. నవ్వు ముఖ సౌందర్యాన్ని పెంచుతుందిః
నవ్వడం వలన ముఖంలో గల కండరాలకు మంచి వ్యాయామం కలిగి అవి చురుకుగా ఉండేందుకు తద్వారా మరింత యవ్వనం గా కనిబడేటందుకు అవకాశం ఉంటుంది. అన్ని రసాయనిక సౌందర్య సాధనాలకన్నా ఖర్చులేని దివ్యమైన సాధనం మనసారా నవ్వడమే.
9. మీ విజయానికి మూలకారణం నవ్వేః
నవ్వు ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి చిహ్నం. ఎల్లప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి అందరిలో చురుకుగా దూసుకుపోగలుగుతాడు. అందరి మన్ననలను పొందగలుగుతాడు. సమావేశాలలో అందరితో కలివిడిగా ఉండగలుగుతాడు. ఇలాంటి లక్షణాలు తప్పనిసరిగా విజయాన్ని తీసుకువస్తాయి. మీ విజయానికి దోహదపడతాయి.
10. నవ్వు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండటానికి దోహదపడుతుందిః
నవ్వుతూ ఉండటం వలన సానుకూలంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. నేను చేప్పేదానిని మీరు నమ్మకపోతే ఒకసారి బిగ్గరగా నవ్వుతూ ఈ వ్యాసం గురించి నెగటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నించండి. నవ్వుతూ నెగటివ్ గా ఆలోచించడం సాధ్యపడదు. అంటే మనం ఎల్లప్పుడూ పాజిటివ్ గా అంటే సానుకూలంగా ఉండాలంటే నవ్వుతూ ముందుకెల్లడటమే. 

                 చిన్నపిల్లలు రోజుకు ఐదు వందలనుండి వెయ్యి సార్లు నవ్వితే పెద్దవారు రోజుకి ఐదు నుండి పదిహెడు సార్లు మాత్రమే నవ్వుతారని ఒక పరిశోధకుడు సెలవిచ్చాడు. భూమిని మోస్తున్న అట్లాస్ లా ఫీల్ అయిపోయి ప్రపంచంలో నున్న సమస్యలన్నీ నెత్తిమీద వేసుకొని ఓ తెగ బాధపడిపోవలసిన పనేమి లేదు మనస్పూర్తిగా నవ్వండి. నవ్వుతూ బ్రతికాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా అని ఓ సినీ కవి అన్నట్టు ..
జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఒత్తిడులు, చికాకులు, చిరాకులు, చిటపటలు, ఉక్రోషాలు , ఏడుపులు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి మనసారా నవ్వుకుందామా.........
చిరునవ్వులతో బ్రతకాలి....చిరంజీవిగా బ్రతకాలి... ఆనందాలను అన్వేషిస్తూ.. అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి..........
విష్ యు గుడ్ లక్
trainerudaykumar@gmail.com

No comments:

Post a Comment