Saturday 24 October 2015

ఓ సంపూర్ణమైన ప్రేమ కు పరిపూర్ణమైన ప్రతిబింబం, క్రిష్ జాగర్లమూడి దార్శినికత కు నిలువెత్తురూపం " కంచె"



ఓ సంపూర్ణమైన ప్రేమ కు  పరిపూర్ణమైన ప్రతిబింబం,
క్రిష్  జాగర్లమూడి దార్శినికత కు నిలువెత్తురూపం "  కంచె"

ప్రేమించడం అంటే బ్రతికించడం ..కేవలం  మనుషుల్ని కాదు .. ఆశలను బ్రతికించడం ..ఆపన్నులను బ్రతికించడం, అనుచరులను బ్రతికించడం, ఆశయాలను బ్రతికించడం, ఇచ్చిన మాటను బ్రతికించడం..

రాయల్ ఆర్మీని  జర్మనీ సైన్యం చుట్టుముట్టినప్పుడు లొంగిపోతే తన అనుచరుల ప్రాణాలు మిగులుతాయని లొంగిపోవాలని నిర్ణయించిన కమాండెంట్ గాని , లొంగిపోయిన వారిని మ్యూనిచ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి చంపబోతున్న జర్మనీ సైన్యం నుండి  వారి ప్రాణాలను కాపాడటానికి వారిని అనుసరించిన వరుణ్ తేజ బృందం కానిబాత్ రూమ్ లొ దాగుకున్న సైనికుల్ని కాపాడటానికి తానూ స్నానం చేస్తున్నట్లు తెలియచేయడానికి నగ్నంగా  వారి ముందు నిలబడిన జర్మనీ యువతి కాని, ఒక యూదు తల్లికి పుట్టిన కారణంగా ప్రాణం కోల్పోతున్న చిన్నపాప ప్రాణాన్ని కాపాడటానికి తమ ప్రాణాలకు లెక్క చేయకుండా తెగించి తిరగబడిన వరుణ్ తేజ బృందం కాని,    చివరికి తనని ద్వేషించే ఈశ్వర్ ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలకు తెగించిన సంఘటన గాని, చివరికి తనవారిని కాపాడటానికి రేపటి ఉదయం కోసం ఆశగా జీవిస్తున్నవారికి జీవితాన్ని కల్పించడానికి ఒక సమిధగా మారడంలో గాని ప్రేమే కనబడుతుంది.  తన ఇష్టమైన ప్రాణాన్ని కోల్పోయినవానికే ప్రాణం విలువ తెలుస్తుంది.

వసుధైక కుటుంబ భావనతో తన పట్ల సంపూర్ణమైన ప్రేమ కలిగినవానికి ఎటువంటి ఉనికిని చాతుకోవాలనే ఆలోచనలు ఉండవు.    ఉనికి ని చాటుకోవాలి అనుకునేవారు మనుషులమధ్య కులం,గోత్రం, వర్గం, వర్ణం, జాతి, మతం అనే ద్వేషాలను రగిలిస్తారు. నిజమైన ప్రేమకోసం జీవించేవారు తమ ఉనికినే ఆహుతి చేస్తారు.  యుద్ధం, ప్రేమ ఒకటే  రెండింటిలోను పోరాటం ఉంటుంది. తెగింపు ఉంటుంది. అంతమై పోయే ప్రమాదం ఉంటుంది.

ఒక చక్కని ప్రేమకథకు, రెండవ ప్రపంచ నేపథ్యాన్ని జోడించి, ప్రపంచ వ్యాప్తంగా నైనా లేదా ఒక మారుమూల గ్రామంలోనైనా  వ్యక్తులమధ్య తమ  ఉనికి నిపెత్తందారీ తనాన్ని, అజమాయిషీ ని చేలాయించుకొనాలనువాళ్ళ మధ్య  సామాన్యులు తమ హృదయాలలో ప్రేమ భావనను మరచి కంచెలు ఎలా కట్టుకుంటున్నారో  హృదయాన్ని హత్తుకునేటట్టుగా చూపించడం లొ దర్శకుడు నూటికి నూరు పాళ్ళు విజయవంతం అయ్యారు.  

ఈ సినిమా ఎలా ఉందిఅని ఎవరినీ అడగనవసరం లేదు. ఎవరి అనుభూతులు వాళ్ళవి.  మీకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం, ఆలోచనలు ఎలా ఉంటాయో అలానే ఈ సినిమా చూస్తె మీ అనుభూతులు ప్రత్యేకంగా ఉంటాయి.
మానవత్వాన్ని, మనిషిని మనిషి ప్రేమించడం మరచి అర్థం లేని గెలుపుల  కొరకు వ్యర్థమైన తలపులతో జాతి, మతం, వర్ణం. కులం అంటూ పనికిమాలిన కన్చేలతో విడిపోతున్న ఈ సమాజానికి    ఈ సినిమా ప్రశ్నించే ప్రశ్నలు , పరిష్కార మార్గాలను సిరివెన్నెలగారి పాత ద్వారా తెలియచేస్తారు...
నీకు తెలియనిదా నేస్తమా
చెంత చేరననే పంతమా
నువ్వు నేనని విడిగా లేమని
ఈ నా శ్వాసని నిను నమ్మించని
విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వేషం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అది మనిషిది అవుతుందా
అడిగావా భూగోళమా  నువ్వు చూసావా ఓ కాలమా  
రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్ధం
ఇది కాదంటూ సరిహద్దుల్ని చెరిపే సంకల్పం అవుదాం
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా  ||ప్రేమను ||
ఆయువు పోసిందా ఆయుధమేడైనా
రాకాసుల మూకల్నే మార్చేదా పిడివాదం
రాబందుల రెక్కల సడి ఏ జీవనవేదం
సాధించేముంది ఈ వ్యర్థ విరోధం
ఏ సస్యం పండిచదు ఈ మరుభూముల సేద్యం
రేపటి శిశువులకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం  || రా ముందడుగేద్దాం  ||
అందరికీ సొంతం  అందాల లోకం
కొందరికే ఉందా పొందే అదికారం
మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషి తోటి బంధం
ఏ  కల్యాణం కోసం ఇంతటి కల్లోలం
నీకు తెలియందా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం
చెంత చేరననే పంతమా
ఖండాలుగా విడదీసే జెండాలను వీడి
తలవంచే తలపే అవుదాం
ఆ తలపే మన గెలుపని అందాం         
     ఈ ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉందా?  కనీసం ఈ పరష్కార మార్గాలను పాటించే సంసద్ధత ఉందా ?
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించే మానవతా వాదుల  స్వప్నం సాకారం  కావాలని   జాగర్లమూడి చేసిన సంకల్పం ...  రసహృదయులైన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి శుచితో కూడిన స్వచ్చమైన ప్రేమకథా చిత్రం  “” కంచే’’

ఇది నా అనుభూతి మాత్రమె. నా అభిప్రాయం  ఎవరిమీద రుద్దాలనే ప్రయత్నం మాత్రం కాదు. 

Tuesday 14 July 2015

హాట్సాఫ్ రాజమౌళి...... శతకోటి ప్రణామాలు



శిలల పై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టి కే  అందాలు తెచ్చినారు   అంటూ ఆనాడు  అమరశిల్పి జక్కన్న సినిమాలో ఒక పాట  ఉంటుంది.  రాజమౌళి  గారిని  ఆయన సన్నిహితులు జక్కన్న  అంటూ ఎందుకంటారో  ఎవరికైనా ఆ మాత్రమో  ఏ మాత్రమో  సంశయం ఉంటే   ఇక అది చెల్లా చెదురు కావలసిందే......

కేన్స్ ఫెస్టివల్ , ఆస్కార్ అవార్డ్  ఫంక్షన్  లేదా   ఏ అంతర్జాతీయ  చలన చిత్ర పండుగ కానీయండి ..  అసలు సిసలైన ప్రతిభకు పురస్కారమిచ్చే  అంతర్జాతీయ వేదిక ఏదైనా కానీయండి ... జేమ్స్ కామరూన్, స్పీల్ బర్గ్  లాంటి ఉద్దండులు    నిస్తేజులై,  చేతలు మాని చేతులు కట్టుకొని  సృజనాత్మకత  తమ తాతగారి సొత్తు అంటూ విర్రవీగిన తమ తలలు ఎక్కడ పెట్టుకొవాలో  తెలియక  తల్లడిల్లుతుంటే  తెలుగు కళామతల్లి  నిండు ముత్తయిదువులా  పట్టుచీర కట్టుకొని    వినయం విధేయతలతో కూడిన గర్వంతో అగ్రాసనాన్ని చేరి  ఉన్నతాసనం పై అధిరోహించిన అవకాశాన్ని కల్పించిన రాజమౌళి  ప్రతిభా పాటవాల్ని   ఎలా చెప్పినా  ఎంత చెప్పినా ... తక్కువే.......

ఈ  సినిమాలో   దొంగల స్థావరంలో  మద్యం  అమ్మే  వర్తకుని పాత్రలో కొన్ని నిమిషాలు  కనబడతారు రాజమౌళి  గారు......  కథానాయకుడు  ప్రభాష్  వచ్చి  మద్యం  అడుగుతాడు.  ఇచ్చిన ప్రతీ చిన్న పాత్రను  ఆవల త్రోసి  ఇంకా భారీ మొత్తంలో  అక్కడకి వినోదం కోసం, వ్యాపకాల కోసం వచ్చిన అందరికీ సరిపడేలా  ఇమ్మని అతని ముందు తాను  తెచ్చిన బంగారు నాణేలు  కుమ్మరిస్తాడు. దాంతో   తన దగ్గర ఉన్న సరుకు మొత్తం  వారి ముందుంచుతాడు... ఈ   సినిమా కూడా అంతే.. వినోదం కావాలంటే  కొసరు కొసరు కాదు   మొత్తం అందరికీ సరిపడేలా  ఇమ్మని అడిగినట్టు   రాజమౌళి తన ప్రతిభ యావత్తూ  ప్రేక్షకుల  ముందు  పరిచివేశాడు.  మరి కథానాయకుడు ఆ కుండలు బ్రదలుగొట్టి  అందరినీ మద్యం మత్తులో ముంచినట్టు  ఈ సినిమా లొ ప్రతీ పాత్ర రస హృదయులైన ప్రేక్షకుల్ని  తన్మయత్వంలో ఆనందపారవశ్యంలో     ముంచి వేస్తుంది......

ఎపుడో  మాయాబజార్  నిర్మించారట . ఇంకెప్పుడో .లవకుశ  కలర్  లొ చిత్రీకరించారట . ఒకానొక సమయంలో .అల్లూరి సీతారామరాజు  సినిమాను అడవిలో ఎన్నో రోజులు  నివసించి తీసారట.... ఇది చరిత్ర   ఈనాటి  తరానికి  తెలియని కేవలం చెబితే విని రాస్తే చదువుకొనే  సత్యాలు..    కాని  ఈ రోజు   ప్రతీ తెలుగు సినిమా ప్రేక్షకుడు  లేదా ప్రతీ తెలుగువాడు   నిజంగా గర్వించదగ్గ విషయం ఏమిటంటే   ఈ అద్భుతం  జరుగుతున్నప్పుడు మనం కూడా   సమకాలీనుకులం  కావడం. ఒక చరిత్ర రాయబడుతున్నప్పుడు మనం కూడా  సాక్షీభూతులం  కాగలగడం, రాజమౌళి మన కాలం నాటి వాడు కావడం  మనవాడు కావడం ..   మన అదృష్టం........

సినిమా ఎలా ఉంది ?  కథ ఏమిటీ?   ఏ రీవ్యూ  లొ ఎవరు ఏమిటి  రాసారు?   ఈ  సినిమాకి ఇచ్చిన రేటింగ్   ఎంత?   ఈ   సినిమా కలెక్షన్స్   ఎలా ఉన్నాయి?   ఈ  ప్రశ్నలు   వేసుకోవడం  అనవసరం......  అసలు రీవ్యూ   అంటే    మళ్ళీ   చూడండి   అని అర్థం    రీవ్యూ   చదవకుండా మళ్ళీ  చూడండి ....  కథ గురించి ఆలోచించక్కరలేదు .. కథనం లొ లీనమవడమే ......  లాజిక్కులు గురించి  విశ్లేషించక్కరలేదు.. రాజమౌళి మేజిక్కు ను ఆస్వాదించడమే...  ఆ పాత్రకు ఈ  పాత్రకు  ఏమిటి సంబంధం  అని ఆలోచించక్కరలేదు.  దేవుడిచ్చిన ఈ రెండు  కళ్ళకు చాలని అంత పెద్ద తెరపై  మనమూ ఒక పాత్రధారులమే అనే భావనతో    కనబడే   ప్రతీ ఫ్రేం లొ   ఒక భాగస్వాములై  రసస్వాదన చెయ్యడమే...........  తమన్నా ఒంటి మీద వాలే సీతాకోక చిలుక అవుతారో ,  తమన్నా ఒంటి పై  పచ్చబొట్టు  వేసే  ప్రభాష్  చేతిలో కుంచె   అవుతారో ....   నీటి కొండ పై ఉరకలెత్తే జలపాతం అవుతారో  అనుష్క ఏరుకొనే కర్రముక్క అవుతారో , అది మీ ఇష్టం.   సినిమాలో  ప్రతీ సన్నివేశం  లొ ప్రేక్షకులు  కుర్చీలను అంటిపెట్టుకొని తనువులు మరచిపోవడం ,,,,  థియేటర్  నలుమూలలా  వ్యాపించిన నిశ్శబ్దం,  ప్రేక్షకులలొ ప్రతి ధ్వనించే  హృదయ స్పందన  ఈ సినిమా   సత్తాకు  సాక్ష్యం...

సినిమా అర్థాంతరంగా   ఆపివేశాడు ...అనే విమర్శ  ఉంది అంటారా?   ఇంతకీ సినిమా పేరు  సరిగా చదివారా ?  బాహుబలి , డి బిగినింగ్    అంటే ఎండింగ్   ఇంకా ఉందనే కదా!   వారపత్రికలకు  వార్తా పత్రికలకు   తేడా తెలియని రోజులలో   వార పత్రికలకు  క్రేజీ   తెచ్చిన యండమూరి సీరియల్స్ ... ప్రతీ వారం ఒక ఊహించని  మలుపు తొ  ఆపేవారు.   తదుపరి  పత్రిక ఎప్పుడు వస్తుందా అంటూ  ఆ పత్రికల గేట్ల వద్ద   ఎంతో ఆసక్తి తొ   పాఠకులు బారులు తీరేవారు.    అభిలాష,  తులసిదళం   ప్రతీ వారం అనూహ్యమైన ఉత్కంఠత  రేపేవి.   దానికి కారణం  యండమూరి  ప్రతీ వారం కథ అంత ఉద్వేగ భరిత ముగింపుతో  ఆపేవారు..... రాజుల రక్షణ కొరకు అంకితమైన  ఒక  బానిస ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న  రాజునే  వెన్నుపోటు తొ చంపాల్సిన  పరిస్థితి ఏమిటి?   అనే ఉత్కంఠత  తొ సినిమా   మొదటి భాగం  అంతమవుతుంది...

సినిమా చూస్తున్నంత సేపు కన్నా  థియేటర్  నుండి బయటకు వస్తున్నపుడు ప్రతీ ప్రేక్షకుడు  ఒక అనుభూతితో  మంచి కళాఖండాన్ని   దర్శించిన  గర్వంతో   బయటకు వస్తాడు... ఆ రోజంతా రాజమౌళి  వారిని ఊరికే వదలడు. వారి ఆలోచనల్లో  మిత్రులతో జరిగే   చర్చల్లో  వారి ప్రతి స్పందనల్లో    ఈ  సినిమా మొదటి అంకంలో   ప్రభాష్  ఊహల్లో మెరిసిన తమన్నాలా  దోబూచులాడుతూనే ఉంటాడు...  ఎంతో  అమాయకంగా  కనబడే రాజమౌళి   చలనచిత్ర అభిమానుల చిత్తాలను  అతి చిత్రంగా కొల్లుగొట్టుకుపోయి   దొంగల స్థావరం లొ  మద్యం వ్యాపారి లా సొమ్ము చేసుకుంటున్నాడు .....

మరి ఈ  సినిమా పై  విమర్శలంటారా ???   ఇదేమైనా   ఇంట్లో పెళ్ళాం చేసిన  పకోడీ నా   లేక గోదుమనూక ఉప్మానా !!!  ఉప్పు తక్కువైంది. కరివేపాకు ఎక్కువైంది .. జీడిపప్పు ఉంటే  బాగుండేది  అనే భాష్యాలు చెప్పడానికి...  నచ్చలేదా మళ్ళీ చూడండి.  నచ్చిందా మళ్ళీ చూడండి.. ఎందుకంటే  ఈ సినిమాకి మీలాంటి రసహృదయుల ఆశేర్వాదం అవసరం.....   మరణం అంటే  కళను అవమానించడం..... మరణం అంటే  ఒక సృజనాత్మక  దర్శకుని ప్రతిభను  ప్రోత్సహించక పోవడం...   మరణం అంటే   తెలుగువాళ్ళమై  ఉండి  ప్రపంచ చలనచిత్ర యవనిక మీద విజయధరహాసం చేస్తూ  ఎగురుతున్న ఒక తెలుగు చలన చిత్ర ప్రాభవాన్ని కళ్ళుండీ దర్శించలేకపోవడం..   చేతులుండీ చప్పట్లు కొట్టకపోవడం.  మనసు  ఉండీ.. స్పందించకపోవడం.....

హాట్సాఫ్  రాజమౌళి......  శతకోటి  ప్రణామాలు

రాజన్ పారయామసి  పారయామాసి  రాజన్  పారయామసి
రాజన్ పారయామసి  పారయామాసి  రాజన్  పారయామసి
పారయామసి పారయామసి 
నవో భవతి జయమానోహ్నం కేతు రుష సామేత్యగ్రే 
భాగం దేవేభో విడదా త్యాయ రాస్తున్ప్రచంద్ర మా స్తిరతి దీర్ఘమాయు;


శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి 

ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు   ..........

అలజంగి  ఉదయకుమార్
trainerudaykumar@gmail,com

Thursday 4 June 2015

ఆనందంగా ఉండాలనుకుంటున్నారా ?

ఆనందంగా ఉండాలనుకుంటున్నారా ?

నిజమా?
మంచిదే ఇన్నాళ్ళకు మంచి ఆలోచన వచ్చింది.... మన ఇల్లు శుభ్రంగా, 
అందంగా, ప్రశాంతంగా ఉండాలనుకుంటే మనం ఏమి చేయాలి..... ఇంటికి 
పట్టిన బూజు, చెత్త, చెదారం తొలగించాలి. ఇంట్లో సామాన్లు అన్ని ఒక పధ్ధతి 
లొ ఉంచాలి. పనికి రాని వస్తువులు, ఇంట్లో అడ్డంగా ఉపయోగం లేకుండా 
ఉన్న వస్తువులు బయట పడేయాలి అంతే కదా......

మరి మనం ఆనందంగా ఉండాలంటే చేయవలసినది అదే....... ముందు 
ఇప్పటికే మన మనస్సుల్లో ఉన్న చెత్త.. మన ప్రవర్తనలో ఉన్న చెడు 
అలవాట్లు జాగ్రత్తగా నేర్పుగా ఓర్పుగా అవతల పారేయాలి..... ఆనందంగా 
ఉండాలంటే మనలో తొలగించుకోవలసిన మరియు వదిలించుకోవలసిన ఈ 
చెత్త ఏమిటో చూద్దాం.......


1. పనికిమాలిన మరియు ఇబ్బంది పెడుతున్న బంధాలను, 
బంధుత్వాలను మనసులోంచి బయటపడేయండి:

అదేమిటండి? అంత మాట అనేసారు అని మీకు అనిపించవచ్చు. కాని 
తప్పదు . మనకు చికాకులు తెప్పిస్తూ మన ఆనందాన్ని హరించి వేస్తూన 
బంధాలు .. స్నేహాలు మనసులోంచి బయట పడేయండి. ఎంతకు మారని 
వారిని మారుతారని ప్రయత్నించడం..... మనం ఎంత సర్డుకుపోతున్న మన
 గురించి నలుగురికి చెడు ప్రచారం చేసేవారిని పట్టుకొని వేలాడటం వలన 
మన ఆనందం ఆవిరై పోతుంటుంది. మన కన్నా మనకి ఎవరూ ముఖ్యం 
కాదు... అటువంటి వారు ఫేస్ బుక్ స్నేహితులైన, వాస్తవ ప్రపంచం లోని 
స్నేహితులైన, బంధువులైన, రాబందువులైన జాగ్రత్త గా పరిశీలించి ఒకటికి 
రెండు సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసి డిలిట్ బటన్ నొక్కండి.. ఆనందాన్ని 
కాపాడుకోండి...
2. ఒత్తిడి కి దూరంగా ఉండండి:
జీవితం ప్రెషర్ కుకర్ కాదు. ప్రతీ చిన్న విషయానికి పెద్ద విషయానికి తీవ్ర 
ఒత్తిడికి లోనవడానికి.... ఒత్తిడికి లోనైతే ఆనందమే కాదు ఆరోగ్యం కూడా 
అటక ఎక్కుతుంది. మనం ముందు ఉంటేనే కదా... ఆయా పనులు అయ్యేవి 
లేనివి చూడటానికి... జరిగేవి ఎలాగు జరగక మానవు..... కాబట్టి ప్రతీ 
విషయానికి తీవ్రంగా స్పందించి ఒత్తిడి తెచ్చుకొనే తత్వాన్ని వీలైనంత 
త్వరలో తుడిచి అవతల పారేయండి.....
3. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టె చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి:
సిగరెట్లు గాని. మద్యపానం గాని అతి నిద్ర కాని, బద్ధకం గాని, సోమరితనం 
గాని, అతి స్నేహాలు గాని, ఫేస్ బుక్ గాని, చాటింగ్ కాని, బాతాఖానీలు గాని 
, విండో షాపింగ్ కాని , ఇలా ఏవైనా మీకు ఇబ్బంది పెడుతూన అలవాట్లు 
తాత్కాలికంగా మీకు ఆనందం కలిగిస్తున్న శాశ్వతంగా తీవ్ర ఇబంది 
కలిగించవచ్చు. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు ఏమిటో గుర్తించి ఫినాయిల్ 
వేసి కడిగి అవతల పారేయండి......

4. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నించకండి:
భగవంతుడు ఈ జీవితాన్ని మనకి కానుకగా ఇచ్చాడు. ఆనందంగా జీవిస్తూ 
నలుగురినీ ఆనందంగా ఉంచడం మంచిదే కాని అందరినీ సంతృప్తి పరచడం 
వలన మనం ఆనందంగా ఉంటాం అనుకోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి 
ఉండదు. ఆత్మ సంతృప్తిని మించిన ఆనందం ఎక్కడా ఉండదు. కాబట్టి ప్రతి 
ఒక్కరిని ఆఖరికి ఇంట్లో పనిమనిషిని, వాచ్ మేన్ ని ఆఫీస్ లొ బాస్ ని, 
కొలీగ్స్ ని, బంధువుల్ని అందరినీ సంతృప్తి పరుస్తూ జీవించాలనే మీ మహా 
యజ్ఞం మీద చన్నీళ్ళు పోసి హాయి గా ఉండండి.

5. ఎవరో అపార్థం చేసుకున్నారు సరిగా అర్థం చేసుకోలేదు అనే భావాన్ని 
విడిచి పెట్టండి:

ఉదాహరణకి మీరు కొరియా లేదా జపాన్ సినిమా చూసారు .. మీకు ఒక్క 
ముక్క అర్థం కాలేదు. అది ఎవరి తప్పు ఆ సినిమా డైరెక్టర్ దా, హీరో దా, 
లేదా ఆ సినిమా ఆడుతున్న థియేటర్ దా? ఆ భాష రాకుండా చూసిన 
మనదే కదా ! అంటే ఎవరో గాడిద మనల్ని సరిగా అర్థం చేసుకోలేక ఓండ్ర 
పెడుతుంటే ఆ తప్పు ఎవరిదీ. అదేంటండి గాడిద అనేసారు అంటారా ? సారీ 
గాడిదను అవమాన పరిచినందుకు...... వాళ్లకు మనం అర్థం కాక పొతే 
మంచి డిక్షనరీ కొనుక్కొని నేర్చుకోమనండి.... ఎవరో అపార్థం 
చేసుకున్నారని 
ముక్కు చీదు కొని ఏడుపు మొదలెట్టవద్దు..... ముందు మొహం కడుక్కొని 
అద్దంలో మీ ముఖారవిందాన్ని ఆనందించండి......

6. ఎవరిని అనవసరంగా అనుకరించవద్దు.:
మీరు మీరే..... ఎవరి నుండైనా ప్రేరణ పొందండి తప్పు లేదు కాని పులిని 
చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు గుడ్డిగా ఎవరినీ అనుకరించడానికి 
ప్రయత్నించవద్దు. ఎందువలన అంటే ఒకరిని అనుసరించాలని లేదా 
ఒకరిలా  ఉండాలని ప్రయత్నిస్తే అది లేని పోనీ తలనొప్పులకు దారి 
తీస్తుంది. అనుకరణ వేరు అనుసరణ వేరు, అనుకరణ అనేది మూర్ఖత్వం 
మన వ్యక్తిత్వాన్ని , అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. అనుసరణ మన 
వ్యక్తిత్వానికి కొత్త సొగసులు అద్దుతుంది. మనం మనలా ఉండటం లో 
ఆనందం. మనలను మనం గా స్వీకరించడంలో ఉన్న ఆత్మ సంతృప్తి 
దేనిలోనూ ఉండదు. 

7. ఎవరిని విపరీతంగా ద్వేషించవద్దు అలా అని ఎవరిని విపరీతంగా 
ప్రేమించవద్దు:
అతి సర్వత్రా వర్జయేత్ .. ద్వేషం అనర్థదాయకం. ఎవరు పూర్తిగా 
మంచివారు ఉండరు. అలా అని పూర్తిగా చెడ్డవారు ఉండరు. పరిస్థితులు 
బట్టి వారి  అవసరాల బట్టి వారి హోదా బట్టి వారి పరిస్థితి బట్టి రకరకాలు గా 
మారు తుంటారు... శాశ్వత స్నేహితులు ఉండరు. శాశ్వత శత్రువులు 
ఉండరు. అతిగా ప్రేమించడం వలన దానికి మించిన శోకానికి బాధకు 
గురికావాలి. అతిగా ద్వేషించడం వలన అనారోగ్యం కోరి తెచ్చుకోవలసి 
వస్తుంది. ఈ మహా ప్రయాణం లో తోటి ప్రయాణికులు వస్తుంటారు 
..పోతుంటారు.... బంధాల బంధనాలతో స్వేచ్ఛను హరించు కోవద్దు. 
ఆనందాన్ని ఆవిరి చేసుకోవద్దు. 

8. జరిగిపోయిన దానికి , జరగబోయే దానికి ప్రాధాన్యత ఇవ్వవద్దు.
మన ఆనందాన్ని హరించేవి గతం గురించి పశ్చాతాపం మరియు భవిష్యత్తు 
గురించి ఆందోళన. మన ఆలోచనల్లో 65 శాతం గతం గురించి 30 శాతం 
భవిష్యత్తు గురించి ఉంటాయట. అంటే కేవలం 5 శాతం వర్తమానం గురించి 
ఆలోచిస్తామన్నమాట. చిన్న పిల్లలు ఎప్పుడు ఆనందంగా ఉండటానికి 
కారణం ఏమిటంటే నూటికి నూరు పాళ్ళు వారు వర్తమానం లొ జీవిస్తారట. 
ది  పవర్ ఆఫ్ నౌ అనే పుస్తకం లొ ఎకార్ట్ టాలి వర్తమానం లొ జీవించే వారికి 
ఆనందం వెంటే ఉంటుందని వివరిస్తాడు.

9. ఎప్పుడు తమ గొప్పలు చెప్పుకుంటూ , మనల్ని కించ పరుస్తూ , 
మనల్ని తక్కువ చేసే మాటలాడే వారికి దూరంగా ఉండండి : 

మన స్నేహితుల్లో గాని బంధువుల్లో గాని కొద్ది మంది తమను తాము గొప్ప 
వారిగా భావించుకుంటూ నిత్యం స్వోత్కర్ష లతో సోది వేయడమే కాకుండా 
మనల్ని బాగా తక్కువ చేసి మాట్లాడుతుంటారు.... తామేదో అంతర్జాతీయ 
స్థాయి లో ఉన్నట్టు మనమేదో గల్లీ కి పరిమితం అయ్యేటట్టు మాట్లాడుతారు 
..మీరు చేయాల్సిన పని ఏమిటంటే మార్కెట్ కి వెళ్లి ఒక మంచి అద్దం కొని 
వారికి బహుమతి గా ఇచ్చి ఒకసారి తమ సౌందర్యాన్ని తనివితీరా 
చూసుకోమని ఒక సలహా ఇచ్చి వారి స్నేహానికి శాశ్వతంగా సెలవు 
చెప్పండి.
10. పెద్ద పెద్ద కోరికలు పెద్ద పెద్ద కలలు కనడం మానకండి:
కోరిక, ఆశ అనేది మన జీవితం లో చైతన్యాన్ని తెస్తుంది. కలలు కనడం ఆ 
కలలను సాకారం చేసుకోవడం లో ఉన్న సంతృప్తి వేరు. పెద్ద పెద్ద కలలు 
మన ఆత్మా విశ్వాసానికి ఆత్మ ఔన్నత్వానికి నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లో 
మనం ఒకరి కన్నా తక్కువ అనే భావాన్ని మన వలన పెద్ద పెద్ద విషయాలు 
సాధ్యం కాదు అనే భావనలను ప్రక్కన పెట్టి నిత్యం ఆనందాన్ని 
వెతుక్కుంటూ  మన ఆనందాన్ని దూరం చేసే వాటిని దూరంగా పెడుతూ 
జీవితం లో ప్రతీ క్షణాన్ని ఆనందించండి. ఆ ఆనందాన్ని నలుగురికి పంచండి.
విష్ యు ఆల్ ది బెస్ట్
trainerudaykumar@gmail.com

Saturday 30 May 2015

మీ పిల్లల్లో చాల లోపాలు కనబడుతున్నాయా ?

మీ పిల్లల్లో చాల లోపాలు కనబడుతున్నాయా ?
 వారిలో చాలా అవలక్షణాలు ఉన్నాయా? 
వారితో వేగడం చాలా కష్టంగా ఉందా?
 మీ పిల్లల ప్రవర్తన మీకు విసుగు తెప్పిస్తుందా? 
అయితే వీరు ఇలా తయారవడానికి ఎవరిని నిందించాలి ?
 ఎవరినో కాదట ..
 దానికి వారు పెరిగేందుకు అలాంటి పరిస్థితులు కల్పించిన మనదే అని ప్రముఖ సైకాలజిస్ట్ Dorothy Law Nolte అంటున్నారు.... ఇది చదివి ఆయనను నిందించడం మొదలుపెట్టవద్దు.... ఎంతవరకు నిజమో అలోచించి పిల్లలు కాకుండా మనం మారడానికి ఏమైనా అవకాశం ఉందేమో ఆలోచిద్దామా????? ( ట్రాన్స్ లేషన్ లొ తప్పులుంటే మార్చుకోండి )
Children Learn What They Live
By Dorothy Law Nolte, Ph.D.
If children live with criticism, they learn to condemn. ( పిల్లలు విమర్శలతో పెరిగితే, వారు ప్రతి విషయాన్ని “ఖండించడం” నేర్చుకుంటారు.)
If children live with hostility, they learn to fight.( పిల్లలు శతృత్వ భావన తో పెరిగితే “ఎదిరించడం” నేర్చుకుంటారు.)
If children live with fear, they learn to be apprehensive.( పిల్లలు భయం తో పెరిగితే, ప్రతీ విషయానికి ఆందోళన చెందడం నేర్చుకుంటారు )
If children live with pity, they learn to feel sorry for themselves.( పిల్లలు జాలితో పెరిగితే, తమపై తాము సానుభూతి చెందడం నేర్చుకుంటారు )
If children live with ridicule, they learn to feel shy. ( పిల్లలు అవహేళన తొ పెరిగితే, పిరికితనం నేర్చుకుంటారు)
If children live with jealousy, they learn to feel envy. ( పిల్లలు అసూయతో పెరిగితే, ఓర్వలేనితనాన్ని నేర్చుకుంటారు )
If children live with shame, they learn to feel guilty. ( పిల్లలు అవమానాలతో పెరిగితే, అపరాధ భావన నేర్చుకుంటారు )
If children live with encouragement, they learn confidence. ( పిల్లలు ప్రోత్సాహం తో పెరిగితే, ఆత్మ విశ్వాసం నేర్చుకుంటారు )
If children live with tolerance, they learn patience. ( పిల్లలు సహనం తొ పెరిగితే, ఓరిమి నేర్చుకుంటారు)
If children live with praise, they learn appreciation. ( పిల్లలు అభినందన లతో పెరిగితే, మెచ్చుకోవడం నేర్చుకుంటారు)
If children live with acceptance, they learn to love. ( పిల్లలు అంగీకారం తొ పెరిగితే, అందరినీ ప్రేమించడం నేర్చుకుంటారు )
If children live with approval, they learn to like themselves. ( పిల్లలు ఆమోదంతో పెరిగితే, తమను తాము ఇష్టపడటం నేర్చుకుంటారు )
If children live with recognition, they learn it is good to have a goal. ( పిల్లలు గుర్తింపుతో పెరిగితే, తమ లక్ష్యాలు ఏర్పరచుకోవడం నేర్చుకుంటారు)
If children live with sharing, they learn generosity. ( పిల్లలు ఉన్నదానిని నలుగురితో పంచుకోవడం తొ పెరిగితే, ధాతృత్వం నేర్చుకుంటారు )
If children live with honesty, they learn truthfulness. ( పిల్లలు నిజాయితీ తో పెరిగితే, సత్యసంధత నేర్చుకుంటారు )
If children live with fairness, they learn justice.( పిల్లలు ధర్మబద్ధత తో పెరిగితే, న్యాయంగా ఉండటం నేర్చుకుంటారు )
If children live with kindness and consideration, they learn respect. (పిల్లలు దయ, కరుణతో పెరిగితే , నలుగురిని గౌరవించడం నేర్చుకుంటారు )
If children live with security, they learn to have faith in themselves and in those about them.( పిల్లలు భద్రతా భావంతో పెరిగితే, తమపై  మరియు ఇతరులపై విశ్వాసం కలిగిఉండటం నేర్చుకుంటారు)
If children live with friendliness, they learn the world is a nice place in which to live. (పిల్లలు స్నేహభావంతో పెరిగితే ఈ ప్రపంచం నివసించేందుకు అనువైన ఒక సుందర ప్రదేశం అని నేర్చుకుంటారు )
నిజం ఒప్పుకోవడం మనకు కొంచెం కష్టమే..... మిత్రులతో పంచుకోండి. కనీసం వారికైనా ఉపయోగపడుతుందేమో....... మనకీ ఉపయోగపడుతుంది అంటారా !!!! ఇంకేం ఈ రోజునుండే ఆచరణ మొదలు పెడదాం...
విష్ యు గుడ్ లక్
అలజంగి ఉదయ కుమార్

Thursday 28 May 2015

నిత్య స్వార్థ పరులతో మెలగడం ఎలా?

నిత్య స్వార్థ పరులతో మెలగడం ఎలా?
అవును నిజమే ఈ ప్రపంచంలో కేవలం తమ కొరకు మాత్రమే ఆలోచిస్తూ, బ్రతికే స్వార్థ పరులతో నిండి ఉంది. నిత్య జీవితంలో ఇలాంటి వారిని చాలా మంది ఎదురవుతుంటారు. తమకు అవసరమున్నట్లయితే మదర్ తెరిస్స్తా , మహాత్మా గాంధీ లను మించి పోయి మహా అధ్బుత వాక్యాలు చెబుతుంటారు. ఎవరిని ఎంత వరకు వాడుకోవాలో .. ఎవరిని ఎక్కడ పెట్టాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలీదు.....
మరి అలా అయితే ఏమి చేయాలి ? వీరి స్వార్థానికి బలి అవవలసిందేనా? మనం వెర్రిబాగులవాళ్ళమైతే వీరే కాదు ఎవరైనా ఎలా వాడుకోవాలో అలా వాడి ..తమ వాడకం ఎలా ఉంటుందో చూపుతుంటారు?
మన అనుమతి లేకుండా మనల్ని ఎవరూ తక్కువ చేయరని ఎలినర్ రూజ్ వెల్ట్ అంటారు. కాబట్టి ఈ సూచనలు పాటించడానికి ప్రయత్నిద్దాం..
1. ముందుగా వారి అసలు స్వరూపాన్ని గుర్తించండి: వీరి గురించి వీరి చూపించే దొంగ ప్రేమలనుండి , కుహానా ఆప్యాయతలనుండి బయటకు రండి.... పంచదార పూట తొ కూడిన మాటల వెనుక వారి స్వార్థం నిండి ఉందన్న సంగతి గుర్తించండి. వారికి వారి స్వార్థమే తప్ప ఎవరి పట్ల ఎటువంటి అభిమానం, ప్రేమ ఉండవన్న సంగతి కొంచెం బాధగా ఉన్నా వాస్తవాన్ని గుర్తించండి. పిచ్చి నమ్మకం లొ పడ్డావా పచ్చి మోసమే గతి నీకు........ మీ కాళ్ళ ముందు ఉన్న అమాయకపు పొరలు వదిలించుకోండి.. వాళ్లకు పైసా లాభం ఉందంటే ఎదుటివారికి లక్ష రోపాయలు నష్టమవుతున్నా అందులో దించుతారని గుర్తించండి...
2. మీకు సంబంధించిన విషయాల్లో పూర్తి దృష్టి కేంద్రీకరించండి: మీ భావోద్వేగాలను వాడుకోవడం లొ వీరు సిద్ధహస్తులు....మీ పట్ల ఏంతో ప్రేమ నటించి. మీ శ్రేయస్సే వారి జీవిత లక్ష్యమ్ అన్నట్టు కటింగ్ లు ఇస్తుంటారు. ఎలా చేస్తే బాగుంటుంది. అలా చేస్తే బాగుంటుంది. అయ్యో నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎంత కష్ట పడుతున్నావో అనే సానుభూతి కేజీ లలో కాదు క్వింటాలలో ఒలకబోస్తుంటారు. కాబట్టి వీరి బోడి సలహాలకు ప్రేమ లకు లొంగ కుండా మీకు సంబంధించిన విషయాల్లో పూర్తీ అవగాహన కలిగి ఉండండి.
3. మీ స్థాయి కి తగ్గట్టు గా ఉండండి; వారి స్థాయి కి దిగజారవద్దు: వారి ప్రవర్తనను చూసి ఒక్కోసారి మీ భావోద్వేగాలు నియత్రించుకోవడం కష్టమై వారి ముందు వ్యక్తపరచవద్దు.. దాని వలన వారిలో మార్పు రాదు కదా మీ గురించి లేనిపోనివి ప్రచారం చేసే అవకాశం ఉంది మీ వ్యక్తిత్వానికి లేనిపోని ముద్రలు వేస్తుంటారు.. మీ స్థాయి, మీ వ్యక్తిత్వం ఎవరి ప్రవర్తన వలన మారకుండా మీరు మీరుగా ఉండటానికి ప్రయత్నించండి.
4. వారే మీ ప్రపంచం కాదని వారిని తెలుసుకోనీయండి: వీరి తో వచ్చే చిక్కు ఏమిటంటే .. వీరు పరాన్న జీవుల్లా ఎవరో ఒకరి మీద ఆధార పడి బ్రతుకుతుంటారు కాని మనం వారి మీద బ్రతుకుతున్నామనే భ్రమల్లో ఉంటారు. వీలయితే అందరికీ ఉచిత ప్రచారం కూడా చేస్తుంటారు. వారే మీ ప్రపంచం కాదని మీ ప్రవర్తన ద్వారా తెలియపరచండి. మీకు సంబధించిన స్నేహితులు గాని మీ తొ కలిసి పనిచేసే వారు కాని మీకు సహాయపడే వారు గాని వందల్లో ఉన్నారని వారిని తెలుసుకోనీయండి.
5. వారిని వీలయినంత దూరంగా పెట్టండి. దూరంగా పెడుతున్న సంగతి వారిని తెలుసుకోనీయండి: వారిని నిర్లక్ష్యమ్ చేయండి.. వారి స్వభావం గుర్తించాం .. మా దగ్గర మీ పప్పులు ఉడకడం కష్టం అనే భావన లొ మీరు ఉన్న సంగతి వారికి మీ ప్రవర్తన ద్వారా తెలియపరచండి.. మీ సమయం, మీ మాటలు చాలా విలువైన సంపద .. ఇటువంటి తేలిక మనుష్య్ల కోసం వాటిని ఖర్చు పెట్టకండి..... ఒక వేళ ఎదురుపడినా దూరంగా ఉండటానికి యత్నించండి. వారు మారిపోతారని కాదు. ఇక మీరు అనవసరంగా నష్టపోవడం తగ్గుతుంది. అంతే...
6. మీకు ఇష్టమైన విషయాలు మాత్రమే, మీకు సంబంధించిన విషయాలు , మీ విజయాలు మాత్రమే వారితో చర్చించండి : వారితో తప్పని సరిగా మాట్లాడవలసి వచ్చినప్పుడు మీకు సంబంధించిన విషయాలు మీరు సాధించిన విజయాలు చర్చించండి. వారికి సంబంధిచిన విషయాలు చెబుతున్నప్పుడు జాగ్రత్త గా ఆ టాపిక్ మార్చడానికి ప్రయత్నించండి.... వారి మొహంలో మారే రంగులు గుర్తించండి.....
7. వారికి సహాయాలు గాని కానుకలు ఈయడం గాని ఆపండి.: మీరు సహాయం చేస్తుంటే వారు అవి గుర్తుంచుకొని మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారని ఆశించవద్దు. ఎవరు వీరికి సహాయం చేసినా అది తమ హక్కు గా భావిస్తారు. తమ వలన లాభం ఉంటుందనే తమకు వీరు ఇది చేస్తున్నారు అని భావిస్తారు. వీరికి కానుకలు ఎంత ఇచ్చినా వీరికి తృప్తి ఉండదు. వాటిని తక్కువ చేసి మాట్లాడుతారు. అలా అని వారికి ఎంచుకునే అవకాశం ఇచ్చినట్లయితే మీ పర్సు గుల్ల చేసి తీరుతారు. మీ జేబులో డబ్బులు మీ ద్వారా ఇతరులకు ఇప్పించి క్రెడిట్ కొట్టేసే అద్భుతమైన టాలెంట్ వీరికి వారసత్వంగా వచ్చిన అపురూపమైన నైపుణ్యం ..
8. వీరినుండి సహాయం ఆశించవద్దు: వీరు సాధారణంగా ఎవరికీ సహాయం చెయ్యరు. ఒకవేళ పైసా ఇస్తే కోటి రూపాయలు ఇచ్చిన ప్రచారం జరుగుతుంది. వీరు ఒక వేల కానుకలు ఇస్తే అవి ఎ అశోకుడు కాలం నాటివో, సింధు నాగరికత త్రవ్వకాలలో బయటపడినవో అవవచ్చు. ఎందుకు తమకు పనికిరావు అని రూది చేసుకున్నతర్వాత మాత్రమె అతి కష్టం మీద గుండె రాయి చేసుకొని వీరు ఇతరులకి ఇస్తారనేది వారు ఒప్పుకోని సత్యం. స్వీకరించం అని మొహమాటం లేకుండా చెప్పండి.
9. వారితో వీలైనంత తక్కువ కాలం గడపండి: వీరిని వదులుకోవడం వీలుకాకపోతే వీరితో గడిపే సమయాన్ని తగ్గించండి. వారికి అవసరం ఉంటె ఒకలా మన అవసరమైతే మరో విధంగా ఉంటుంది. వీరి ప్రవర్తనలలో తేడా గమనించడం చాలా కష్టం. మనసుకి చాలా బాధ కలుగుతుంది. మన ఇంటికి వస్తే ఒలకబోసే ప్రేమలు వారివద్దకు మనం వెళ్ళినప్పుడు ఏమవుతాయో మనకు అర్థం కాదు. దూరంగా ఉండటాన్ని మించిన ఆనందం లేదు.
10. మంచి స్నేహాలు ఎంచుకోండి: మీ విలువ మీ అర్హతలు, మీ అలవాట్లు, మీ అభిప్రాయాలు గుర్తించి గౌరవించే వారు ఈ లోకం లొ కోకొల్లలు. కాబట్టి వీరిని వీలైనంతవరకు తొలగించుకొని మంచి స్నేహాలు ఎంచుకోండి... అలా అని వీరి వలన లాభం లేదని కాదు.. జీవితం అంటే ఏమిటో స్వార్థం అంటే ఏమిటో తెలియచేసేది వీరి వింత ప్రవర్తనే...... జాగ్రత్త పడండి.. మీ ఆనందాన్ని మీరు కాకపొతే ఎవరు కాపాడుతారు......
విష్ యు ఏ హ్యాపీ లివింగ్.....
అలజంగి ఉదయ కుమార్
trainerudaykumar@gmail.com

Tuesday 19 May 2015

తల్లిదండ్రులు గమనించండి........


   
ఫలితాల్ని హుందా గా స్వీకరించండి .. పిల్లల భవిష్యత్తు వైపు అడుగు వేయండి 
        పదవ తరగతి ఫలితాలను ఇంటర్ నెట్ లో  చూసుకొని చాలా ఆనంద పడింది మాలతి. తనకు 9.5  గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. స్కూల్ లో  ఎప్పుడూ 9.2  కన్నా ఎక్కువ వచ్చేవి కావు. పబ్లిక్ పరీక్షల్లో  బాగా కష్టపడటం వలన బాగా వచ్చాయి. ఇంటికి వచ్చి అమ్మకు చెప్పింది. కాని తల్లి నుండి స్పందన సరిగా రాలేదు. 10/10  వస్తాయని  మన చుట్టాలందరికీ చెప్పాను.  ఇప్పుడు వాళ్లకు నా మొహం ఎలా చూపించను అంటూ బాధపడింది. ఇంతలో ఆవేశంగా ఆఫీస్ నుండి  నాన్నగారు వచ్చారు.  ఏమిటీ మార్కులు మా ఆఫీస్ లో  అటెండర్ కూతురికి 9.8 గ్రేడ్ మార్కులు వచ్చాయి. వేలకు వేలు ఫీజులు కట్టి చదివిస్తే ఇదా నీవు చేసిన ఘనకార్యం అంటూ కూతురి పై కేకలు వేసాడు. బిక్కమొహం వేసుకొని తన గదిలో భోజనం మాని పడుకొని ఒంటరిగా రోదించసాగింది మాలతి.  
ఇదేదో టీ.వి. సీరియల్ కథ కాదు. చాల ఇళ్ళల్లో పదవ తరగతి ఫలితాలు వచ్చేటప్పుడు  ఇంచుమించు గా జరిగే అతి సాధారణ సన్నివేశం.
                     రెండు రోజుల్లో పదవతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.   ఈ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠత  పిల్లలలో కన్నా వారి తల్లి దండ్రుల్లో అధికంగా ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.  పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన కన్నా  ఒకవేళ తక్కువ మార్కులు వస్తే నలుగురిలో  ఎలా చెప్పుకోవాలో  అనే బాధ చాలా మంది తల్లిదండ్రులలో కనబడుతుంది.  ఈ ధోరణి  విద్యార్థుల వ్యక్తిత్వం మీద మరియు వారి భవిష్యత్తు చదువులమీద  తీవ్రమైన ప్రభావం చూపుతుందని  మానసిక విశ్లేషకుల అభిప్రాయం.  పదవ తరగతి ఫలితాలు విడుదల అవుతున్న  సందర్భంగా  విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు  కొన్ని విషయాలను దృష్టి లో ఉంచుకోవాలని  ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు, రచయిత అలజంగి ఉదయ కుమార్ ఈ అంశాలను తెలియ చేస్తున్నారు.
తల్లిదండ్రులకు సంబంధించి :
1.    మార్కులు అనేవి  విద్యార్థుల తెలివితేటలకు కొలబద్దలు కావు.  పరీక్ష రాస్తున్న సమయంలో అనేక అంశాలు పిల్లలు పరీక్ష వ్రాసేటపుడు ప్రభావం చూపుతాయి.
2.    పిల్లల మార్కులు తమ పట్ల  తమకు  అవగాహన కలిగిస్తాయి. రాబోయే రోజుల్లో ఎలా చదవాలో, ఎలా మార్పులు చేసుకోవాలో, తమ లోపాలు  ఏమిటో, తమ సామర్థ్యాలు ఏమిటో తెలియ చేస్తాయి.
3.    పిల్లల మార్కులు నలుగురి లో  ప్రకటించుకొని గొప్పతనం  ప్రదర్శించుకోవడం అజ్ఞానానికి, అవగాహనరాహిత్యానికి పరాకాష్ట. ఫేస్ బుక్ లో మార్కుల కాపీ కూడా పోస్ట్ చేసి  లైక్ లు   కామెంట్లు లెక్కపెట్టుకోవద్దు. ఒకవేళ పాఠశాల  వారు ప్రకటించుకుంటే  అది వారికి సంబంధించినది. టీ.వీ లలో వచ్చే వివిధ పాఠశాల వ్యాపార ప్రకటనలతో మీ పిల్లల మార్కులను తక్కువ చేసి చూడకండి.
4.    పిల్లలకు నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తల్లిదండ్రులు పెంచే విధంగా ప్రవర్తించాలి తప్ప , జరిగిపోయిన విషయాలు త్రవ్వి వారి మానసిక ఒత్తిడి ని  పెంచకూడదు.
5.    గ్రేడ్ మార్కులు తగ్గడం అనేది అనేక అంశాల మీద ఆధార పడి ఉంటుంది. పదవ తరగతి లో  ఉండే చాలా సబ్జెక్ట్స్  తదుపరి చదువులో ఉండవు.  అందువలన కొన్ని సబ్జెక్ట్స్ లో  మార్కులు తగ్గినందువలన  భవిష్యత్ చదువుకు పెద్దగా జరిగే నష్టం ఉండదు.
6.    అతిగా పొగిడినా లేక అతిగా మందలించినా  అనుకోని దుష్పరిమాణాలు జరగవచ్చు.
7.    పిల్లలు మానసికంగా  బాధపడుతుంటే ఒంటరిగా వారిని విడిచిపెట్టకూడదు. వారు భవిష్యత్ చదువు పై సానుకూలంగా  దృష్టి పెట్టేటట్టు చర్యలు తీసుకోవాలి.
8.    పిల్లల ముందు వారు చదివిన పాఠశాలను  కాని ఉపాధ్యాయులను కాని ఎట్టి పరిస్థితుల్లో నిందించరాదు.
విద్యార్థులకు సంబంధించి:
1.    పదవ తరగతి లో  మీరు సాధించిన గ్రేడులు ఆ సమయంలో మీరు చేసిన కృషికి ఫలితమే అని తెలుసుకోవాలి. అంతే తప్ప  తెలివితేటలకు మార్కులే ప్రమాణం కాదని గ్రహించాలి.
2.    విజయం అనేది ఒక గమనం అంతే  కాని గమ్యం కాదు. పదవతరగతి కేవలం మొదటి మెట్టు మాత్రమే..  ఇంకా చాలా  సుదూరం ప్రయాణించాలని తెలుసుకోవాలి.
3.    తమ మిత్రుల మార్కులతో పోల్చుకోవడం  కాని ఎక్కువ గ్రేడులు వచ్చిన వారి పట్ల ఈర్ష్య అసూయలు పెంచుకోవడంగాని,  తక్కువ వచ్చిన వారిని హేళన చేయడం గాని చేయరాదు.
4.    మంఛి  మార్కులు వస్తే  అదే స్థాయిని ప్రమాణాలను  ఉన్నత చదువుల్లో కొనసాగించాల్సిన  గురుతర భాద్యత మీ పై ఉంటుందని  గ్రహించండి. తక్కువ మార్కులు వస్తే  లోపం ఎక్కడ ఉందో, మీ బలహీనతలేమిటో తెలుసుకొని  వాటిని సరిదిద్దుకోడానికి  ప్రయత్నించండి.
5.    జీవితం మొత్తం లో పదవ తరగతి అనేది  చాలా చిన్న  విషయం.  ఇంకా ఎన్నో గమ్యాలు చేరాలి. ఇంకా ఎన్నో నైపుణ్యాలు పెంచుకోవాలి అని గ్రహించండి.
6.    ఎవరు నిరుత్సాహ పరిచినా, ఎవరు అతిగా పొగిడినా  ఒకేలా తీసుకొని భవిష్యత్  లో  ఎలా చదవాలో ప్రణాళిక వేసుకోండి.
7.    స్నేహితుల విజయాలను అభినందించండి.  ఉన్నత లక్ష్యాలవైపు ముందుకుసాగండి.
                      విష్ యు  గుడ్ లక్
                     అలజంగి ఉదయ కుమార్
trainerudaykumar@gmail.com