Wednesday 14 November 2012

పసి(డి) మనస్తత్వాలు


పిల్లలు దేవుడూ   చల్లని వాళ్ళే.. కల్లాకపటం ఎఱగని కరుణామయులే.....  ఈ మాట ఎందుకు అన్నారేమో గాని ...బాలల దినోత్సవం సందర్భం గా పిల్లలనుండి మనం నేర్చుకోవలసింది ఏదైనా ఉందంటే...

1. వర్తమానం లోనే జీవించడం ; 

                   పిల్లలు గతాన్ని వేగం గా విస్మరించగలరు. భవిష్యత్ గురించి పెద్దగా  భయం పెట్టుకోరు.  ఎలా అంటే  ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటే.. ఆ విషయం పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్తే ఆ రెండు ఇళ్ళ మధ్య జీవితాంతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంటుంది.  కాని ఆ  ఇద్దరు పిల్లలు  కొంత సమయం గడవగానే అతి మామూలుగా కలిసిపోయి చెట్టాపట్టలేసుకొని ఆడుకుంటారు. వారి మధ్య జరిగింది  వెంటనే మరచి పోతారు..   అంతే  కాకుండా  మరుసటి రోజు పబ్లిక్ పరీక్ష ఉన్నా ఏ మాత్రం జరగబోయే దాని గురించి ఆలోచించకుండా  హాయిగా   టీ వి చూడగలరు, క్రికెట్ ఆడగలరు.   పెద్దవాళ్ళు మాత్రం ఇలా అయిత్ భవిష్యత్ ఏమయిపోతుందో  అడుక్కొని తినాలి అదీ ఇదీ అని తెగ్ హైరానా  పడిపోతుంటారు...  పిల్లలనుండి  మనం నేర్చుకోవలసింది ఏమిటంటే  వీలైనంత వరకు వర్తమానాన్ని  ఆనందించడం.

2. సృజనాత్మక మరియు ఊహాశక్తిని వినియోగించడం;
  
    
                పిల్లలనుండి మనం నేర్చుకోవలసిన మరో ముఖ్యమైన విషయం గానుగెద్దులా  తిరిగిన చోటే తిరుగుతూ, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ  అన్నట్టు ఒకే బాణీ  కొనసాగించకుండా  జీవితం లో మనం చేసే ప్రతి విషయం లోనూ నవీనత్వానికి  సృజనాత్మకతకు  ప్రయత్నించడం..   ముఖ్యంగా  ఆడవాళ్ళు.  వంకాయ కూర చేస్తే  జీవితాంతం   ఒకటైపే  తప్ప. మరో రకంగా  ప్రయత్నిద్దాం అని ఉండదు.  చిన్న పిల్లలు కథ చెప్పినా, లేదా పాఠశాల లో    జరిగిన విషయం చెప్పిన కావల్సినంత  సృజనాత్మకత ఉంటుంది.  


3. కావల్సింది పొందాలనే పట్టుదల కలిగి ఉండటం;

            పిల్లలు  ఏదైనా పొందాలనుకుంటే దాని యొక్క సాధ్యాసాధ్యాలు గురించి ఎలాగైనా పొందాలని కోరుకుంటారు  .  వారి మొండి పట్టుదల చూసి తల్లిదండ్రులు వీలైనంత ప్రయత్నించి   కోరిక తీర్చడానికి  ప్రయత్నస్తారు.  చందమామ పొందాలన్న  బాలరాముడి  కోరిక కనీసం అద్దం లో  ప్రతిబింబం అయినా  దగ్గరనుండి  చూడటానికి అవకాశం కలిగింది.   మనం పెద్ద అవుతున్నకొద్దీ  సాధ్యం కాదనే ఆలోచన పెంచుకొని మన కోరికల్ని అణచుకొని అసంతృప్తితో జీవించేస్తుంటాం.  

4. సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉందటం
   
            పిల్లలు తాము నమ్మిన వాళ్ళు అంటే తల్లిదండ్రులు గాని ఉపాధ్యాయులుగాని మిగిలిన పెద్దవారు గాని చెప్పితే అది నిజమా కాదా  ఎంతవరకు సాధ్యం అనే లేనిపోని లాజిక్కుల గురించి ఆలోచించకుండా  సంపూర్ణమైన నమ్మకం కలిగియుంటారు.  స్పైడర్ మేన్ అయినా శక్తిమాన్  అయినా  ఏదైనా  అవి నిజమే అనే నమ్మకాన్ని కలిగి యుంటారు.  ఇలా నమ్మడం వలన పెద్ద వాళ్ళమైన మనం  చీకటిని భూతాల్ని అవి ఇవి అని లేనిపోని భయాలు వారికి నేర్పిస్తామన్నది వేరే విషయం.   పెద్దవాళ్ళమయితే ఇది ఎందుకు అది ఎందుకు ఇది ఎలా అది ఎలా అని నమ్మాల్సిన విషయాలు నమ్మడం   మాని బురిడీ బాబాల వద్ద,  పొంగించి పబ్బం గడుపుకునే వాళ్ళ వద్ద బోర్లా పడుతుంటాం.

5.  శాశ్వతమైన మమకారాలు పెంచుకోకూడదుః;

            పిల్లలు తమ వస్తువుల్ని, బొమ్మల్ని అపురూపంగా చూసుకుంటారు. అవి విరిగినా, పని చేసినా, పని చేయకపోయినా  అన్నింటినీ ఒక బుట్టలో పెట్టి  అతి జాగ్రత్తగా  దాస్తారు. కాని  అతి త్వరలోనే వాటికి తమకు ఏమీ సంబంధం లేదన్నట్టు  ఒక మూలన పడేసి యోగిలా ఒక నవ్వు నవ్వుతారు.  మనమో  లేని పోని బంధాలు  ఆఖరికీ  అతి అశాశ్వతమైన ఫేస్ బుక్ లో కూడా మనకంటూ  శతృవులు, వర్గాలు, కారాలు, మిరియాలు నూరడాలు ఒకటేమిటి.  చెప్పుకుంటూ  మరలా బాలల దినోత్సవం వచ్చేస్తుంది.    ఎవరు కనపడినా వారు స్నేహితులైనా కకపోయినా  తెలిసిన వారైనా తెలియని వారైనా  నవ్వుమొహంతో పలకరిస్తారు. అంతే కాని ఎదుటివాడు  ముందు పలకరిస్తాడులే అని  వెర్రి చూపులు చూడరు.

                బాలల దినోత్సవం రోజైన  పసిడి లాంటి పసిమనస్తత్వం మనం అలవరుచుకొని పిల్లమనస్తత్వం వదులుకుంటామని ఆశిస్తూ....

haram, koodali, trainer uday kumar, jalleda,

Monday 1 October 2012

6 థింకింగ్ హేట్స్..... ఎడ్వర్డ్ డి బనో

             బహుముఖ, విశ్లేషణాత్మక ఆలోచనల తో ఉత్తమ  నిర్ణయాల ఎంపిక

               జీవితం లో అనుకోని సంఘటనలు ఎదురయ్యేటపుడు, సంక్లిష్టమైన పరిస్థితులు తలెత్తినపుడు   మనిషికైన, ఒక వ్యవస్థకైన  సరియైన, స్పష్టమైన, తప్పిదాలకు తావు లేని  నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.   ఒక సంస్థలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోడానికి సమావేశాలు జరిగినపుడు అందులో ఫాల్గొన్న ఒక్కొక్కరు ఒక  విధమైన ఆలోచన చేయడం వలన, తమ విధానమే సరియైనదని భావించడం వలన అనవసరమైన వాగ్వివాదాలు జరగడం, సమావేశాలు వాయిదా వేయడం అర్ధాంతరం గా ఆగిపోవడం లేదా  అమూల్యమైన కాలం వృథా అవడం జరుగుతుంది.
          ఈ సమస్యలకు సరియైన పరిష్కారం ఎడ్వర్డ్ ది బనో ప్రతిపాదించిన   6 థింకింగ్ హేట్స్...  ఆరు విభిన్నమైన ఆలోచనా సరళులు.  ఇది రెండు విషయాలపై ఆధారపడి ఉంది.
                                                        ఒకటి. సమాంతర ఆలోచనా విధానం ( parallel Thinking ).                                                         రెండు పార్శ్వముఖ ఆలోచనా విధానం ( Lateral Thinking)
సమాంతర ఆలోచన విధానమంటే..    విధాన నిర్ణయ ప్రక్రియ లో ఫాల్గొంటున్న ప్రతి ఒక్కరు  తమ వ్యక్తిగత అహం లేదా అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి ఒకే విధమైన  మార్గదర్శక ఆలోచన విధానాన్ని  అనుసరించాలి.   అంటే  అందరూ ఒకే కోణం లో  ఆలోచిస్తే  ఆ విషయం పై మరింత లోతుగా,  విస్తృతంగా  ఆలోచించడానికి అవకాశం ఉంటుంది.

1  WHITE  HAT

           ..ఈ కోణం లో ఆలోచించేటపుడు  అంతా కేవలం  సమాచారం, వాస్తవాలు గణాంకాలు గురిమ్చి మాత్రమే తెలియచేయాలి.  ఏమిటి? ఎందుకు? ఎక్కడ? ఎప్పుడు? ఎలా?  అనే ప్రశ్నలకు సంబంధించిన  వివరాల సేకరణ మరియు వాటి వ్యక్తీకరణ మాత్రమే చేయాలి.   నిర్ణయం తీసుకునేందుకు సమస్య గురించి ఉన్న విషయాలను మాత్రమే తెలియచేయాలి.     వ్యక్తిగత అభిప్రాయాలు గాని నమ్మకాలు గాని తెలియచేయకూదదు.  గతం గురించిన వాస్తవ విషయాలు , గణాంకాలు వ్యక్తపరచాలి.   ఈ విషయాలన్నీ  నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడతాయి.

తమకు తాము గా  వేసుకోవలసిన  ప్రశ్నలుః
  ఈ సమస్య గురించి నాకు ఏమిటి తెలుసు?
ఈ సమస్య గురించి నాకు ఏమి తెలియదు
ఈ సమస్య వలన తెలుసుకోవలసినవి ఏమిటి?
దీనికి సంబంధించిన గణాంకాలు, వాస్తవాలు న వద్ద ఏమిటి ఉన్నాయి?
2. RED HAT
               ఈ కోణం నుండి ఆలోచించేటపుడు  మనసులో ఉన్న భావాలను బహిరంగంగా వ్యక్త పరచాలి. ఈ సమస్య పట్ల దానికి సంబంధించిన నిర్ణయం కు సంబంధించి ఏ భావాలు కలిగితే ఉద్వేగాలు కలిగితే వాటిని  హేతువుకు  సంబంధం  లేకుండా  బహిరంగంగా వ్యక్తపరచాలి.  ఒక విషయం గురించి  ఆలోచించేటపుడు   అచేతనం  గా  కలిగే  భావోద్వేగాలు తెలియచేయాలి.  
     ఈ ఆలోచన విధానం వలన  తీసుకోబడే నిర్ణయం లో అంతర్గతం గా ఉన్న లోపాలు,  అది వ్యక్తులలో కలిగించే తీవ్ర ప్రకోపాలను ముందుగానే తెలుసుకోడానికి ఉపయోగపదుతుంది.
ఈ కోణం లో ఆలోచించే వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియచేయడానికి తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి.

ఈ సమస్య గురించి నాకు మనసులో ఏమి అనిపిస్తుంది?
దీనికి సంబంధించి నా భావాలు భావోద్వేగాలు ఏమిటి?
నా భావాలకు తగ్గట్టుగా మరోక పరిష్కారం ఏదైనా ఉందా?
నా  అంతరాత్మ ప్రబోధం ప్రకారం సరియైన పరిష్కారం ఏమిటి?

3. BLACK HAT
            ఇది నకరాత్మక, రంధ్రాణ్వేషక ఆలోచన విధానం.   తీసుకోబఓయే నిర్ణయం లో గల లోపాలు, ఒకవేళ  ఈ నిర్ణయం తీసుకుంటే జరగబోయే అనర్థాలు, సమస్యలు ముందుగానే తెలియచేస్తూ సాధ్యమైనంత వరకు నిర్ణయం వెనక్కి తీసుకోడానికి సంబంధించిన అంశాలను, అవసరాలను  తెలియచేసే ఆలోచనా సరళి..  భయం, అనుమానం, అసూయ. మరియు కోపం మొదలగు నెగటివ్ ఆలోచనలతో కూడుకున్న అభిప్రాయాలను తెలియచేసే విధానం.
    అయితే ఈ ఆలోచనా విధానం  ప్రమాదకరమైనది మాత్రం కాదు.  నిర్ణయం తీసుకోక ముందే ఇలా లోపాలని అన్వేషించడం వలన  జరగబోయే అనర్థాలను ముందుగా గుర్తించి సరిదిద్దుకోడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళికల లో గల అసంపూర్తి విషయాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
ఈ కోణం లో ఆలోచించే వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియచేయడానికి తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి
ఈ నిర్ణయం వలన జరగబోయే గొప్ప అనర్థం ఏమిటి?
ఈ నిర్ణయం లో లోపాలేమిటి?
ఇది విఫలమవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి?
దీని వలన కలిగే విష పరిణామాలేమిటి?
ఈ నిర్ణయం అమలు కాకుండా ఎలా ఆపగలను?

YELLOW HAT




.................ఇంకా ఉంది.....

Sunday 23 September 2012

బాల్యాన్ని ప్రేమిద్దాం రండి......

 జడబారిన హృదయాల్లో జడివానలాంటి                                  ఆలోచనలు రేకెత్తించే                                          చిరు(గ)జల్లు.......


 తండ్రి అడుగుజాడల్లో ప్రస్థానాన్ని   ప్రారంభించిన              తండ్రికి   తగ్గ   తనయ   చిరంజీవి   సంస్కృతి...

           సంగీత మరియు  సాహిత్య ప్రియులకు గజల్ శ్రీనివాస్ సుపరిచితులు.   ఆలోచనాంబుధిలో ఓలలాడించే సరస సాహిత్య ప్రక్రియ అయిన గజల్ ను విదేశాలనుండి దిగుమతి చేసుకున్నప్పటికీ మన సంస్కృతి, మానవీయ విలువలతో ఒక వినూత్న గానసరళి లో తనదైన ప్రత్యేక శైలిలో తెలుగు గజల్ కు దశా దిశా నిర్దేశం  చేసిన గజల్ శ్రీనివాస్  ఈ రచనా ప్రక్రియని పదిమందికి తెలియచేస్తూ ఎందరో గజల్ రచయితల గజల్లను తెలుగు శ్రోతలకు పరిచయం చేస్తూ కొత్త ఒరవడి ప్రారంభించారు.  ఈ ప్రక్రియలో భాగమే ఇటీవల విడుదల అయిన చిరు(గ)జల్లు ఆడియో సి.డి.
                    ఈ తెలుగు గజల్  అడియీ సి.డి. ప్రత్యేకత మరియు ఆయన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఓ మైలురాయి ఏమిటంటే  ఈ సి.డి లో గజల్లను తన ముద్దుల కుమార్తే చిరంజీవి సంస్కృతి  చే పాడించడం. విశ్వవ్యాప్తంగా గజల్ గానంతో స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ గజల గాన వైతాళికుని వారసురాలుగా సంస్కృతి పాడిన తీరు, మధురమైన, గుండెల్లో మెళికలు తిప్పే కొన్ని సున్నితమైన భావాలను పలికిన తీరు మంద్రమైన స్వరం లో కొన్ని భావాలను వ్యక్తపరచిన తీరు సంగీతం లో ఏ మాత్రం ప్రవేశం లేని వారితో సైతం శభాష్ అనిపిస్తాయి. సంగీతం తెలిసినవారికి  రాగయుక్తం గా ఎక్కడా శృతితప్పకుండా పాడిన విధానం ఔరా అనిపించి నిండైన మనసుతో ఈ చిన్నారి దీవెనల పెనుజల్లు కురిపిస్తాయి.

           గజల్ శ్రీనివాస్ గారి పరిచయ వాక్యాలతో ప్రారంభమయ్యే ఈ సి.డి లో మొత్తం 7 గజల్లు ఉన్నాయి.  మొట్ట మొదటి గజల్ గురుదేవులు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు రచించిన    '' మంచుపొగలుండేవి మరికొద్ది క్షణాల్లే  -      ఆ పిదప నిండేవి ఆదిత్య కిరణాలే  ''  అనే  గజల్   నిండైన వ్యక్తిత్వపు నమూనా ను  ఆవిష్కరిస్తుంది.  ఇదే పంథాలో  మంచి సహితీ విలువలతో కూడిన భావపరంపర ను కలిగించే  '' జీవిత సత్యాల గురించి చెట్టేమని అంటుంది"     అంటూ  డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి  గారి గజల్,  " నమ్మదగిన మనిషేది అమ్మ తప్ప "  అంటూ  శ్రీ   రెంటాల వెంకటేశ్వర రావు గారి గజల్   మరియు  " ఎంత గాయం చేసినా  "  అంటూ శ్రీ సురారం శంకర్ గారి గజల్  తెలుగు భాష లో గజల్ ప్రక్రియ ద్వారా తేలికైన పదాలతో బరువైన భావాలను ఎలా వ్యక్తపరుస్తాయి.
    
            ఈ   చిరు గజల్లు  ఆడియో సి.డి ప్రత్యేకత మరియు తలమానికంగా చెప్పే గజల్లు ఏమిటంటే   మన చిన్నారులు  కార్పోరేట్   విద్యా విధానం వలన, బిజీ బిజీ  బ్రతుకుల్లో   బానిసలమవుతూ మనం విస్మరిస్తున్న అరుదైన బాల్యం పడుతున్న గాయాల గురించి తెలియచేయడమే కాకుండా  వింటున్న ప్రతీ తల్లిదండ్రులు భుజాలు తడుముకునే విధంగా , తాము వెంటనే తెలుసుకోవలసిన  తమ పిల్ల హృదయాల వేదన గురించి కర్తవ్య బోధన చేస్తాయి.   ముఖ్యంగా  డాక్టర్ తటపర్తి రాజగోపబాలం రచించిన  " అమ్మ చేతి ముద్దలు" అనే గజల్  హాస్టల్ లో ఉండే పిల్లల అవ్యక్త వేదనను కన్ను చమర్చేలా వివరిస్తుంది.  డాక్టర్ ఎం.బీ.డి. శ్యామల గారు రచించిన " అందమైన బాల్యానికి  గాయం అయిందా?"  అనే గజల్    నేటి విద్యా వ్యవస్థ లో నలుగుతున్న పిల్లల అత్యంత విలువైన సహజ హక్కు అయిన బాల్యం పడుతున్న వేదన  మనలో మానని గాయాలను రగిలిస్తుంది.
             ఈ  ఆడియో సి.డి లో చివరి గజల్  ప్రేమాభిమానలతో, ముద్దు ముచ్చట్లతో  కోలాహలంగా ఉండాల్సిన ఇంట్లో చిన్న పిల్లలు ఒంటరి తనాన్ని ఎందుకు ఎలా అనుభవిస్తున్నారో తెలియచేస్తుంది. నీ పిల్లలకు నీవిచ్చే గొప్ప బహుమతి ఒక గంట వారితో గడపటం అనే మాట నిజమనిపిస్తుంది.   ప్రేమాభిమానాలనే నీరుపోసి పెంచాల్సిన ఈ పాదులు ఎలా ప్రేమరాహిత్యమనే ఎడారికి ఎలా బలవుతున్నాయో  తెలియచేస్తుంది.  తల్లిదంద్రుల ప్రధమ కర్తవ్యం మంచి భవిష్యత్తు ఇవ్వడం  మాత్రమే  కాదు  బంగారు బాల్యాన్ని  ఆనందంతొ తనివితీరా అనిభవించే అవకాశం కలిపించాలనే కర్తవ్య బోధన చేస్తాయి.
         ఈ గజల్లు వింటే  పన్నెండు సంవత్సరాల లే లేత ప్రాయం లో ఉన్న ఒక పసిగొంతు పాడిందంటే  ఆశ్చర్యం  కలుగుతుంది.. ''  ఇలా తయారు చేసారు దేశాన్ని ఏం త్రాగి బ్రతకాలి కంటి చెమ్మ తప్ప ?''    ఏవేవో  పోయాయని  ఏడుస్తారెందుకు..  ఏం పట్టుకొచ్చారు జన్మ తప్ప ?  అని ఆరిందలా ప్రశ్నిస్తుంటే  భావ వ్యక్తీకరణలో ఆ గొంతు గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.  
          బాల్యం ఎదుర్కుంటున్న  సమస్యల పట్ల వారి బాల్యాన్ని  వారు అనుభవించాల్సిన ప్రాధాన్యత ను గుర్తు చేసే
అంశాలతో  కూడిన గజల్లను ఎన్నుకోవడం హర్షించతగ్గ విషయం. ప్రతీ తల్లిదండ్రులు తప్పక వినాల్సిన ఆడియో సి>డి.  పుట్టినరోజు లకు కానుక ఈ ఆడియో సి.డి ఇస్తే  అంతకు మించిన విలువైన కానుక ఏదీ ఉండదు.
        చిరంజీవి సంస్కృతికి హార్ధిక అభినందనలు. తండ్రి వారసత్వానికి తొలి అడుగు వేల వేల మైళ్ళ ప్రయాణం కావాలని  సంగీత ప్రపంచం లో చిరస్థాయి స్థిర స్థాయిగా నిలవాలని ఆశీర్వదిస్తూ.....

అలజంగి ఉదయ్ కుమార్
      
koodali.org, haaram, jalleda, telugu gazels, gazal srinivas, trainer uday kumar

Friday 21 September 2012

MANAGEMENT LESSONS FROM THE GREAT POEM DESHAMUNU PREMINCHUMANNAA WRITTEN BY SRI GURAJADA APPA RAO GARU


కీర్తి  శేషులు శ్రీ గురజాడ అప్పారావు గారు షుమారు 102 సంవత్సరాల క్రితం రాసిన అజరామరమైన ఈ గీతం నుండి గ్రహించ వలసిన పాఠాలు, జీవిత సత్యాలు అనేకం....

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌

1. BE A TRUE PATRIOT
2. WORK FOR THE EXPANSION OF GOOD AMONG THE PEOPLE
3. STOP TALKING THE THINGS WHICH ARE NOT USEFUL TO ANY
4. DO CONSTRUCTIVE HELP TO OTHERS


పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌
తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌
5. DEVELOP THE AGRICULTURAL PRODUCTS
6. TAKE HYGIENIC  FOOD FOR SOUND BODY
7. STRONG BODY IS ASSET FOR PEOPLE


ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్‌
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌

8. COUNTRY WILL NOT FETCH WITH THE LAZY AND WEAK PEOPLE
9. DEVELOP YOUR ARTS AND SKILLS
 10  PRODUCE INDIGENOUS GOOD

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి


11. PROMOTE THE SALES OF INDIGENOUS GOODS
12. MONEY BRINGS YOU  FAME AND PROSPERITY


వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి


13. DONT LIVE IN YOUR PAST
14. FOCUS ON FUTURE
15. NEVER BE COMPLAISANT

పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్


16. HAVE COMPETITION IN EDUCATION
17. HAVE FIGHTING SPIRIT IN BUSINESS
 18. NEVER HAVE GRUDGES AND ENEMITY
19. AVOID WARS AND ENEMITY

 దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌


20. NEVER EX AGGREGATE YOUR PATRIOTISM 
21. DO SOMETHING GOOD FOR THE PEOPLE
21. YOUR DEED SHOULD SPEAK NOT THE WORDS

ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్

22. IMPATIENCE IS DANGEROUS FOR COUNTRY
23. ENJOY OTHERS SUCCESS
24. LEARN TO BE UNITED

పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్

25. JEALOUS MAN NEVER BE HAPPY
26. ONE FEELS OTHERS GOOD AS HIS WILL HAVE LOT OF GOOD

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

27. SACRIFICE YOUR PROFIT TO HELP THE OTHER
28.COUNTRY IS MADE BY THE PEOPLE NOT BY LAND

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌


29. LIVE WITH CO OPERATION AND CO EXISTENCE 
30 FRATERNITY AMONG THE RACES AND RELIGIONS

మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్


31. DEVELOP UNITY AMONG THE MINDS OF ALL RELIGIONS
32. NATIONAL INTEGRITY FETCHES SUCCESS


దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్

33. DEVELOP LOVE AMONG THE NATION
34. PERSPIRE IN ORDER TO PROSER

ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్
35. LITERATURE AND POETRY SHOULD BE DEVELOPED
36. ART AND LITERATURE SHOULD BRING NAME AND FAME TO THE NATION

                            ఇవి నాకు అర్థమైన భావాలు. మీరు విభ్ధించినా పరవాలేదు.  కేవలం ఒక పాటగా కాకుండా కర్తవ్యోణ్ముఖుల్ని చేసే ఒక అభ్య్దయ గీతం గా గురజాడ గారి పాటను స్మరిస్తూ   పాటిస్తే  అదే   మనం ఆ మహానీయునికిచ్చే గొప్ప నివాళి..

Wednesday 19 September 2012

వినాయక రూపం చెప్పే వివిధ జీవన విధానాలు

 
మితృలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అన్నీ విఘ్నాలు, ఆటంకాలు తొలిగిపోయి మనం చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని ప్రతీ కార్యక్రమాన్ని వినాయక పూజతో మొదలుపెట్టడం ఆనాదిగా వస్తున్న ఆచారం.
అన్నీ దేవతా విగ్రహాలకన్నా వినాయక విగ్రహానికి ప్రత్యేకత ఉంది. సామాజిక అడవులంటూ పర్యావరణ్ వేత్తలంతా చెబుతున్న విషయాలు వినాయక పూజలో మనం ఉపయోగించాల్సిన పత్రులు చూస్తే ఎన్ని రకాల చెట్లు మన ఊరి సమీపంలో ఉండేవో మనకు అర్థం అవుతుంది. అంతే కాకుండా వినాయక విగ్రహ రూపాన్ని నిశితంగా పరిశీలిస్తే.................. సింబాలిక్ గా మనం జీవించాల్సిన విధానాన్ని చెప్పారనికూడా ఒక కోణంలో అర్థం చేసుకోవచ్చు.

1. భారీ పరిమాణంలో ఉండే తలః ప్రతీ విషయాన్ని పెద్ద గా ఆలోచించాలని జీవితంలో తలకు దానితో ఆలోచించాల్సిన ప్రాధాన్యతను తెలుపుతుంది. Low Aim is Crime అని అబ్దుల్ కలాం గారు అన్నట్టు. ఉన్నత లక్ష్యాలను ఉన్నత ఆలోచనలతో చేధించాలని పెద్ద తల చెబుతుంది.

2. ప్రతీ విషయాన్ని నిశితం వినాలని చెప్పే పెద్ద చెవులు.మనం మాట్లాడటానికి ఇచ్చే ప్రాధాన్యత వినడానికి ఇవ్వం. అనేక సమస్యలకు మూల కారణం అసలు వినకపోవడం, సరిగా వినకపోవడం, పూర్తిగా వినకపోవడం. వినాయక విగ్రహ రూపం మనకు చెప్పే గొప్ప విషయం వీలైనంతగా వినమనే.

3. సూక్ష్మ దృష్టి తో పరిశీలించమని చెప్పే చిన్న కళ్ళుః ఏ విషయాన్నైనా నిశితంగా, పూర్తి ధృష్టిని పెట్టి చూడాలి. కేవలం విని నిర్ణయానికి రాకుండా సూక్ష్మపరిశీలనతో స్వయంగా తెలుసుకోవాలని చిన్న కళ్ళు చెబుతుంటాయి.

4. తక్కువమాట్లాడమని చెప్పే చిన్న నోరు. నోరు ఉంది కదా అని, వినే వాళ్ళు దొరికారు కదా అని ఏది పడితే అది మట్లాడకుండా ఉపయోగమైనవి మాత్రమే పరిమితంగా మాట్లాడాలని చిన్న నోరు చెబుతుంది.

5. ఇఅతురులకు మంచి జరుగుతుందంటే నీ కున్న ఆయుధాలలో లేదా సంపత్తి లో సగం వదులుకొని మిగిలిన సగంతో జీవించు అని చెప్పే ఏక దంతం.

6. భారీ గా, సమర్థవంతంగా, సంకోచ వ్యాకోచాలతో కోరుకున్న దాన్ని కదలకుండా పొందగలిగేందుకు వీలుగా ఉన్న తొండం మనం చేయాల్సిన కృషి ఎలా ఉండాలో చెబుతుంది.

7. విశాలంగా భారీ గా ఉన్న ఉదరం మనం సంపాదించింది అంటా ఖర్చుపెట్టకుండా దాచుకోవాలని చెబుతుంది. ఎంత మొత్తం మనకు అందుబాటులో ఉంటే అంత విశ్వాసంతో, నమ్మకంతో దర్పంగా మనం జీవించగలుగుతాం.

8. చేతుల్లో ఉండే పలు రకాల ఆయుధాలు, ఉండ్రాళ్ళు మనల్ని మనం కాపాడుకునేందుకు ఉప్యోగపడే ఆయుధాల్ని సిద్ధంగా ఉంచుకోవాలని, శక్తినిచ్చే ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటుండాలని చెబుతుంటాయి.

9. జీవితంలో మనం రకరకాల కోరికలపై స్వారీ చేస్తుంటాం. ఎలుకల్లా మన కోరికలు మన ఆధీనంలో ఉన్నాయా లేదా కోరికలే గుర్రాలై మనల్ని పరిగెత్తెస్తున్నాయా అనేదే ముఖ్యం. ఎంత చిన్న కోరికలుంటే మనం ప్రయాణం అంత సాఫీగా జరుగుతుంది అనేది మూషిక వాహనం చెబుతుంది.

10. ఎల్లప్పూడూ చిరు మందహాసం తో, అందరి మేలు కోరుతూ ఆశీర్వదిస్తూ ఉండమని అభయ హస్తం చిరు మందహసం చెబుతాయి.

దీంట్లో లాజిక్ ఎంత? ఎంతవరకు సత్యమ్ ఎంతవరకు కల్పితమనే ఆలోచనలు మాని పండుగని ఉత్సాహం తో, ఆనందంతో జరుపుకుందాం... మన కార్యాల్లో మన లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నత జీవనం వైపు పరిశ్రమించాలని మన యత్నాలని విజయవంతం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.

Sunday 12 August 2012

Powerful Life Lessons from the Punch dailogues of Thrivikram Srinivas from Movie JULAI

Powerful Life Lessons from the Punch dailogues of Thrivikram Srinivas from Movie  JULAI

                    నేటి కాలం దర్శకులలో కథా బలం తో బాటు మలుపులతో కూడిన  కథనం  దానికి మించిన పదునైన పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే వారిలో త్రివిక్రం శ్రీనివాస్  ముందుంటాడు అంటే  అతిశయోక్తి కాదు.   చిన్నప్పటినుండి అన్ని రకాల పుస్తకాలను కాచి వడబోయడమే కాకుండా  తెలుగు బాషమీద మంచి పట్టు ఉండటమే కాకుండా  ప్రాసతో కూడిన భాష, పద ప్రయోగాలలో  వైవిధ్యం చమత్కారం తో కూడిన పంచ్ డైలాగ్ లు   ప్రేక్షకులకు నవ్వు కలిగించడమే  కాకుండా  ప్రతీ సన్నివేశాన్ని రక్తి కట్టిస్తాయి.  కాని ప్రతీ సంభాషణ ని  లోతుగా పరిశీలించి చూస్తే తాను కాచి వడబోచిన జీవిత సత్యాలు అంతర్లీనంగా గోచరిస్తాయి.ఈ మధ్య విడుదలయిన  జులాయి సినిమాలో  ఆద్యంతం అనేక డైలాగ్ ల్లో  under current  గా మంచి భావాల్ని, ఆలోచనలని తెలియచేస్తాయి..    కొన్ని డైలాగ్ లను పరిశీలిస్తే.....
ఎవడు జులాయి?????? 
 1..లక్ష రుపాయకు తగిలే లాటరీ టికెట్ కూడా కష్టపడి 
సంపాదించిన రుపాయి తోనే కొనాలి...  జీవితం హై వే.. గెలుపు వన్ వే.. ఇందులో షార్ట్ కట్స్ కి నో వే......
      సినిమా  ప్రారంభం లోనే  TITLE JUSTIFICATION  చేసేటట్టు ప్రకాష్ రాజ్ వాయిస్ తో ఈ డైలాగ్ చెప్పించాడు డైరెక్టర్ త్రివిక్రం..
        కనీసం కష్టపడకుండా  అడ్డదారిలో  ఎదిగిపోదామనుకునే ప్రతీ వాడు ఒక జులాయే... నెలంతా 
కష్టపడిసంపాదించే బదులు పదివేల్ రుపాయల్ని రెండుగంటల్లో లక్ష 
రుపాయలు  చేసేద్దామనే వై ఖరి కలిగియున్న రవి (అల్లు అర్జున్)జులాయి అయితే రెండు శాతం వడ్డి ఎక్కువ ఇస్తాడంటే వెనుక ముందూ ఆలోచించకుండా  పదిహేను వందల కోట్లు డిపాజిట్ చేసిన ప్రతీవాడూ ఒక జులాయే.  అంతమొత్తాన్ని ఒక క్రిమినల్ తో కలసి కొట్టేసి హైదరాబాద్  లో  పెద్ద సైట్ కొనేద్దామని ప్లాన్ చేసిన వరద రాజులు (కోటా) ,   పదిమందితో ప్లాన్ చేసి పని జరిగాక  వాటాలు ఇవ్వనవసరం లేకుండా అందరినీ పైకి పంపించిన బిట్టూ ( సోనూ సూద్) , డంపింగ్ యార్డ్ లో డబ్బు ఉందని తన వెహికిల్  కి  ఎగిరివచ్చిన  నోటు  తో  గుర్తించి అందర్నీ పంపించి గోవిందరాజులతో కలసి  బిట్టుని  మరియు  పైసా ఆశించకుండా లైఫ్ రిస్క్ చేస్తున్న హీరో రవిని  కూడా బోల్తా కొట్టించాలనుకున్న రాజ్ మాణిక్యం ( రావు  అశోక్),  ఐ,పి,ఎస్   అఫీసర్ అయినా గన్  వాడాలన్నా చివరికి      ఇంటరాగేషన్ చెయ్యాలన్నా వణికే  సీతారామయ్య( రాజేంద్ర ప్రసాద్) అంతా జులాయిలే ఒక విధంగా చూస్తే...  జీవితం హై వే..  అన్ని ఒడిదుడుకులు ఎదుర్కుంటూ సూటిగా పోవాలి.  షార్ట్ కట్స్ కోసం చూసామా  గెలుపు కి నోవే.. ఈ రోజుల్లో చాలామంది ఎవడి మీద వాలిపోదామా అని చూసే వాళ్ళే...   స్నేహితులు కష్టపడి సహాయం చేస్తే లేదా తల్లిదండ్రులు సంపాదిస్తే, లేదా అత్తామామ ఇచ్చే కట్నం మీదో  , బెట్టింగ్ మీదో, బెదిరీంచడం మీద ఆదారపడో పైకెదిగిపోదామని ఆలోచించడం ఆపాలి....  రెండు మూడు గంటల్లో లక్షలు సంపాదించాలనుకుంటే  ప్రాబెమ్స్  తప్పవు..
2. ఆలోచనల్లోనూ, పిల్లలకు చెప్పే పాఠాల్లోనూ రిచ్ నెస్ ఉండాలిః 
         ఈ సినిమాలో హీరో  మొదటి సీన్ లో జీవితం లో లాజిక్ గా ఆలోచించడం ,  ఉన్నతం గా ఆలోచించడం స్కూల్ స్థాయి లోనే  పిల్లలకు నేర్పించాలంటారు త్రివిక్రం.    ఏభై కేజీ ల మనిషి  కోటి రుపాయల BMW  కారులో సిగ్నల్ దగ్గర ఎదురుచూస్తే...... ఇలాంటి  విషయాలు చెప్పి  థాట్స్ లో రిచ్ నెస్ నేర్పించండంటాడు. లాజిక్ లేకుండా  బట్టీ పట్టి నేర్చుకోవడం వలన సరియైన ఉద్యోగం దొరక్క " సాఫ్టవేర్ లో ఖాళీ లేదు, హార్డ్ వేర్ లో గ్రోత్ లేదు, రియల్ ఎస్టేట్ లో రౌడీలెక్కువ, కనస్ట్రక్షన్ జీతాలు తక్కువని బాధపడాల్సి వచ్చి నిజంగా జులాయి గా హైదరాబాద్ లో అమీర్ పేట లో స్కిల్స్ ఇంప్రూవ్ మెంట్ కోర్సులు చేస్తూ కాలం గడపాల్సి వస్తుంది. 
3. లైఫ్  లో ఎప్పుడూ ఏం చెయ్యాలి అని అవతలివారిని అడగకు .  నీ కంటూ క్లారిటీ ఉండాలి: 
          తమజీవితం లో ఏం చెయ్యాలో, ఏం కావాలని అనుకుంటున్నారో చాలా మందికి సరియైన అవగాహన ఉండదు. ఇతరుల సలహాల మీద సూచనలమీద అధారపడుతూ జీవితం ఎలగో ఒకలాగ బ్రతికేస్తుంటారు. ఒంటరిగా కనీసం తనకు కావల్సిన బట్టలు కూడా ఎంచుకోలేని పరిస్థితి.  ముఖ్యం గా  తమ లక్ష్యం ఏమిటో దానికి కావల్సిన నైపుణ్యాలేమిటో , వాటిని ఎలా పెంపొందించుకోవాలనే  కనీస అవగాహన ఉన్నవాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు.  ఇతరుల నుండి సలహాలు తీసుకోవచ్చేమో గాని నిర్ణయం మాత్రం మనదై ఉండాలి. పదే పదే ఇతరుల మీద అలవాటు పడటం వ్యక్తిత్వ లేమి కి నిదర్శనం.   ట్రావెల్ మూర్తి (బ్రహ్మాజీ)  కన్ ఫ్యూజన్ లో  బిట్టూ ( సోనూ సూద్ ) ని అడిగినా.. ఇదే పరిస్థితి చాలా మంది యువకులకూ ఎప్పూడూ కొనసాగుతూనే ఉంటుంది. క్లారిటీ లేని వాడు జులాయీ లా మిగలడానికి అవకాశం ఉంటుంది
4.  
 ( ఇంకాఉంది....)

Saturday 12 May 2012

Life lessons from the telugu movie GABBAR SINGH

koodali.org,
                  
          గబ్బర్ సింగ్   సినిమా చూసి ఆనందిస్తున్న తెలుగు ప్రేక్షకులు తమ తమ అభిరుచులమేరకు ఆ సినిమాలోని అనేక అంశాలను మెచ్చుకుంటున్నారు..  ఈ సినిమా ఫక్తు కమర్షియల్ సినిమా అని విమర్శించే వారు ఎప్పటిలాగే ఉన్నప్పటికీ   ఈ సినిమా లో తెలుసుకోవల్సిన, పరిశీలించవల్సిన మనో విశ్లేషణా  మరియు జీవితానికి ఉపయోగపడే అంశాల గురించి ఒక వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా నా అభిప్రాయలను నేను పరిశీలించిన అంశాలను తెలియచేస్తున్నాను. ఇంతకు ముందు బిజినెస్ మేన్ సినిమా లో మేనేజ్ మెంట్ అంశాలను ఎలాగైతే అభినందించారో అదేవిధంగా ఈ వ్యాసం మీకు ఆనందం కల్గిస్తుందని ఆశిస్తున్నాను.
SIBLING RIVALRY:    ప్రతీ కుటుంబంలో  ఇద్దరు మగ పిల్లలుంటే  తండ్రి లేదా తల్లి ఒకరివైపు ఎక్కువ అభిమానం చూపుతూ   ఒకరి వలన రెండో వాడు చెడిపోతున్నడనే విమర్శించడం వలన అటువంటి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో  ఈ సినిమా ఒక చక్కని ఉదాహరణ.  గారాబం చెయ్యబడ్డవాడు ఆ ప్రేమను దుర్వినియోగం చేస్తాడు. రెండోవాడు తనని తాను ఒక విలన్ గా ప్రొజెక్ట్  చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలను తరుచూ పోల్చడం, ఒకరి వలన మరొకరు పాడవుతున్నాడనే విమర్శ  ఒకరిలో ప్రతీకారన్ని, మరొకరిలో తాను ఏమి చేసినా పర్వాలేదనే మొండితనాన్ని ఏర్పరుచుతుంది.
ACCEPTANCE OF CHILD AS HE IS;    పిల్లలని వారి అభిరుచులను వారి ఆసక్తులను ప్రతీ తండ్రి లేదా తల్లి వారు ఎలా ఉంటున్నారో అలానే  అంగీకరించాలి.  తమ అభిప్రాయాలకు భిన్నంగా ప్రవర్తిస్తుంటే వారిని అర్థం చేసుకోవాలి. అంతే కాని వారిని హాస్టల్ లో ఉంచితే  దూరంగా ఉండటం వలన తల్లిదండ్రుల ప్రేమకు దూరమై కుటుంబం పట్ల నిరాసక్తత ఏర్పరచుకోవచ్చు.  ఎవరు  ఎవరు లా ఉన్నా జీవించడం ముఖ్యం, బ్రతకడమ్ ముఖ్యం. కలిసి ఉండటమ్ ముఖ్యం.    తమ అభిప్రాయాలను వ్యక్తపరుచుకోవడం ముఖ్యం.  ముసలి కాలం ఆప్యాయత  ఎలా మనకు అవసరమో  పిల్లలకి ఆ వయస్సులో అభిమానం ఆప్యాయత, ప్రేమ చాలా అవసరం.
OEDIPUS  and ELECTRA COMPLEX:     ఈ సినిమాలో గుర్తించాల్సిన విషయాలు రెండు   హీరో పవన్ కల్యాణ్  ఇడిపస్ కాంపెక్స్ అనే స్వభావం కలిగి ఉంటే హీరోయిన్  ఎలెక్ట్రా కాంప్లెక్స్  అనే  స్వభావమ్ కలిగి ఉంటారు.   తల్లి పై   తీవ్రమైన అభిమానం కలిగిఉండి ఆమె ప్రేమకోసం  తహతహలాడటం, తనమీద వ్యామోహం పెంచుకొని వయ్యారాలు పోతున్న స్త్రీ మీద మోజు చూపకపోవడం,   గౌరవంగా ఒక పద్ధతిగా ఉండే  శృతిహసన్  పై  అభిమానం పెంచుకొని  ఆమె అభిప్రాయానికి గౌరవించడం  ఇవన్నీ   ఇడిపస్ కాంప్లెక్స్   స్వభావం అయితే తండ్రి బలహీనతలను కూడా గౌరవిస్తూ   తండ్రి కోసం తన అభిప్రాయాలను కూడా కాదనుకోవడం  శృతిహసన్ ఎలెక్ట్రా కాంప్లెక్స్ స్వభావం కలిగిఉంటుంది.
FAMILY IS IMPORTANT:    దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా  కుటుంబం,   కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చాల ముఖ్యం . ఇదే విషయాన్ని శృతి హసన్ పాత్ర ద్వారా దర్శకుడు చెప్పిస్తాడు.   చివరికి అన్నదమ్ముల మధ్య  చిన్న చిన్న వైరుధ్యాలున్న  ఒకరినొకరు క్షమించుకోవడం   పిల్లల సుఖాలే తల్లిదండ్రుల లక్ష్యం అని కోట శ్రీనివాస్  పాత్ర  ద్వారా  చెప్పిస్తాడు.
                        (  ఇంకాఉంది..)   It will be completed soon.................
give feed back...if you like
        trainerudaykumar@gmail.com

Wednesday 2 May 2012

వేసవి సెలవల్లో ....వినోదమే కాదు వికాసం కూడా......

వేసవి సెలవల్లో   ....వినోదమే కాదు వికాసం కూడా......

     హమ్మయ్యా!  పరీక్షలు అయిపోయాయి ఇక సెలవలే తెగ ఆడుకోవచ్చు.. ఇటువైపు పిల్లల కేరింతలు
   అయ్య బాబోయ్ వేసవి సెలవలొచ్చేసాయ్... వీరిని ఎలా కంట్రోల్ చెయ్యాలి దేవుడా.. అటు తల్లిదండ్రుల  తీరని చింతలు ..

  ఇది వరకటి రోజులలో సెలవలు ముఖ్యంగా వేసవి సెలవలు వస్తే చాలు తాత 
గారి ఊరు వెళ్ళడం అక్కడ మామిడి తోటలో మామిడికాయలు తెంపుకోవడం
వాటిని ఊరబెట్టడం, పళ్ళు  ముగ్గబెడితే ఎవరికీ తెలీకుండా దొంగలించడం
ఊరు చివర ఏటి ఒడ్డుకు స్నానాలకు వెళ్ళడం...  ఇదంతా గతం మాత్రమే..  ఆధునిక జీవన ప్రభావ ఫలితంగా పలుచబడుతున్న మానవ సంబంధాలు ఒకవైపు, పరిమిత సంతాన భావన ఒకవైపు పిల్లలు ఇతర ఊళ్ళకు వెళ్ళడం గాని లేదా పిల్లలను విడిచి తల్లిదండ్రులు ఉండలేకపోవడం వలన గాని పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు.
   అయితే ఇంటర్మీడియట్ మరియు పదవతరగతి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు కార్పోరేట్ పాఠశాలలు సెలవలు ఇవ్వడం లేదు. ఇతర తరగతుల పిల్లలకు సమ్మర్ కాంప్ లు నిర్వహిస్తుంటారు
   ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తీసుకోవలసిన  జాగ్రత్తలేమిటి ?  ఈ సెలవుల్ని మరింత ఉపయోగ పరం గా  ఎలా  వినియోగించుకోవచ్చో   వివరంగా చర్చిద్దాం. 
వేసవి శిక్షణా శిబిరాలు    ఈ రోజుల్లో ప్రతి ఊరిలో,  ప్రతి పాఠశాలల్లో  వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు.  అవకాశం ఉన్న తల్లిదండ్రులు  వీటిలో ఏ ఏ అంశాలు చెబుతున్నారు. నేర్పించేవారు ప్రొఫెషనల్ కోచ్ లా లేదా నామమాత్రం గా పేరుకోసం లేదా డబ్బులు కోసం నిర్వహిస్తున్నారో పరిశీలించి తమ పిల్లలను జాయిన్ చెయ్యాలి.  ఈ శిబిరాలు కూడా ఒకటి రెండు వారాల పాటు రోజుకి రెండు మూడు గంటలకన్నా  ఎక్కువ ఉండవు. ఉండకూదదు కూడా.   ఇంట్లో పిల్లలు ఉంటే  టీ.వీ చూసి పాడైపోతున్నారనో పిల్లలమీద విసుక్కోవడం. మరలా స్కూలు ఎప్పుడు తెరుస్తారంటూ ఎదురుచూడటం కాదు.  వేసవి సెలవల్లో వినోదం మరియు వికాసం పిల్లలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
1) చదువుకు సంబంధించిన అంశాలు;  ప్రతీ రోజు చదువుకి , ఆటలకి, టీ,వీ చూడటానికి ఇతర అంశాలకి ఎంతసమయం కేటాయించాలి  ఒక  టైం  టేబుల్  పిల్లలతో   చర్చించి  తయారుచేయాలి.  సెలవలంటే  చదువుని  పూర్తిగా  వదిలివేస్తే ముందు తరగతిలో నేర్చుకున్నది మరచిపోయే అవకాశం  ఉంటుంది.  ముందు  తరగతి  వార్షిక  పరీక్షల్లో  ఏ సబ్జెక్ట్ లో  వెనుకబడి  ఉన్నాడో  గుర్తించి ఆ  సబ్జెక్ట్ మరల రివిజన్ చెయ్యాలి. సెలవల అనంతరం ఏ క్లాస్ చదవబోతున్నాడో ఆ క్లాస్ కి సంబంధించి ముఖ్యమైన సబ్జెక్ట్స్ చదవడం కొంత మంచిది. ఇది రోజుకి రెండు లేదా మూడు గంటలు మాత్రమే. 
2) భాషా నైపుణ్యాలు పెంపొందించ డానికి సంబంధించిన అంశాలుః నేటి కాలం లో  విద్యార్థులు   లాంగ్వేజ్ లలో బాగా వెనుకబడి ఉంటునారు.  వారికి ఆసక్తి ఉన్న అంశాలకు సంబంధించిన  కథల పుస్తకాలు,చంద్ఫమామ, బాలమిత్ర,  కామిక్స్, జనరల్ నాలెడ్జ్  మొదలగు పుస్తకాలు కొని చదివించాలి.  వారికి నచ్చిన సినిమా పాటలు  విని రాయమని చెప్పడం,  ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బిగ్గరగా చదివించడం చేయించాలి.  వారు చూసిన సినిమా వారికి వచ్చిన భాషలో క్లుప్తంగా రాయమని చెప్పాలి.  అంతే కాకుండా వారి ఇంగ్లీష్ పెంచుకోడానికి  వీలైతే కమ్యూనికేషన్  స్కిల్స్ నేర్పిస్తున్న సంస్థలకు పంపించడం గాని , ఇతర పిల్లలతో కలసి వర్డ్ గేమ్స్ , పజిల్ నింపడం మొదలగు ఆటలు ఆడేటట్టు చూడాలి.   వారిని దగ్గరున్న పుస్తకాల షాప్ కి తీసుకెళ్ళి  కొన్ని పుస్తకాలు వారు ఎంచుకుని కొనేటట్టు చేయాలి. 
3) మెదడుని చైతన్యం చేసే అంశాలుః  వేసవి కాలంలో తగిన సమయం ఉంటుంది కాబట్టి  సుడోకు, చదరంగం, పజిల్స్, అబాకస్,  రుబిక్స్ క్యూబ్ మొదలగు  పిల్లలతో ఆడిస్తుండాలి. సుడోకు   సెల్ ఫోన్ లో  కాకుండా  పేపర్  మీద  నింపించాలి. రుబెక్స్ క్యూబ్ వలన లాజికల్  థింకింగ్ ,  లాటరల్  థింకింగ్  పెరుగుతుందని   నిరూపించబడింది. అవే కాకుండా క్యారమ్ బోర్డ్ కొని ఇంట్లో ఉంచితే ఎండలో తిరగరు సరికదా అది ఆడటం వలన బాడీ మైండ్ సమన్వయం పెరుగుతుంది. దగ్గరలో కంప్యూటర్ నేర్పే సంస్థలుంటే అందులో చేర్పించడం మంచిది.
4)  ఆటలు, శారీరక కృత్యాలుః వేసవి కాలంలో పిల్లల ఆటలకి అడ్డూ అదుపూ ఉండదు అంటారు. నిజమే వారు ఆడే ఆటలు లేదా ఇతర శారీరక కృత్యాలు వారికి తరువాత కూడా ఉపయోగపడాలి. కేవలం క్రికెట్ అంటూ ఎండలో మాడిపోకుండా.  ఉదయం పూట మీతో పాటు వాకింగ్ కి తీసుకెళ్ళడం, యోగా లేదా మెడిటేషన్ సెంటర్ దగ్గరలో ఉంటే అందులో జాయిన్ చెయ్యడం
  స్విమ్మింగ్ , సైక్లింగ్ నేర్పించడం, కొంచెం పెద్దవారైతే  గేర్లు లేని మోపెడ్ లేదా మోటార్ వెహికిల్స్ నేర్పించడం చెయ్యాలి. ఇండోర్ గేమ్స్ తో పాటు బయట ఆడే ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  చిత్రలేఖనం, క్లే మౌల్డింగ్, నృత్యాలు మొదలగునవి వారిలో అభిరుచిని ఆసక్తిని పెంపొందింపచేస్తాయి.
5) ప్రయాణాలుః  చాలామంది వేసవి సెలవుల్లో తీర్థయాత్రలు కాని ఇతర సందర్శనా ప్రదేశాలకు వెళుతుంటారు.  వాటిని పిల్లలు బాగా ఎంజాయ్ చేసే టట్టు చూడండి.  వారు ప్రతీ రోజు టూర్ డైరీ రాయడం, అక్కడ ఉన్న విశేషాలను తెలుసుకోవడం వారిలో ఆసక్తి పెంపొందించడం ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యతలే.  ప్రయాణాల్లో ఎటువంటి పరిస్థితుల్లో వారిని విసుక్కోవడం  కసరుకోవడం చేయరాదు.  ఆ ప్రదేశాల్లో ప్రకృతి, అక్కడ ప్రజల జీవన విధానం, సంస్కృతి తెలుసుకునేటట్టు చూడాలి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలకు తీసుకువెళ్ళి వారు అవి తెలుసుకునేటట్టు చూడాలి. 
6) ఇంట్లో పనులు నేర్పించడం; పిల్లలకి  వారి పనులు వారు చేసుకునేటట్టు నేర్పించే బాధ్యత ఇంట్లో ఆడవారిదే. అమ్మాయైనా  అబ్బాయైనా, లేచిన వెంటనే పక్క సర్దుకోవడం,  బీరువాలో బట్టలన్నీ మరలా సర్దుకోవడం. ఇంట్లో ఉన్న గ్రోసరీ మరలా సర్దుకోవడం, డ్రాయింగ్ రూం  ఫర్నీచర్ సర్దడం, శుభ్రంగా ఉంచడం  పిల్లలకి ఈ వయసులోనే నేర్పించాలి.  వారు చేసే ప్రతీ పనికి తగిన బహుమానం ఉండాలి. పాలు మరగించుకోవడం, ఆమ్లెట్ వేయడం, టీ తయారుచేయడం, ఇంట్లో గెస్ట్స్ వస్తే  మమ్చినీళ్ళు, స్నాక్స్, టీ  అందించడం నేర్పించాలి. గెస్ట్స్ వచ్చినపుడు వచ్చి బాగున్నారా అని పలకరించడం ఇటువంటు మర్యాదలు నేర్చుకునేందుకు వేసవి కాలమే సరియైన  సమయం. పిల్లలతో ఐస్ క్రీం తయారుచేయడం, జ్యూస్ తయారు చేఅడం వంటల్లో ప్రయోగాలు ఇంట్లో చక్కని స్నేహపూరిత వాతావరణం ఏర్పరుస్తుంది, మా అమ్మాయి చేసిన కేక్,   ఐస్ క్రీం అంటూ చ్ట్టు పక్కల వాళ్ళకి పంచుతుంటే   వచ్చే ఆనందం చెప్పలేనిది కాక పోతే కాస్త రుచి చూసాక పంచండి. 
7) భక్తి, పూజా కార్యక్రమాలు;  పిల్లలో భక్తిశ్రద్ధలు  పెంపొందింప చేసేందుకు  తగిన  సమయం ఇదే. పుణ్యక్షేత్ర దర్శన, ఉదయం శ్లోకాలు చదివించడం, పూజా విధానం నేర్పించడం.  పిల్లలలో చాలా మార్పును తీసుకువస్తుంది. పెద్దల్పట్ల గౌరవమర్యాదలు ఇవన్నీ వారికి నైతికాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. 
8 ) ప్రకృతి పై అవగాహన కల్పించడం;   పెరడులో గాని ఇంటి పైన ఖాళీ స్థలం ఉంటే కుండీలలో లేదా నేల పై మొక్కలు పెంచడం,  కొన్ని ధనియాలు వారికి
ఇచ్చి  నేలపై నాటిస్తే కొన్ని రోజులకి అవి కొత్తిమీరగా వస్తే ఎంత ఆశ్చర్యపోతారో మీరే చూడండి.  అవకాశం ఉన్న   వాళ్ళు  కాయగూరలు  పండించండి. అదేదో వ్యాపారం  లేదా వ్యవహారం  కాదు  అలా  చేయడం  వలన  కాయగూర  బోజనం అంటే చిరాకు పడకుండా ఉంటారు. అవి పండించిన వారి కష్టం గుర్తిస్తారు.  జూకి, బీచ్ కి తీసుకెళ్ళడం వలన వారికి ప్రకృతి పట్ల ఇష్టం ఏర్పడుతుంది.  వీలైతే దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోం కి , అనాథాశ్రమం కి తీసుకెళ్ళండి. తరువాత వారి ప్రవర్తనలో కలిగే మార్పులు చూడండి.
9) ప్రేమాభిమానాలు పంచుకునేందుకు, పెంచుకునేందుకు తగిన సమయం ;  పిల్లలతో తప్పనిసరిగా కల్సి భోజనం చెయ్యాలి. సెలవల్లో వారానికి రెండుసార్లు  బయటకు వెళ్ళాలి.   చిరాకు పడటం, కోపించడం మానివేయాలి.  వారు గీచిన  చిత్రాలకు,   చేసిన వంటకు ఎలాగున్నా మెచ్చుకోవాలి తగిన బహుమతులివ్వాలి.  వారి ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిపించుకొని ఆడుకొనే స్వేచ్చ నివ్వాలి. వారి ముందు ఎటువంటి పరిస్థితుల్లో  కలహమాడరాదు. ఇతరులని దూశించరాదు.
             ఇవన్నీ ఆచరణ  సాధ్యమా    అంటూ దీర్ఘాలు తీయకండి.   ప్రయత్నిద్దాం.   మన పిల్లల గురించే కదా....... మామూలు రోజులలో చదువు, మెదడు ఈ రెండింటికి తప్ప  మిగిలిన వాటికి పని ఉండదు. అభివృద్ధి ఉండదు. ఈ వేసవి సెలవుల్లో పిల్లల మానసిక, శారీరక, భావోద్వేగ, ఆథ్యాత్మిక మరియు నైతిక అంశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోడానికి కాస్త సమయం ఉంటుంది.   స్కూల్ లో  సెలవలు ఇవ్వలేదని మీరు వారిని నిందించకండి.   మీ బట్టే వాళ్ళు .. నిలదీయండి..  పిల్లల్ని ఎదగనీయండి..    పిల్లలనే మొక్కలు ఏ చీడపడకుండా పెంచే తోటమాలులు మీరేనన్న సత్యం విస్మరించకండి
  ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com


(ఇంకా ఉంది)

Sunday 19 February 2012

Time Management

                Time Management అనేది ఈ రోజుల్లో అత్యంత తరుచుగా చర్చించబడే విషయం అయిపోయింది. ఇంతకు ముందు ఈ విషయం కేవలం కార్పోరేట్ సంస్థలలో ఉన్నత స్థాయి అధికారులకు, కార్యనిర్వాహకులకు మాత్రమే సంబంధించిన విషయంగా పరిగణించే వారు.
నర్సరీ పిల్లాడి నుండి విశ్రాంత జీవనం గడిపేవారి దాక ఈ రోజుల్లో అందరినోటినుండి వచ్చే మాట ఒక్కటే. సమయం చాలడం లేదు.                               ఒక్కోసారి పిల్లలు తమ తల్లిదండ్రులను అడుగుతుంటారు '' రోజుకి ఇరవై నాలుగంటలే ఎందుకు మరో రెండు గంటలు ఎక్కువ చెయ్యవచ్చు కదా.'' అని. మనలో కొందరికి నిజమే కదా అనే ధర్మసందేహం కూడా వస్తుంది. పూర్వం వ్యవసాయ ప్రధాన మరియు ఉమ్మడి కుటుంబాలు ఉండే సమయాలలో ఉన్న సమయం అందరికీ సరిపోయేదేమో కాని నేటి ఆధునిక, పారిశ్రామిక, వ్యష్ఠి కుటుంబాల కాలం వచ్చే సరికి రోజు రోజుకి విస్తృతమౌతున్న పని ఒత్తిడి ఏ పని సమయానికి అనుకున్నట్టు గా జరగనీక తీవ్ర నిరాశకు నిస్పృహలకు అంతే కాకుండా పలుచనైపోతున్న ఆత్మీయ బంధాలకు దారి తీస్తుంది.
                   ఇంతకీ టైం మేనేజ్ మెంట్ అంటే ఏమిటి ? అందులో ప్రధానమైన విషయాలేమిటి ? మనకు దైనందిన వ్యవహారాల్లో  ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. బయట కంపెనీల్లో పనిచేసేవారికైనా లేదా ఇంట్లో ఉండే గృహుణులైనా తాము అయినా చేయవలసిన పనులను శాస్త్రీయంగా ఎలా నిర్వహించవచ్చో తెలుసుకుందాం. దీని వలన మాకేమి ఉపయోగం ? ఇలా అయితే పనులు తగలడి నట్టే అనే ఆలోచన వస్తుందా? ముందు మనస్సులోంచి తొలగించి సానుకూలంగా ఆలోచిస్తూ మీకు ఉపయోగపడేవి మరియు పాటించడానికి వీలున్నవి వీలైనంత వరకు పాటించండి. 
టైం మేనేజ్ మెంట్  నిర్వచనం; 
    టైం మేనేజ్ మెంట్ ( సమయ పాలన) అంటే నిర్ధిష్టమైన పనులను చేపట్టేడపుడు అందుబాటులో ఉన్న సమయాన్ని, సక్రమంగా వినియోగించుకునేందుకుతగిన పద్ధతులు, నైపుణ్యాలు, చిట్కాలు, విధానాలు వినియోగించడమే
                అంటే మనం ఏదైనా పనిని చేపట్టేడపుడు మనకు అందుబాటులో ఉన్న సమయం లో ఆ పని ఎలా పూర్తి చేయాలో అందుకు ఏ పద్ధతులు అనుసరించాలో తెలియచేసే కార్యనిర్వాహక ప్రణాళిక.

టైం మేనేజ్ మేంట్ లో ప్రధానమైన అంశాలు
planning, ; ప్రణాళిక     
  Division of work ; పని విభజన     
   allocating, ; పనిని కేటాయించుట 
  setting goals, ; లక్ష్య నిర్దేశన      
 delegation, ;అధికారాన్ని బాధ్యతలను బదిలీ చేయుట     
analysis of time spent, ; పూర్తయిన సమయాన్ని పున; పరిశీలించుట ·
 monitoring, పర్యవేక్షణ  
  organizing, నిర్వహణ       
   scheduling, సమయాన్ని పనులకు అనుగుణం గా కేటాయించుట 
    prioritizing. పనుల ప్రాధాన్యతలను బట్టి వర్గీకరించుట

పైన పేర్కొన్న మేనేజ్ మెంట్ పదాలను చూసి ఇదేదో మనకు సంబందించని లేదా మనకు సంబంధం లేని విషయాలు అనుకోకండి. ఇవన్నీ మీరు నిత్యం ఇంట్లో  బయట  అన్ని విషయాలలో పాటిస్తున్నవే.

OBSTACLES : ఆటంకాలు ; ప్రతి ఒక వ్యక్తి సమయానుకూలంగా తన పనులను, సమయానికన్నా ముందుగా చేయాలనుకుంటాడు. కావాలని సమయాన్ని ఎవరూ వృథా చేసుకోడు. అయినప్పటికీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల ప్రభావం వలన లేదా తన చేతిలో లేని బయట కారణాల వలన తన ప్రమేయం లేకుండా సమయం వృథా అవడమే కాకుండా అనుకున్న పనులు వాయిదా పడుతుంటాయి.   ఈ  ఆటంకాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. అవి. 
            A.  బహిర్గత ఆటంకాలు  External Obstacles                                        B.  అంతర్గత ఆటంకాలు   Internal Obstacles                                వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.  
A.  బహిర్గత ఆటంకాలు  External Obstacles ; 
బహిర్గత ఆటంకాలంటే  మన ప్రమేయం లేకుండా మన పనులకు ఆటంకం కలిగించేవి.   అవి.                                                                                  1. అంతరాయాలుః (Interruptions):   మెయిల్స్,  చాటింగ్, ఫేస్ బుక్, ఫోన్స్ మొదలగునవి మనం చేసే పనిని నిలుపుదల చేసి  అసలు పని మాని లేనిపోని విషయాలతో సమయాన్ని వృథా పరుస్తుంటాయి.
2. బాతాఖానీలు (Socializing conversations): ఆఫీస్ లో గానీ  ఇరుగు పొరుగు తో ఖానీ  అదేపని గా  ప్రపంచంలో అన్ని విషయాలు, రాజకీయాలు, వార్తా పత్రికల్లో విషయాలు, క్రికెట్ మ్యాచుల పై  విశ్లేషణలు, టీ.వీ. సీరియళ్ళ పై వ్యాఖ్యానాలు ఒకటేమిటీ  అనేకరకాలైన పిచ్చాపాటి కబుర్లతో గంటలు గంటలు భోంచేస్తూ బ్రేవ్ మని తేన్చుతుంటారు.  తీరా  సమయం వృథా అయిన తర్వాత తీరిగ్గా ఎదుటివారివలనే  సమయం పాడయిపోయిందని బాధపడుతుంటాం.  వాళ్ళుకూడా అలాగే భావిస్తుంటారని మనకు తెలియకపోవడం ఒకవిధం గా మన అధృష్టమే. 
౩. అనేక పనులు  ఒకేసారి చేయడం ( Multi Tasking):  సవ్యసాచుల్లా రెండు చేతులతో నాలుగు పనులు ఒకేసారి నెత్తిన వేసుకోవడం వలన ఏ పని పూర్తికాకుండా అన్ని పనులు చెడగొట్టుకుంటుంటారు చాలామంది.  ఇలా అనేక పనులు ఒకేసారి చేయాలనుకోవడం కూడా ఒకవిధంగా పనులు సమయానికి జరగడానికి ఆటంకమే.
4. అనుకోకుండా వచ్చే అతిథులు (Unscheduled Visitors): తిథి, వారం, నక్షత్రం చూడకుందా వచ్చే వాళ్ళే అతిథులంటారట.  కాని మనం ఏదైనా పనికోసం బయలుదేరుతున్నప్పుడు అతిథులు గాని ఎవరైనా మనతో పని కోసం వస్తే  తప్పనిసరిగా మన పనిని వాయిదా వేసుకొని వాళ్ళకు మనం సమయం కేటాయించవలసి వస్తుంది. అలా అని మన పనులకోసం వాళ్ళతో సమయం గడపకపోతే మన మర్యాదకే లోపం ఏర్పడుతుంది.  మన పనులు సమయానికి జరగకపోడానికి మనింటికి ముందస్తు సమాచారం లేకుండా వచ్చే సందర్శకులు కూడా ఒక కారణమే.
5. అస్తవ్యస్తంగా ఉన్న పని పరిస్థితులుః (Poor Work Environment) కంపెనీలో గాని. ఆఫీస్ లో గాని ఇంట్లో గాని పరిసరాలు సరిగా లేకపోతే  చేసే పని సమయానికి జరగకపోవచ్చును.  అస్తవ్యస్తంగా ఉన్న పరిసరాలు చికాకు పెడుతూ, ఏ వస్తువు సమయానికి దొరకక, నిత్యం కావలసిన వస్తువుల కోసం వెతుక్కుంటూ సమయం వృథా అవుతుంది. ఎక్కడ ఏ వస్తువు ఉందో, కాళ్ళకు  ఏదో వస్తువు తగులుతూ ఉంటే అరికాలమంట తలకెక్కుతూ ఉంటుంది. కాలుష్యం, వేడి, దుర్గంధం మొదలైనవి శ్రామికుల ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని ఎల్టన్ మేయో అనే మేనేజ్ మెంట్ నిపుణుడు ఎప్పుడో నిరూపించాడు. 
6. అస్పష్టమైన లక్ష్యాలు ( Unclear Goal):  చేయవలసిన పని మీద సరియైన స్పష్టత లేకపోతే, ఒక పని ఎందుకు చేయాలో, ఎప్పుడు చేయాలో ఒక అవగాహన మరియు స్పష్టత ఉంటే ఆ పని సమయానికి జరగడానికి అవకాశం ఉంటుంది. లక్ష్యం ఉన్న వ్యక్తి వంద తప్పులు చేస్తే  లక్ష్యం లేని వ్యక్తి వేయి తప్పులు చేస్తాడని స్వామి వివేకానంద అన్నాడు. అస్పష్టమైన లక్ష్యాలు మన పనులు సమయానికి జరగక పోడానికి సమయం వృథా కాడానికి ఒక కారణం మరియు అతి ముఖ్యమైన ఆటంకం.
7. ఇతరుల సహకారం పై అతిగా ఆధారపడటం ( Too much dependency on others' cooperation):  మన పనులు మనంతట మనం చేసుకోవడం మాని ఇతరుల సహకారం మీద అతిగా ఆధారపడటం కూడా సమయం వృథా అవడానికి ఒక కారణం.  కంపెనీ లో అన్ని విభాగల మధ్య సమన్వయం, సహకారం లోపిస్తే పనులు సకాలం లో జరగక పనుల్లో స్తబ్దత ఏర్పడి కాలహరణం జరుగుతుంది.
8. ఉద్యోగ స్వామ్యం ( Bureaucratic Red Tape) : ఇది సంస్థలలో పనులు  జరగడానికి  వ్యవస్థాపితమైన క్రమానుగత శ్రేణిని అనుసరించి నియమాలకు  అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. ఒక ఫైల్ అన్ని విభాగాలకు వెళ్ళి రావాలంటే చాలా సమయం పడుతుంది.  అలా అని నియమాలను ఉల్లఘించినట్లైతే అది అధికార దుర్వినియోగమవుతుంది.  ఇది చాలా కాలయాపనకు ,జాప్యతకు దారి తీస్తుంది.   
B.  అంతర్గత ఆటంకాలు   Internal Obstacles : 
అంతర్గతమైన ఆటంకాలంటే కేవలం మన అలవాట్లవలన, ప్రవర్తన వలన మన దృక్పథాల వలన మన పనుకు జరగడానికి ఏర్పడే ఆటంకాలు.
1. వాయిదా వేసే గుణం ( Procrastination): కొంతమంది పనులను తీరిగ్గా వాయిదా వేస్తూ, తీరా గడువు సమీపించేసరికి హైరానా పడుతుంటారు. " కొండలా కోర్సు ఉంది. ఎంతకీ తగ్గనంది, ఏందిరా వింత గొడవా? ఉందిలే సెప్టెంబర్ మార్చి పైన, వాయిదా పద్ధతుంది దేనికైనా" అని అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాలో ఒక పాట ఉంటుంది. అలా ప్రతి పని పని వాయిదా వేస్తుంటారు. దీనివలన చివరి నిమిషంలో పని జరగకపోవడం లేద పెద్ద మొత్తం లో డబ్బు చెల్లించవలసి రావడం జరుగుతుంది. చాలామంది ప్రయాణాలు ముందుగా వెళ్ళలని తీర్మానించుకున్నప్పటికీ చివరి నిమిషం వరకు రిజర్వేషన్ చేయించరు. ఈ వాయిదా గుణాన్ని బాగా అర్థం చేసుకున్న అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్  తత్కాల్ స్కీమ్  ప్రవేశపెట్టి ఇండియన్ రైల్వేస్ ని లాభాల బాట పట్టించారు.  విమానంలో ప్రయాణించేవారు కూడా ముందుగా రిజర్వ్ చేసుకుంటే చాలా తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాని చాలా మంది  చివరి నిమిషం వరకు వాయిదా వేస్తూ ఆయా విమానయాన సంస్థలను పోషిస్తూ ఉంటారు.
    ఈ వాయిదా వేసే తత్వం మన వాళ్ళల్లో ఎంత పురాతనమైనదో చెప్పడానికి కబీర్ మహశయుడు   ఒక చక్కని దోహే లో ఇలా చెప్పాడు.
కల్ కరే సో ఆజ్ కర్  ఆజ్ కరే సో అబ్ కర్                                                    పల్ మే పర్లయ్ హోయేగీ  బహురీ కరోగే కబ్                                             దీని అర్థం ఏమిటంటే రేపు చేయాలనుకున్నదీ  ఈ రోజే  చెయ్యు. ఈ రోజు  చెయ్యాలనుకున్నది ఇప్పుడే  చెయ్యు.  క్షణకాలంలో  ప్రళయం రావచ్చు.  తర్వాత  ఏమి చెయ్యగలవు.  కాబట్టి  వాయిదా  వేసే తత్వం  మంచిది  కాదని.  అతని అభిప్రాయం. 
2. ప్రణాళిక లేక పోవడం ( Lack of Planning) : ఏదైనా  పని  చేసే ముందు  పని  ఎలా  చెయ్యాలి. దానిని వివిధ భాగలుగా విభజిస్తూ ఒక ప్రణాళిక  అవసరం.     If you fail to Plan, You plan to fail  అన్నది ఆంగ్ల సామెత.  అంటే  ప్రణాళిక వేయడం లో విఫలమైతే, విఫలమవడానికి ప్రణాళిక  వేస్తున్నట్టే అని అర్థం. ప్రణాళిక వేయడం ఎంత ముఖ్యమో దానిని అనుకున్నట్టుగా అమలు చేయడం అంతే ముఖ్యం. Plan without Action is Futile but Action without plan is fatal.  ప్రణాళిక ఉండి అది అమలు చేయకపోతే అది వ్యర్థం కాని అసలు ప్రణాళిక లేకుండా పని చేస్తే అది ప్రమాదకరం. ప్రణాళిక లేకుండా పని చేయడం వలన తక్కువ సమయంలో పూర్తి కావలసిన పనులు ఆలస్యం కావచ్చును.
3. ప్రాధాన్యతల క్రమం లేకపోవడం (  Lack of Prioritization) : నేటి ఆధునిక కాలంలో మనిషి చాలా బిజీ అవుతున్నాడు. ఉన్న కొద్ది సమయంలోనే అనేక పనులు చేయవలసి వస్తుంది. ఏ పని వెంటనే చేయాలి. ఏ పని ఇతరులకి అప్పగించాలి ఏ పని తరువాత చేయవచ్చు అనే విషయం లో  అవగాహన లోపించడం వలన ముందు చేయవల్సినది వెనుక, తరువాత చేయవలసినది ముందు చేస్తూ తన జీవితాన్ని కిందా మీదా చేసుకుంటున్నాడు. ప్రధాన మంత్రి కైనా, తపాలా బంట్రోతుకైనా ఉన్న సమయం రోజుకి ఇరవై నాలుగు గంటలే. ఉన్న సమయాన్ని తన ప్రాధాన్యతల ప్రకారం ఉపయోగించుకోవాలి.
4. సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోవడం ( Indecisive Nature): సరియైన సమయంలో సరియన నిర్ణయం తీసుకోవడం లో విఫలమైతే దాని ప్రభావం మన సమయం పై పడుతుంది. the decision that delayed is the decision not taken అని అంటారు.  ఆలస్యం గా చేసిన నిర్ణయం అసలు నిర్ణయమే కాదని. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే దాని అమలులో మరింత ఆలస్యమవుతుంది. పని సకాలంలో పూర్తి చేయడం కూడా కష్టమవుతుంది. దాని ప్రభావం ఇతర పనులపై కూడా పడుతుంది.
5. పరిపూర్ణత్వానికై పరితపించుట ( Perfectionism) : చాలా మంది పనులు చేసే టపుడు నూటికి నూరుపాళ్ళు ఖచ్చితంగా జరగడానికి చూస్తుంటారు. ఉన్నంతలో పరిపూర్ణతకోసం ప్రయత్నించడం మంచిదే కాని ఆ క్రమంలో అన్ని పనులు ఆపి ఆ ఒక్క పనిలో నిమగ్నమైతే ఉన్న సమయం కాస్త గడిచిపోతుంది. ఎంత బాగా చేసినా ఏదో ఒక తప్పిదం జరగడానికి అవకాశం ఉంటుంది. అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపనంత వరకు అలా వదిలేస్తే మంచిది. అలా కాదని చేసిందే చేసుకొని కూర్చుంటే  అది ఒక Obsession Compulsion Disorder అనే మానసిక జాడ్యానికి దారి తీస్తుంది.  
6.  మానసిక, శారీరక అలసట ( Mental and Physical Exhaustion) : పనికి పనికి మధ్య తగిన విశ్రాంతి తీసుకోకుండా అదే పనిగా కొనసాగించడం వలన శారీరకంగా, మానసికంగా అలసిపోవడం వలన చేస్తున్న పనులు ఆలస్యమై ఏ పని సరియైన సమయానికి జరగదు.  సాధ్యమైనంతవరకు  అలసట  ఉన్నప్పుడు   చేస్తున్న పని ఆపి విశ్రాంతి తీసుకోవడం మంచిది. 
7. మొహమాటం ( Not being able to say NO) : చాలామంది  తమకు  తమపై  అధికారి గాని లేదా స్నేహితులు గాని ఏదైనా పని అప్పచెబితే  అది వారి వలన సాధ్యం కాకపోయేటప్పటికీ  మొహమాటం కొద్దీ ఆ పనిని చేస్తామని ఒప్పుకుంటారు. ఆ పని చేయలేక చేయలేమని ఒప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అందరి వద్ద చివరికి మాట పడటమే కాకుండా వాళ్ళ పనికూడా పూర్తి చేయలేకపోతారు. అందరినీ సంతృప్తి పరచడం చాలా కష్టం. ఎంత మంచి అనిపించుకోవాలని ప్రయత్నిస్తే అంత చెడ్డ అనిపించుకోడానికి అవకాశం ఉంటుంది. 
8. క్రమబద్ధత లేకపోవడం ( Lack of Orderliness):  చాలామంది తాను  పని  చేసే  చుట్టూ ఉన్న పరిస్థితులు, తాను ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచుతూ, పని అయిన తర్వాత వాటిని యథాస్థానంలో ఉంచుతారు.  ఈ రకమైన క్రమశిక్షణ వలన మరలా ఆ వస్తువులు అవసరమైనప్పుడు వెతుకుతూ సమయాన్ని వృథా చేస్తుంటారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని, పనిచేసే ప్రదేశాన్ని చూసి పనితనాన్ని చూడాలంటారు.  జపాన్ వారి పద్ధతి అయిన 5S  బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణం చాలా మందిలో ఈ క్రమశిక్షణ లోపించడమే.
9. తగిన ప్రేరణ, ఉత్సాహం లేకపోవడం ( Lack of Motivation and encouragement ) : చాలామంది స్వతహాగా చాలా నెమ్మదిగా, నిస్తేజంగా  పని  పట్ల ప్రత్యేకమైన ఉత్సాహం లేకుండా తక్కువ ప్రేరణ తో ఉంటారు.  వారికి తగిన గుర్తింపు లేకపోవడం వలన గాని, వారిలో ప్రేరణ కలిగించకపోవడం వలన గాని monotony కి లోనై ఏ పని పైన శ్రద్ధ చూపరు. దీని వలన అనుకున్న సమయానికి పనులు జరగవు. అందుకే అన్ని సంస్థలలో  ఉద్యోగులలో ప్రేరణ కలిగిస్తూ వారికి తమ పని పట్ల ఉత్సాహం, ఉత్తేజం కలిగించడాని మానవ వనరుల అభివృద్ధి విభాగం ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యకలాపాలకు, సెలవుతో కూడిన విహారయాత్రలకు అవకాశం కల్పిస్తుంది. 
10. ఒత్తిడి ( Stress):  ఈ రోజుల్లో సమాజంలో అన్ని వర్గాల వారి లో పని వలన వచ్చే ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. Unrealistic deadlines, Inspections, Review meetings, Report Submissions ఒకటేమిటి  అన్ని  రకాలుగా  తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. ఇది ఉద్యోగుల పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో కూడా తెల్లవారి పిల్లలను స్కూల్ కి పంపించడం వారికి కేరేజ్ కట్టడం, శ్రీవారికి ఇస్త్రీ బట్టలు అందించడం మొదలుకొని ఆఫీస్ కి పంపించడం ఇలా అనేక పనుల మధ్య ఒత్తిడితో అపర కాళిక మాతల్లా  ఉంటారు.  ఇలా ఒత్తిడికి గురయ్యే వారిలో హర్మోన్ల సమతౌల్యం కూడా దెబ్బతిని వారి ఉత్పాదక సామర్ధ్యం తగ్గుతుందని పరిశోధనలు  తెలియచేస్తున్నాయి.  
ADVANTAGES OF GOOD TIME MANAGEMENT : సమయాన్ని సరిగా నిర్వహించుకోడానికి ఉపయోగపడే వివిధ పద్ధతులు, చిట్కాలు, నైపుణ్యాలు గురించి తెలుసుకునే ముందు అసలు సమయాన్ని సరిగా నిర్వహించడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుంటే  వాటిపై మనకు ఆసక్తి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
1.Goals and Objectives are Achieved: లక్ష్యాల సాధనః సరియైన టైం మేనేజ్ మెంట్ పద్ధతులను అలవరుచుకుంటే మన లక్ష్యాలు, ఉద్ధేశ్యాలు మనం సకాలంలో ఎటువంటి హైరానా లేకుండా నెరవేర్చుకోడానికి అవకాశం ఉంటుంది.                                                                                 2.Confidence  and Good will are increased: ఎప్పుడైతే మన పనులను సకాలంలో , సక్రమంగా పూర్తి చేయగలుగుతామో మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ఇతరులలో మన పట్ల గురి పెరుగుతుంది.  ఏ పని సరిగా చేయకపోతే మన విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా ఇతరులు మనల్ని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది.                                           3.Stress will be reduced:( ఒత్తిడి తగ్గుతుంది)  సరియైన టైం మేనేజ్ మెంట్ పద్ధతుల్ని అలవాటు చేసుకుంటే  ఒక క్రమ పద్ధతిలో మన పనులు మనం సకాలం లో పూర్తి చేయడం వలన మనపై ఎటువంటి ఒత్తిడి, చిరాకులు ఉండవు. ఇతరులతో చిన్న చిన్న విషయాలకు చిరాకు పడాల్సిన అవసరం ఉండదు.                                                                            4.Peace of Mind and Sense of Achievement:(మానసిక ప్రశాంతత  మరియు సంతృప్తి):  పని పట్ల సరియైన క్రమశిక్షణ అలవడుతుంది. తత్ఫలితంగా పనులు సరిగా జరగడం వలన మానసిక ప్రశాంతత అలవడుతుంది. లక్ష్యాలు సాధించామనే తృప్తి కలుగుతుంది.                      5.Increased energy: పనులు సరిగా పూర్తి కాక హైరానా పడుతూ ఉన్న శారీరక మానసిక శక్తులను దుర్వినియోగపరచుకోవలసిన స్థితి ఏర్పడదు కాబట్టి సమయ పాలన సరిగా చేసుకొనే వారికి శక్తి పెరుగుతుంది. 6.Increased Productivity:  చేస్తున్న పని  సమయానికి  పూర్తికావడం  వలన   ఇంకా ఎక్కువ పనులు చేయడానికి సమయం మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ పనులు చేయడం ద్వారా తన ఉత్పాదకత పూర్తిస్థాయిలో ఉండే విధంగా పనిచేయగలడు.                          7.Financial stability  (ఆర్ధిక సుస్థిరత): శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అన్నాడో కవి.  ఎప్పుడైతే తన కర్తవ్యాలని సరిగా నిర్వహించ గలుగుతాడో తన రంగం లో ఉన్నత స్థానానికి చేరుకోడానికి అవకాశం ఉంటుంది.  తత్ఫలితంగా ఆర్ధికంగా కూడా ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది.                                                                                           8. Promotion in the Job ( ఉన్నత స్థాయికి ఎదుగుదల). ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగం పొందినపుడు తన విధులను ఎటువంటి జాప్యత లేకుండా సరిగా చేయగలగడం ద్వారా ఉన్నతాధికారుల ధృష్టిలో పడతాడు. నేటి కార్పోరేట్ రంగం లో కేవలం పనితీరు బట్టే ప్రమోషన్లు ఉంటాయి. ఉన్న పని చేయడానికి పరేషాన్ అయ్యేవాడికి ప్రమోషన్ కాదు  ఫైరింగ్ ఆర్డర్ సిద్ధంగా ఉంటుంది.                                                                                           9. Maximum Utilization of Time;  (సమయాన్ని గరిష్టంగా సదుపయోగం   చేయగలడం)  ఒకే పని నాన్చుకుంటూ చేస్తుంటే సమయం వృథా అవడమే కాకుండా  సమయ గరిష్ఠ వినియోగం తగ్గిపోతుంది.  ఒక పద్ధతి ప్రకారం పనిచేసే వారు సమయాన్ని గరిష్ఠంగా వినియోగించుకోగలుగుతారు.                                                              10. Stronger Family Bonds ( కుటుంబ బాంధవ్యాల అభివృద్ధి) చాలా మంది ఆఫీస్ లో పని సకాలంలో పూర్తిచేయలేక ఆ ఫైళ్ళన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వారితో ఉలుకు పలుకు లేకుండా ఫైళ్ళల్లో మునిగిపోతారు. కంపెనీ విషయాలు చర్చిస్తూ ఆ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు అంటూ ఫోన్ లో కూడా తోటి ఉద్యోగస్తులతో చర్చిస్తూ ఇంట్లో వారిని ఉపేక్షిస్తుంటారు. దానివలన కుటుంబ సభ్యులలో నిర్లిప్తత ఏర్పడుతుంది. అలా కాక సమయపాలన సరిగా చేస్తూ ఎక్కడ పనులు అప్పటి కప్పుడే పూర్తిచేయగలిగితే ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. అందరి మధ్య ప్రేమాభిమానాలు పరిడవిల్లుతాయి. 
WHAT IS THE VALUE OF THE TIME....
value of One Year:   ఒక సంవత్సరం  విలువ  తెలుసుకోవాలంటే  ఒక  విద్యా  సంవత్సరం కోల్పోయిన విద్యార్థిని అడిగితే తెలుస్తుంది.  EAMCET  లేదా I.I.T.  లో రాంక్ రాకపోవడం వలన  ఆ విద్యార్థి  లాంగ్  టెర్మ్  కోచింగ్  తీసుకుంటే తరువాత సంవత్సరం కోర్సు లో జాయిన్  అయితే  ఆ విద్యార్థి  ఉద్యోగం పొందినంతవరకు  విద్యా సంవత్సరం లో ఎందుకు తేడా వచ్చిందో  వివరించాల్సి ఉంటుంది. అంతే కాక  తనతో చదువుకునే వాళ్ళకు జూనియర్  అవుతాడు.  ఒక సంవత్సరం విలువ  ఆ విద్యార్థి కి బాగా తెలుస్తుంది.
  value of One Month: ఒక నెల విలువ తెలుసుకోవాలంటే ఎనిమిదో నెల గర్భం తో ఉన్న ఒక స్త్రీ  గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్తే ఆమె తనని పరిశీలించి అత్యవసరంగా సిజెరియన్ చేసి బిడ్డయొక్క రక్షణ్ దృష్ట్యా బయటకు తీసి ఇంక్యుబేటర్ లో ఒక నెల రోజులు ఉంచితే  ఆ బిడ్డ సంరక్షణ కోసం తల్లడిల్లే ఆ తల్లికి ఒక నెల యొక్క విలువ తెలుస్తుంది.
value of One Week:
ఇంకా  ఉంది.............

 
 
   
                              

Sunday 12 February 2012

ఇలా చదవాలి....అలా సాధించాలి....

అత్యంత ప్రజాధరణ పొందిన, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయుక్తమైన " ఇలా చదవాలి..అలా సాధించాలి"  పుస్తకాన్ని  సీరియల్ గా ఈ బ్లాగ్ లో మీ అందరికోసం ........... మీకు వీలైనంతమందికి  ఈ బ్లాగ్ ను షేర్  చేయండి