సంస్థ కు వెన్నెముక లా నిలిచే అత్యంత ప్రభావశీలురైన ఉద్యోగుల లక్షణాలు
శ్రమే దైవం ఇది
అనాది గా వాడుకలో ఉన్న మాట. . శ్రమైక జీవన
సౌందర్యానికి సమానమైనది లేనే లేదో య్ అంటారు శ్రీ.శ్రీ. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అంటారు అనేక
మంది వ్యక్తిత్వ వికాస శిక్షకులు. ఉద్యోగం పురుష లక్షణం అని పూర్వం అనేవారు. ఏ
సంస్థ కైనా వెన్నెముక ఆ సంస్థలో
పనిచేసే ఉద్యోగులే. ప్రభుత్వ రంగ సంస్థ
కానీయండి ప్రైవేట్ రంగ సంస్థ కానీయండి
చౌకీదార్ నుండి సి. ఎం. డి వరకు ,
ప్యూన్ నుండి సి.ఇ.ఓ. వరకు తాము పనిచేసే సంస్థను ఒక దేవాలయం గా భావించి
పనిచేసే సంస్థ పట్ల గౌరవ భావం, నాది అనే
ఒక ప్రేమానుబంధం కలిగి ఉంటేనే ఆ సంస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ది
చెందడానికి అవకాశం ఉంటుంది. పనిచేసినా
చేయకపోయినా నెల అయ్యేసరికి జీతం వస్తుంది. ఇక్కడ నన్ను పీకే వాడు ఎవడు అనే
భావం తొ పనిచేస్తే శ్వేత ఐరావతం లా మారి ఆ సంస్థ చరిత్ర పుటల్లో శిధిలమవడమే
కాక దానిపై ఆధారపడి బ్రతికే అనేక కుటుంబాల
నోట్లో మట్టి కొట్టే పరిస్థితి వస్తుంది.
అలా కాకుండా తాము చేస్తున్న సంస్థ యొక్క అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ, తమ అభివృద్ధిని తమ
సంస్థ అభివృద్ధిలో చూసుకొనే ఉద్యోగులు ఏ
సంస్థ కైనా హృదయం లాంటి వారు.
వారు సంస్థలో నియమించబడిన సమయంలో తాము చేయబోయే పని పై పెద్ద అవగాహన లేక
పోయినప్పటికీ పని పట్ల వ్యక్తిగత శ్రద్ధ
పెంచుకొని , నైపుణ్యాలను అభివృద్ది
పరుచుకొని తమ పనిలో పరిపూర్ణత
సాధిస్తారు. వాటిని తమ జీవన విధానంలో ఒక
భాగమయ్యే విధంగా అలవాట్లుగా మార్చుకుంటారు. వారి యొక్క నిరంతర శ్రమ మరియు
సంస్థ పట్ల వారికున్న అంకితభావమే వీటికి
కారణం. సంస్థకు పునాది గా,
ఆలంబన గా నిలిచే అటువంటి ఉద్యోగుల పనితీరు గురించి, అలవాట్లను గురించి చర్చిద్దాం.
1. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా సమయానికి హాజరవడం:
ఎటువంటి
కుంటి సాకులు చెప్పకుండా ,
అనవసరమైన మరియు అతి సాధారణ విషయాలకు కూడా సెలవు వినియోగించుకోకుండా , ప్రతీ రోజూ
హాజరు కావడం మరియు సమయానికి రావడం అనే ఈ
రెండు గుణాలు ప్రతీ ఉద్యోగి వృత్తి పరమైన అన్ని ఆటంకాలను తొలగించుకొని తన సమయాన్ని సదుపయోగం
చేసుకునేందుకు ఉపకరిస్తాయి. సెలవు వినియోగించుకోవడం కూడా సరియైన
సహేతుకతమైన కారణానికి
ఉపయోగించుకుంటారు. సెలవు అనేది ఉద్యోగి యొక్క హక్కు కాదు.
ముందస్తు
అనుమతి లేకుండా సెలవు తీసుకోవడం అనేది
వీరి డిక్షనరీ లో ఉండదు. టైం మేనేజ్ మెంట్ సక్రమంగా నిర్వహించడం వలన ఏ పనిలో కూడా ఆలస్యం అనేది వీరికి అలవాటు ఉండదు.
2. పని చేసే ఆవరణను శుభ్రంగా ఉంచడం :
“ ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి” అనేది
పాత సామెత . అదే విధంగా ఒక ఉద్యోగి తను పని చేస్తున్న కర్మాగారం, కార్యాలయం, తాను వినియోగించే వస్తువులు మొదలగువాటిని ఎలా ఉంచుతున్నాడు అనేది తానూ
పనిచేసే విధానాన్ని తెలియచేస్తాయి. అనేక
కార్యాలయాల్లో జపాన్ లో ప్రాచుర్యం
పొందిన “ 5 – S” విధానాన్ని
సక్రమంగా వినియోగిస్తున్నారు. దీని వలన
వస్తువులు దీర్ఘకాలం మన్నడమే కాకుండా, చాలా సమయం కూడా ఆదా అవుతుంది. చక్కని పని పరిస్థితులు, పనిచేసే దృక్పథాన్ని పెంపొందింప చేస్తాయి. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం.
I.
Seiri: (sorting) అంటే పనికి వచ్చే వస్తువుల్ని అన్నింటిని ఎంచుకొని ఉపయోగం లేని వాటిని లేదా రిపేర్
చెయ్యడానికి వీలున్నవాటిని వేరు వేరు గా ఉంచాలి. మన ఇంటిలో గాని, కార్యాలయం లో గాని
బీరువాలు, స్టోర్ రూమ్ ఇతర చోట్ల
లో ఒకసారి చూస్తే ఉపయోగంలో లేని అనేక వస్తువులు అన్ని చోట్లా
నిండి ఉండటం గమనించవచ్చును. వీటిలో
ప్రస్తుతం ఉపయోగం లో ఉన్న వాటిని వేరు పరిచి, ఉపయోగం లో లేనివాటిని
తీసివేయాలి.
II.
Seiton: (straighten, set in order)
ఉపయోగంలో ఉన్న వస్తువుల్ని అన్నింటిని
మెరుగుపరిచి ఎక్కడ ఉంచాల్సిన
వస్తువుల్ని వాటి ప్రదేశం ఎక్కడో నిర్ణయించి అక్కడ ఉంచడం. సమయానికి కావలసిన
వస్తువుల్ని వెతుక్కోవలసిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుంది. అంతే కాకుండా ఉపయోగం లో ఉన్న వస్తువులను సిద్ధంగా ఉంచుకోవడం కూడా పనితీరు
మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది.
III.
Seiso: (sweeping, shining, cleanliness)
కార్యాలయం గాని కర్మాగారం కాని లేదా ఇల్లు గాని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం. స్వచ్చ భారత్ కార్యాక్రమ లక్ష్యమ్ కూడా ఇదే.
చిందర వందరగా ఉన్న పని పరిస్థితులు
ఉద్యోగుల మానసిక స్థితి కి నిదర్శనం.
కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు పశువుల పాక కన్నా హీనంగా ఉండటం , కొన్ని చోట్ల
పాత ఫైళ్ళను ఉపయోగించకుండా ఉంచిన
మరుగుదొడ్ల లో భద్రపరచడం కొంత మందికి ఆశ్చర్యం కలిగించినా నమ్మలేని నిజం.
IV.
Seiketsu: (standardising) అంటే
పనిచేసే విధానాలను ప్రక్రియలను ఒక నిర్ధిష్టమైన ప్రమాణాలను ఏర్పరచడం. దీని వలన ఒక ప్రక్రియకు అంటా అలవాటు పడి పనిలో వేగం పెరుగుతుంది. ఒక ఉద్యోగి బదిలీ పై
వేరే చోటుకు వెళ్ళినా కొత్తగా ఆ స్థానం లొ వచ్చిన వారు అదే విధానాన్ని కొనసాగిస్తారు.
దీని వలన పనిలో అయోమయం తలెత్తే పరిస్థితి
ఉండదు.
V.
Shitsuke: (sustaining discipline) వ్యవస్తితమైన విధానాలను, పద్ధతులను క్రమశిక్షణ తో ఎటువంటి లోటుపాట్లు, పొరపాట్లు లేకుండా కొనసాగించడం.
ఈ విధంగా ఒక నిర్థిష్టమైన రీతిలో వస్తువులను
ఫైళ్ళను నిర్వహిస్తూ పనిచేసే ఆవరణ ను పరిశుభ్రంగా ఉంచుతారు.
3. పై అధికారుల నిర్దేశాలను, సూచనలు
సక్రమంగా వినడం మరియు పాటించడం:
‘’ మంచి అనుచరుడు మంచి నాయకుడు కాగలడు.’’ ప్రతి ఉద్యోగి తన సంస్థ యొక్క విధి విధానాలను,
నియమాలను సక్రమంగా అవగాహన చేసుకొని ఉంటారు.
విధి నిర్వహణలో ఉన్నప్పుడు పై
అధికారులు ఏదైనా పనిని అప్పచెప్పేటప్పుడు దానికి సంబంధించిన నిర్దేశాలను
ఇచ్చేటప్పుడు సరిగా వింటారు. ఏవైనా
సందేహాలు ఉంటే అక్కడే నివృత్తి చేసుకుంటారు. తీసుకున్న సలహాలను, సూచనలను తూ చా తప్పకుండా పాటిస్తారు. అవిధేయత వలన సమస్యలు మరింత జఠిలమవుతాయే తప్ప పరిష్కారం కావు. అధికారుల యొక్క బాధ్యతలు చాలా
క్లిష్టమైన అంశాలతో కూడి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో చెప్పులో రాయి లా అవిధేయత కలిగిన ఉద్యోగుల వలన అసహనం మరింత
పెరిగి సంస్థ యొక్క అభివృద్ది పై ప్రభావం పడుతుంది.
4. మంచి జట్టు స్ఫూర్తి కలిగిఉండి అందరితో
కలిసి పనిచేస్తుంటారు:
సంస్థకు
వెన్నెముక లా నిలిచే ఈ ఉద్యోగుల
ఉత్తమ లక్షణం అందరితో కలిసి ఒక జట్టు గా పని చేయ గలగడం. మనిషి సంఘజీవి .. అందరితో కలిసి పనిచేసే గుణం
వలన అధిక ఉత్పాదకత సాధించడానికి అవకాశం
ఉంటుంది. క్లిష్టమైన సమస్యలు కూడా అతి సులువుగా పరిష్కారం అవుతాయి. అందరితో కలిసిపనిచేయాలంటే ఆత్మ విశ్వాసం ఉండాలి. అందరిమీద గౌరవం ఉండాలి. తానే
గొప్పవాడినని అందరికన్నా ఎక్కువ జ్ఞానం లేదా అనుభవం కలిగి ఉన్నాననే ఆధిపత్య ధోరణి
లేకుండా ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాలకన్నా
సంస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చేవారై ఉండాలి. సంస్థ విజయం లో తన విజయాన్ని చూసుకోగలిగి ఉండాలి. పనికి మాలిన, ఉపయోగం లేని అంతర్గత రాజకీయాలకు అవకాశం ఇవ్వనివారై ఉంటారు.
5. అంతిమ లక్ష్యాలను దృష్టి లొ ఉంచుకొని
పనిచేయడం:
అత్యంత ప్రభావ శీలురైన ఉద్యోగుల
అలవాట్లలో అత్యంత ముఖ్యమైనది తాము చేస్తున్న పనిని సంస్థ యొక్క అంతిమ లక్ష్యాలకు
అనుగుణంగా అన్వయించుకొని పని చేయడం. తమ
కిచ్చిన పనిని చేసామా లేదా అని కాకుండా ఆ పని ఎంతవరకు సంస్థ కు ఉపయోగ పడుతుందనే
ఉద్దేశ్యం తో పనిచేస్తుంటారు. తమకు
ముఖ్యమైన పనిని అప్పగించారా లేదా? తమకు
ప్రాధాన్యత ఇస్తున్నారా అని కాకుండా సంస్థ
తన లక్ష్యాల సాధన కొరకు తాము ఎంత వరకు ఉపయోగపడుతున్నాం అనే భావనతో పనిచేస్తుంటారు.
ఎప్పుడైతే ఉద్యోగులు ఈ రకమైన భావనతో ఉంటారో లేని పోనీ ఇగో లకు అనవసరమైన అపోహలకు
అవకాశం ఉండదు. దీని వలన సంస్థ ఉత్పత్తులలో
నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది.
6. తమ
తప్పులను అంగీకరించడం మరియు సరిదిద్దుకోవడం:
ఎవరూ అన్ని విషయాలలో పరిపూర్ణులు కారు.
మనిషి అన్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక
విషయంలో ఏంటో కొంత తప్పు జరిగే అవకాశం ఉంటుంది.
చాలా మంది ఉద్యోగులు ఏదైనా తప్పు తమ విభాగంలో గాని జరిగితే దానిని
సాధ్యమైనంత వరకు ఇతరులపై నెట్టడం గాని లేదా ఎవరో దానికి కారణం అని చెబుతూ తమ
బాధ్యతను అంగీకరించరు. పనిరానివాడు
పనిముట్లను నిందిస్తాడు అనే సామెత కూడా కొన్ని సందర్భాలలో నిజం అనిపిస్తుంది. కాని అత్యుత్తమ ప్రమాణాలను ఏర్పరచే
ఉద్యోగులు తమ వలన ఏదైనా తప్పిదం జరిగితే
దానిని అంగీకరించి ఆ తప్పును
సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తారు. పరిపూర్ణత సాధ్యమవ్వాలంటే నిరంతర శోధన
మరియు సాధన కావాలి. అది సాధ్యం
కావాలంటే ప్రతి వ్యక్తీ తనలోని లోపాలను
తప్పిదాలను లోటుపాట్లను
గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇటువంటి
మనస్తత్వం ఉన్నప్పుడు యాజమాన్యం కూడా ఉద్యోగులకు ఏ విషయంలో శిక్షణ అందించాలనే
ఆలోచన చేయగలుగుతుంది.
7.
క్లిష్టమైన సమయంలో నిరంత సానుకూల
దృక్పథాన్ని, ఆశావాదాన్ని కల్గి ఉండటం :
సాధారణంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు
ప్రతి ఒక్కరూ హుషారుగా , సానుకూలంగా నలుగురుతో
కలుస్తూ ఉండవచ్చు. కాని క్లిష్టమైన పరిస్థితి తలెత్తినప్పుడు వారి వాస్తవిక
ముఖాలు బయటపడతాయి. సంస్థలో కీలకంగా
వెన్నెముక లా నిలిచే ఈ ఉద్యోగుల గొప్పతనం, అంకితభావం క్లిష్టమైన పరిస్థితుల్లో అందరికీ తెలుస్తుంది. సమస్య ను పరిష్కరించే బాధ్యతను భుజాలపై వేసుకొని ఆశావాద దృక్పథం తో
అందరినీ ప్రోత్సహిస్తూ ఆ సమస్య నుండి సంస్థను బయట పడేందుకు పనిచేస్తారు. అసలు సమస్యలనేవి ఎవరి నిజాయితీ ఎంత ? ఎవరు తాము
మాట్లాడే విషయాలపై ఎంత నిబద్ధతతో
వ్యవహరిస్తారు అని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. సానుకూల దృక్పథం తో, నిరంతర ఆశావాదం తో పనిచేసే ఉద్యోగులు సంస్థకు పెట్టుబడి వంటి వారు.
8. తమకు తెలిసిన విషయాలు నలుగురికీ తెలియచేస్తుంటారు:
సంస్థ అభివృద్ధికి దోహదపడే ఈ ఉద్యోగుల మరియొక
ముఖ్యమైన లక్షణం తమకు తెలిసిన విషయ
పరిజ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడం. కొత్తగా సంస్థలో ప్రవేశించే ఉద్యోగులలో సంస్థ
పట్ల గౌరవభావాన్ని పెంపొందింప చేస్తూ
సంస్థ ను వారు అర్థం చేసుకునేందుకు
కొత్త యంత్రాలతో గాని, కొత్త
విధానాలతో గాని వారు ఇబ్బంది పడుతున్నప్పుడు
వారు అడగకుండానే చొరవతీసుకొని వారికి కావలసిన సలహా సూచనలు అందిస్తుంటారు.
పంచుకుంటే పెంచుకోవచ్చనే వీరి నమ్మకం సంస్థ లో పనిచేసే ఉద్యోగుల సుస్థితి మెరుగుపరచేందుకు ఉపయోగపడుతుంది. తమ అధీనులు పని నేర్చుకుంటే తమ మాట వినరు వారు ఎదగకుండా త్రొక్కి ఉంచాలనే నెగటివ్ ఆలోచన కాని, అభద్రతాభావం కాని వీరిలో మచ్చుకైనా
ఉండదు.
9. సృజనాత్మక ఆలోచనలతో సంస్థ పురోభివృద్ధికి దోహదపడటం:
ప్రతీ సంస్థ లో ఉద్యోగుల యొక్క సృజనాత్మక ఆలోచనా విధానాన్ని
అభివృద్ధి పరచేందుకు కొన్ని సమూహాలను,
సంఘాలను ఏర్పరచి వారినుండి నూతన ఆలోచనలను, వ్యూహాలను, ప్రస్తుత విధి విధానలలో
చేయవలసిన మార్పులకు సంబంధించి సూచనలను ఆహ్వానిస్తుంటారు. కాని చాలా మంది ఉద్యోగులు
వీటి పట్ల నిర్లిప్తత భావనతో ఉండి, వీట్లో ఫాల్గొనేందుకు విముఖత చూపుతుంటారు కాని
సంస్థ కు వెన్నుముక లా పనిచేసే అత్యంత ప్రభావశీలురైన ఈ ఉద్యోగులు
నిరంతరం నూతన ఆలోచన విధానాలతో , సక్రియాత్మకంగా వ్యవహరిస్తూ సంస్థ అభివృద్ధికి
ఉపయోగపడే ఆలోచనలను అందిస్తూ ఉంటారు. వారికున్న
అనుభవం వలన వారు వాస్తవిక ఆలోచనతో కూడిన ఆచరణాత్మక సూచనలు అందించడానికి అవకాశం ఉంటుంది. అవి సంస్థ
అభివృద్ధికి చాలా దోహదపడతుంటాయి.
10.
మానవ వనరుల అభివృద్ది
విభాగం నిర్వహించే శిక్షణా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనుట:
ప్రతి సంస్థలో రాబోయే సవాళ్ళ కోసం
ఉద్యోగులను సిద్ధం చేసేందుకు, ఉద్యోగుల నైపుణ్యాలు మరుగున పడిపోకుండా వాటిని
నిరంతరం పదును పెట్టేందుకు మానవ వనరుల శిక్షణా కేంద్రం ఏర్పరచబడి ఉంటుంది. కాని అనేక మంది ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొనరు. దీనిని వారు శిక్షణలా కాకుండా శిక్ష లా భావిస్తుంటారు. కాని సంస్థ లో కీలకంగా పని చేసే అత్యంత ప్రభావశీలురైన ఈ
ఉద్యోగులు నిరంతర విద్యార్థుల్లా ఉంటూ
ఈ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఎప్పటికప్పుడు తమ ప్రతిభా పాటవాల్ని,
నైపుణ్యాలను మెరుగుపరుచు కుంటారు. ఈ కార్యక్రమాల్లో తాము నేర్చుకున్న అంశాలను
ఇతరులకు తెలియచేస్తుంటారు. ఇతర ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తుంటారు.
అంతే కాక
వారికి కావలసిన క్రొత్త కార్యక్రమాలు నిర్వహించమని ఈ మానవ వనరుల శిక్షణా కేంద్రానికి సూచనలు
ఇస్తుంటారు.
ఇంట్లో
ఒక చిన్న వస్తువు పొతే నానా యాగి
చేస్తాం. ఇంట్లో పనిమనిషి సరిగా సమయానికి
రాకపోయినా , సరిగా పనిచేయక పోయినా అపర
భద్రకాళి అవతారం లేదా నరసింహావతారం ఎత్తుతాం. మరి కోట్లు
కోట్లు పెట్టుబడి పెట్టి , బ్యాంక్ నుండి లోన్ లు తీసుకొని ఏంతో మంది కి
ఉపాధి కల్పించే సంస్థ ల యజమానులను దృష్టి
లొ ఆలోచిస్తే ఏ ఉద్యోగి కూడా తన బాధ్యతలను
విస్మరించలేడు. ప్రభుత్వరంగం లొ అడిగేవారు ఎవ్వరూ ఉండరనే అపోహతో అతి కొద్దిమంది నిర్లక్ష్యం గా ఉన్నా దీర్ఘకాలం లొ ప్రభుత్వరంగం కనుమరగయ్యే అవకాశం ఉంది
అని భావించే కొంత మంది నిపుణుల మాటలు
కూడా నిజమయ్యే అవకాశం ఉంటుందేమో.......
కాబట్టి మనకు ఒక
అస్తిత్వాన్ని, మనుగడను కల్పించిన మన సంస్థ లను కాపాడుకొనే ప్రయత్నం చేద్దాం. సంస్థ విజయంలో మన విజయాన్ని చూసుకుందాం.
అభినందనలతో ,
అలజంగి ఉదయ కుమార్
trainerudaykumar@gmail.com