Friday 26 September 2014

ఆడవారి అందం


కవిత్వం రాస్తావట కదా
ఏదీ ఆడవారి అందం గురించి రాయి
ఆ ఒంపుసోపుల ఒయ్యారాల్నీ
ఆ నెరజాణతనాన్ని, నెమలి నడకల్ని
రసికత ఓలలాడే కొంటె చూపుల్ని
శివధనుస్సులా  ఒంగి ఉన్న కనుబొమ్మల్ని
పాలరాతి శిల్పం లా చెక్కి ఉన్న నునుపైన చెక్కిలిని
హంస గమనాన్ని, రాయంచ ఠీవిని
రాజుల్ని రారాజుల్ని పాదదాసులుగా చేయగలిగే
లేలేత వయసు పొంగులను 
మన భాష లొ తగిన పదాలు చాలక పొతే
పరభాషా పదాలు వెతికి తెచ్చి మరీ వర్ణించు
శోధించైనా ,  శ్రమించైనా కాస్త కాలం ఎక్కువ తీసుకునైనా
నీ కలానికి కొత్త కసరత్తులు నేర్పించైనా
కవితా పరంపరులు సాగించు
నవకవితా పరిమళాల సౌరభాలతో
ఈ సురబాలల సరస సల్లాపాలను విశ్లేషించు .......
ఎప్పుడు ఎదుగుతారురా ఓ మూర్ఖుల్లారా !
ఆడవారి అందం వారి శరీరాకృతి లొ,ఒంపుసొంపుల్లో  ఒయ్యారాల్లో కాదురా
అమ్మతనం నిండిన ప్రతి అణువులో ఉందిరా
ఆప్యాయతలో, ఆదరణలో, అర్ధం చేసుకునే ఆర్ద్రత నిండిన
ఆ హృదయం లొ  ఉందిరా
వేయి తప్పుల్ని కూడా క్షమించే ఆ ధరాగుణంలో ఉందిరా
జీవితంలో ఎదురయ్యే ఆతంకాలకి అడ్డంగా బోర్లాపడి
అయోమయం లొ కొట్టుకుపోతూ   
నిండుగా పేడితనం తో  భీరువులై  చేవచచ్చినవారిలో
విశ్వాసపు ఊపిరిలూది , రేపటి జీవితంపై క్రొంగొత్త ఆశలు రగిల్చి
ధీరత్వాన్ని నింపి మగదీరులుగా విజయశిఖరాలపై నిల్పి
తెరవెనుక నిలిచిపోయే ఆ సాద్వీ గుణంలో ఉందిరా......
మనసుతో చూడగలిగే మలినపు ఆలోచనలు ప్రక్కనపెట్టి చూడు
కారుకూతలు మాని వెకిలి వేషాలు వదిలి
ఎవరెస్టును  మించిన ఆ నిలువెత్తు అమ్మరూపాన్ని చూడు
కళ్ళు భైర్లు క్రమ్మి , కామపు పొరలు పోయ
అసలు సిసలైన మగవాడి గా   నిలుస్తావు...    

No comments:

Post a Comment