Friday 7 October 2011

భజగోవిందం - నిండైన వ్యక్తిత్వానికి, పరిపూర్ణ జీవితానికి పునాది

                                   భజగోవిందం - వ్యక్తిత్వ వికాసం
                  
                   శంకరాచార్యులు మరియు అతని శిష్యగణం చే చెప్పబడిన భజగోవింద శ్లోకాలు నేటి కాలానికి, ప్రతి వ్యక్తి జీవితంలో ఎదుర్కునే ప్రతి మానసిక సమస్యకు చక్కని నివారణ మార్గాన్ని చూపే నిత్య సత్యాలు.  కాశీ పుర వీధుల్లో శిష్యులతో వెలుతున్న శంకరాచార్యులు వ్యాకరణ సూత్రాలను వల్లె వేస్తున్న ఒక ముసలి బ్రాహ్మణున్ని చూసి  వయసు ముదిరిన ప్రాపంచిక విద్య పట్ల  దాని ద్వారా సంపాదించాలనుకున్న ధనం పట్ల  దాని ద్వారా తీర్చుకోవాలనుకున్న కోరికల పట్ల అతనికి తాపత్రయం గ్రహించి  ఆసువుగా శంకరాచార్యులు మరియు శిష్యులచే చెప్పబడిన శ్లోకాలు  సర్వకాల సర్వావస్థలకు ఉపయోగమే.  నేటికాలంలో  కోరికల,  ఆశల, వలయాల్లో చిక్కుకొని జీవిత పరమ ధర్మమేమిటో నిజమైన  సచ్చిదానందం ఎక్కడ దొరుకుతుందో తెలియక అనేక వ్యథలలో చిక్కుకున్న వారికి మోహముద్గారం కలిగించి జీవితంపట్ల స్పష్టమైన అవగాహన కలిగించే  ఈ భజగోవింద శ్లోకాలలో నిమిడియున్న  తత్వాలను వ్యక్తిత్వ వికాస కోణం నుండి తెలుసుకుందాం.


భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే .. 

        ప్రతీ మనిషి జీవితంలో నాలుగు ధృక్కోణాలుంటాయి.  ఒకటి   శరీరం -  మనస్సు  -  హృదయం  -  ఆత్మ.   శారీరక  భౌతిక మొదలైన అంశాలు  శరీరం నకు సంబంధించి,  తెలివితేటలు, మేథా శక్తి  మనసుకు  సంబంధించి,  భావోద్వేగాలు  హ్రుదయానికి సంబంధించి  ఆథ్యాత్మిక అంశాలుకు సంబంధించి  ఆత్మకు సంబంధించినవి.  కాని మనం  శారీరక మరియు  మేథా శక్తికి సంబందించిన విషయాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి  మిగిలిని రెండింటిని నిర్లక్ష్యం చేస్తాం.  అన్నింటికన్నా ఆథ్యాత్మిక విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాం. 
      start early, drive slowly and reach safely అన్నది ఆథ్యత్మికత కు సంబంధించినదే.  అథ్యాత్మిక అనేది  రిటైర్ అయ్యాక, వయసు తీరినతర్వాత మొదలు పెట్టాల్సిన విషయం అని భక్తికి సంబందించి లేదా ఆత్మజ్ణానానికి సంబంధించిన విషయాలను వాయిదా వేస్తాం.  ప్రాపంచిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తాం.
                     శంకరాచార్యులవారు వయసు గతించినప్పటికీ,  ప్రాపంచిక విద్యనువదిలి,  పరావిద్యను గ్రహించి ఆత్మజ్ణానానికై ఆలోచించని ముసలిబ్రాహ్మణునితో   ఓ మూర్ఖుడా...వయసు మీరిపోయి  చావు సమీపించే వయస్సులో కూడా  ఆత్మజ్ణానం కోసం కాకుండా కాసులు సంపాదించే ప్రాపంచిక జ్ణానం కోసం ఎందుకు ప్రయాసపడతావు. ఇవి ఏవీ కూడా  చావు సమీపించినపుడు నీకు రక్షణ కలిగించలేవు. అని బోధిస్తున్నరు ఈ శ్లోకం ద్వారా.  మనం కూడా అథ్యాత్మిక తత్వాన్ని ముందుగా తెలుసుకొని దేనికి ఇవ్వవల్సిని ప్రాధాన్యత దానికి ఇస్తే తప్పనిసరిగా  బాధలు తొలగించుకోవచ్చును.  అత్యంత సంపన్నులైన బిల్ గేట్స్, వారెన్ బఫెట్స్  తమ సంపాదన్  త్రుణ ప్రాయంగా విసర్జించి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవడమే కాకుండా మానవ సేవయే మాధవ సేవ అని  భగవంతుని సేవ చేయాలనే  ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేపట్టడం గమనించినట్లైతే  డబ్బు సంపాదనే జీవితం అని తలపోసేవారికి కనువిప్పు కలుగక మానదు.  కాబట్టి  శారీరక, మానసిక, భావోద్వేగ  అంశాలతో పాటు  అథ్యాత్మికాంశాలకు ప్రాధాన్యత ఇచ్చి వివేక,వైరాగ్యాలను పెంచుకోవడం చాలా మంచిది.  అలాంటి పరిస్థితిలలో  చివరకు మరణం ఆసన్నమైనపుడు భవబంధాలను విసరించి చావును ఆనందంగా స్వీకరించే అత్యున్నత మానసిక స్థితికి చేరుకోగలం సచ్చిదానందాన్ని పొందగలం.

1 comment:

  1. భజగోవిందం - నిండైన వ్యక్తిత్వానికి, పరిపూర్ణ జీవితానికి పునాది

    Absolutely

    No doubt about it

    Shiva

    http://endukoemo.blogspot.in

    ReplyDelete