Wednesday 14 November 2012

పసి(డి) మనస్తత్వాలు


పిల్లలు దేవుడూ   చల్లని వాళ్ళే.. కల్లాకపటం ఎఱగని కరుణామయులే.....  ఈ మాట ఎందుకు అన్నారేమో గాని ...బాలల దినోత్సవం సందర్భం గా పిల్లలనుండి మనం నేర్చుకోవలసింది ఏదైనా ఉందంటే...

1. వర్తమానం లోనే జీవించడం ; 

                   పిల్లలు గతాన్ని వేగం గా విస్మరించగలరు. భవిష్యత్ గురించి పెద్దగా  భయం పెట్టుకోరు.  ఎలా అంటే  ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటే.. ఆ విషయం పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్తే ఆ రెండు ఇళ్ళ మధ్య జీవితాంతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంటుంది.  కాని ఆ  ఇద్దరు పిల్లలు  కొంత సమయం గడవగానే అతి మామూలుగా కలిసిపోయి చెట్టాపట్టలేసుకొని ఆడుకుంటారు. వారి మధ్య జరిగింది  వెంటనే మరచి పోతారు..   అంతే  కాకుండా  మరుసటి రోజు పబ్లిక్ పరీక్ష ఉన్నా ఏ మాత్రం జరగబోయే దాని గురించి ఆలోచించకుండా  హాయిగా   టీ వి చూడగలరు, క్రికెట్ ఆడగలరు.   పెద్దవాళ్ళు మాత్రం ఇలా అయిత్ భవిష్యత్ ఏమయిపోతుందో  అడుక్కొని తినాలి అదీ ఇదీ అని తెగ్ హైరానా  పడిపోతుంటారు...  పిల్లలనుండి  మనం నేర్చుకోవలసింది ఏమిటంటే  వీలైనంత వరకు వర్తమానాన్ని  ఆనందించడం.

2. సృజనాత్మక మరియు ఊహాశక్తిని వినియోగించడం;
  
    
                పిల్లలనుండి మనం నేర్చుకోవలసిన మరో ముఖ్యమైన విషయం గానుగెద్దులా  తిరిగిన చోటే తిరుగుతూ, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ  అన్నట్టు ఒకే బాణీ  కొనసాగించకుండా  జీవితం లో మనం చేసే ప్రతి విషయం లోనూ నవీనత్వానికి  సృజనాత్మకతకు  ప్రయత్నించడం..   ముఖ్యంగా  ఆడవాళ్ళు.  వంకాయ కూర చేస్తే  జీవితాంతం   ఒకటైపే  తప్ప. మరో రకంగా  ప్రయత్నిద్దాం అని ఉండదు.  చిన్న పిల్లలు కథ చెప్పినా, లేదా పాఠశాల లో    జరిగిన విషయం చెప్పిన కావల్సినంత  సృజనాత్మకత ఉంటుంది.  


3. కావల్సింది పొందాలనే పట్టుదల కలిగి ఉండటం;

            పిల్లలు  ఏదైనా పొందాలనుకుంటే దాని యొక్క సాధ్యాసాధ్యాలు గురించి ఎలాగైనా పొందాలని కోరుకుంటారు  .  వారి మొండి పట్టుదల చూసి తల్లిదండ్రులు వీలైనంత ప్రయత్నించి   కోరిక తీర్చడానికి  ప్రయత్నస్తారు.  చందమామ పొందాలన్న  బాలరాముడి  కోరిక కనీసం అద్దం లో  ప్రతిబింబం అయినా  దగ్గరనుండి  చూడటానికి అవకాశం కలిగింది.   మనం పెద్ద అవుతున్నకొద్దీ  సాధ్యం కాదనే ఆలోచన పెంచుకొని మన కోరికల్ని అణచుకొని అసంతృప్తితో జీవించేస్తుంటాం.  

4. సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉందటం
   
            పిల్లలు తాము నమ్మిన వాళ్ళు అంటే తల్లిదండ్రులు గాని ఉపాధ్యాయులుగాని మిగిలిన పెద్దవారు గాని చెప్పితే అది నిజమా కాదా  ఎంతవరకు సాధ్యం అనే లేనిపోని లాజిక్కుల గురించి ఆలోచించకుండా  సంపూర్ణమైన నమ్మకం కలిగియుంటారు.  స్పైడర్ మేన్ అయినా శక్తిమాన్  అయినా  ఏదైనా  అవి నిజమే అనే నమ్మకాన్ని కలిగి యుంటారు.  ఇలా నమ్మడం వలన పెద్ద వాళ్ళమైన మనం  చీకటిని భూతాల్ని అవి ఇవి అని లేనిపోని భయాలు వారికి నేర్పిస్తామన్నది వేరే విషయం.   పెద్దవాళ్ళమయితే ఇది ఎందుకు అది ఎందుకు ఇది ఎలా అది ఎలా అని నమ్మాల్సిన విషయాలు నమ్మడం   మాని బురిడీ బాబాల వద్ద,  పొంగించి పబ్బం గడుపుకునే వాళ్ళ వద్ద బోర్లా పడుతుంటాం.

5.  శాశ్వతమైన మమకారాలు పెంచుకోకూడదుః;

            పిల్లలు తమ వస్తువుల్ని, బొమ్మల్ని అపురూపంగా చూసుకుంటారు. అవి విరిగినా, పని చేసినా, పని చేయకపోయినా  అన్నింటినీ ఒక బుట్టలో పెట్టి  అతి జాగ్రత్తగా  దాస్తారు. కాని  అతి త్వరలోనే వాటికి తమకు ఏమీ సంబంధం లేదన్నట్టు  ఒక మూలన పడేసి యోగిలా ఒక నవ్వు నవ్వుతారు.  మనమో  లేని పోని బంధాలు  ఆఖరికీ  అతి అశాశ్వతమైన ఫేస్ బుక్ లో కూడా మనకంటూ  శతృవులు, వర్గాలు, కారాలు, మిరియాలు నూరడాలు ఒకటేమిటి.  చెప్పుకుంటూ  మరలా బాలల దినోత్సవం వచ్చేస్తుంది.    ఎవరు కనపడినా వారు స్నేహితులైనా కకపోయినా  తెలిసిన వారైనా తెలియని వారైనా  నవ్వుమొహంతో పలకరిస్తారు. అంతే కాని ఎదుటివాడు  ముందు పలకరిస్తాడులే అని  వెర్రి చూపులు చూడరు.

                బాలల దినోత్సవం రోజైన  పసిడి లాంటి పసిమనస్తత్వం మనం అలవరుచుకొని పిల్లమనస్తత్వం వదులుకుంటామని ఆశిస్తూ....

haram, koodali, trainer uday kumar, jalleda,

No comments:

Post a Comment