Wednesday, 2 May 2012

వేసవి సెలవల్లో ....వినోదమే కాదు వికాసం కూడా......

వేసవి సెలవల్లో   ....వినోదమే కాదు వికాసం కూడా......

     హమ్మయ్యా!  పరీక్షలు అయిపోయాయి ఇక సెలవలే తెగ ఆడుకోవచ్చు.. ఇటువైపు పిల్లల కేరింతలు
   అయ్య బాబోయ్ వేసవి సెలవలొచ్చేసాయ్... వీరిని ఎలా కంట్రోల్ చెయ్యాలి దేవుడా.. అటు తల్లిదండ్రుల  తీరని చింతలు ..

  ఇది వరకటి రోజులలో సెలవలు ముఖ్యంగా వేసవి సెలవలు వస్తే చాలు తాత 
గారి ఊరు వెళ్ళడం అక్కడ మామిడి తోటలో మామిడికాయలు తెంపుకోవడం
వాటిని ఊరబెట్టడం, పళ్ళు  ముగ్గబెడితే ఎవరికీ తెలీకుండా దొంగలించడం
ఊరు చివర ఏటి ఒడ్డుకు స్నానాలకు వెళ్ళడం...  ఇదంతా గతం మాత్రమే..  ఆధునిక జీవన ప్రభావ ఫలితంగా పలుచబడుతున్న మానవ సంబంధాలు ఒకవైపు, పరిమిత సంతాన భావన ఒకవైపు పిల్లలు ఇతర ఊళ్ళకు వెళ్ళడం గాని లేదా పిల్లలను విడిచి తల్లిదండ్రులు ఉండలేకపోవడం వలన గాని పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు.
   అయితే ఇంటర్మీడియట్ మరియు పదవతరగతి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు కార్పోరేట్ పాఠశాలలు సెలవలు ఇవ్వడం లేదు. ఇతర తరగతుల పిల్లలకు సమ్మర్ కాంప్ లు నిర్వహిస్తుంటారు
   ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తీసుకోవలసిన  జాగ్రత్తలేమిటి ?  ఈ సెలవుల్ని మరింత ఉపయోగ పరం గా  ఎలా  వినియోగించుకోవచ్చో   వివరంగా చర్చిద్దాం. 
వేసవి శిక్షణా శిబిరాలు    ఈ రోజుల్లో ప్రతి ఊరిలో,  ప్రతి పాఠశాలల్లో  వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు.  అవకాశం ఉన్న తల్లిదండ్రులు  వీటిలో ఏ ఏ అంశాలు చెబుతున్నారు. నేర్పించేవారు ప్రొఫెషనల్ కోచ్ లా లేదా నామమాత్రం గా పేరుకోసం లేదా డబ్బులు కోసం నిర్వహిస్తున్నారో పరిశీలించి తమ పిల్లలను జాయిన్ చెయ్యాలి.  ఈ శిబిరాలు కూడా ఒకటి రెండు వారాల పాటు రోజుకి రెండు మూడు గంటలకన్నా  ఎక్కువ ఉండవు. ఉండకూదదు కూడా.   ఇంట్లో పిల్లలు ఉంటే  టీ.వీ చూసి పాడైపోతున్నారనో పిల్లలమీద విసుక్కోవడం. మరలా స్కూలు ఎప్పుడు తెరుస్తారంటూ ఎదురుచూడటం కాదు.  వేసవి సెలవల్లో వినోదం మరియు వికాసం పిల్లలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
1) చదువుకు సంబంధించిన అంశాలు;  ప్రతీ రోజు చదువుకి , ఆటలకి, టీ,వీ చూడటానికి ఇతర అంశాలకి ఎంతసమయం కేటాయించాలి  ఒక  టైం  టేబుల్  పిల్లలతో   చర్చించి  తయారుచేయాలి.  సెలవలంటే  చదువుని  పూర్తిగా  వదిలివేస్తే ముందు తరగతిలో నేర్చుకున్నది మరచిపోయే అవకాశం  ఉంటుంది.  ముందు  తరగతి  వార్షిక  పరీక్షల్లో  ఏ సబ్జెక్ట్ లో  వెనుకబడి  ఉన్నాడో  గుర్తించి ఆ  సబ్జెక్ట్ మరల రివిజన్ చెయ్యాలి. సెలవల అనంతరం ఏ క్లాస్ చదవబోతున్నాడో ఆ క్లాస్ కి సంబంధించి ముఖ్యమైన సబ్జెక్ట్స్ చదవడం కొంత మంచిది. ఇది రోజుకి రెండు లేదా మూడు గంటలు మాత్రమే. 
2) భాషా నైపుణ్యాలు పెంపొందించ డానికి సంబంధించిన అంశాలుః నేటి కాలం లో  విద్యార్థులు   లాంగ్వేజ్ లలో బాగా వెనుకబడి ఉంటునారు.  వారికి ఆసక్తి ఉన్న అంశాలకు సంబంధించిన  కథల పుస్తకాలు,చంద్ఫమామ, బాలమిత్ర,  కామిక్స్, జనరల్ నాలెడ్జ్  మొదలగు పుస్తకాలు కొని చదివించాలి.  వారికి నచ్చిన సినిమా పాటలు  విని రాయమని చెప్పడం,  ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బిగ్గరగా చదివించడం చేయించాలి.  వారు చూసిన సినిమా వారికి వచ్చిన భాషలో క్లుప్తంగా రాయమని చెప్పాలి.  అంతే కాకుండా వారి ఇంగ్లీష్ పెంచుకోడానికి  వీలైతే కమ్యూనికేషన్  స్కిల్స్ నేర్పిస్తున్న సంస్థలకు పంపించడం గాని , ఇతర పిల్లలతో కలసి వర్డ్ గేమ్స్ , పజిల్ నింపడం మొదలగు ఆటలు ఆడేటట్టు చూడాలి.   వారిని దగ్గరున్న పుస్తకాల షాప్ కి తీసుకెళ్ళి  కొన్ని పుస్తకాలు వారు ఎంచుకుని కొనేటట్టు చేయాలి. 
3) మెదడుని చైతన్యం చేసే అంశాలుః  వేసవి కాలంలో తగిన సమయం ఉంటుంది కాబట్టి  సుడోకు, చదరంగం, పజిల్స్, అబాకస్,  రుబిక్స్ క్యూబ్ మొదలగు  పిల్లలతో ఆడిస్తుండాలి. సుడోకు   సెల్ ఫోన్ లో  కాకుండా  పేపర్  మీద  నింపించాలి. రుబెక్స్ క్యూబ్ వలన లాజికల్  థింకింగ్ ,  లాటరల్  థింకింగ్  పెరుగుతుందని   నిరూపించబడింది. అవే కాకుండా క్యారమ్ బోర్డ్ కొని ఇంట్లో ఉంచితే ఎండలో తిరగరు సరికదా అది ఆడటం వలన బాడీ మైండ్ సమన్వయం పెరుగుతుంది. దగ్గరలో కంప్యూటర్ నేర్పే సంస్థలుంటే అందులో చేర్పించడం మంచిది.
4)  ఆటలు, శారీరక కృత్యాలుః వేసవి కాలంలో పిల్లల ఆటలకి అడ్డూ అదుపూ ఉండదు అంటారు. నిజమే వారు ఆడే ఆటలు లేదా ఇతర శారీరక కృత్యాలు వారికి తరువాత కూడా ఉపయోగపడాలి. కేవలం క్రికెట్ అంటూ ఎండలో మాడిపోకుండా.  ఉదయం పూట మీతో పాటు వాకింగ్ కి తీసుకెళ్ళడం, యోగా లేదా మెడిటేషన్ సెంటర్ దగ్గరలో ఉంటే అందులో జాయిన్ చెయ్యడం
  స్విమ్మింగ్ , సైక్లింగ్ నేర్పించడం, కొంచెం పెద్దవారైతే  గేర్లు లేని మోపెడ్ లేదా మోటార్ వెహికిల్స్ నేర్పించడం చెయ్యాలి. ఇండోర్ గేమ్స్ తో పాటు బయట ఆడే ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  చిత్రలేఖనం, క్లే మౌల్డింగ్, నృత్యాలు మొదలగునవి వారిలో అభిరుచిని ఆసక్తిని పెంపొందింపచేస్తాయి.
5) ప్రయాణాలుః  చాలామంది వేసవి సెలవుల్లో తీర్థయాత్రలు కాని ఇతర సందర్శనా ప్రదేశాలకు వెళుతుంటారు.  వాటిని పిల్లలు బాగా ఎంజాయ్ చేసే టట్టు చూడండి.  వారు ప్రతీ రోజు టూర్ డైరీ రాయడం, అక్కడ ఉన్న విశేషాలను తెలుసుకోవడం వారిలో ఆసక్తి పెంపొందించడం ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యతలే.  ప్రయాణాల్లో ఎటువంటి పరిస్థితుల్లో వారిని విసుక్కోవడం  కసరుకోవడం చేయరాదు.  ఆ ప్రదేశాల్లో ప్రకృతి, అక్కడ ప్రజల జీవన విధానం, సంస్కృతి తెలుసుకునేటట్టు చూడాలి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలకు తీసుకువెళ్ళి వారు అవి తెలుసుకునేటట్టు చూడాలి. 
6) ఇంట్లో పనులు నేర్పించడం; పిల్లలకి  వారి పనులు వారు చేసుకునేటట్టు నేర్పించే బాధ్యత ఇంట్లో ఆడవారిదే. అమ్మాయైనా  అబ్బాయైనా, లేచిన వెంటనే పక్క సర్దుకోవడం,  బీరువాలో బట్టలన్నీ మరలా సర్దుకోవడం. ఇంట్లో ఉన్న గ్రోసరీ మరలా సర్దుకోవడం, డ్రాయింగ్ రూం  ఫర్నీచర్ సర్దడం, శుభ్రంగా ఉంచడం  పిల్లలకి ఈ వయసులోనే నేర్పించాలి.  వారు చేసే ప్రతీ పనికి తగిన బహుమానం ఉండాలి. పాలు మరగించుకోవడం, ఆమ్లెట్ వేయడం, టీ తయారుచేయడం, ఇంట్లో గెస్ట్స్ వస్తే  మమ్చినీళ్ళు, స్నాక్స్, టీ  అందించడం నేర్పించాలి. గెస్ట్స్ వచ్చినపుడు వచ్చి బాగున్నారా అని పలకరించడం ఇటువంటు మర్యాదలు నేర్చుకునేందుకు వేసవి కాలమే సరియైన  సమయం. పిల్లలతో ఐస్ క్రీం తయారుచేయడం, జ్యూస్ తయారు చేఅడం వంటల్లో ప్రయోగాలు ఇంట్లో చక్కని స్నేహపూరిత వాతావరణం ఏర్పరుస్తుంది, మా అమ్మాయి చేసిన కేక్,   ఐస్ క్రీం అంటూ చ్ట్టు పక్కల వాళ్ళకి పంచుతుంటే   వచ్చే ఆనందం చెప్పలేనిది కాక పోతే కాస్త రుచి చూసాక పంచండి. 
7) భక్తి, పూజా కార్యక్రమాలు;  పిల్లలో భక్తిశ్రద్ధలు  పెంపొందింప చేసేందుకు  తగిన  సమయం ఇదే. పుణ్యక్షేత్ర దర్శన, ఉదయం శ్లోకాలు చదివించడం, పూజా విధానం నేర్పించడం.  పిల్లలలో చాలా మార్పును తీసుకువస్తుంది. పెద్దల్పట్ల గౌరవమర్యాదలు ఇవన్నీ వారికి నైతికాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. 
8 ) ప్రకృతి పై అవగాహన కల్పించడం;   పెరడులో గాని ఇంటి పైన ఖాళీ స్థలం ఉంటే కుండీలలో లేదా నేల పై మొక్కలు పెంచడం,  కొన్ని ధనియాలు వారికి
ఇచ్చి  నేలపై నాటిస్తే కొన్ని రోజులకి అవి కొత్తిమీరగా వస్తే ఎంత ఆశ్చర్యపోతారో మీరే చూడండి.  అవకాశం ఉన్న   వాళ్ళు  కాయగూరలు  పండించండి. అదేదో వ్యాపారం  లేదా వ్యవహారం  కాదు  అలా  చేయడం  వలన  కాయగూర  బోజనం అంటే చిరాకు పడకుండా ఉంటారు. అవి పండించిన వారి కష్టం గుర్తిస్తారు.  జూకి, బీచ్ కి తీసుకెళ్ళడం వలన వారికి ప్రకృతి పట్ల ఇష్టం ఏర్పడుతుంది.  వీలైతే దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోం కి , అనాథాశ్రమం కి తీసుకెళ్ళండి. తరువాత వారి ప్రవర్తనలో కలిగే మార్పులు చూడండి.
9) ప్రేమాభిమానాలు పంచుకునేందుకు, పెంచుకునేందుకు తగిన సమయం ;  పిల్లలతో తప్పనిసరిగా కల్సి భోజనం చెయ్యాలి. సెలవల్లో వారానికి రెండుసార్లు  బయటకు వెళ్ళాలి.   చిరాకు పడటం, కోపించడం మానివేయాలి.  వారు గీచిన  చిత్రాలకు,   చేసిన వంటకు ఎలాగున్నా మెచ్చుకోవాలి తగిన బహుమతులివ్వాలి.  వారి ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిపించుకొని ఆడుకొనే స్వేచ్చ నివ్వాలి. వారి ముందు ఎటువంటి పరిస్థితుల్లో  కలహమాడరాదు. ఇతరులని దూశించరాదు.
             ఇవన్నీ ఆచరణ  సాధ్యమా    అంటూ దీర్ఘాలు తీయకండి.   ప్రయత్నిద్దాం.   మన పిల్లల గురించే కదా....... మామూలు రోజులలో చదువు, మెదడు ఈ రెండింటికి తప్ప  మిగిలిన వాటికి పని ఉండదు. అభివృద్ధి ఉండదు. ఈ వేసవి సెలవుల్లో పిల్లల మానసిక, శారీరక, భావోద్వేగ, ఆథ్యాత్మిక మరియు నైతిక అంశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోడానికి కాస్త సమయం ఉంటుంది.   స్కూల్ లో  సెలవలు ఇవ్వలేదని మీరు వారిని నిందించకండి.   మీ బట్టే వాళ్ళు .. నిలదీయండి..  పిల్లల్ని ఎదగనీయండి..    పిల్లలనే మొక్కలు ఏ చీడపడకుండా పెంచే తోటమాలులు మీరేనన్న సత్యం విస్మరించకండి
  ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com


(ఇంకా ఉంది)

1 comment:

  1. కొన్ని పాఠశాలల వాళ్ళు , పిల్లలను వేసవిసెలవల్లో కూడా ఆడుకోనివ్వకుండా , చదువుకు సంబంధించిన కోచింగ్ క్లాసులు పెట్టేస్తున్నారండి..

    ReplyDelete