Thursday, 1 September 2011

విమర్శలను ఎదుర్కోవడం ఎలా?

విమర్శలను ఎదుర్కోవడం  ఎలా?
       ప్రపంచం లో అనేకమంది సతమతమౌతున్న సమస్యల్లో  విమర్శించబడటం అనేది చాలా ముఖ్యమైనది.  విమర్శకుల బారిన పడకుండా ఉన్న మానవుడు ఎవరూ లేరంటే  అతిశయోక్తి కాదు.  అందుకే  ఐనిస్టీన్ అంటారు విమర్శింపడనివాడెవడైనా ఉన్నాడంటే  వాడు ఏమీ చేయకుండా ఉన్నవాడైయుంటాడు అని.  నలుగురూ నడిచే దారిలో కాకుండా  తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నమ్మి  తనకు నచ్చిన దారిలో నడవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ ఈ విమర్శలు తప్పవు.
   విమర్శలకు జడిసి  మనసు చంపుకొని  తాము చేయాలనుకున్నవి చేయలేక జీవచ్చవాలై జీవించే వారు నూటికి తొంభైకి పైగా ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు
కాని ఒక్కసారి  ఇతరులను విమర్శించేవారి మానసిక వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకుంటే  వారు తమలో తామే  ఎంతటి అసంత్రుప్తితో జీవిస్తున్నారో తెలుసుకుంటే వారి పట్ల కోపం కన్నా జాలి పుట్టి వారికి మంచి మనసు ప్రసాదించమని  వారి తరుఫున దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం.   నమ్మరు కదా ..... సరే  మీ కోసమే   ...........   ఈ   ఆర్టికల్......
విమర్శించే వారి  మానసిక స్థితిః

* విమర్శించే వారి గతంః  సాధారణంగా ఇతరులను అకారణంగా విమర్శించేవారి గతం అనేక బాధలతో కూడి ఉంటుందని మానసిక విశ్లేషికుల అభిప్రాయం.   వారి జీవితంలో తరుచూ తల్లిదండ్రుల దూషణలకు, బందు మిత్రుల హేళనలకు గురై యుంటారు.
* విమర్శించే వారు  పొగడ్తలకోసం అర్రులు చాస్తూ ఉంటారుః  వీరు ఇతరులనుండి  పొగడ్తలు ఎక్కువగా ఆశిస్తుంటారు. తమకు సరియైన గుర్తింపులేదని తరుచూ అంతర్గతంగా బాధపడుతుంటారు. తాము చేసిన చిన్న చిన్న విషయాలను గోరంతలు కొండంతలు చేస్తూ  తమ గొప్పలు తరుచూ చెప్పుకుంటూ ఉంటారు.  నార్సిస్టిక్ పర్సనాలిటీ దిజార్డర్  అనే  మానసిక సమస్యతో మధన పడుతుంటారు.
* విమర్శించే వారు  మన స్నేహాన్ని, మన ప్రేమను ఎక్కువ మొత్తంలో  ఆశించినవాలై యుంటారు. ఎప్పుడైతే మనం వారు ఆశించినంత  సన్నిహితంగా మెలగటం లేదో మన  ద్రుష్టిని  ఆకర్షించేందుకు విమర్శిస్తుంటారు.
* విమర్శించే వారికి భావోద్వేగాలు సమతౌల్యం చేసుకొనే అవకాశం ఉండదుః   ప్రతీ వారికి తమ యొక్క  కోపాన్ని గాని,  భావోద్వేగాలను  వ్యక్తపరచేందుకు, సమతౌల్యం చేసుకొనేందుకు ఎదో ఒక వీలు అవకాశం ఉంటుంది.  వీటినే EMOTIONAL VENTILATORS ఆంటాం.  వీరికి  ఈ అవకాశం  లేకపోవడాం వలన ఎవరు దొరుకుతారా వారిపై  తమ కడుపులో ఉన్న  అక్కసు కక్కేద్దామని ఎదురుచూస్తుంటారు.  ఎదుటివారి మీద కోపం కన్న  తమ కడుపులో కుళ్ళు బయటకు పంపడానికే  అకారణం గా విమర్శిస్తుంటారు.
*విమర్శించే వారికి భవిష్యత్ పై ఆశ చాలా తక్కువగా ఉంటుందిః  తరుచూ  ఇతరులను అకారణంగా విమర్శించే వారికి తమ భవిష్యత్ మీద ఆశ ఉండదు. నిరాశావాదం తో క్రుగిపోతుంటారు.  ఇతరులు తమను ఎక్కడ అధిగమిస్తారో అనే భయం తో తరుచూ మధన పడుతుంటారు.
విమర్శించేవారు  అతి ఎక్కువ అసూయ, అతి తక్కువ ఆత్మ గౌరవం కలిగియుంటారు. ః  ఇతరులను విమర్శించే వారు తమపై తమకు తక్కువ అబ్జిప్రాయం కలిగియుంటారు.  తరుచూ మనలాంటి వాళ్ళకి అది సాధ్యమా, మన బ్రతుకులకి అలా వీలవుతుందా అనే  మాటలతో మనల్ని కూడా వాళ్ళలాగే  దద్దమ్మలగా లెక్క కట్టి మాట్లాడుతుంటారు. ఇతరులమీద అసూయ ఇక్కువ మొత్తంలో కలిగియుంటారు.
    విమర్శలను  ఎదుర్కోవడం ఎలా?
  రాముడులాంటి వాడే  విమర్శలను ఎదుర్కోలేక సీతను త్యజించాడని రామాయణంలో చెబుతారు.  ఈ సారి  మిమ్మల్ని ఇతరులు  విమర్శిస్తున్నపుడు వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా వారి బలహీన మానసిక స్థితిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి.  ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి.
1. మీరు ఏదైనా ఒక పని చేసేటపుడు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే  వారు  ఆ రంగంలో  లేదా ఆ పనిలో అనుభవం ఉన్నవారా? కాదా? ప్రశ్నించుకోండి. ప్రతీ దద్దమ్మ చెప్పే కబుర్లు పట్టించుకోనవసరం లేదని గుర్తించండి.  వికెట్లమధ్య ప్రుగెత్తడం చేతకాక 38 సార్లు రన్ అవుట్  అయిన సంజయ్  మంజ్రేకర్  సచిన్  టెండుల్కర్ ని  ఎక్కడ అవకాశం దొరికినా విమర్శిస్తుంటాడు.  అంత పోటుగాడు అయితే  ఆడి చూపించవచ్చుగదా....
2. మన లక్ష్యం, మన కల ఎప్పుడూ   ఇతరుల విమర్శకన్నా బలంగా ఉండాలి.;   ఇతరుల విమర్శకు జడిసి మనం చేస్తున్న పనిని వదిలివేసామంటే మన లక్ష్యం  చాలా బలహీనంగా ఉందన్నమాట. ఎవరైతే స్థిరమైన ఖచ్చితమైన బలమైన కోరిక కలిగిఉంటారో  వారు  ఇతరులు కడుపుమంటతో చేసిన విమర్శలను పట్టించుకోరు.
3. మనల్ని విమర్శించే వారు మనం చేస్తున్న పనిలో లోపాలు, తప్పులు గురించి చెప్పేటపుడు  ఎలా చేస్తే, ఏమి చేస్తే బాగుంటుందో   అని వారిని ఒక సారి  ప్రశ్నించండి.  వారి వద్ద సమాధానం ఉండదు సరికదా  అక్కడనుండి పలాయనం చిత్తగిస్తారు.   ఈ సారి ప్రయత్నించి చూడండి.
4.విమర్శకులకు దూరంగా ఉండండి లేదా వారిని దూరంగా ఉంచండి;    ఎలాంటి వారైన విమర్శల బాణాల వాడిని  వేడిని  తట్టుకోలేరు.  వారిని దూరంగా ఉంచడం  లేదా మనం దూరంగా ఉండటం అన్నిటికన్నా  మంచిది.  రోడ్డుమీద దారి పొడుగునా ముళ్ళు ఉన్నప్పుడు  వాటిని పీకి వేస్తూ  సమయం దుర్వినియోగం చేసుకోవద్దు.  మంచి  చెప్పులు వేసుకుంటే  పోలా.
5.ఇంకా వివరాలు, చిట్కాలు  అనవసరం మౌలా నజిరుద్దీన్ కి  ఎదురైన ఒక అనుభవం చూడండి.  విమర్శకుల గురించి,  మనకు బాగా అర్థం  అవుతుంది.
    ఒక సారి  మౌలా నజిరుద్దీన్  తన కుమారుడి తో కలసి సంతకు వెళ్ళి  ఒక గాడిద కొన్నాడట్.  ఎందుకంటే  ఆ రోజుల్లో  గాడిదలే  ప్రధాన ప్రయాణ సాధనాలు.  గాడిద కొని  దాని పైన తన కుమారుడిని కూర్చోపెట్టి ప్రక్కన్ నడుస్తూ వస్తున్నాడట.  కొంతమంది  అది చూసి  ఏమయ్యా  నజిరుద్దీన్  మీ అబ్బాయికి  గారాబం చేస్తున్నావు. పిల్లడికి కష్టం అంటే తెలీక పోతే  రేపు పెద్దయ్యాక సమస్యలు ఎదుర్కుంటాడు. నీవు చేస్తున్న ఏమీ బాగో లేదు అని విమర్శించారట్.   దానితో నజీరుద్దీన్  పిల్లవాడిని దించి  తను  కూర్చొని ప్రయాణం సాగించాడట.  దార్లో కొద్ది మంది అది చూసి  ఏమయ్యా నజిరుద్దీన్  నీకు ఏమైనా బుర్ర ఉందా  చిన్న పిల్లవాడిని నడిపిస్తూ  ఇంత ఎదిగావు  ఆ మాత్రం తెలీదా అని విమర్శించారట.  దాంతో నజిరుద్దీన్  తాను మరియు తన కొడుకు ఇద్దరు కలసి గాడిద మీద కూర్చొని ముందుకు సాగారు. దార్లో కొద్ది మంది చూసి  అసలు మీలో మానవత్వం ఉందా  ఇద్ద్రరు కలసి కూర్చుంటే అది మొయ్యగలదా? మీలో సైతాన్  ప్రవేశించాడా అని శాపనార్థాలు మొదలెట్తారట.  దాంతో నజిరుద్దీన్  వెంటనే  తాను  తన కుమారుడు  గాడిద పైనుండి దిగి  ఇద్దరు కలసి  గాడిద తో  పాటు నడవడం మొదలెట్టారట.  దార్లో  మరికొందరు చూసి  ఏమయ్యా  నజిరుద్దీన్  ఏమి మనిషివయ్యా   ఉన్న అవకాశం  ఉపయోగించుకోడం చేతకాక పోతే ఎలాగయ్యా?  గాడిద కొని దానిని నడిపిస్తే అది ఎందుకు కొన్నావయ్యా?  దానిమీద కూర్చొని ప్రయాణం చెయ్యవచ్చుకదా  అని విమర్శల వర్షం మొదలెట్టారట. ఇప్పుడు  నజీరుద్దీన్  దగ్గర ఒకటే  అప్షన్ ఉంది.  దానిని  తండ్రి కొడుద్కులిద్దరూ మొయ్యడం  లేదా  గాడిద ను వదిలి పారిపోవడం.
         ఇతరులను సంత్రుప్తి పరచాలని ప్రయత్నిస్తే  ఎవరినీ సంత్రుప్తి పరచలేము.   ఇతరులు మనల్ని విమర్శిస్తున్నారంటే  మనలో ఏదో  విషయం  ఉందన్నమాట.  కాబట్టి  విమర్శలకు  వెఱవకుండా మనం ఎంచుకున్న రంగం లో  జైత్రయాత్ర మొదలెడుదామా.
ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయకుమార్
trainerudaykuma@gmail.com

Wednesday, 27 July 2011

చిరునవ్వులతో బ్రతకాలి...

డియర్ ఫ్రెండ్స్!
 నవ్వు నాలుగు విధాల స్వీటు అనడం మీకు తెలిసినదే. స్వర్గీయ జంధ్యాల గారు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగమని చలోక్తి విసిరారు. నవ్వడం వలన కలిగే లాభాలను తెలుసుకుందామా! మనసారా సదా నవ్వుతూనే ఉందామా?
1. నవ్వుతూ ఉందటం వలన మనలో ఆకర్షణ శక్తి పెరుగుతుందిః
సదా నవ్వుతూ ఉండటం వలన చిరునవ్వు చిందించడం వలన మన ఆకర్షణ శక్తి పెరుగుతుందనేది అక్షర సత్యం. కొత్తవారెవరైనా ఏదైనా విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించేటపుడు ఎవరైతే నవ్వు ముఖం కలిగి ఉంటారో వారి దగ్గరకి వెళ్ళి ఆ విషయం అడుగుతారు. సీరియస్ గా ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి విముఖత చూపుతారు. చిరాకుగా, కోపంగా లేదా ఏడుపుగొట్టు మొహాన్ని ఎవరూ ఇష్టపడరనేది మనందరికీ తెలిసిందే. అదే నవ్వుతూ సరదాగా కనపడే వారు అందర్నీ తనవైపు ఆకర్షించుకుంటారు. మీరు ఏ హైదరాబాదో, ముంబాయో వెళ్ళారనుకోండి  ఎవరి ఎడ్రస్  తెలుసుకోవాలనుకోండి ఎడ్రస్ కాగితం పట్టుకొని నిల్చున్నారు. ఎదురుగా బస్ స్టాప్ లో ఇద్దరు వ్యక్తులున్నారు   ఒకడేమో చిరాకు మొహమేసుకొని ఉన్నాడు. మరొకతను నవ్వుతూ  ఆహ్లాదంగా ఉన్నాడు మరి మీరు ఎడ్రస్ అడగటానికి ఎవరి దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడతారు?
2. నవ్వు మన మూడ్ ని మారుస్తుంది;
ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు గట్టిగా నవ్వడానికి ప్రయత్నించండి. తప్పని సరిగా అన భావోద్వేగాలు అదుపులోకి వచ్చి తేలికవుతాం. మనసంతా నిండియున్న బరువు తీరి నట్టు అవుతుంది. శంకర్ దాదా సినిమాలో లాఫింగ్ థెరపీ ని మన లింగం మామ అదే హిరోయిన్ తండ్రి అయిన కాలేజ్ డీన్ ఎలా ఉపయోగించేవాడో చూసాం కదా! మరేం మూడ్ బాగోలేదనిపించినపుడు మంచి జోక్ ని ఫ్రెండ్ తో పంచుకోవడమో , కార్టూన్ చానల్ ని చూదటమో చేసి బరువు దించుకుందాం. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలతోనే బలి చేయవద్దని పెద్దయన చక్కగా పాడి మరీ చెప్పారు కదా! మనం విని నడుచుకోక పోతే ఆయన మూడ్ మారిపోవచ్చు.
3. నవ్వు ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుంది.;
కళ్ళకలకలు వచ్చినపుడు ఒకరికి సోకితే అందరికీ ఎలా వ్యాపిస్తుందో అలాగే నవ్వుకూడా అంతే. ఒక గ్రూప్ లో అంతా నవ్వుతూ ఉన్నప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి చేరితే వారికి సందర్భం మరియు విషయం తెలియకపోయినప్పటికి ఆందరితో కలసి తెగ నవ్వేస్తాడు. ఎందుకు నవ్వుతున్నామని మనం అడిగితే మీరు నవ్వుతున్నారు కదా అంటాడు. మనకి తెలియని వాళ్ళు ఏదైనా విషయానికి నవ్వుతుంటే మనం కూడా శ్రుతి కలుపుతాం. తెలియని వ్యక్తి చచ్చి ఏడుస్తుంటే వారితో పాటు  మనం ఏడవం సరికదా జాతస్య ధ్రువో మృత్యు; అని వేదాంతం చెప్పడానికి రెడీ అవుతాం. అంటే నవ్వడం ద్వారా మన సైన్యాన్ని పెంచుకుందాం.
4. నవ్వు మన మానసిక శారీరక ఒత్తిడి ని తగ్గిస్తుంది;.
తీవ్రమైన పని ఒత్తిడితో మానసికంగా శారీరకంగా అలసిపోయినపుడు మనసారా నవ్వగలిగితే మంచి సరదా అయిన సంభాషణ పంచుకుంటే మనసంతా తేలికై ఆహ్లాదంగా ఉంటుంది. మన ఆలోచనలలో మార్పు కలిగి మన అలసట గురించి చికాకుల గురించి మరచి ప్రశాంతత పొందగలుగుతాం. మన ఒత్తిడి తగ్గి మన పని పై ధ్యాస పెట్టగలుగుతాం. ఒత్తిడియొక్క చిహ్నాలు మన మొహం పై మాయమై మందహాసం తొణికిసలాడుతుంది.
5. నవ్వు మన రోగ నిరోధక శక్తిని పెంచుతుందిః
నవ్వడం వలన మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఫ్లూ మరియు జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాక రిలాక్స్ అయ్యేందుకు నవ్వు బాగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యం మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
6. నవ్వడం వలన మన రక్తపోటు తగ్గుతుందిః
ఈ మధ్య జరిగిన పరిశోధనలలో నవ్వడం వలన అధిక రక్తపోటుతో బాధ పడుతున్నవారిలో చాలా మెరుగుపడే అవకాశం ఉంటుందని తేలిందట. స్పిగ్మో మానో మీటర్ లో మీ రక్తపోటు కొలుచుకునే ముందు ఒక నిమిషం పాటు హాయి గా నవ్వి తర్వాత మరల రక్తపోటు కొలిస్తే మార్పు ఉండే విషయం మీరే స్వయంగా చూడవచ్చును.
7. నవ్వు సహజమైన నివారిణిః
నవ్వడం వలన మన అంతఃస్రావీ గ్రంథులలో ఎండో ఫైన్స్ మరియు సెరోటోనైన్ మరియు నొప్పి నివారణ కు ఉపకరించె రసాయనిక హార్మోన్లు స్రవించి మన ఆరోగ్య స్థాయిని పెంచుతాయి. మనలో అనారోగ్యాన్ని తరిమికొడతాయి.
8. నవ్వు ముఖ సౌందర్యాన్ని పెంచుతుందిః
నవ్వడం వలన ముఖంలో గల కండరాలకు మంచి వ్యాయామం కలిగి అవి చురుకుగా ఉండేందుకు తద్వారా మరింత యవ్వనం గా కనిబడేటందుకు అవకాశం ఉంటుంది. అన్ని రసాయనిక సౌందర్య సాధనాలకన్నా ఖర్చులేని దివ్యమైన సాధనం మనసారా నవ్వడమే.
9. మీ విజయానికి మూలకారణం నవ్వేః
నవ్వు ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి చిహ్నం. ఎల్లప్పుడు నవ్వుతూ ఉండే వ్యక్తి అందరిలో చురుకుగా దూసుకుపోగలుగుతాడు. అందరి మన్ననలను పొందగలుగుతాడు. సమావేశాలలో అందరితో కలివిడిగా ఉండగలుగుతాడు. ఇలాంటి లక్షణాలు తప్పనిసరిగా విజయాన్ని తీసుకువస్తాయి. మీ విజయానికి దోహదపడతాయి.
10. నవ్వు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండటానికి దోహదపడుతుందిః
నవ్వుతూ ఉండటం వలన సానుకూలంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. నేను చేప్పేదానిని మీరు నమ్మకపోతే ఒకసారి బిగ్గరగా నవ్వుతూ ఈ వ్యాసం గురించి నెగటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నించండి. నవ్వుతూ నెగటివ్ గా ఆలోచించడం సాధ్యపడదు. అంటే మనం ఎల్లప్పుడూ పాజిటివ్ గా అంటే సానుకూలంగా ఉండాలంటే నవ్వుతూ ముందుకెల్లడటమే. 

                 చిన్నపిల్లలు రోజుకు ఐదు వందలనుండి వెయ్యి సార్లు నవ్వితే పెద్దవారు రోజుకి ఐదు నుండి పదిహెడు సార్లు మాత్రమే నవ్వుతారని ఒక పరిశోధకుడు సెలవిచ్చాడు. భూమిని మోస్తున్న అట్లాస్ లా ఫీల్ అయిపోయి ప్రపంచంలో నున్న సమస్యలన్నీ నెత్తిమీద వేసుకొని ఓ తెగ బాధపడిపోవలసిన పనేమి లేదు మనస్పూర్తిగా నవ్వండి. నవ్వుతూ బ్రతికాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా అని ఓ సినీ కవి అన్నట్టు ..
జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఒత్తిడులు, చికాకులు, చిరాకులు, చిటపటలు, ఉక్రోషాలు , ఏడుపులు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి మనసారా నవ్వుకుందామా.........
చిరునవ్వులతో బ్రతకాలి....చిరంజీవిగా బ్రతకాలి... ఆనందాలను అన్వేషిస్తూ.. అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి..........
విష్ యు గుడ్ లక్
trainerudaykumar@gmail.com

Wednesday, 6 July 2011

Self Esteem - Key of Success

self esteem:
 
ఆత్మ ఔన్నత్వం లేదా ఆత్మ గౌరవం ;

ప్రతీ వ్యక్తి జీవితం లో విజయం సాధించడానికి, తన శక్తియుక్తులమేరకు ఎదగడానికి దోహదపడేది అతను తనపై తాను పెంచుకున్న ఆత్మ ఔన్నత్వం లేదా అత్మగౌరవమే. No one can grow beyond his self esteem అని అంటాడు Jim Rohn అనే వ్యక్తిత్వ వికాస శిక్షకుడు. ముందుగా మనలో అత్మ ఔన్నత్వం ఎంత వరకు ఉందో క్రింది ప్రశ్నల ద్వారా తెలుసుకుందాం. నిజాయితీ గా క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1 . ఇతరులు నాకన్నా గొప్ప అధ్రుష్టవంతులు మరియు గొప్పవాళ్ళు కారు.
2 . నన్ను నేను అంగీకరిస్తున్నాను మరియు నా గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను.
3.నలుగురిలో కలవడాన్ని ఇష్టపడతాను.
4 . నన్ను నేను విలువైన వ్యక్తిగా నలుగురికి అవసరమైన వ్యక్తిగా భావిస్తాను.
5 . నేను మంచిపని చేసాను అని ఇతరులు చెప్పవలసిన పని లేదు.
6 . నేను నాలా ఉండటమే నాకు ముఖ్యం.
7 . ఇతరులతో త్వరగా స్నేహం చేయగలుగుతాను.
8 . నా గురించి తక్కువగా భావించకుండా ఇతరుల విమర్శలను స్వీకరించగలుగుతాను.
9 . నా తప్పులను బహిరంగంగా ఒప్పుకోగలను.
10 . నా స్పందనను. భావాలను నేను దాచుకోను.
11.నా అభిప్రాయాలను స్వచ్చంధంగా వ్యక్తపరచగలను.
12. నేను ఉల్లాసంగా, నిర్భయంగా ఉండే వ్యక్తిని.
13 . నా గురించి, నా అభిప్రాయలను గురించి ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోను.
14. ఇతరులు నా అభిప్రాయలకు తమ ఆమోదం తెలపాలని ఆశించను.
15. నేను కోరుకునే వాటిని గురించి ఇష్టపడేవాటిగురించి గిల్టీగా అపరాధబావాన్ని నేను తలంచను.
16. ఇతరుల అభిమానానికి , ప్రేమకి నేను పూర్తి అర్హత కలిగియున్నాను.

TEST SCORE: అవును అనే ప్రతీ సమాధానానికి ఒకమార్కు వేసుకోండి

15-16 మార్కులు - మీ ఆత్మ ఔన్నత్వం చాలా అధికంగా ఉంది. ఆల్ ది బెస్ట్
12-14 మార్కులు - పర్వాలేదు. మెరుగుపడే అవకాశం ఉంది.
8-11 మార్కులు - చాలా తక్కువగా ఉంది. అనేక సందర్భంలో మిమ్మల్ని వెనక్కు లాగుతోంది.
8 మార్కుల కన్నా తక్కువ - మీ ఆత్మ గౌరవం చాలా తక్కువ స్థాయిలో ఉంది.

మరి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ ఔన్నత్వాన్ని ఎలా పెంచుకోవాలి.

* మీరు సాధించిన విజయాల గురించి ఆలోచించండి.
* విమర్శకులకు బెదరకండి. ఇతరులు మనలను పొగడారంటే మన వలన వారికి ఏదో ప్రయోజనం ఉందన్నమాట. విమర్శించారంటే ప్రస్తుతం వారికి మన అవసరం పెద్దగా లేదన్నమాట.
* వాస్తవాల్ని గ్రహించండి.
* భవిష్యత్తు పై ధ్రుష్టి పెట్టండి.
*విమర్శకులకన్నా పెద్దగా ఆలోచించండి. వారికన్నా ఉన్నతంగా ఆలోచించండి.
*మీ గురించి మీరు ఉన్నతంగా ఉండటానికి ఏ అంశాలు మెరుగుపరుచుకోవాలో తెలుసుకోండి.
* ఆత్మ పరిశిలనతో మీలో లోపాలను సరిదిద్దుకోండి.
* సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ప్రతి ఒక్కడికీ వాడి స్థాయిని బట్టి సమస్యలుంటాయని తెలుసుకోండి.
*మన ఆలోచన స్థాయి మేరకే మనం ఎదగగలగమని గుర్తించి, ఎంత మేరకు ఎదగాలనుకుంటున్నారో ఆ స్థాయి మేరకు ఆలోచనలు పెంచుకోండి.
* ఈ స్రుష్టిలో కేవలం మనం ఒకరికి మాత్రమే జవాబుదారి. అది ఎవరో తెలుసుకొని ఆత్మసాక్షి గా పనిచేయండి.
* ఆనందం భవిష్యత్తులో ఉండదు. ఈ క్షణం ఆనందంగా ఉండలేని వాడు ఏ క్షణం ఆనందంగా ఉండలేదు.
విష్ యు ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gamil.com

Tuesday, 5 July 2011

Process of Learning:

Process of Learning:
అభ్యాసన ప్రక్రియః
డియర్ ఫ్రెండ్స్ ,
ఏదైన విషయాన్ని, నైపుణ్యాన్ని మనం నేర్చుకునే ప్రక్రియలో గల వివిధ దశలను తెలుసుకుందాం. ఇది కేవలం విద్యార్థులకే కాదు. ఉద్యోగులకు, గ్రుహిణులకు క్రీడాకారులకు సమాజం లోని అన్ని వర్గాలకు అనువర్తింపచేయవచ్చును. కారు డ్రైవింగ్ నేర్చుకోవడం గాని, స్విమ్మింగ్ నేర్చుకోవడం గాని, కొత్తగా వచ్చిన టూల్ ని నేర్చుకోవడం గాని ఏదైనా కావచ్చును.

మొదటి దశః Unconscious/incompetence: Incompetence ఆంటే ఏదైన ఒక విషయంలో దానికి తగిన పరిజ్నానం లేకపోవడం. దానిని తెలుసుకోవాలనే ఆలోచన ఈ దశ లో ఉండదు. ఉదాహరణకు కార్ డ్రైవింగ్ రాకపోవడం. కారు లేకపోవడం వలన దానిని నడపాల్సిన ఆవశ్యకత లేకపోవడం వలన్ ఆ నైపుణ్యన్ని నేర్చుకోవాలనే చేతన కలగకపోవడం. డిగ్రీ చధువుతున్న విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, ఉద్యోగసాధనా నైపుణ్యాలు పెంచుకోవాలనె ఆలోచనలేకపోవడం ఈ దశ లో ఉంటుంది.
రెండవ దశః Conscious/ Incompetence: ఈ దశలో తనకు ఫలానా నైపుణ్యం లేదని గుర్తించడం జరుగుతుంది. ఆ నైపుణ్యం లేకపోవడం వలన కలిగిన్ ఇబ్బందులు, దానిని నేర్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలు గుర్తిస్తాడు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి వంట రాకపోవడం వలన అత్తవలన గాని భర్త వలన గాని మాటలు పడటం, ఉద్యోగం కోసం ఇంటర్యూ కి హాజరైన విద్యార్థి ఇంగ్లీషులో మాట్లాడలేక తెల్లమొహం వేయడం. కారు కొనుక్కునే అవకాశం కంపెనీ వారు ఇచ్చినా డ్రైవింగ్ రాకపోవడం వలన ఆ సౌకర్యం ఉపయోగించుకోలేకపోవడం, ఆడ్వాన్స్ టూల్స్ నేర్చుకోకపోవడం వలన ఫైర్ కాబడటం ఇలాంటి దశకు దారితీస్తాయి.
మూడవ దశః Conscious/ Competence: నేర్చుకుంటున్న మొదటి దశ ఇది. అతి జాగ్రత్తగా అన్ని విషయాలను ధ్రుష్టిలో పెట్టుకొని మాన్యుయల్ దగ్గరపెట్టుకొని దానిని అమలుచేయడం నేర్చుకోవడం. మాటి మాటికి ఉడికిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అని జాగ్రత్త పడుతూ వంట చేయడం లాంటింది. స్పీడ్ బ్రేకర్ కి కిలోమీటర్ ముందే బ్రేక్ వేస్తూ, టర్నింగ్ ల వద్ద సవాలక్ష జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవింగ్ చేయడం లాంటింది. గ్రామర్ ప్రకారం మాట్లాడుతున్నానా లేదా అని పదే పదే పరిశీలించుకోవడం ఈ దశలో ఉంటుంది.
నాలుగవ దశ ; Unconscious/ Competence: ఈ దశలో అభ్యాసన పూర్తవడం వలన పదే పదే ఆ పనిని చేయడం వలన ఆ పనిపై మంచి పట్టు సంపాదించి అచేతనంగా పెద్ద ప్రయాసలేకుండా ఆ పని చేయగల స్థాయి కి చేరుకుంటాం. సునాయసంగా డ్రైవింగ్ చేయగలగడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడగలగటం, ఎంత మంది చుట్టాలు ఇంటికి వచ్చినా ఏ మాత్రం ప్రయాస లేకుండా రుచిగా వండగలగటం, బోర్డ్ మీటింగ్ లో గాని మేనేజింగ్ డైరెక్టర్ వద్ద సైతం ఆంగ్లం లో బల్లగుద్ది మరీ మాట్లాడగలగటం ఈ దశలో సాధ్యమౌతుంది. అబ్యాసనలో అత్యున్నత దశ ఇది. చాలా మంది ఈ దశలో ఆగిపోవడం జరుగుతుంది
ఐదవ దశ; Achieving Mastery; మనసా వాచా కర్మేణా త్రికరణ శుద్దితో పదే పదే ఒక పనిని చేయడం వలన ఆ పనిలో పూర్తి నైపుణ్యం సాధించగలుగుతారు. ఈ స్థాయి కి ఎలా వచ్చారో వారికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏలా జరిగింది అంటే ఏమో అనే సమాధానం వస్తుంది. ఆ పనిలో పరిపూర్ణత సాధించడమే కాకుండా అత్యున్నత స్థితిలో ఉంటారు గాని దానికి సంబంధించిన సందేహాలు గాని, తాము పాటించే నైపుణ్యాలు ఇతరులకు బోధించలేరు. తమను చూసి తెలుసుకోమని మాత్రం చెబుతుంటారు.
ఆరవ దశ; Coach/ Guru/ Mentor: ఇతరులకు ఒక విషయంలో పరిపూర్ణులుగా తీర్చిదిద్దే ప్రావీణ్యత కలిగియుండటం. అభ్యాసనలో గల మొదటి నాలుగు దశలపై సంపూర్ణ అవగాహన కల్గియుండి అభ్యాసకులతో ప్రాధమిక స్థాయినుండి అన్ని అంశాలను క్షుణ్ణంగా సంసిద్ధం చేయగలుగుతారు> వారికి ఆ విషయం పై పూర్తి ప్రావీణ్యత లేకపోయినప్పటికీ శిక్షణలో విజయం సాధించగలిగే స్థితిలో ఉంటారు. ఉధాహరణ కు రమాకాంత్ అచ్రేకర్ పెద్ద క్రికెటర్ కాకపోయినా సచిన్, కాంబ్లి, ఆమ్రే లాంటి సక్సెస్ ఫుల్ ఆటగాళ్ళను తయారు చేయగలిగాడు. బుకానన్, వాట్ మోర్ కూడా ఈ కోవకే చెందుతారు.
ఫ్రెండ్స్, పై అంశాలను ధ్రుష్టిలో ఉంచుకొని అభ్యాసన లో అత్యున్నత స్థాయిని చేరుకునేందుకు మనమంతా ప్రయత్నిద్దాం. విష్ యు ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com

Monday, 4 July 2011

How to be positive in Negative Environment

How to be positive in Negative Environment
మన చుట్టు ఉన్న వాతావరణంలో వివిధ రకాల వ్యక్తులతో మనం జీవించేటపుడు మనం ఎంత సానుకూలంగా ఉండాలని ప్రయత్నించేటప్పడికీ ఇతరుల వ్యతిరేఖ ప్రవర్తన మనపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ. మరి అటువంటి పరిస్థితులలో సానుకూలంగా ఎలా ఉండాలనేది మిలియన్ డాలర్ల ప్రశ్నః
క్రింది విషయాలను ఆచరించడానికి ప్రయత్నిస్తే కొంతవరకు సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మరి వాటిని తెలుసుకొని ప్రయత్నిద్దామా?
1. Spread a Smile Around: నిరంతరం చిరుమందహాసాన్ని మన మొహంపై తొలగించకుండా ఉండగలిగితో సాధారణంగా మనతో ఇతరులు సరిగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. రెండుచేతులు కలిస్తే కదా చప్పట్లు వచ్చేది. ఎదుటివారి పట్ల వ్యతిరేఖభావంతో గాకుండా సాధ్యమైనంతవరకు నవ్వుతూ మాట్లాడటం వలన మనతో వారు సక్రమంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.
2.Recognize & Compliment Others: ఇతరులలో ఉన్న ప్రతిభను గాని, వారు చేసిన మంచిపనిని గాని వెంటనే గుర్తించి మెచ్చుకున్నట్లయితే వారిలో మనం మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పరచినవారవుతాం. ఇతరుల విజయం గాని, వారు సాధించిన మెచ్చుకోతగ్గ విషయాలు గాని తెలిసికూడా చాలామంది మౌనంగా ఉంటారు. భగవంతుడు కూడా స్తోత్రపియుడు. మంచిని గుర్తించి ప్రసంశించేందుకు మంచి మనసు అవసరం. మంచి మానవ సంబంధాల సాధనకు ప్రశంస మంచి సాధనం. అయితే అది నిజాయితీ తో కూడినదై ఉండాలి.
3.Keep an Open Mind: ఇతరులపట్ల మంచి అభిప్రాయం కలిగియుండి వారు చెప్పేది మనస్పూర్తిగా వినడమే కాకుండా స్పందిస్తూ ఉండటం వలన ఇతరులు మనపై మంచి అభిప్రాయం ఏర్పరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. సంకుచిత భావాల వలన, స్వార్ద పూరిత అభిప్రాయాల వలన తాత్కాలికంగా లాభం ఉంటుందేమో గాని శాశ్వతంగా చాలా ఇబ్బంది పడకతప్పదని గ్రహించాలి.
4. Forgive & Forget: To err is human, to forgive is divine అని పోప్ జాన్ పాల్ అన్నట్టు గా ఒకవేళ ఇతరుల వలన ఏదైనా తప్పిదం జరిగినట్టైతే సాధ్యమైనంత త్వరగా మన్నించగలిగితే మన ఆరోగ్యం బాగుంటుంది. గతాన్ని తవ్వుకుంటూ విలపించడం వలన ఒరిగేదేమీ ఉండదు సరికదా మన సమయమే కాదు ఆరోగ్యం కూడా నష్టపోయే అవకాశం ఎక్కువ. జరిగిన తప్పులు మరచిపోవాలి గాని తప్పు చేసిన వాడిని గుర్తుంచుకోమని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటారు. మరలా వారికి అలంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడమని ఆయన ఉద్దేశ్యం.
5. Keep Your Promise.: ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించాలి. నిలబెట్టుకోలేని మాటలు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. ఆడిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టే రాముడు దేవుడు కాగలిగాడు. ఆడి తప్పడంవలన మన విశ్వసనీయత తగ్గే అవకాశం ఉంటుంది. సానుకూలంగా ఆలోచించేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.
6.Be Trustworthy: ఇతరులు మనల్ని నమ్మేది మన విశ్వసనీయత వలనే. ఒక అబ్బాయి జామకాయ కోయాలని చెట్టు ఎక్కాడట. అలా పైకి ఎక్కిన తర్వాత క్రిందికి చూస్తే భయం వేసి తెగ ఏడవడం మొదలుపెట్తాడట ఎలా దిగాలో తెలియక. చాలా మంది వచ్చి క్రింద వల లాంటింది ఏర్పాటు చేసి గెంతమని చెప్పారట. ఎవరెంతగ చెప్పినా ఆ అబ్బాయి వినకుండా ఏడుపు కొనసాగించాడట. ఈ లోగా విషయం తెలుసుకున్న వాడి తండ్రి ఆఫీస్ నుండి వచ్చి రెండు చేతులు చాపి గెంతమని ఆడిగిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గెంతేసాడట. ఇంతమంది ఎంత బ్రతిమలాడినా గెంతని అబ్బాయి వాడి నాన్నా గెంతమని అడిగేసరికి వెంటనే ఎందుకు గెంతాడు. వాడి తండ్రి పట్ల వాడికున్న విశ్వసనీయత. అదే విధంగా మన పట్ల ఇతరులకు మన ప్రవర్తన వలన, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వలన కలుగుతుంది.
7.Speak What is Good: ఏ విషయం పడితే ఆ విషయం మాట్లాడకుండా మనం మాట్లాడకుండా మూడు విషయాలు గుర్తుంచుకొని మాట్లాడాలి. మనం మాట్లాడేది నిజమేనా? ఎవరికైనా నష్టం కలిగిస్తుందా ? మాట్లాడవలసిన అవసరం ఉందా అని తెలుసుకొని మాట్లాడాలి.మన మనసును, ఇతరులమనసును శాంతబరిచే మాటలే మాట్లాడాలని తులసీదాస్ చెప్పాడు.
8. Accept all the Changes: మార్పు అనేది ప్రక్రుతిలో అతి సహజమైన విషయం. ఎందుకిలా జరిగింది అని వగచేకన్నా మార్పుకు తగ్గట్టుగా మారి, మార్పును మనస్పూర్తిగా ఆహ్వానించడం మన భాధ్యత. సానుకూలంగా ఆలోచించేవారు అన్ని పరిస్థితులకు మారడానికి సిద్ధంగా ఉంటారు.
9. Respond to Stimulus: చర్యకు ప్రతిచర్య నేటి మానవ సమాజంలో సమాధానం కాదు. ఇతరుల ప్రవర్తనగాని, ఏదైనా విషయాలకు గాని ఏ మాత్రం ఆలోచించకుండా ప్రతిచర్యకు సిధ్ధపడకుండా వీలైనంత సమయం ఆలోచించి సరియైన ప్రతిస్పందనని ఎంచుకొని వాటి పర్యవసానాలను ఆలోచించి ప్రతిస్పందించాలి. లేనియెడల తీవ్రంగా పశ్చాతాప పడాల్సి ఉంటుంది.
10. Look for Fun: చుట్టు ఉన్న వారితో హాస్యస్పూరకంగా సంభాషిస్తూ జరుగుతున్నా విషయాలను ప్రశాంతంగా, తేలికగా తీసుకోవడం వలన మన మానసిక సమతౌల్యం ఇతరులకు తెలిసి మనతో వారు సరిగా ప్రవర్తించేందుకు మన పట్ల సానుకూల వైఖరి కలిగి యుండేందుకు అవకాశం ఉంటుంది.
పై విషయాలన్ని మనకు తెలిసినవే అయినప్పటికీ ఆచరణలో మనం చాలా సార్లు విస్మరించే అవకాశం ఉంటుంది . విష్ యు ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయకుమార్
trainerudaykumar@gmail.com

Monday, 27 June 2011

The Negative People at Work Place


The Negative People at Work Place:
మనం పనిచేసే వాతావరణం లో అనేక మనస్తత్వాలున్న అనేకమంది పనిచేస్తుంటారు.  పైకి అంతా  నవ్వుతూ ఆనందంగా కనబడుతుంటారు కాని అంతర్గతంగా రకరకాలుగా ఉంటారు.  అందులో సానుకూల దృక్పథం ఉన్నవారితో కలిసి పనిచేయడం ఎంత ఆనందమో  వ్యతిరేఖ దృక్పథం ఉన్న వాళ్ళతో సర్దుకు పోవడం అంట సులభం కాదు. వీరందరితో సర్దుకుపోతూ పనిచేయడం అంత సుళువైన విషయం కాదు. ముందుగ విభిన్న రకాలవ్యతిరేఖ దృక్పథం ఉన్న  మనుష్యులను ముందుగా అర్ధం చేసుకుందాం. 
1. COMPLAINERS( ఫిర్యాదిగాళ్ళు) : వీరు తరుచూ అన్ని విషయాల పట్ల, అందరివ్యక్తుల తీవ్ర అసంతృప్తి తో  ఉండి వారిలోని లోపాలను నిత్యం కనబడే ప్రతీవారికి ఫిర్యాదు చేస్తుంటారు. కోడిగుడ్డు పై వెంట్రుకులుతీసే పనిలో నిత్యం ఆనంద పడుతుంటారు.
2, BACKSTABBERS (వెన్నుపోటుగాళ్ళు) : వీరు మన ఎదుట చాలా మంచిగా నటిస్తూ ఉంటారు కాని సమయం చూసి మన అంచనాకు ఏ మాత్రం అందకుండా దొంగదెబ్బ తీస్తారు. వీరి వినమ్రత, నక్క వినయాలు చూసి వీరిపై పూర్తిగా ఆధారపడ్డామా అడ్డంగా దొరికిపోతాం.
3. CONTROLLERS: (రిమోట్ గాళ్ళు): మన స్వంత విషయాల్లో గాని ఇతర విషయాల్లో గాని అధికంగా జోక్యం చేసుకుంటూ మనపై ఆధిక్యం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ తమ నియంత్రణలో ఉండాలనే భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు.
4. CLAMS : ( దాగుడుమూతగాళ్ళు); వీరు ప్రతీ పని చాలా రహస్యంగా చేస్తుంటారు. తమ విషయలు ఎవరితో పంచుకోవడం గాని నలుగురికి చెప్పడం గాని ఎప్పుడు చేయరు. ఆఖరికి వాళ్ళ అబ్బాయి పెళ్ళి నిర్ణయించబడిన విషయం పక్కింటివారికి కార్డు ఇచ్చినంతవరకు కూడా తెలియనీయరు.
5. SLUFFERS: (పనిదొంగలు): వీరు ఏ మాత్రం అనుకున్న సమయనికి లేదా వస్తామన్న సమయానికి ఎప్పుడూ రారు. పని చేయాల్సివస్తే ఇలా కనబడి అలా మాయమైపోతారు. పనిపూర్తయ్యాక తప్పనిసరిగా   కనబడతారు. వీరిని నమ్ముకొని ఏ పని మొదలెట్టినా పనంతా మనం చేసుకోవలసి వస్తుంది లేదా అనుకున్న ప ని  వీరి మూలంగా వాయిదా పడే పరిస్థితి తలెత్తుతుంది.
6. GOSSIPERS :( పుకారుగాళ్ళు) ; వీరికి లేనిపోని, పనికిమాలిన అనవసర కబుర్లతో కాలక్షేపం చేయడమంటే  వీరికి చాలా  ఇష్టం . నిత్యం ఎవరిగురించో గాలికబుర్లు ప్రచారం చేస్తుంటారు. ఎవరినైనా ఎత్తెయ్యాలన్నా, ముంచెయ్యాలన్నా వీరికి క్షణంలో పని.
7. WALKING WOUNDED : ( క్షతగాత్రులు) : జీవితంలో అనేక విషయాల్లో ఎదురుదెబ్బలు తినడం వలన ప్రపంచం లోని సమస్యలన్నీ వీరికే ఉన్నట్టు తలవేలాడేసుకుంటూ పనిచేస్తుంటారు. తాము ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ ఒక్కరే పనిభారం తమపై వేసుకొని ఒకరితో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు.
8. NEGATIVES: ( రంధ్రాన్వేషణగాళ్ళు) ;  వీరు ప్రతీ విషయంలో నెగటివ్ ఏముందో దానిని వెతకడానికి ప్రయత్నిస్తుంటారు. నిరాశవాదంతో తెగ నలిగిపోతూ ఎవడూ సుఖంగా లేకుండా అందరిలో గాలి తీస్తుంటారు.
9. BROWN NOSERS; (చంచాగాళ్ళు) ;ఎలాంటివారినైనా భట్రాజు పొగడ్తలతో తెగ పొగిడి తమ పని కాకా పట్టి చేయించుకుంటుంటారు. తమ పనిపూర్తయినంతవరకు తెగ పాలిష్ చేస్తుంటారు.
10. SNIPPERS; ( దొంగదెబ్బగాళ్ళు ); పైకి మంచిగా కనబడినా చాటుగా గోతులు తెగ తీస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ దొరకరు. అకస్మాత్తుగా దాడిచేయడం లో సిద్ధ హస్తులు.
11.WHINERS ( ఏడుపుగొట్టు గాళ్ళు) : ఎప్పుడు ఇతరుల ఉన్నతిని , విజయాలను చూసి ఏడిచేవాళ్ళు. అందరూ బాగున్నారు కాని తాము మాత్రమె ఎదగాలేకపోతున్నాం అంటూ తెగ బాధపడుతుంటారు.  ఎపుడు ఇతరుల పై అసూయ తొ ఉంటూ ఉండేవాళ్ళు . 
12. EXPLODERS (పటాష్ గాళ్ళు); వీరికి వ్యతిరేకంగా ఏమి జరిగినా  వీరు అనుకున్నట్టు వీరికి ఏ మాత్రం అనుకూలంగా జరగకపోయినా పటాష్ లా ఫట్ మని బద్దలై బీభత్సం   సృష్టిస్తారు. వీరితో పెట్టుకోవడం చాలా ప్రమాదం అని అందరూ అనుకునేలా నోరు వేసుకొని మీద పడుతుంటారు. . 
13. PATRONIZERS; (వకల్తా గాల్లు);  వీరు ఎప్పుడు తమ గురించి కాకుండా ఇతరుల గురించి వకల్తా తీసుకొని మాట్లాడుతుంటారు. వారికి సంబంధం  లేకపోయినా ఇతరులగురించి వీరు తెగ ఫీలైపోతుంటారు. 
పై మనస్తత్వంతో ఉన్నవారు మీతో పనిచేసేవారు గుర్తుకువస్తున్నారా ? వీరిని ఎలా  సంస్కరించాలనే ఆలోచనలొద్దు. వీరినుండి మనం మనల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. దారిలో ముళ్ళుంటే అవన్నీ ఏరుకొని కూర్చుంటామా, కాళ్ళకు మంచి చెప్పులు వేసుకుంటే సరిపోలా?
విష్ యూ ఆల్ ది బెస్ట్
అలజంగి ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com

Thursday, 28 April 2011

Role of Parents in educating their Children


"Parents who know their children's
teachers and help with the homework
and teach their kids right from wrong --
these parents can make all the difference."  --  U.S. Ex  President Bill Clinton

    ఈ రోజుల్లో  చాలా మంది పిల్లల్ని తరుచూ ఒక్ స్కూలు నుండి మరొక స్కూలు మార్చడమే కాకుండా ఇంచుమించు ఏ స్కూలు పట్ల సరియైన సంత్రుప్తి కలిగి ఉండటం లేదు.  స్కూలు ని లేదా ఉపాధ్యాయుల్ని నిందించే ముందు అసలు తల్లిదండ్రులుగా మన భాధ్యతలను  ఎంత వరకు నెరవెరుస్తున్నామో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.    అమెరికన్ మాజీ  అధ్యక్షుడు తల్లిదండ్రుల భాధ్యత గురించి చాలా వివరంగా చెప్పాడు  ఏ తల్లిదండ్రులైతే వారి పిల్లల టీచర్లను తెలుసుకొని యుండి, పిల్లల హోమ్ వర్క్ లో సహయం చేస్తూ వరికి మంచి చెడ్డల గురించి బోధిస్తూ ఉంటారో వారు పిల్లల్లో చాలా మార్పు తేగలుగుతారని.
     ప్రతీ తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల తీసుకోవలసిన  జాగ్రత్తలు గురించి  తెలుసుకొందాం.
*  పిల్లలు చదువుతున్నప్పుడు  మీరు కూడా మీకు నచ్చిన నవలకాని, మ్యాగ్ జైన్  గాని లేదా న్యూస్ పేపర్ గాని తీసి చదవండి. వారు చదవడానికి ఆహ్లదకరమైన పరిస్థితులు ఉండేటట్టుగా చూడండి.  ఆ సమయంలో మీరు  టీ.వీ చూడటం లేదా ఇతర అంశాలు చర్చించడం వలన వారి  ఏకాగ్రతను మనమే పాడు చేస్తుంటామని గ్రహించండి.
* పిల్లలు  టీవీ చూసే సమయం నియంత్రించండి. పిల్లలు టీ వీ చూడకుండా నియంత్రించడం ప్రతీ తల్లిదండ్రులకు కత్తి మీద సామే.  ఏ కార్యక్రమాలు చూడాలి?  ఎంత సేపు చూడాలి?  వారితో చర్చించి ఒక సమయం కేటాయించుకునేటట్టుగా ఒప్పందానికి రండి.  కొన్ని కార్యక్రమాలు వారితో కలిసి చూడటం చేయాలి.  పూర్తిగా కేబుల్ కనెక్షన్ తీసివేయడం అర్థరాహిత్యం.
*హోమ్ వర్క్ ఏ సమయంలో చేయాలో సమయాన్ని ముందుగా నిర్దేశించుకోండి.  వారి  స్కూల్ డైరీ తీసి  ఏ అంశాలు  హోమ్ వర్క్ గా ఇచ్చారో  చూడటం ప్రతీ తల్లి లేదా తండ్రి కనీస భాధ్యత  దానికి పావుగంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. మనం బిజీ అని లేదా ఈకాలం చదువులు నాకు అవగాహన లేదని తప్పించుకోడానికి ప్రయత్నిస్తాం. ప్రతీ రోజు స్కూల్ డైరీ చూడటం వలన్ స్కూల్ లో ఏం జరుగుతుందో తెలియడమే కాకుండా వారి ఉపాధ్యాయులతో నిర్మాణాత్మకం గా చర్చించడానికి అవకాశం ఉంటుంది.
*పిల్లలతో ఎక్కువ  సమయం గడపండి. వారి సమ వయస్కులతో వారు ఎదుర్కోనే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో చర్చీచాలి.  తక్కువ  మాట్లాడుతూ ఎక్కువ వినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వారి స్నేహితులెవరో వారు ఎవరితో పోటీ పడుతున్నారో మనకు తెలిసి ఉండాలి.
* మీరు పిల్లల్నుండి ఏమీ ఆశిస్తున్నారో వారికి చెబుతూ ఉండండి.    బ్రయాన్  ట్రైసీ అనే రచయిత  లా  ఆఫ్  ఎక్స్ పెక్టేషన్స్  అని  మన అంచనాలుకు తగ్గట్టుగా పిల్లలు నిలవడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారని చెబుతాడు.   అయితే ఆ అంచనాలు  ఆచరణ  సాధ్యమైనవిగా చూడండి. లేకపోతే వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే  ప్రమాదం ఉంది.

* స్కూలు ని తరచూ సందర్శించండిః    మన పిల్లలు చదువుతున్న స్కూల్ కి  తరుచూ  వెళ్తూ వారు ఏ సమయం మనకి కేటాయించారో ఆ సమయంలో  ఉపాధ్యాయులతో  పిల్లల గురించి చర్చించాలి. స్కూల్ ప్రమణాలలో తేడా లేదా లోపాలు ఉంటే  ప్రిన్సిపాల్  ధృష్టికి తీసుకురావాలి.
అంతే తప్ప ఎవరో చెప్పిన మాటల బట్టి లేదా పేపర్లలో ప్రకటనల బట్టి  అంచనా వేయవద్దు.
* స్కూల్ యాజమాన్యంతో  సహకరించండి.   ఫీజులు సకాలంలో చెల్లించడం  ఒకవేళ ఏదైనా కారణం చేత ఆలస్యమైతే ముందుగా స్కూల్ వారికి చెప్పి అనుమతి తీసుకోవడం తల్లిదండ్రులుగా మన విధి. స్కూల్ ఫీజు గురించి  మన పిల్లల్ని వారు  అందరిలో అడగటం, నోటీస్ బోర్డులో పేర్లు  ఉంచడం పిల్లల మానసిక స్థాయి మీద చాలా ప్రభావం చూపుతొందని మరువ వద్దు. మేము అలా కాదండి అని బాధ పడాల్సిన పనేమీ లేదు ఏ కార్పోరేట్ స్కూల్ అయినా అతి సాధారణ స్కూల్ అయినా ఎదుర్కొంటున్న అతి సాధారణ్ సమస్య ఫీజులు వసూలు కాకపోవడం.
          మన పిల్లల చదువు  భాధ్యత కేవలం ఒక్క స్కూల్ ది మాత్రమే కాదు.  ఇది ఉమ్మడి భాధ్యత. పువ్వు పుట్ట గానే పరిమళిస్తుంది.  ఏకలవ్యుడికి ఎవరు నేర్పారనే  మెట్ట వేదాంతం మాని మన ప్రయత్నం మనం మొదలు పెడదాం.

  థాంక్యూ వెరీ మచ్.  ఆల్ ది బెస్ట్.
అలజంగి  ఉదయ్ కుమార్
trainerudaykumar@gmail.com