Tuesday, 4 May 2021

పతనం అవుతున్న కుటుంబ బాంధవ్యాలకు పరాకాష్ట ‘’ జోజి’’ సినిమా పతనం అవుతున్న కుటుంబ బాంధవ్యాలకు పరాకాష్ట ‘’ జోజి’’  సినిమా

 

అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ చూసి చాలా ఆనందంగా ఉన్నారా? ఒకవేళ మీకు అమెజాన్ ప్రైమ్   మీ స్మార్ట్ టీవి లో ఉంటె ఒక మంచి మళయాళ సినిమా చూడండి...   మహేషింటే ప్రతీకారం ( ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తెలుగు రీ మేక్), బెంగళూర్ డేస్, తొండి మాథులం ద్రిక్సక్సీయం, అయోబింటే పుస్తకీయం,  కుమ్బలంగి నైట్స్, సి యు సూన్, ఎంజన్ ప్రకాశన్, 22 ఫిమేల్ కొట్టాయం  మొదలగు  అద్భుతమైన సినిమాలతో  కేవలం కేరళలోనే కాక దేశమంతటా మంచి నటుడిగా తండ్రికి తగ్గ నిజమైన సినీ వారసుడిగా పేరుగాంచిన ఫాహాద్ ఫాజిల్  గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.

కరోనా సమయంలో కూడా తక్కువ కాలంలో మంచి సినిమాటిక్ విలువలతో ఆలోచించతగ్గ కథనం అమెజాన్ ప్రైం లో మనకు ఫాహాద్ ఫాజిల్ నటించిన జోజి అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందుతుంది.  షేక్ స్పియర్ రాసిన మెక్ బెత్  ఈ సినిమాకి మాతృక అని కొందరు అభిప్రాయపడిన వాస్తవానికి ఈ సినిమా  మెక్ బెత్  కథనానికి చాలా దూరంగా ఉంటుంది.

మారుతున్న కుటుంబ పరిస్థితులు, కుటుంబంలోని సంబంధ బాంధవ్యాలు. పిల్లలను ప్రయోజకులుగా ఎన్ని ఏళ్ళు వచ్చినా  స్వతంత్రత ఇవ్వకుండా  తనమీద ఆధారపడే వారిగా పెంచితే,  ఏదో ఒక కారణంగా వారు వెనుకబడినా, వైఫల్యం చెందినా వారికి చేయూత ఇచ్చి, అర్థం చేసుకొని జీవితంలో స్థిర పడేందుకు సహాయపడకుండా  వారిని ఎగతాళి చేస్తూ, పనికిరాని వారిగా ముద్ర వేసి  అవమానపరిస్తే  అది చివరికి ఆ కుటుంబం ఎలా ఇబ్బందులు పడుతుందో ఈ సినిమాలో చక్కటి కథనం తో చూపించాడు దర్శకుడు దిలీష్ పోతాన్.

క్లుప్తంగా కథ ఏమిటంటే:   పితృస్వామిక, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రతీకగా కేరళలో కొట్టయ్యన్ ప్రాంతంలో అత్యంత ధనికుడైన  రబ్బరు తోటల యజమాని కుట్టప్పన్ అతని ముగ్గురు కొడుకులు, ఒక కోడలు, ఒక మనవడు ఈ సినిమాలో ప్రధానంగా కనబడే పాత్రలు.  వయస్సు  మీద పడినప్పటికీ,   ఆర్ధిక వ్యవహారాలన్నీ తానే చూసుకుంటూ, పిల్లలను  స్వతంత్రులుగా కాకుండా తన మీద ఆధారపడే వారు గా చూస్తుంటాడు. పెద్ద కొడుకు జోమన్  త్రాగుడు కు అలవాటు పడి, భార్య నుండి విడి పోయి ఉంటాడు. రెండవ కొడుకు జైసన్, అతని భార్య బిన్సీ  స్వంత ఆలోచనలు అమలు చేయడానికి ప్రయత్నించిన  తండ్రి నుండి ఆర్ధిక సహాయం లేక అసంతృప్తితో ఉంటారు.

 ఈ సినిమాకి ప్రధాన పాత్ర మూడవ కొడుకైన జోజి  ( ఫాహాద్ ఫాజిల్)  చదువు కొనసాగించలేక ఇంట్లో తండ్రి చేత పనికిమాలినవాడిగా ముద్ర వేయబడి, చిన్న చిన్న విషయాలకి తండ్రి ఆర్ధిక సహాయం చేయకపోవడం వలన తీవ్ర మానసిక వ్యథ తో, ఉద్వేగభరితంగా ఉంటాడు.  మనవడైన (రెండవ కొడుకు కుమారుడు) పాపీ   లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ క్లాసులు వింటూ తాతకి తెలియకుండానే అతను స్నానానికి వెళ్ళినప్పుడు  అతని మొబైల్ ద్వారా ఆన్ లైన్ లో పెల్లేట్ గన్ ఆన్ లైన్ ద్వారా కొంటాడు.  ఈ గన్ కూడా చివరిలో కీలక పాత్ర వహిస్తుంది.

కుటుంబ యజమానియైన కుట్టప్పన్ వయసు మీద పడినా రోజువారీ వ్యాయామం చేస్తూ, అన్ని పనులు తానే చేయగలననే ధీమా తో ఉండి, వ్యవసాయ బావిలో మోటార్ మరమ్మత్తు చేస్తున్నప్పడు తన మితిమీరిన స్వభావం వలన గుండె పోటు తెచ్చుకొని ఆసుపత్రి పాలవుతాడు. తండ్రి జబ్బు పడ్డాడు అనేదానికన్నా ఆర్ధిక స్వేచ్చ వస్తుందనే ఆనందంలో ఉంటారు పిల్లలు. వీలునామా రాసాడా అని ఆరాలు తీస్తుంటారు. 

ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చినా మంచం మీదే ఉంటాడు.  తండ్రి చావు కోసం ఎదురుచూస్తున్న కొడుకులు తమలో తామే అసంతృప్తితో ఉంటారు. తండ్రి చేత అవమానాలకు గురైన మూడవ కొడుకు జోజి తండ్రి చావుకు పథకం వేస్తాడు. ఈ విషయం కనిపెట్టిన రెండవ అన్న భార్య వదిన  బిన్సీ అడ్డు చెప్పదు. ఈ కుట్ర బయటపడి పోతుందనే భయంలో పెద్ద అన్నని పెల్లేట్ గన్ తో హతమార్చి, ఆ నిందని పనివాడి మీద వేస్తాడు. తనపై అనుమానపడుతున్న రెండవ అన్నని ప్రలోభ పెడతాడు. చివరికి  తన కుట్ర బయటపడి పోలీసులు ఇంటికిరావడంతో  ఈ సమాజమే తన పతనానికి కారణం అంటూ తన జీవితాన్ని ముగుస్తాడు జోజి.

కథ ని ఎంత క్లుప్తంగా చెప్పినా  ఇందులో ఫాహాద్ ఫజల్  నటన, దర్శకుడు దిలీస్ పోతన్  ప్రతిభ, కథా రచయిత శ్యాం పుష్కరన్ కథనం సినిమాకి ప్రాణం పోశాయి. కాకపొతే సినిమా కొంచెం నిదానంగా నడుస్తుంది. మంచి సినిమా చూసామనే సంతృప్తి తప్పక కలిగిస్తుంది. 

                                                        ...అలజంగి ఉదయకుమార్

No comments:

Post a comment