Monday, 12 January 2015

నాయకుడిగా ఎదగాలంటే ..................


నాయకుడిగా ఎదగాలంటే...........        

  నలుగురిలో గుర్తించబడాలని , నలుగురిలో గౌరవించబడాలని ,  నలుగురి ముందూ నడవాలని , ముందుండి  నలుగురినీ నడిపించాలని, సత్కారాలు, సన్మానాలు అందుకోవాలని  ప్రతి  మనిషి కి  అతి సహజంగా ఉంటుంది.  ఎవ్వరూ దీనికి అతీతం కాదు.   అదృష్టవశాత్తూ  కొంత మందికి ఆ అవకాశం వస్తుంది,  తమ తమ వ్యక్తిత్వాల వలన , సంస్కారం వలన, ఆదర్శాల వలన, అనుచరుల వలన దానిని  సద్వినియోగ పరుచుకుంటారు.  మరికొంత మంది పాటించాల్సిన కనీస ప్రమాణాలను,  ప్రాథమిక అంశాలను విస్మరించడం వలన  గొప్ప నాయకులుగా  ఎదగలేక కనుమరుగవుతుంటారు.....
       స్వామి వివేకానంద  జన్మదినోత్సవ సందర్భంగా  నాయకుడిగా ఎదగాలంటే పాటించాల్సిన కనీస ప్రమాణాల  గురించి  నాయకత్వ లక్షణాల గురించి  చర్చిద్దాం,,,,,,,

1.  విషయ పరిజ్ఞానం పై సంపూర్ణ అవగాహన మరియు  సమర్థత:  నాయకుడిగా తాను  ఏ  రంగంలో ఉన్నామో ఆ రంగానికి సంబందించిన   అన్ని అంశాల పైన ప్రాథమిక పరిజ్ఞానం,  మొత్తం వ్యవస్థ మీద  సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి.   కేవలం అనుచరుల మీద ఆధారపడి వారు రాసిన లేదా అందించిన  సమాచారం పై  గుడ్డిగా ఆధారపడకుండా తనకంటూ  స్వంత అవగాహన ఉండాలి. ఉదాహరణకు రాజకీయ రంగంలో నాయకుడిగా ఉండాలంటే   రాజ్యాంగం గురించి, వివిధ రకాల  రాజ్యాంగ సిద్ధాంతాల గురించి  వివిధ దేశాలలో ఉన్న  ప్రభుత్వ రీతుల గురించి,   ప్రభుత్వ పనితీరు గురించి,  వివిధ శాఖల గురించి, వాటి బాధ్యతల గురించి   ఎప్పటికప్పుడు  తెలుసుకుంటూ అప్ టు డేట్ గా  ఉండాలి .. . అదే ఒక సంస్థ లో  నాయకత్వం  వహిస్తుంటే సంస్థ లో గల వివిధ విభాగాల గురించి , మార్కెట్ గురించి, పోటీ దారులు అనుసరిస్తున్న వివిద విధానాల గురించి రాబోయే మార్పుల గురించి  తెలుసుకుంటూ ఉండాలి.
2.   స్వంత బలాలను పూర్తిగా నమ్మాలి, బలహీనతలను తెలుసుకోవాలి:    నాయకుడి గా ఎదగాలనుకునే వాడు చేయాల్సిన మొదటి పని తన యొక్క బలాల గురించి బలహీనతల గురించి తెలుసుకోవాలి.   నాయకుడిగా తాను  తయారయ్యేందుకు తనకున్న బలం ఏమిటి?  వారసత్వంగా తల్లి దండ్రుల లేదా తాత ముత్తాల వారసత్వం వస్తే ..ఏ  కారణాల వలన  తాతలు గాని తండ్రులు గాని ప్రజలలో పలుకుబడి, ఆదరణ, నమ్మకం సాధించారో తెలుసుకొని ఆ గుణాలను తానూ  పెంపొందింప చేసుకోవాలి..  ప్రజలకు మతి మరుపు చాలా ఎక్కువ ..  కొత్త తరం పాత తరాన్ని చాల వేగంగా మరచిపోతుంది.  తనకంటూ స్వంత ముద్ర వేసుకోకుండా  చెట్టు పేరు కాయలమ్ముకుందామంటే  చివరికి  గన్నేరుకాయలే  మిగులుతాయి.   నాయకుడికి ఉండాల్సిన బలం ప్రజలలో ఆదరణ ,  అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం ,  ధైర్యం,  సహాయం చేయడానికి ముందుండటం, అందరిలో  విశ్వాసాన్ని  నమ్మకాన్ని  అభివృద్ధి చేయడం .  ఈ లక్షణాలను నిరంతరం పదును పెట్టుకోవాలి.  తన బలహీనతలు ఏవో తెలుసుకొని వాటిని బలాలుగా మార్చుకోడానికి నిరంతర సాధన చేయాలి.   ప్రభావపూరితంగా ఉపన్యాసం ఇవ్వడం, వ్యూహరచన  చేయడం  ఇటువంటి వాటిలో  కాస్త వెనుకబడి ఉంటే  వాటిని బలాలుగా మార్చుకోడానికి నిపుణుల సహాయం తో సాధన చేస్తుండాలి.
3. జయాలకు అపజయాలకు స్వంత బాధ్యత తీసుకోవాలి:  నాయకుడనేవాడు సమస్యలు వచ్చినపుడు వాటిని పరిష్కరించేందుకు స్వంత భాద్యత తీసుకోవాలి. సమస్యలు అన్నిటినీ  సానుకూలంగా పరిష్కరించుకోక పోవచ్చు.  అవి ఒక వేల పరిష్కరించబడకపొతే  ఆ బాధ్యతను తాను  తీసుకోవాలి తప్ప  ఇతరుల మీద త్రోయరాదు.  తన ఓటమికి  తమ జట్టు వెనుకబడటానికి  ఎవరో కారణమని  నమ్మితే  ఆ ఓటమినుండి  గుణపాఠాలు  ఎప్పటికీ నేర్చుకోక పోవచ్చును.   ఎప్పుడైతే  బాధ్యత  స్వయంగా తీసుకుంటాడో అనుచరుల  నమ్మకాన్ని గెలుచుకోవడమే కాకుండా  గెలవాలన్న తపన నలుగురిలో పెంచగలుగుతాడు..
4. సమర్థులైన శత్రువుల్ని ఎంచుకోవాలి:  ఉన్నత మైన లక్ష్యము  కలిగిన  నాయకుడు  ఉన్నతమైన  శత్రువుల్ని  పోటీదారుల్ని   ఎంచుకోవాలి.   సాధ్యమనంత వరకు నలుగురినీ కలుపుకొని  ముందుకు వెళ్ళాలి కాని నలుగురినీ కెలుక్కుంటూ  సమయం    వృథా  చేసుకోకూడదు.   ఎవడి బలాల్ని   తక్కువగా అంచనా వేయకూడదు.  అహంకారంతో దగ్గరయ్యే వారిని దూరం చేసుకోకూడదు.  అణు బాంబు తో పెట్టుకున్న పర్వాలేదేమో  కాని ఆత్మా విశ్వాసం ఉన్న వాడితో అసలు పెట్టుకోకూడదు.  బయటకు కనబడే బలంకన్నా  లోపల  ఉన్న అసలు బలాల్ని అంచనా వేయగలగాలి.  ఎటువంటి అంచనా లేనప్పడు  ముందుగా ఘర్షణ  మొదలుపెట్టరాదు. .   బలమైన శత్రువులతో  తాత్కాలికంగా సంధి చేసుకోవడం ఉత్తమం.  చెప్పులో చిన్న రాయి కూడా మన పరుగును ఆపి వేయగలదు.  చిన్నవారితో అనవసర శత్రుత్వం వలన  అందరికీ లోకువయ్యే   పరిస్థితి  ఎదురవడం కాకుండా వారు ఎదుగేందుకు దోహదపడే అవకాశం ఇచ్చినట్టే ..  అత్యంత విశాలమైన  రష్యా అతి చిన్న జపాన్  చేతిలో ఓటమి పాలు అవడం తో  జార్ రాజుల పతనం మొదలయ్యింది.
5. అనుచరులకు ఆదర్శంగా  ఉదాహరణ దాయకంగా ఉండాలి: తన చుట్టూ నిరంతరం ఉండే  అనుచరులను సరియైన వారిని ఎంచుకోవాలి.  భజనపరులకు, చంచా  గాళ్ళకు,  తార్పుడుగాల్లకు ఆ అవకాశం ఇస్తే ఆత్మహత్యా సాదృశ్యం అయ్యే అవకాశం ఉంది.   తాను  చేసే చిన్న చిన్న  తప్పులు కూడా వారికి తెలియకూడదు.   వారికి  లోకువయ్యే  పనులు ఎప్పుడూ చెయ్య కూడదు. చేయాల్సి వచ్చినా  వారికి తెలియకూడదు. తమ నాయకుడి లోపాలు  తమకు తెలిస్తే వారు  అతనిని మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది.
నోటి దురద , తన దగ్గరకు వచ్చిన వారి పట్ల అమర్యాదగా  ప్రవర్తించే వారిని  వెంటనే  తొలగించాలి.   విన్ స్టన్ చర్చిల్  కి అత్యంత ప్రీతిపాత్ర మైన కుక్క  ఒకటి  ఉండేదట.   కాని అది   చర్చిల్  కలవడానికి వచ్చినవారి పైన బడటం  అరవడం చేసేదట.  అది  చర్చిల్ కి తెలియలేదు.    ఒకసారి  చర్చిల్  ఉండగానే  తనను కలవడానికి వచ్చిన వారిని చూసి  ఒకరిపై   బడి అది  మొరిగిందట.    వెంటనే  చర్చిల్  దానిని గన్  తో కాల్చి వేసాడట..   అంత  ఇష్టపడే  కుక్కను కాల్చారా?   అని అడిగితే    అది  వేరే కుక్క  అయితే    కుక్క కరిచింది అని చెప్పుకుంటారు.  నా దగ్గర ఉన్న  కుక్క  నన్ను కలవడానికి వచ్చినవారిని కరిస్తే   చర్చిల్  కుక్క   కరిచింది అని చెబుతారు  అన్నాడట.   దీనిని బట్టి   మర్యాదపూర్వకంగా హుందా గా ప్రవర్తించే   వ్యక్తులనే తన కోటరీ లొ ఉంచుకోవాలి.
6. అనుచరుల్ని మంచి నాయకులు గా తయారుచేయాలి:   "  నీ చుట్టూ ఉన్న వారిని సింహాలు గ  తీర్చుదిద్దు. లేదా వారు తోడేళ్ళు  గా మారి నిన్నే తినేస్తారు  అన్నారు  స్వామి వివేకానంద .  అనుచరుల యొక్క సామర్థ్యాలను  గుర్తించి సముచితంగా  వారు ఎదిగేందుకు అవకాశం కల్పించాలి.  ఎక్కడ  ఎవరు ఎదిగిపోతారో అని నిరంతరం బాధపడేవాడు   భయ పడేవాడు  నిజమైన నాయకుడి గా ఎదగలేడు.  ఎవ్వడు వెళ్ళిపోయినా   అలాంటి వారిని వందమందిని తయారుచేయగలననే  నమ్మకం విశ్వాసం  నాయకుడికి ఆక్సిజన్ లాంటింది.  తన అనుచరుల , సహచరుల అవసరాలను తెలుసుకొని  వారికి ఆసరాగా  భరోసాగా ఉండాలి.  విజయాలలో అనుచరులను అభినందించాలి . పరాజయాలకు స్వయంగా భాద్యత  తీసుకోగలగాలి.  ఎదిగేందుకు అవకాశం  కల్పించే  నాయకుడి కోసం  ప్రాణాలు అర్పించేందుకు   అనుచరులు సిద్ధంగా ఉండగలుగుతారు.   స్పార్తకస్   కోసం  ప్రాణాలివ్వడానికి అనుచరులు సిద్ధపడింది. మరియు    తమ పదవులకు ముప్పు వాటిల్లబోతుందనే   అనుమానంతో సీజర్ ను హతమార్చిన తన అనుచరులు దీనికి  ఉదాహరణగా   చెప్పుకోవచ్చును.
7. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో నిరంతర అప్రమత్తత:  అధికారం ఉంటేనే ఎవరికైనా సేవ చేయడానికైనా  సహాయం చేయడానికైనా  అవకాశం ఉంటుంది.   నేడు నిరంతరం మారుతున్న రాజకీయ వ్యవస్థలో
వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో నాయకుడు   నిరంతరం అప్రమత్తంగా  ఉండాలి.   తరతరాలుకు నిలిచిపోయే  కార్యక్రమాలు చేయాలంటే   అధికారం  నిలుపుకోవడం ,  ప్రజలతో  మమేకం అవ్వడం,   ప్రజల విశ్వాసం  చూడగొనడటం  తప్పని సరి.   సరియైన మేథా  వర్గం తో కూడిన వ్యూహాలుచేసే బృందం  తయారు చేసుకోవాలి.
అల్లాటప్పా   ఆకతాయిలతో  కాలం గడిపేవాడు  కాలగర్భంలో కలుస్తాడు.  వేసే ప్రతి అడుగు వేసేవాడు , పలికే ప్రతి మాట ఆచితూచి  పలికేవాడు కాలాన్ని గెలిచే నాయకుడిగా  నిలుస్తాడు.
                        నాయకత్వం అంటే   రాజకీయ నాయకత్వమే కాదు  ఒక పరిశ్రమ  కావొచ్చు, ఒక కుటుంబం  కావొచ్చు, ఒక ధార్మిక సంస్థ  సంస్థ కావొచ్చు.  లేదా  ఒక సేవా సంస్థ కావొచ్చు.    మదర్  తెరిస్సా  స్థాపించిన   మిషనరీ ఆఫ్ చారిటీ  ఆమె  లేకపోయినా  కొనసాగటం.   ఏ   రాజకీయ పార్టీ  నైతే  స్థాపించిన ఒక మహానుభావుడు  తన అనుచరులతోనే చెప్పులు విసిరేయించుకునే  దశకు  చేరి  సంపూర్ణ మెజార్టీ ఉన్నా అధికారం కోల్పోయి  అర్థాంతరంగా  అవనినే విడిచి పెట్టాల్సిరావడం  వ్యూహాలు  ప్రతి వ్యూహాలు  లేకపోవడం  ముఖ్య కారణం. నాయకత్వం  అనేది నిరంతరం నేర్చుకునే ఒక కల.  ఒక అదృష్తం.  ఒక  వరం.   మనిషి జన్మ  సార్ధకం అయ్యేందుకు ఒక అద్భుత అవకాశం.    
    విష్ యు  ఆల్ డి బెస్ట్.......
   అలజంగి ఉదయకుమార్
trainerudaykumar@gmail.com   

No comments:

Post a Comment