సిరివెన్నెల సీతారామ శాస్త్రి
నేటి తెలుగు చలన చిత్ర సీమ నోచుకున్న నోముల ఫలం.... ఆయన కలం సాగించిన కృషీ ఫలం ఆస్వాదించగలిగిన ఆసక్తి ఉంటే , అవలంబించగలిగిన అనురక్తి ఉంటే ప్రతి ఒక్కరి జీవితం సాఫల్యమయం.. ముకుంద సినిమా కోసం ఆయన గీతాలలో " చేసేదేదో " అనే గీతం నేటి యువతకు కావాల్సిన దశా దిశా నిర్దేశాన్ని చూపించి చైతన్య వంతులుగా తీర్చి దిద్దుతుంది. ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణలో ఉన్న మెలుకువ పాఠాలను ఒక్క పాటలో సూటిగా, స్పష్టంగా చెప్పారు సిరివెన్నెల గారు......
ఈ రోజుల్లో నేటి యువత కు సరియైన గమ్యం లేదు లక్ష్యమ్ లేదు చెడు దారుల్లో వెళ్తుంది.. సమయాన్ని వృథా చేస్తుంది అంటూ వారిని ఎందుకు కొరగాని వారిగా, చేతకాని దద్దమ్మల్లా చూడటం , దూషించటం చాలా మందికి ఒక ఫాషన్ అయింది. అలా అందరిలా సోది కబుర్లు చెప్పకుండా వారికి అర్థమయ్యే రీతిలో, వారికి ఉత్తేజం కలిగించే రీతిలో సిరివెన్నెల గారు తన కలాన్ని సుతిమెత్తగా ఉపయోగించి వారి సామర్థ్యాల్ని వారికి అర్థమయ్యే రీతిలో కర్తవ్యబోధన చేసారు. ఇది ముకుంద సినిమాలో హీరో పాత్ర ని వ్యక్తిత్వాన్ని తెలియచేసేందుకు రాసినా ప్రతి యువకునికి , జీవితాన్ని ఉపయుక్త కరంగా జీవించాలనుకునే ప్రతి వ్యక్తికీ ఒక గీతా బోధనలా ఉంటుంది....
ఇక పాట లోనికి వెళ్తే ....
వాగార్థవ సంప్రక్తౌ వాగార్థ ప్రతిపత్తయే
జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వర:
వాక్కు మరియు దాని యొక్క అర్థం రెండు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్లా విడదీయని బంధాన్ని కలిగి ఉంటాయి. అర్థం లేని వాక్కు అర్థ రహితం .. ఈ భావనతో ఈ పాటను సిరివెన్నెల గారు రాయడం జరిగింది
నేటి యువత ఏమి చేస్తుందో, ఎందుకు చేస్తుందో ఆలోచిస్తే ఇంటర్ నెట్ బ్రౌజింగ్, ఫేస్ బుక్, వాట్స్ ఆప్, హైక్, ట్విట్టర్ , వైబర్, రబ్బర్ బంతి బెట్టింగ్ క్రికెట్ , రోడ్డు మూలన మిత్రులతో చిట్ చాట్ లు.. పనికి మాలిన మరియు ప్రమాద కరమైన బైక్ రేస్ లు అమ్మాయిలతో ఫాలోయింగ్.... ఇలా ఈ లిస్టు కు అంతం ఉండదు. ఇవి చెయ్యొద్దు అని చెప్పడం లేదు అలా అని చెయ్యమని చెప్పడం లేదు. ఇవి నీ జీవితానికి ఎంత వరకు ఉపయోగపడతాయో ఆలోచించుకో మని చెపుతున్నారు...
పక్క పక్కనే అక్షరాలను
నిలిపి ఉంచినా
అర్థం ఉన్న ఓ
పదం కానిదే అర్థం ఉండునా
నీది అయినది నిర్వచనం ఇచ్చుకో
జీవితానికి ఏం చేసినాఅర్థవంతమైన అక్షరాల కలయిక పదం ఎలా అవుతుందో అర్థవంతమైన పనుల కలయికే జీవితం. ఇది నీ జీవితం, నీ జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నావు.. జీవితానికి నీవు ఇచ్చే నిర్వచనం ఏమిటి? ఎవరి జీవితాన్ని గుడ్డి గా అనుకరించకు .. నీ ముద్ర ఉండాలి, నీ స్వంత అర్థం ఉండాలి.. దానికి తగ్గట్టుగా దానికి జత అయ్యేటట్టు గా నీవు చేసే ప్రతి పని ఉండాలి. నీ జీవితానికి నీవు ఇచ్చే నిర్వచనానికి తగ్గట్టుగా ఉన్న పనులే చేయి.. అంతే కాని అందుకు విరుద్ధమైన పనులు చేయకు..........
పల్లవి:
చేసే దేదో చేసే ముందే
ఆలోచిస్తే
తప్పుందా?
తోచిందేదో చేసేస్తుంటే
తొందరపాటే కాదా?
ఆచి తూచి అడుగేయ్యోద్దా
...
నీ లక్ష్యానికి తగ్గట్టుగా నీవు చేసే ప్రతీ పని ఆలోచించి ఎటువంటి తొందరపాటు లేకుండా చెయ్ .. ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా ఏ స్నేహితులు ఎన్ని రకాలుగా ఆకర్షింప చేసినా ఏ వ్యామోహం లో పడకుండా నీవు చేయబోయే పని నీ జీవితానికి ఉపయోగపడుతుందా లేదా అని ఆచి తూచి నీకు నీవే ప్రశ్నించుకొని చెయ్. ఒక్క తొందరపాటు పని వలన జీవితసౌదం కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతీ పని ఆలోచించి చేయడం ఏ మాత్రం తప్పు కాదు. Haste Brings Waste.....
చరణం : 1
ఈతే తెలియాలి నది ఎదురైతే
పూర్తయి తీరాలి కథ మొదలెడితే
గెలుపే పొందాలి తగువు
కి దిగితే
పడినా లేవాలి
ఏ పూటైనా ఏ చోటైనా
విడవని పయనం సాగాలి
రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా
దారేదయినా గాని
కోరే గమ్యం
చూపించాలి
నీవు అన్ని రకాలుగా నిర్ణయించుకొని నీ లక్ష్యాన్ని ఎంచుకోవాలి. నదిలో దిగేముందే ఈత వచ్చో రాదో చూసుకోవాలి. మన బలాలు బలహీనతలు పూర్తిగా అర్థం చేసుకోవాలి.... ఆ లక్ష్యాన్ని పొందే మార్గం లో ఎన్ని ముళ్ళు ఉన్నా, రాళ్ళు ఉన్నా ,ఎలాంటి దారి అయినా పట్టు వదలకుండా , రేయనక, పగలనక నీవు కోరి ఎంచుకున్న గమ్యాన్ని చేర్చే మార్గం లో చివరి వరకు నడవాలి. చాలా మంది విద్యార్థులకు I.A. S. లేదా I.P.S. లేదా సాఫ్ట్ వేర్ లొ లక్షలు సంపాదించే ఉద్యోగం ఇలా చాలా కోరికలుంటాయి. కోరికలు ఉండటం తప్పు కాదు . వాటిని సాధించగల సామర్థ్యం ఉందా లేదా ఒక వేళ లేకపోతె వాటిని ఎలా సంపాదిచాలి. ఇంగ్లీషు లో నాలుగు మాటలు తడబడకుండా మాట్లాడ గలమా? ఉద్యోగాన్ని సంపాదించే నైపుణ్యాలు ఉన్నాయా ? ఒకవేళ లేకపోతే వాటిని విడవకుండా రేయనక పగలనక శ్రమించి సంపాదించగలమా.... అనేక ఇంగ్లీష్ లేదా జాబ్ ఓరియంటెడ్ నైపుణ్యాలు నేర్పించే సంస్థల్లో ప్రవేశం పొందే విద్యార్థులు సగం మందికి పైగా వారం రోజులు తరువాత మరి కనబడరు. జిమ్ లొ జాయిన్ అయిన వారు నెల తరువాత అటువైపు మొహం చూపరు..... ఎన్ని కష్టాలున్నా రాళ్ళు ఉన్నా ముళ్ళు ఉన్నా లక్ష్యసాధనా మార్గం లొ చివరి వరకు సాగమని సిరివెన్నెల గారు ఈ చరణం లో ఉద్బోధించారు.
చరణం : 2
స్పష్టంగా పోల్చుకో
శక్తుందా తేల్చుకో
అతి సుళువుగా అయ్యే
పనా ఏం అనుకున్నా ,,ఓహో..
కష్టాలే ఓర్చుకో ఇష్టంగా
మార్చుకో
అడుగడుగునా ఏ మలుపెలా
పడగొడుతున్నా..ఓహో ..
కలలకి కళ్ళకి మధ్యన కనురెప్పే అడ్డని
నమ్మకం నిజమయ్యే
లోపుగా
తప్పని నొప్పి ఉండని
ఆకలే వేటగా మార్చటం కాలం
అలవాటని
గమనించే తెలివుంటే
ప్రళయాన్ని ప్రణయం అనవా
ఈ చరణం వచ్చే సరికి లక్ష్యసాధన లో ఉండే కష్టాలని వాటిని ఎలా ఓర్చుకోవచ్చో వివరించారు.....
నీ లక్ష్యమ్ ఏర్పరుచుకున్నావు బాగానే ఉంది. దానిని సాధించగల శక్తులు నీకున్నాయా? ఇంతకు ముందు ఆ లక్ష్యాన్ని సాధించిన వారి శక్తులతో నీ శక్తులను ఒకసారి పోల్చుకో. స్పష్టంగా నీ లక్ష్యమ్ నీకుందో లేదో మరొకసారి చూసుకో .. ఎందుకంటే ఇది అతి సులువుగా అనుకునే పని కాదు... కలలు వేరు, కళ్ళ ముందు ఉన్న వాస్తవాలు వేరు. వాస్తవాలు అనేక కష్టాలతో కూడి ఉంటాయి అయితే వాటిని ఇష్టంగా మార్చుకున్నావా ఏ మాత్రం కష్టం కలిగించవు. గెలుపు అందినట్టే అంది ప్రతి మలుపులో ఒక దెబ్బ కొట్టి పడగొడుతుంది.. తప్పించుకోలేని అనేక నొప్పుల్ని, బాధల్ని తెచ్చిపడుతుంది. సచిన్ టెండూల్కర్ సాధించిన విజయాలు ఊరికే రాలేదు నిద్రాహారాలు మాని , అవమానాలు అపజయాలు తట్టుకొని సాగించిన శ్రమ వలన వచ్చాయి. You Must Be Hungry అంటాడు Les Brown.. ఎప్పుడైతే విజయం పట్ల ఆకలి పుడుతుందో అది వేటాడే పులిలా నిన్ను తయారు చేస్తుంది. అది తెలుసుకొని గుర్తించి తెలివి నీకుంటే ప్రళయాల్ని కూడా ప్రేమించగలగుతావు. పనిని లక్ష్యాన్ని ప్రేమించేవాడికి విజయం బానిసగా నిలుస్తుంది.
చరణం: 3
శ్రీ రాముని బాణమై
సాధించిన శౌర్యమే
చేధించదా నీ లక్ష్యము
యముడు ఎదురైనా
కృష్ణుని సారధ్యమే
సాగిన సామర్ధ్యమే
సాధించదా ఘన విజయం
ప్రతి సమరాన ..ఓహో..
కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి
గాలిలో కత్తులే దుయ్యకు
శతృవు లేనిదానికి
ఊహతో నిచ్చెనే వెయ్యకు అందని గగనానికి
వ్యర్థంగా వదిలేస్తే
వందేళ్ళు ఎందుకు మనకి
ఈ చరణం లో విజయ సాధన లక్ష్య సాధనలో సాగించాల్సిన వ్యూహాల గురించి, చెంత ఉండాల్సిన ఆయుధాల గురించి, చేపట్టాల్సిన విధానాల గురించి యువతకు అవగాహన కలిగిస్తున్నారు సిరివెన్నెల గారు... లక్ష్యసాధన ప్రాణం కోల్పోయేనంత ప్రమాదం ఎదురైనా గురి తప్పని రామబాణం లాంటి శౌర్యం కలిగి ఉండాలి. అన్ని అనర్థాలకు మూల కారణం పిరికితనమే. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ ఒదులుకోవద్దురా ఓరిమి అన్నట్టు రామబాణం లాంటి గురి కలిగిన ధైర్యాన్ని ఆయుధం గా కలిగి ఉండాలంటారు ... కురుక్షేత్ర యుద్ధం లొ శ్రీకృష్ణుడు ఎలా వ్యూహ రచన చేసాడో ఎలాంటి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాడో అలాంటి నాయకత్వ సామర్థ్యాన్ని కలిగి ఉండాలంటారు. సమర్థవంత సామర్థ్యం ఉంటే ఎలాంటి సమరం లోనైనా ఘన విజయం సాధించగలరు. కాలక్షేపమ్ కోసం ఊసుపోని కబుర్ల కోసం స్నేహం చేయకు. పనికి మాలిన అడ్డగాడిదలతో తిరిగే బదులు లైబ్రరీ కెళ్ళి మంచి పుస్తకాలు చదువుకో .. కనబడే ప్రతీ వీధి కుక్క తో దొమ్మీ లకు దిగకు. కయ్యానికైనా నెయ్యానికైనా సరి జోడు కాదు ..... సరియైన కారణం ఉండాలి. .... చేతిలో ఆయుదం ఉంది కదా... అని మెదడులో తెలివి ఉంది కదా అని లేని శతృవులను సృష్టించుకొని యుద్ధాలు చెయ్యకు. ఊహలలో గాల్లో మేడలు మిద్దెలు కట్టకుండా వాస్తవిక దృక్పధాన్ని కలిగి ఉండు. కాకిలా కలకాలం బ్రతకాల్సినవసరం లేదు. ఎవరికీ చివరికి నీకు నీవు కూడా ఉపయోగపడకుండా వందేళ్ళు బ్రతకడం వలన ఉపయోగం ఉందా... భగత్ సింగ్ ఎన్నేళ్ళు బ్రతికాడు, స్వామి వివేకానంద ఎన్నేళ్ళు బ్రతికాడు. రాశి కాదు వాసి కావాలి...
పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా
అర్థం ఉన్న ఓ
పదం కానిదే అర్థం ఉండునా
నీది అయినది నిర్వచనం ఇచ్చుకో
జీవితానికి ఏం చేసినాఅర్థం లేని పనుల కలయిక కాదు జీవితం అంటే...... అర్థవంతమైన లక్ష్యభరితమైన ఉపయోగపూరితమైన కార్యక్రమాల మేలుకలయికే జీవితం. విధాత నీవే విజేత నీవే....
బాణాల్లాంటి మాటలతో సుతి మెత్తగా యువత ఉద్బోధ కలిగించే ఈ గీతం యువతకు ఎలా దశా దిశా నిర్దేశం చెబుతుందో వేరేగా చెప్పక్కర్లేదు. '' అర్థరాత్రి ఉదయించే సూర్యుడు సిరివెన్నెల'' అని త్రివిక్రమ్ గారు ఊరికే చెప్పలేదు.. సిరివెన్నెలగారి కలానికి ఆయన మేథస్సుకు యువత పట్ల ఈ జాతి భవిష్యత్ పట్ల ఆయనకున్న నిబద్ధతకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ.....
............... అలజంగి ఉదయ కుమార్
trainerudaykuaar@gmail.com
కవిసమయాన్ని చక్కగా వివరించారు! కవిగారి నాడి పట్టుకున్నారు! మీరు శిక్షకులు, బోధకులు కూడా కాబట్టి ఇంకా చక్కగా వివరించారు! సినిమా చూడాలనిపిస్తోంది! పాట స్థిమితంగా విని స్ఫూర్తి పొందే విధంగా బాణీ లేదు! మీ వివరణ లేకపోతే కొంచెం కష్టమయ్యేది! మీరు మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనలతో మీ ఫణి
ReplyDeleteఫణి గారు. మీ ఆశీస్సులకు, అభిమానానికి ధన్యవాదాలు
Delete