భజగోవిందం వ్యక్తిత్వ వికాసానికి, పరిపూర్ణ జీవితానికి పునాది (2)
ఇద్దరు వ్యక్తులు కలిస్తే అడిగే మొదటి ప్రశ్న మీరు ఏమి చేస్తుంటారని చెప్పే సమాధానం బట్టి వచ్చే జీతం సంపాదన లెక్కకట్టి దాని బట్టి వారు ఇచ్చే గౌరవం ఆధారపడియుంటుంది. అబ్బాయికి పెళ్ళి కుదిరిందంటే అడిగే ప్రశ్న పెళ్ళికూతురు ఏం చదివింది ఏం చేస్తుందని కాదు. కట్నం ఎంత అని.. అమెరికా లోని పౌరహక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూదర్ కింగ్ '' మనం ఎటువంటి సమాజంలో నివసిస్తున్నామంటే ఒక వ్యక్తి సామర్థ్యం లేదా విజయం ఆ వ్యక్తి సంపాదించే జీతం మొత్తం బట్టి నడిపే వాహనం యొక్క పరిమాణం బట్టి కాక ఆ వ్యక్తి సమాజానికి, తోటి మానవులకు ఏ రకమైన సేవ చేస్తున్నాడనేదానిబట్టి కాదు'' ఈ మాట 1968 లో అన్నా ఇప్పటికీ ఇది అక్షర సత్యంగా ఉంది. ఎప్పుడైతే వ్యక్తులమధ్య డబ్బు ప్రాధాన్యత పెరిగిందో దానికి అంతం ఉండదు. సంపాదన తో తృప్తి ఉండదు. తీవ్ర మైన పోటీ ,నిరాశా. అసంతృప్తి ఒకటేమిటి అన్ని అనార్ధాలకు దారి ఏర్పడినట్టే....
అందుకే భజగోవిందం రెండవ శ్లోకంలో శంకరాచార్యులు గారు ఇలా చెబుతున్నారు...
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం
యల్లభ సేనిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ..
( అర్థం; ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.)
ప్రపంచమంతా www ల వెంట పిచ్చిగా పరుగెడుతుంది.. అయితే ఈ మూడు ఎంత పొందిన తనివి తీరదు.. యే దిల్ మాంగే మోర్ అంటూ పరుగులు పెడుతునే ఉంటుంది... అవి ఏమిటంటే w - wealth, w - wine and w - women. అలగ్జాండర్ ది గ్రేట్ మృత్యువు తో పోరాడుతూ తన చివరి మూడు కోరికలు తెలియచేస్తాడు. దానిలో చివరి కోరిక తన శవపేటికకు రెండు రంధ్రాలు ఉంచి తన చేతులు బయటకు ఉంచి తనను పూడ్చమంటాడు. ప్రపంచ విజేతయైన అలగ్జాండర్ ఖాళీ చేతులతో వచ్చాడు తిరిగి ఖాళీ చేతులతో పోయాడని అందరికీ తెలియాలని ఆయన అభిమతం. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటపుడు అది వెంట రాదు అంటూ ఒక సినీ కవి చెప్పినదీ అదే.
శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ధనాన్ని సంపాదించాలనే దురాశను విడిచిపెట్టు. కోరికలను వదలాలి అనే బుధ్ధిని పెంచుకో. ప్రతీ వ్యక్తి తాను చేసే కర్మలను, అర్హతలను బట్టి సంపాదించే ధనంను ఆనందం గా తృప్తి చెందాలని స్పష్టంగా చెప్పారు. గనులు తవ్వి. బంగారు పాత్రల్లో తిని, బంగారు పాయిఖానాల్లో విసర్జించే వ్యక్తి చివరికి చిప్పకూడు తినాల్సిరావడానికి దురాశ మాత్రమే కారణం కాదా.అనేకమంది అర్హతను మించి దురాశను పెంచుకోవడం వలన వారికి మనశ్శాంతి లేకపోవడం, మిగిలినవారికి మనశ్శాంతిలేకపోవడం మనం రోజూ చూస్తున్నాం. సంపద అస్థిరమైనది. విశ్వసార్వభౌముడైన హరిశ్చంద్రుడు అడవులపాలై నక్షత్రకునితో సంపదలగురించి చక్కటి పద్యం చెబుతాడు
తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగి రా వేరి కే
సరికేపాటు విధించెనో విధి యవశ్య ప్రాప్యమద్దాని నె
వ్వరు దప్పించెద్? రున్నవాడననిగర్వం బేరికిన్ గాదు! కిం
కరుడే రాజగు రాజే కింకరుడగున్ గాలానుకూలంబుగన్
( సంపదలనేవి ఎప్పూడు స్థిరంగా ఒకనివెంట రావు. ప్రతి వ్యక్తి తన ప్రాప్తిని బట్టి పొందగలడు. జరిగేదాన్ని ఎవరూ తప్పించలేరు. ధనమున్నదనే గర్వం ఎప్పుడూ పనికి రాదు. కాలానుగుణంగా ఈనాటి రాజే కింకరుడు కావచ్చు, కింకరుడు లాంటి వాడు రాజు కాగలడు. )
ఇట్టి అస్తిరమైన సంపదార్జనకై దురాశను పెంచుకోవద్దు మూర్ఖుడా అని ఈ శ్లోకం మన జీవితంలో దురాశను పెంపొందించుకొనక, ఒకరితో సరిపోల్చుకోకుండా వచ్చిన దానితో సంతృప్తి పెంచుకోవాలి సంతృప్తిని మించిన సంపద లేదు, దురాశను మించిన దారిద్రం లేదు.
No comments:
Post a Comment