Thursday, 19 March 2015

How to stay Positive...

HOW TO STAY POSITIVE
నిరంతరం సానుకూల దృక్పథం తో ఉండటం అంత సులువు కాదు. మనం సానుకూలంగా ఉన్నప్పటికీ నిరంతరం నెగటివ్ ఆలోచనలతో బ్రతికేవారు అతి చాక చక్యంతో మన ఆలోచనలను హైజాక్ చేసి మనలో ఎదుగుదల కు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. మన జీవితంలో మనం పాజిటివ్ గా ఉండటం ఎంత అవసరమో నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండటం అంతకన్నా అవసరం......వీరి నుండి మనలను మనం కాపాడుకోకపోతే మనం కూడా వీరిలాగే తయారవడానికి అవకాశం ఉంటుంది. లేదా మనం చాలా గొప్పవాళ్ళం అనే ముసుగులో ఉంది కంఫర్ట్ జోన్ మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా నెగటివ్ వ్యక్తుల లక్షణాలను గుర్తించండి.
నెగటివ్ వ్యక్తుల లక్షణాలు :
1. ఆత్మన్యూన్యతా భావంతోనూ, అపరాధభావంతోనూ తరుచు బాధపడుతుంటారు.
2. విమర్శను ఏ మాత్రం సహించలేరు .
3. ప్రతి ఒక్కరిలో ఉన్న తప్పులు తరుచూ వెతుకుతుంటారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చిన దానిని కెలికి కెలికి పెద్దది చేసి వినోదం చూస్తుంటారు.
4. తనకు అణుకువుగా ఉన్నవారితో కలిసి ఒక చిన్న సమూహాన్ని తయారు చేసుకుంటారు
5. కొత్త విషయాల్ని వేగంగా అంగీకరించరు. మార్పుకు వ్యతిరేకత చూపుతారు.
6. ఎవరితోనైనా వాదన చేయడానికి సిద్ధంగా ఉంటారు.
7. ఇతరులు కొత్త గా ఏదైనా ప్రయత్నిస్తుంటే వారిని వెనక్కు లాగుతుంటారు.
8. ఎవరిమీద కూడ నమ్మకం ఏ మాత్రం కలిగిఉండరు.
9. ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం చాలా తక్కువ మోతాదులో కలిగి ఉంటారు. వ్యక్త పరచలేని ప్రేమరాహిత్యంతో బాధపడుతుంటారు.
10. నిత్యం నిరాశావాదం తో ఉంటూ రేపటి గురించి ఆశ గాని ఆలోచన గాని కలిగియుండరు.
వీరినుండి సాధ్యమైనంతవరకు దూరంగా లేకపోతె మనం కూడా కంఫర్ట్ జోన్ లొ సమాధి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు గాను క్రింది చిట్కాలు ఉపయోగపడతాయేమో ప్రయత్నించండి...
1. ముందుగ మీరు పనిచేస్తున్నచోట నెగటివ్ వ్యక్తులను గుర్తించండి.
ఇతరుల తప్పులగురించి మాట్లాడేవారు. నిరంతరం నిరాశావాడంతో ఉండేవాళ్ళు నిరంతరం అసంతృప్తితో ఉండే ఈ మహానుభావులు మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపుతారు. వీరికి భవిష్యత్తు పై ఆశావాద దృక్పథం ఉండదు. గడిచినకాలం కన్నా బాగా ఉన్నాం కదా అంటూ నిరంతరం కంఫర్ట్ జోన్ లొ ఉంటారు. తీయతీయని మాటలతో చిన్నా. కన్నా.. ఒరేయ్... బాబూ అంటూ మూడు ముద్దు పలకరింపులతో అనకు తెలియకుండానే మనల్ని ముంచేస్తారు......
2. వారి స్వంత అభిప్రాయాను పరిశీలించండి:
ఏదైనా విషయాన్ని వారు చెబుతున్నప్పుడు అందులొ ఎంతవరకు సత్యం ఉంది. అది మనకు తెలియచేయడం లొ వారి ఉద్దేశ్యం ఏమిటి? ఈ విషయం వినడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అని ఆలోచించండి. ఆ విషయం నిజమవడానికి ఎంతవరకు అవకాశం ఉంది సాక్ష్యాలు గాని ఉదాహరణలు గాని ఉన్నాయా ఆలోచించండి. అది నిజమా లేక వారి అభిప్రాయాన్ని ఆ రకంగా తెలియచేస్తున్నారా అని ఆలోచించాలి. '' వినదగు ఎవ్వరు చెప్పినా'' పద్యం తెలుసు కదా..
3. ప్రభావితం చేయడానికి ప్రయత్నించండి కాని ప్రభావితం కాకండి:
వీలైనంత వరకు వారిని మీ అభిప్రాయానికి తగ్గట్టుగా ఉంచేందుకు ప్రయత్నిచండి కాని వారి అభిప్రాయం వైపు ప్రభావితం అవవద్దు. ఆ విషయం మీరే అన్నారని మరలా వారే ప్రచారం చేయవద్దు. అనవసరమైన సంజాయిషీలు వివరణలు ఇచ్చుకోవలసిన పరిస్థితి తలెత్తుతుంది.
4. రేపటి గురించి, వారి భవిష్యత్ ప్రణాళిక ల గురించి లక్ష్యాల గురించి చర్చించండి :
వీరు సాధారణంగా భవిష్యత్ ప్రణాళిక ల గురించి లక్ష్యాల గురించి చర్చించడానికి ఇష్టపడరు. ఎప్పుడైతే ఈ విషయాలు మాట్లాడుతామో వారి వాదన, ప్రభావం మనమీద తగ్గే అవకాశం ఉంటుంది. మీ లక్ష్యాల గురించి ఆలోచనల గురించి చెప్ప వద్దు. మరింత పిరికిమందు నూరిపోస్తారు.
5. వారి బాధలకి మూల కారణం కనుక్కోడానికి ప్రయత్నించండి:
వారి నెగటివ్ దృక్పథానికి అసలు కారణం ఏదో ఉంటుంది. చిన్నప్పుడు జరిగిన సంఘటన కాని, లేదా తీరని ఆశలు గాని లేదా వ్యక్తపరచలేని కోరికలు గాని ఏవో కారణమై ఉంటాయి. వాటి గురించి చర్చించడం ద్వారా వారి స్వభావం మార్చవచ్చు లేదా వారు అవి మీతో మాట్లాడటానికి ఇష్టపడక తమంతట తామే దూరంగా ఉండవచ్చు.
6. వారితో ఎటువంటి పరిస్థితుల్లో వాదనకు దిగవద్దు:
వీరితో ఎటువంటి పరిస్థితుల్లో వాదనకు దిగవద్దు. నేరుగా వారి తత్వాన్ని విమర్శించవద్దు.. కాని ఇటువంటి ఆలోచనల వలన భవిష్యత్తు లొ జరిగే పరిణామాలను క్లుప్తంగా చెప్పండి. వారికో చాలెంజ్ ఇచ్చి అది సాధించగలరా అని ప్రేరేపించండి ..
7. వారితో సాధ్యమైనత వరకు ఒంటరిగా సమయం గడపటానికి అవకాశం ఇవ్వవద్దు:
వీరు సాధారణంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమె అందరి తప్పులను మన ముండు ఏకరువు పెట్టి మనం ఇతరులకన్నా ఎ విధగా గొప్పవారో చెప్పటానికి ప్రయత్నిస్తారు. సాధ్యమైనంత వరకు అందరూ కలిసి ఉన్నప్పుడు వీరితో ఉండండి గాని. వీరి సంభాషణల ఏకైక శ్రోత గా మాత్రం ఎప్పుడు చిక్క వద్దు.
8. మీరు ఆ గ్రూప్ లొ సభ్యులు కాదన్న సంగతి ఇతరులలు తెలుసుకునేలా ఉండండి:
తరుచూ అటువంటి వారితో ఉండటం వలన మీకు ఇతరుల వద్ద ఉన్న గౌరవం మర్యాద రెండూ దెబ్బ తేనే అవకాశం ఉంది. ఆ గ్రూప్ లొ మీరు సభ్యులు కాదన్న సంగతి నలుగురికి తెలిసేలా అందరితో సాధారణంగా ఎలా ఉంటారో అలానే ప్రవర్తించండి.
9. మీ లక్ష్యాల పట్ల నిరంతరం ఆశా వాదం తో ఉండండి.
మీ లక్ష్యాలేమితో మీ ఆశయాలేమితో వాటి పట్ల నిరంతరం అవగాహనతో చైతన్యంతో ఉండండి. ఇటువంటి వారితో సమయం గడిపే కన్నా లక్ష్యాలపై దృష్టి పెటడం ఏంతో ఉత్తమం అని గ్రహించండి.ఏ పనీ పాటా లేనివాళ్ళే ఇలాంటి విషయాల్లో తలమునకలై ఉంటారని గ్రహించండి.
10. మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకోండి:
ఇక్కడ ఎవరూ ఎవరికీ శాశ్వతం కాదు. మనతో చివరిదాకా ఉండేది మనకు మనమే. కాబట్టి మనం మనలా ఉండటానికి అవకాశం ఉన్న చోటే ఉండండి. ఉన్నత వ్యక్తులతో కలిసి ఉంటె వారి తత్త్వం మనం తెలుసుకొని మనల్ని మనం అభివృద్ది చేసుకోవచ్చు. అంతే కాని నెగటివ్ వారితో ఉంది మన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోరాదు.
విష్ యు గుడ్ లక్
అలజంగి ఉదయ కుమార్

Monday, 16 March 2015

పేడి తనానికి టాటా చెప్పి .....


బృహన్నల అవతారాన్ని

అలనాటి అర్జునుడు స్వీకరించాడంటే


దానికో అర్ధం ఉంది 


పరమార్థం ఉంది 


తనకో తన కుటుంబానికో 


ఒక ప్రయోజనముంది 


మీకేమి పోయే కాలం దాపురించింది 


భగవంతుడిచ్చిన శక్తి నరనరాన ప్రాకుతుంది 


సల సలా కాగే రక్తం దేహమంతా ప్రవహిస్తుంది 


కణ కణలాడే ఉష్ణం అణువణువునా రేగుతుంది 


అన్నింటినీ వీడి ఆదమరచి నిద్రపోతున్నారు 


కాలం తో సాగడం మాని కనులు మూసి జోగుతున్నారు 


శ్రమను నమ్ముకొని సాగుతున్నవారి


కాళ్ళకు అడ్డం పెడుతున్నారు 


స్వేద బిందువులు చిమ్ముతూ సేద్యం చేసే వారి 


శీలానికి మసిని పూస్తున్నారు


నవ సమాజాన్ని నిర్మిచేవారి 


ధీరత్వానికి ద్వేషాన్ని ఉసికోల్పుతున్నారు


ఉడుకు నెత్తురు దుడుకుని చూసి


జడిసి జడిసి చస్తున్నారు 


ఇకనైనా ఈ పేడితనానికి సెలవు చెప్పి


మాడా బ్రతుకుకి టాటా చెప్పి 


నిస్స్త్తత్తువుకి లోనైనా నీ శక్తులకు పని చెప్పండి 


ఎదుగుతున్న వారిపై ఏడుపులు మాని 


మీ లక్ష్యాల సాధనకోసం అడుగులు మొదలెట్టండి


శ్రమైక జీవన సౌందర్యాన్ని అహరహం ఆస్వాదించండి 


మూతి మీద మొలిచిన మీసానికి సార్ధకత సాధించండి...

Sunday, 8 February 2015

'' మళ్ళి మళ్ళి ఇది రాని రోజు''


తెల్లవారు ఝామున బాల్కనీ లొ కూర్చొని కాఫీ త్రాగుతూ ఉదయించే సూర్యున్ని చూస్తూ ఆ ప్రశాంతతను మనసారా ఆస్వాదిస్తుంటారా?

పనులన్నీ పూర్తీ చేసి సేద తీరుతున్న తల్లి తో కూర్చొని చిన్న నాటి ముచ్చట్లను మరలా ఒకసారి తనివితీరా గుర్తు చేసుకునే అలవాటు ఉందా??

రాత్రి భోజనం చేసాక భార్యతో కలిసి లేదా ఒంటరిగా కొంతసేపు భవిష్యత్ గురించి సమాలోచనలు చేస్తూ నడిచే అలవాటు ఉందా????

కృష్ణ శాస్త్రి కృష్ణ పక్షమ్ , , తిలక్ అమృతం కురిసిన రాత్రి, చలం మైదానం, బుచ్చిబాబు చివరకు మిగిలేది, నవీన్ అంపశయ్య , యండమూరి ఆనందో బ్రహ్మ ఇవన్నీ నిత్యం మీ ఒంటరితనం లొ తోడుగా నీడగా మీ ఆలోచనల్లో ఒక భాగంగా ఉంటాయా????

అయితే మీ లాంటి వాళ్ళకోసమే ఒక మంచి అనుభూతిని , మరుగున పడిపోయాయని మీరు అనుకున్న మీ పాత జ్ఞాపకాలను మరల సృజింపచేసుకునేందుకు మీరు తప్పని సరిగా చూడవలసిన సినిమా '' మళ్ళి మళ్ళి ఇది రాని రోజు''

ముందుకు కదులుతుందో లేక అక్కడే ఆగిపోయిందో తెలియని గోదావరి ప్రవాహం లా నెమ్మదిగా మొదటి భాగం నడుస్తుంది.... ప్రతి మాట స్పష్టంగా వినిపించే మంద్ర స్థాయిలో నేపథ్య సంగీతం .... ప్రాస కోసం కాకుండా ఒక చక్కని భావాన్ని, తర్కాన్ని, ఒక చక్కని ఆలోచనలను కలిగించే భావస్పూరక సంభాషణలు ..... మొదటి భాగం కొంచెం అతిగా సాగుతుందని అనిపించినప్పటికీ తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్ ..

ఈ సినిమాకి ప్రాణం అంతా రెండో భాగమే.. కొంత ఆసక్తి కరంగా చక్కని ముగింపుతో అందరినీ ఆకట్టుకునేటట్టు తీసారు. కొంత సినిమాటిక్ గా అనిపించేటప్పటికీ కొంత వరకు సహజత్వానికీ దగ్గరగా ఉన్నట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. నిత్యా మీనన్ అద్భుతంగా నటించి మరో సౌందర్య లా నటిస్తుంది అని అందరూ అనుకునేడి నిజమే సుమా అన్నట్టు నిరూపించుకుంది...
ఇంకా చెప్పాలంటే చాలా ఉంది... పట్టీ సంభాషణ ని, ప్రతీ భాగాన్ని వివరించాలనే ఉంది ...కాని అంతకన్నా ముందు ఇది చదవడం ఆపి థియేటర్ కి వెళ్లి చూడండి. మంచి సినిమా అంతా ప్రోతహిస్తారు అనే నమ్మకం తో సినిమాలు తీసేవారిని ప్రోత్సహించినవారవుతారు.. మనలో కూడా ఇంకా భావుకత మిగిలే ఉంది అని నిరూపించినవారవుతారు..

Wednesday, 28 January 2015

నిశ్శబ్దాన్ని ఆనందించు


నిత్యం ఊకదంపుడు చప్పుల్లెందుకు
చెవులు చిల్లు బారేలా ఆ శబ్దాలెందుకు
మనసు కు సొగసు కలిగించే 
సునిశిత నిశ్సబ్ద గీతాన్ని 
ఆత్మకు ఆత్మీయత కలిగించే 
మోహన మౌన రాగాల్ని
తనివితీరా తన్మయత్వంతో
అలసట లేకుండా ఆస్వాదించు
ఎవడు ఏమేమి చేస్తున్నాడో నీ ఆరాలు మాను
ఎవడు ఎలా ఎదిగిపోతున్నాడో ఏడ్పులు ఆపు
దొరికినోడికి దొరికినంత
చేసుకున్నోడికి చేసుకున్నంత
ఎవడు ఎన్ని కుస్తీలు పడినా
ఎంత ప్రాప్తమో అంతే అనుకో
లేనిపోని గందరగోళం తగ్గి
మనసుకు శాంతి దొరుకుతుంది
కొత్త పనులకు మార్గం కనబడుతుంది.
రెళ్ళు దుబ్బలు ఎంత లాగినా దొరికేవి మూడు పైసలే
త్రినాథ వ్రతం కథ చదవలేదా
దొరికినదాంతో సంతృప్తి చెందితే
నిన్ను మించిన శ్రీమంతుడు ఉంటాడా ?
చేయాల్సిన పని లేకపోతె
దొరికిన సమయంలో నీ నైపుణ్యాలు పెంచుకో
పఠనాభిలాష పెంపొందించుకొని పరిజ్ఞానం పెంచుకో
ఆనందాన్ని పంచేవాడివి ఆనందంగా ఉండటం నేర్చుకో
ఉత్తేజం కలిగించేవాడివి ఉన్మాదిగా ఉండటం మానుకో
ఆదర్శాలు పలికేవాడివి ఆదర్శంగా నడవటం తెలుసుకో
trainerudaykumar@gmail.com

Friday, 16 January 2015

సృజనాత్మకత కు నిలువెత్తు దృశ్య కావ్యం శంకర్ సార్ సినిమా ' ఐ '


   
   తాజ్  మహల్  చూడటానికి వెళ్తాం ....ఇంటి దగ్గర  బయలు దేరినప్పటి నుండి  మరలా ఇంటికి చేరినంత వరకు  మొత్తం ప్రయాణం  అంతా  సంతోషంగా ఉండక పోవచ్చు.   కొన్ని అద్భుత సంఘటనలు ఉండొచ్చు.  కొన్ని చోట్ల  కొన్ని సార్లు మంచి హోటల్,   మంచి  భోజనం దొరకక పోవచ్చును.  తాజ్  మహల్ దగ్గరకు వెళ్ళారు.  ఆ రోజు  పౌర్ణమి ..నిండు వెన్నెల .. అలా మైమరచి పోతుండగా   మీ చిన్ననాటి ప్రేయసి అనుకోకుండా అక్కడ కలిస్తే..  ఇద్దరూ కొంత సేపు   ఆ తాజమహల్ బ్యాక్ గ్రౌండ్  లొ  మాట్లాడుకుంటూ  ఆ పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటే ....  మరలా  గుడ్ బై  చెప్పుకొని ఎవరి ఫ్యామలీ  తో వారు  వెనక్కి వస్తే....  మరలా దారిలో అక్కడక్కడా   చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైతే    .....  ఇంటికి చేరుకున్న తరువాత..   ప్రయాణం ఎలా జరిగింది   అని మీకు మీరు  అనుకుంటే ఏం  చెబుతారు...   ఎదవ ప్రయాణం    అక్కడక్కడ భోజనం బాగో లేదు..   ఏముంది తాజ్ మహల్  లొ  ...  ఎదవ   సంత  తో వెళ్ళా ..  ప్రయాణం లొ రకరకాల ఇబ్బందులు పడ్డా   అని చెబుతారా.....అలా చెప్ప  గలిగితే.....మీ సృజనాత్మకతకు.......  కవితాత్మకతకు జోహార్.......

అలాగే తిరుపతి వెళ్తాం... ప్రయాణం లొ ఇబ్బంది..   మెట్లు ఎక్కి వెళ్ళారు....  లైన్లలో గంటల కొద్దీ ఉన్నారు.  దర్శనం స్వామి ని చాలా దగ్గర నుండి చూసారు.. స్వామి  ప్రత్యెక పూజల్లో  స్వామి విగ్రహం ముందు అరగంట ఉండే అవకాశం వచ్చింది...  తిరిగివస్తుండగా  మీ పాత బట్టలు  ఉన్న  బ్యాగ్  పోయింది.   ట్రైన్  కొంచెం ఆలస్యమయింది.   మొత్తానికి ఇంటికి చేరుకున్నారు.   మొత్తం   యాత్ర  ఎలా జరిగింది అంటే  ఏమి చెబుతారు...    పోయిన బ్యాగ్  గురించి చెబుతారా.....   మెట్లు ఎక్కినా అలసట గురించి చెబుతారా  లేదా  అరగంటకు పైగా స్వామి సన్నిధి లొ ఒళ్ళు పులకరించేలా  గడిపిన మధుర క్షణాల  గురించి చెబుతారా......    మీ భక్తీ కి  అనురక్తి కి జోహార్........

కోడి గుడ్డు మీద ........... పీకే  పని  ధ్యేయంగా  ఉన్నవాళ్ళ   ఆలోచన మీకు అనవసరం...  హాలీవుడ్ సినిమాల్లో సగానికి సగం  డైలాగ్ లు  వినబడవు... వినబడినదాంట్లో   చాలా మటుకు  అర్థం కావు....   ఏ   లాజిక్  కి అందని  మర మనుష్యులు.  వికృత రూపాలు...   సినిమా ఎప్పుడు మొదలయిందో  ఎప్పుడు ముగిసిందో  తెలుసుకొనే సరికి   అంతా   బయటకు వచ్చేస్తుంటారు.  చాలా మంది అబ్బా   ఏమి టెక్నాలజీ  హబ్బా   ఏమి  గ్రాఫిక్స్.  హబ్బబ్బా   ఏమి స్క్రీన్ ప్లే   అబ్బా అబ్బా   అబ్బా   అంటూ   చంకలు గుద్దుకొని వచ్చేస్తుంటారు......

అదే  మన వాళ్ళు  సాహసించి వందల కోట్లు ఖర్చు పెట్టి  రాత్రనక పగలనక ఒళ్ళు హూనం చేసుకొని  శక్తికి మించి  సినిమాని ఒక కళాఖండం గా తీస్తే .. శంకర్  మేజిక్   అయిపొయింది..  శంకర్    వాడిని వదులుకోవడం  తప్పు. వీడితో చేస్తే బాగుండును..  పాత కథే..  భైరవద్వీపం లా  మన బాలకృష్ణ   ఇంకా ఇరగ దీసాడు......అంటూ  సన్నాయి నొక్కులు నొక్కడమే కాకుండా ఫేస్ బుక్ వాల్ మీద  వెధవరాతలు  రీవ్యూ లు రాసేస్తారు...
అసలు ఏమి చేస్తే   వీళ్ళు బాగుపడతారు....  వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సొల్లు కబుర్లు చెప్పి  షార్ట్  ఫిలిం కి ఎక్కువ  డాక్యు మెంటరీ  కి  తక్కువ లాంటి సినిమా తీసి  వాళ్ళు    సినిమాయే మా జీవితం.  సృజనాత్మకత కోసం జీవిస్తున్నాం   అని ప్రగల్భాలు పలుకుతూ  పెద్ద పెద్ద సినిమాలని   విమర్శించడం  ద్వారా   కొంచెం  పాపులారిటీ  పెంచుకుందాం  అని ఆలోచించేవాళ్ళు   శంకర్  గారి సినిమా    ని విమర్శిస్తుంటే    చాలా బాధ అనిపిస్తుంది.

సినిమాని చూడటానికి  ప్రేక్షకులని థియేటర్ కు రప్పించడం చాలా కష్టం.   పనికిమాలిన రీవ్యూ లు  రాయడం వలన ఒక గొప్ప  కళాకారుడి  కృషి ని   పాత్రకోసం చేసిన త్యాగాలని తపస్సుని   చాలా మంది  మిస్   అవుతారు..   అప్పుడెప్పుడో చదివాం  విన్నాం. దేవదాసు సినిమాకి  అక్కినేని  నాగేశ్వర రావు గారు ఉపవాసాలు  చేసారని..  రాముడు కృష్ణుడు   పాత్ర వేసినప్పుడు  నందమూరి రామారావు గారు  చాలా నిష్టగా  ఉండేవారని.. మరి మన కళ్ళముందు    ఈ   ఐ   సినిమా కోసం  విక్రం పడిన పాట్లు   ఒక భారతీయ నటుడి  నట విశ్వరూపం    తప్పని సరిగా సినిమా చూసే అవకాశం  మరియు  అలవాటు ఉన్న ప్రతి  ఒక్కడూ చూడాల్సిందే...

ఒక  అద్భుత  దృశ్య  కావ్యాన్ని చూడటానికి   సరస హృదయం కావాలి.. రసజ్ఞత ఉండాలి... రస స్వాదన చేసే  స్పందించే హృదయం  ఉండాలి....   ఇవి లేక పోయిన పర్వాలేదు....   చందమామ పై   మచ్చను మాత్రం  చూసే నిరాశావాద  గుణం,     బడి గోడ   మీద  గుడి గోడ మీద  కుక్క  మూడు కాళ్ళపై నిలబడి .......   పోసే   తుచ్చ  గుణం   మాత్రం  ఉండగూడదు....... 

ఈ సినిమా లొ  విమర్శించడానికి  ఏమైనా ఉందంటే  అది   ఐదు  నుండి పడి శాతం  లోపే.. 
 ఒకటి  నిడివి  ఎక్కువ అవడం. 
  క్లైమాక్స్  సాగ దీయటం..   
 చివర్లలో  బ్యాచలర్  పార్టీ లొ విల్సన్ల తో   సంబాషణలలొ  పస తగ్గటం. 
  అనవసరమైన  అర్థం  లేని ట్రైన్ ఫైటింగ్ 
    చివరి అరగంట ఓ స్పీడ్  తగ్గటం  అంతే...........


.మెచ్చుకోవలసినవి  వందలకొద్దీ ఉన్నాయి......    

ఒకే వ్యక్తి  వివిధ రకాలుగా శరీరాకృతి ని పాత్రకు తగ్గట్టుగా మార్చుకోవడం.......
కళ్ళు చెదిరే  అందమైన   దృశ్యాలను చూపించిన అద్భుత ఫోటోగ్రాఫర్  పనితనం.......
చైనా లోకేషన్స్ లొ  తీసిన వివిధ  సన్నివేశాలు  అందునా   ఇంటర్ వెల్  ముందు ఫైటింగ్ దృశ్యాలు.......
వివిధ కారణాలుగా తనకు తెలియకుండా శత్రువులు ను పెంచుకొని వారి చేతుల్లో తన కెరీర్  ప్రేమ కోల్పోవడం............కథ లొ భాగంగా వీటన్నింటిని  మిళితం చేసి చూపించడం....

ఇవన్నీ  ఒక ఎత్తు   షేక్ స్పియర్   తన సోనేట్    ట్రూ లవ్  లొ   నిజమైన  ప్రేమ  అంటే బాహ్య మైన  అందానికి  ప్రాధాన్యత  ఇవ్వదని  కాలానికి అది  మార్పు కాదని చెప్పాడు..
   ఈ  సినిమా లొ  హీరోయిన్   వ్యక్తిత్వాన్ని  అద్భుతంగా   చూపించారు  శంకర్  సార్....    అవసరం కోసం  ప్రేమ ఒక సాకుగా  వాడుకోకూడదని...  ఒక  వ్యక్తి  పై  ప్రేమ ఏర్పడితే   ఆ వ్యక్తీ కి   ఏ రకమైన  సమస్యలు వచ్చినా   తోడుగా నీడగా ఉండాలని...   అతను కోలుకునేందుకు  అండగా ఉండాలని.....    ప్రేమించిన వ్యక్తి   కలను సాకారం చేసేందుకు   జీవితాన్నే అంకితం చేయాలని తపించే నిజమైన ప్రేయసిగా    హీరోయిన్  వ్యక్తిత్వాన్ని   చూపించారు.........   అవకాశాల కోసం   వ్యక్తిత్వాన్ని  అమ్ముకోకూడదని,, సమస్య పెట్టినవారికే సమస్య ను కల్పించాలని   హీరోయిన్  ద్వారా    చెప్పించారు...
ఇంకా రాయమంటే   వంద పేజీలు  రాస్తా........ఈ సినిమా గురించి  ......అది కాదు  ముఖ్యం..  వందల కోట్లు పెట్టి  భారతీయ ప్రేక్షకులు    సహృదయం ఉన్నవాళ్ళు...... సృజనాత్మకత కు  పెద్ద పీట  వేస్తారు....  సొల్లు రాతలు నమ్మరు  అనే ధైర్యం తో శంకర్  సార్   ఈ సినిమా తీసారు    ఈ   సినిమాను    చూడండి..   థియేటర్  లోనే   చూడండి...   సినిమా రంగం పై  ఆశలు పెట్టుకొని అనేక మంది జీవిస్తున్నారు..    పనికిమాలిన అభిప్రాయాలతో  గొప్ప మధురానుభూతి   కోల్పోవద్దు.......

అతి సాధారణ ప్రేక్షకులమైన మాకు  స్పీల్  బర్గ్  తెలీదు... హిచ్ కాక్  ఎవరో తెలీదు...  సగటు ప్రేక్షకులకు కోట్లు ఖర్చుబట్టి  సాహసం  చేసి   గుండె ధైర్యం తో  అద్భుత అనుభూతి కల్పించి  నిజమైన ప్రేమకు నిలువెత్తు రూపంగా  ఈ సినిమాను మలిచిన    శంకర్ గారికి ఆయన అంచనాలకు అనుగుణం గా ఒళ్ళు హూనం చేసుకొని నటించిన విక్రం  కళాభిరుచి  కి అంకిత భావానికి    శిరస్సు వంచి పాదాభివందనం  చేస్తున్నాను.

అంతా చదివిన   తరువాత  నన్ను తిట్టుకోవాలని అనిపిస్తే.......  తిట్టుకోండి..  రాజ్యాంగం లొ  19 వ ప్రకరణ  భావ ప్రకటనా  స్వాతంత్రాన్ని ఇచ్చింది...  కాని   అధ్బుత రసమయ దృశ్య కావ్యాన్ని ,    కళను నమ్ముకున్న అవిరళ కృషిని  అనవసరంగా   విమర్శించి  అభాసుపాలు కావద్దు.......    ఎందుకంటే    శ్రమ ఏవ జయతే......

wish you all the best
A. Uday Kumar

trainerudaykumar@gmail.com

Monday, 12 January 2015

నాయకుడిగా ఎదగాలంటే ..................


నాయకుడిగా ఎదగాలంటే...........        

  నలుగురిలో గుర్తించబడాలని , నలుగురిలో గౌరవించబడాలని ,  నలుగురి ముందూ నడవాలని , ముందుండి  నలుగురినీ నడిపించాలని, సత్కారాలు, సన్మానాలు అందుకోవాలని  ప్రతి  మనిషి కి  అతి సహజంగా ఉంటుంది.  ఎవ్వరూ దీనికి అతీతం కాదు.   అదృష్టవశాత్తూ  కొంత మందికి ఆ అవకాశం వస్తుంది,  తమ తమ వ్యక్తిత్వాల వలన , సంస్కారం వలన, ఆదర్శాల వలన, అనుచరుల వలన దానిని  సద్వినియోగ పరుచుకుంటారు.  మరికొంత మంది పాటించాల్సిన కనీస ప్రమాణాలను,  ప్రాథమిక అంశాలను విస్మరించడం వలన  గొప్ప నాయకులుగా  ఎదగలేక కనుమరుగవుతుంటారు.....
       స్వామి వివేకానంద  జన్మదినోత్సవ సందర్భంగా  నాయకుడిగా ఎదగాలంటే పాటించాల్సిన కనీస ప్రమాణాల  గురించి  నాయకత్వ లక్షణాల గురించి  చర్చిద్దాం,,,,,,,

1.  విషయ పరిజ్ఞానం పై సంపూర్ణ అవగాహన మరియు  సమర్థత:  నాయకుడిగా తాను  ఏ  రంగంలో ఉన్నామో ఆ రంగానికి సంబందించిన   అన్ని అంశాల పైన ప్రాథమిక పరిజ్ఞానం,  మొత్తం వ్యవస్థ మీద  సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి.   కేవలం అనుచరుల మీద ఆధారపడి వారు రాసిన లేదా అందించిన  సమాచారం పై  గుడ్డిగా ఆధారపడకుండా తనకంటూ  స్వంత అవగాహన ఉండాలి. ఉదాహరణకు రాజకీయ రంగంలో నాయకుడిగా ఉండాలంటే   రాజ్యాంగం గురించి, వివిధ రకాల  రాజ్యాంగ సిద్ధాంతాల గురించి  వివిధ దేశాలలో ఉన్న  ప్రభుత్వ రీతుల గురించి,   ప్రభుత్వ పనితీరు గురించి,  వివిధ శాఖల గురించి, వాటి బాధ్యతల గురించి   ఎప్పటికప్పుడు  తెలుసుకుంటూ అప్ టు డేట్ గా  ఉండాలి .. . అదే ఒక సంస్థ లో  నాయకత్వం  వహిస్తుంటే సంస్థ లో గల వివిధ విభాగాల గురించి , మార్కెట్ గురించి, పోటీ దారులు అనుసరిస్తున్న వివిద విధానాల గురించి రాబోయే మార్పుల గురించి  తెలుసుకుంటూ ఉండాలి.
2.   స్వంత బలాలను పూర్తిగా నమ్మాలి, బలహీనతలను తెలుసుకోవాలి:    నాయకుడి గా ఎదగాలనుకునే వాడు చేయాల్సిన మొదటి పని తన యొక్క బలాల గురించి బలహీనతల గురించి తెలుసుకోవాలి.   నాయకుడిగా తాను  తయారయ్యేందుకు తనకున్న బలం ఏమిటి?  వారసత్వంగా తల్లి దండ్రుల లేదా తాత ముత్తాల వారసత్వం వస్తే ..ఏ  కారణాల వలన  తాతలు గాని తండ్రులు గాని ప్రజలలో పలుకుబడి, ఆదరణ, నమ్మకం సాధించారో తెలుసుకొని ఆ గుణాలను తానూ  పెంపొందింప చేసుకోవాలి..  ప్రజలకు మతి మరుపు చాలా ఎక్కువ ..  కొత్త తరం పాత తరాన్ని చాల వేగంగా మరచిపోతుంది.  తనకంటూ స్వంత ముద్ర వేసుకోకుండా  చెట్టు పేరు కాయలమ్ముకుందామంటే  చివరికి  గన్నేరుకాయలే  మిగులుతాయి.   నాయకుడికి ఉండాల్సిన బలం ప్రజలలో ఆదరణ ,  అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం ,  ధైర్యం,  సహాయం చేయడానికి ముందుండటం, అందరిలో  విశ్వాసాన్ని  నమ్మకాన్ని  అభివృద్ధి చేయడం .  ఈ లక్షణాలను నిరంతరం పదును పెట్టుకోవాలి.  తన బలహీనతలు ఏవో తెలుసుకొని వాటిని బలాలుగా మార్చుకోడానికి నిరంతర సాధన చేయాలి.   ప్రభావపూరితంగా ఉపన్యాసం ఇవ్వడం, వ్యూహరచన  చేయడం  ఇటువంటి వాటిలో  కాస్త వెనుకబడి ఉంటే  వాటిని బలాలుగా మార్చుకోడానికి నిపుణుల సహాయం తో సాధన చేస్తుండాలి.
3. జయాలకు అపజయాలకు స్వంత బాధ్యత తీసుకోవాలి:  నాయకుడనేవాడు సమస్యలు వచ్చినపుడు వాటిని పరిష్కరించేందుకు స్వంత భాద్యత తీసుకోవాలి. సమస్యలు అన్నిటినీ  సానుకూలంగా పరిష్కరించుకోక పోవచ్చు.  అవి ఒక వేల పరిష్కరించబడకపొతే  ఆ బాధ్యతను తాను  తీసుకోవాలి తప్ప  ఇతరుల మీద త్రోయరాదు.  తన ఓటమికి  తమ జట్టు వెనుకబడటానికి  ఎవరో కారణమని  నమ్మితే  ఆ ఓటమినుండి  గుణపాఠాలు  ఎప్పటికీ నేర్చుకోక పోవచ్చును.   ఎప్పుడైతే  బాధ్యత  స్వయంగా తీసుకుంటాడో అనుచరుల  నమ్మకాన్ని గెలుచుకోవడమే కాకుండా  గెలవాలన్న తపన నలుగురిలో పెంచగలుగుతాడు..
4. సమర్థులైన శత్రువుల్ని ఎంచుకోవాలి:  ఉన్నత మైన లక్ష్యము  కలిగిన  నాయకుడు  ఉన్నతమైన  శత్రువుల్ని  పోటీదారుల్ని   ఎంచుకోవాలి.   సాధ్యమనంత వరకు నలుగురినీ కలుపుకొని  ముందుకు వెళ్ళాలి కాని నలుగురినీ కెలుక్కుంటూ  సమయం    వృథా  చేసుకోకూడదు.   ఎవడి బలాల్ని   తక్కువగా అంచనా వేయకూడదు.  అహంకారంతో దగ్గరయ్యే వారిని దూరం చేసుకోకూడదు.  అణు బాంబు తో పెట్టుకున్న పర్వాలేదేమో  కాని ఆత్మా విశ్వాసం ఉన్న వాడితో అసలు పెట్టుకోకూడదు.  బయటకు కనబడే బలంకన్నా  లోపల  ఉన్న అసలు బలాల్ని అంచనా వేయగలగాలి.  ఎటువంటి అంచనా లేనప్పడు  ముందుగా ఘర్షణ  మొదలుపెట్టరాదు. .   బలమైన శత్రువులతో  తాత్కాలికంగా సంధి చేసుకోవడం ఉత్తమం.  చెప్పులో చిన్న రాయి కూడా మన పరుగును ఆపి వేయగలదు.  చిన్నవారితో అనవసర శత్రుత్వం వలన  అందరికీ లోకువయ్యే   పరిస్థితి  ఎదురవడం కాకుండా వారు ఎదుగేందుకు దోహదపడే అవకాశం ఇచ్చినట్టే ..  అత్యంత విశాలమైన  రష్యా అతి చిన్న జపాన్  చేతిలో ఓటమి పాలు అవడం తో  జార్ రాజుల పతనం మొదలయ్యింది.
5. అనుచరులకు ఆదర్శంగా  ఉదాహరణ దాయకంగా ఉండాలి: తన చుట్టూ నిరంతరం ఉండే  అనుచరులను సరియైన వారిని ఎంచుకోవాలి.  భజనపరులకు, చంచా  గాళ్ళకు,  తార్పుడుగాల్లకు ఆ అవకాశం ఇస్తే ఆత్మహత్యా సాదృశ్యం అయ్యే అవకాశం ఉంది.   తాను  చేసే చిన్న చిన్న  తప్పులు కూడా వారికి తెలియకూడదు.   వారికి  లోకువయ్యే  పనులు ఎప్పుడూ చెయ్య కూడదు. చేయాల్సి వచ్చినా  వారికి తెలియకూడదు. తమ నాయకుడి లోపాలు  తమకు తెలిస్తే వారు  అతనిని మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది.
నోటి దురద , తన దగ్గరకు వచ్చిన వారి పట్ల అమర్యాదగా  ప్రవర్తించే వారిని  వెంటనే  తొలగించాలి.   విన్ స్టన్ చర్చిల్  కి అత్యంత ప్రీతిపాత్ర మైన కుక్క  ఒకటి  ఉండేదట.   కాని అది   చర్చిల్  కలవడానికి వచ్చినవారి పైన బడటం  అరవడం చేసేదట.  అది  చర్చిల్ కి తెలియలేదు.    ఒకసారి  చర్చిల్  ఉండగానే  తనను కలవడానికి వచ్చిన వారిని చూసి  ఒకరిపై   బడి అది  మొరిగిందట.    వెంటనే  చర్చిల్  దానిని గన్  తో కాల్చి వేసాడట..   అంత  ఇష్టపడే  కుక్కను కాల్చారా?   అని అడిగితే    అది  వేరే కుక్క  అయితే    కుక్క కరిచింది అని చెప్పుకుంటారు.  నా దగ్గర ఉన్న  కుక్క  నన్ను కలవడానికి వచ్చినవారిని కరిస్తే   చర్చిల్  కుక్క   కరిచింది అని చెబుతారు  అన్నాడట.   దీనిని బట్టి   మర్యాదపూర్వకంగా హుందా గా ప్రవర్తించే   వ్యక్తులనే తన కోటరీ లొ ఉంచుకోవాలి.
6. అనుచరుల్ని మంచి నాయకులు గా తయారుచేయాలి:   "  నీ చుట్టూ ఉన్న వారిని సింహాలు గ  తీర్చుదిద్దు. లేదా వారు తోడేళ్ళు  గా మారి నిన్నే తినేస్తారు  అన్నారు  స్వామి వివేకానంద .  అనుచరుల యొక్క సామర్థ్యాలను  గుర్తించి సముచితంగా  వారు ఎదిగేందుకు అవకాశం కల్పించాలి.  ఎక్కడ  ఎవరు ఎదిగిపోతారో అని నిరంతరం బాధపడేవాడు   భయ పడేవాడు  నిజమైన నాయకుడి గా ఎదగలేడు.  ఎవ్వడు వెళ్ళిపోయినా   అలాంటి వారిని వందమందిని తయారుచేయగలననే  నమ్మకం విశ్వాసం  నాయకుడికి ఆక్సిజన్ లాంటింది.  తన అనుచరుల , సహచరుల అవసరాలను తెలుసుకొని  వారికి ఆసరాగా  భరోసాగా ఉండాలి.  విజయాలలో అనుచరులను అభినందించాలి . పరాజయాలకు స్వయంగా భాద్యత  తీసుకోగలగాలి.  ఎదిగేందుకు అవకాశం  కల్పించే  నాయకుడి కోసం  ప్రాణాలు అర్పించేందుకు   అనుచరులు సిద్ధంగా ఉండగలుగుతారు.   స్పార్తకస్   కోసం  ప్రాణాలివ్వడానికి అనుచరులు సిద్ధపడింది. మరియు    తమ పదవులకు ముప్పు వాటిల్లబోతుందనే   అనుమానంతో సీజర్ ను హతమార్చిన తన అనుచరులు దీనికి  ఉదాహరణగా   చెప్పుకోవచ్చును.
7. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో నిరంతర అప్రమత్తత:  అధికారం ఉంటేనే ఎవరికైనా సేవ చేయడానికైనా  సహాయం చేయడానికైనా  అవకాశం ఉంటుంది.   నేడు నిరంతరం మారుతున్న రాజకీయ వ్యవస్థలో
వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో నాయకుడు   నిరంతరం అప్రమత్తంగా  ఉండాలి.   తరతరాలుకు నిలిచిపోయే  కార్యక్రమాలు చేయాలంటే   అధికారం  నిలుపుకోవడం ,  ప్రజలతో  మమేకం అవ్వడం,   ప్రజల విశ్వాసం  చూడగొనడటం  తప్పని సరి.   సరియైన మేథా  వర్గం తో కూడిన వ్యూహాలుచేసే బృందం  తయారు చేసుకోవాలి.
అల్లాటప్పా   ఆకతాయిలతో  కాలం గడిపేవాడు  కాలగర్భంలో కలుస్తాడు.  వేసే ప్రతి అడుగు వేసేవాడు , పలికే ప్రతి మాట ఆచితూచి  పలికేవాడు కాలాన్ని గెలిచే నాయకుడిగా  నిలుస్తాడు.
                        నాయకత్వం అంటే   రాజకీయ నాయకత్వమే కాదు  ఒక పరిశ్రమ  కావొచ్చు, ఒక కుటుంబం  కావొచ్చు, ఒక ధార్మిక సంస్థ  సంస్థ కావొచ్చు.  లేదా  ఒక సేవా సంస్థ కావొచ్చు.    మదర్  తెరిస్సా  స్థాపించిన   మిషనరీ ఆఫ్ చారిటీ  ఆమె  లేకపోయినా  కొనసాగటం.   ఏ   రాజకీయ పార్టీ  నైతే  స్థాపించిన ఒక మహానుభావుడు  తన అనుచరులతోనే చెప్పులు విసిరేయించుకునే  దశకు  చేరి  సంపూర్ణ మెజార్టీ ఉన్నా అధికారం కోల్పోయి  అర్థాంతరంగా  అవనినే విడిచి పెట్టాల్సిరావడం  వ్యూహాలు  ప్రతి వ్యూహాలు  లేకపోవడం  ముఖ్య కారణం. నాయకత్వం  అనేది నిరంతరం నేర్చుకునే ఒక కల.  ఒక అదృష్తం.  ఒక  వరం.   మనిషి జన్మ  సార్ధకం అయ్యేందుకు ఒక అద్భుత అవకాశం.    
    విష్ యు  ఆల్ డి బెస్ట్.......
   అలజంగి ఉదయకుమార్
trainerudaykumar@gmail.com   

Thursday, 25 December 2014

యువతకు దశా దిశా నిర్దేశం.. సిరివెన్నెల గారి "ముకుంద" చిత్ర గీతం.


సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
నేటి తెలుగు చలన చిత్ర సీమ నోచుకున్న నోముల ఫలం....  ఆయన కలం సాగించిన కృషీ ఫలం  ఆస్వాదించగలిగిన ఆసక్తి ఉంటే  ,  అవలంబించగలిగిన  అనురక్తి ఉంటే   ప్రతి ఒక్కరి జీవితం  సాఫల్యమయం..  ముకుంద సినిమా కోసం ఆయన గీతాలలో    " చేసేదేదో "  అనే గీతం  నేటి  యువతకు కావాల్సిన దశా దిశా నిర్దేశాన్ని చూపించి  చైతన్య వంతులుగా తీర్చి దిద్దుతుంది.  ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణలో ఉన్న మెలుకువ పాఠాలను  ఒక్క పాటలో  సూటిగా, స్పష్టంగా   చెప్పారు సిరివెన్నెల గారు......

ఈ రోజుల్లో  నేటి యువత కు  సరియైన గమ్యం లేదు  లక్ష్యమ్ లేదు   చెడు దారుల్లో వెళ్తుంది.. సమయాన్ని వృథా చేస్తుంది అంటూ  వారిని  ఎందుకు కొరగాని వారిగా, చేతకాని దద్దమ్మల్లా  చూడటం , దూషించటం   చాలా మందికి ఒక ఫాషన్ అయింది. అలా  అందరిలా సోది కబుర్లు చెప్పకుండా  వారికి అర్థమయ్యే రీతిలో,  వారికి ఉత్తేజం కలిగించే రీతిలో  సిరివెన్నెల గారు తన కలాన్ని  సుతిమెత్తగా ఉపయోగించి  వారి సామర్థ్యాల్ని వారికి అర్థమయ్యే రీతిలో కర్తవ్యబోధన చేసారు.   ఇది ముకుంద సినిమాలో హీరో  పాత్ర ని వ్యక్తిత్వాన్ని తెలియచేసేందుకు రాసినా   ప్రతి యువకునికి , జీవితాన్ని ఉపయుక్త కరంగా జీవించాలనుకునే  ప్రతి వ్యక్తికీ  ఒక గీతా బోధనలా ఉంటుంది....

ఇక పాట లోనికి వెళ్తే ....
                     వాగార్థవ  సంప్రక్తౌ వాగార్థ ప్రతిపత్తయే 
                     జగత: పితరౌ వందే పార్వతీ పరమేశ్వర:
వాక్కు  మరియు  దాని యొక్క అర్థం రెండు  ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్లా   విడదీయని బంధాన్ని కలిగి ఉంటాయి.   అర్థం లేని వాక్కు  అర్థ రహితం ..  ఈ  భావనతో   ఈ  పాటను   సిరివెన్నెల గారు రాయడం జరిగింది
నేటి యువత ఏమి చేస్తుందో, ఎందుకు చేస్తుందో ఆలోచిస్తే   ఇంటర్ నెట్ బ్రౌజింగ్,  ఫేస్ బుక్, వాట్స్ ఆప్,  హైక్, ట్విట్టర్ , వైబర్,  రబ్బర్ బంతి  బెట్టింగ్  క్రికెట్ ,  రోడ్డు మూలన మిత్రులతో చిట్ చాట్ లు..   పనికి మాలిన మరియు ప్రమాద కరమైన బైక్ రేస్ లు అమ్మాయిలతో ఫాలోయింగ్.... ఇలా ఈ  లిస్టు కు  అంతం  ఉండదు.   ఇవి చెయ్యొద్దు అని చెప్పడం లేదు అలా అని  చెయ్యమని చెప్పడం లేదు.  ఇవి నీ జీవితానికి   ఎంత వరకు ఉపయోగపడతాయో ఆలోచించుకో మని   చెపుతున్నారు...


పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా

అర్థం ఉన్న  ఓ

పదం కానిదే అర్థం ఉండునా

నీది అయినది నిర్వచనం  ఇచ్చుకో

జీవితానికి ఏం  చేసినా

            అర్థవంతమైన అక్షరాల కలయిక పదం ఎలా అవుతుందో  అర్థవంతమైన పనుల కలయికే జీవితం.  ఇది నీ జీవితం,  నీ జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నావు..  జీవితానికి  నీవు ఇచ్చే నిర్వచనం  ఏమిటి?   ఎవరి జీవితాన్ని  గుడ్డి గా అనుకరించకు ..  నీ ముద్ర ఉండాలి, నీ స్వంత   అర్థం ఉండాలి.. దానికి  తగ్గట్టుగా దానికి జత అయ్యేటట్టు గా   నీవు చేసే  ప్రతి  పని ఉండాలి.   నీ జీవితానికి  నీవు ఇచ్చే  నిర్వచనానికి  తగ్గట్టుగా  ఉన్న పనులే చేయి..  అంతే  కాని  అందుకు విరుద్ధమైన పనులు చేయకు..........

పల్లవి:

చేసే దేదో చేసే ముందే
ఆలోచిస్తే   తప్పుందా?

తోచిందేదో చేసేస్తుంటే
తొందరపాటే కాదా?


ఆచి తూచి అడుగేయ్యోద్దా ...

         నీ  లక్ష్యానికి తగ్గట్టుగా నీవు చేసే ప్రతీ పని ఆలోచించి  ఎటువంటి   తొందరపాటు లేకుండా చెయ్ .. ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా  ఏ  స్నేహితులు ఎన్ని  రకాలుగా ఆకర్షింప చేసినా   ఏ వ్యామోహం  లో  పడకుండా  నీవు చేయబోయే పని నీ జీవితానికి ఉపయోగపడుతుందా  లేదా అని  ఆచి తూచి  నీకు   నీవే ప్రశ్నించుకొని  చెయ్.  ఒక్క తొందరపాటు  పని వలన జీవితసౌదం కూలిపోయే అవకాశం ఉంటుంది  కాబట్టి  ప్రతీ పని ఆలోచించి చేయడం ఏ  మాత్రం తప్పు కాదు.   Haste  Brings  Waste.....

చరణం : 1

ఈతే తెలియాలి నది ఎదురైతే

పూర్తయి తీరాలి  కథ మొదలెడితే

గెలుపే పొందాలి తగువు కి  దిగితే

పడినా లేవాలి

ఏ పూటైనా   ఏ చోటైనా

విడవని పయనం సాగాలి

రాళ్ళే ఉన్నా  ముళ్ళే ఉన్నా

దారేదయినా గాని

కోరే  గమ్యం  చూపించాలి 

          నీవు అన్ని రకాలుగా నిర్ణయించుకొని నీ లక్ష్యాన్ని ఎంచుకోవాలి.  నదిలో దిగేముందే ఈత వచ్చో రాదో చూసుకోవాలి.  మన బలాలు బలహీనతలు  పూర్తిగా అర్థం చేసుకోవాలి.... ఆ లక్ష్యాన్ని పొందే మార్గం లో    ఎన్ని ముళ్ళు ఉన్నా,  రాళ్ళు  ఉన్నా ,ఎలాంటి దారి అయినా పట్టు వదలకుండా , రేయనక, పగలనక  నీవు  కోరి ఎంచుకున్న గమ్యాన్ని చేర్చే మార్గం లో    చివరి వరకు  నడవాలి.    చాలా మంది విద్యార్థులకు   I.A. S.  లేదా   I.P.S.  లేదా  సాఫ్ట్ వేర్ లొ లక్షలు  సంపాదించే  ఉద్యోగం   ఇలా చాలా కోరికలుంటాయి.   కోరికలు ఉండటం  తప్పు కాదు  .  వాటిని సాధించగల   సామర్థ్యం ఉందా లేదా  ఒక వేళ  లేకపోతె వాటిని ఎలా సంపాదిచాలి.  ఇంగ్లీషు లో  నాలుగు మాటలు  తడబడకుండా  మాట్లాడ గలమా?    ఉద్యోగాన్ని సంపాదించే నైపుణ్యాలు ఉన్నాయా ?  ఒకవేళ లేకపోతే     వాటిని    విడవకుండా రేయనక పగలనక  శ్రమించి   సంపాదించగలమా....  అనేక ఇంగ్లీష్   లేదా జాబ్ ఓరియంటెడ్  నైపుణ్యాలు నేర్పించే సంస్థల్లో ప్రవేశం పొందే  విద్యార్థులు  సగం మందికి  పైగా   వారం రోజులు తరువాత మరి కనబడరు.   జిమ్  లొ జాయిన్  అయిన వారు  నెల తరువాత అటువైపు  మొహం చూపరు.....  ఎన్ని కష్టాలున్నా   రాళ్ళు ఉన్నా  ముళ్ళు ఉన్నా   లక్ష్యసాధనా మార్గం లొ చివరి వరకు సాగమని సిరివెన్నెల గారు  ఈ చరణం లో  ఉద్బోధించారు. 

చరణం : 2

స్పష్టంగా పోల్చుకో

శక్తుందా  తేల్చుకో

అతి సుళువుగా అయ్యే పనా  ఏం అనుకున్నా ,,ఓహో..

కష్టాలే ఓర్చుకో ఇష్టంగా మార్చుకో

అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా..ఓహో ..

కలలకి కళ్ళకి   మధ్యన కనురెప్పే అడ్డని

నమ్మకం నిజమయ్యే లోపుగా 

తప్పని నొప్పి ఉండని

ఆకలే వేటగా మార్చటం కాలం అలవాటని

గమనించే తెలివుంటే

ప్రళయాన్ని ప్రణయం  అనవా   

        ఈ   చరణం వచ్చే సరికి    లక్ష్యసాధన లో  ఉండే  కష్టాలని   వాటిని  ఎలా ఓర్చుకోవచ్చో వివరించారు.....
నీ లక్ష్యమ్ ఏర్పరుచుకున్నావు   బాగానే ఉంది.   దానిని సాధించగల  శక్తులు నీకున్నాయా?   ఇంతకు  ముందు ఆ లక్ష్యాన్ని సాధించిన వారి శక్తులతో నీ శక్తులను ఒకసారి పోల్చుకో.    స్పష్టంగా  నీ లక్ష్యమ్  నీకుందో లేదో మరొకసారి చూసుకో .. ఎందుకంటే   ఇది అతి సులువుగా అనుకునే పని కాదు...  కలలు  వేరు,   కళ్ళ  ముందు ఉన్న వాస్తవాలు వేరు.   వాస్తవాలు అనేక కష్టాలతో కూడి ఉంటాయి   అయితే వాటిని ఇష్టంగా  మార్చుకున్నావా   ఏ మాత్రం కష్టం కలిగించవు.     గెలుపు అందినట్టే అంది  ప్రతి మలుపులో ఒక దెబ్బ కొట్టి పడగొడుతుంది..  తప్పించుకోలేని అనేక నొప్పుల్ని,  బాధల్ని తెచ్చిపడుతుంది.  సచిన్ టెండూల్కర్  సాధించిన విజయాలు ఊరికే రాలేదు   నిద్రాహారాలు మాని , అవమానాలు అపజయాలు తట్టుకొని  సాగించిన శ్రమ వలన వచ్చాయి.  You Must Be  Hungry  అంటాడు  Les   Brown..   ఎప్పుడైతే  విజయం పట్ల  ఆకలి పుడుతుందో   అది వేటాడే పులిలా  నిన్ను  తయారు చేస్తుంది.  అది తెలుసుకొని గుర్తించి తెలివి నీకుంటే  ప్రళయాల్ని కూడా  ప్రేమించగలగుతావు.  పనిని  లక్ష్యాన్ని ప్రేమించేవాడికి  విజయం బానిసగా నిలుస్తుంది.   

చరణం: 3

శ్రీ రాముని బాణమై
సాధించిన శౌర్యమే
చేధించదా నీ  లక్ష్యము
యముడు ఎదురైనా

కృష్ణుని సారధ్యమే
సాగిన సామర్ధ్యమే
సాధించదా ఘన విజయం
ప్రతి సమరాన ..ఓహో..

కయ్యమో నెయ్యమో  చెయ్యకు కాలక్షేపానికి
గాలిలో కత్తులే దుయ్యకు శతృవు లేనిదానికి
ఊహతో  నిచ్చెనే వెయ్యకు  అందని గగనానికి

వ్యర్థంగా  వదిలేస్తే
వందేళ్ళు ఎందుకు మనకి 

       ఈ  చరణం లో   విజయ సాధన  లక్ష్య సాధనలో  సాగించాల్సిన  వ్యూహాల గురించి,  చెంత ఉండాల్సిన ఆయుధాల గురించి,  చేపట్టాల్సిన   విధానాల గురించి యువతకు అవగాహన కలిగిస్తున్నారు సిరివెన్నెల గారు...    లక్ష్యసాధన   ప్రాణం కోల్పోయేనంత  ప్రమాదం  ఎదురైనా గురి తప్పని రామబాణం లాంటి  శౌర్యం కలిగి ఉండాలి.  అన్ని  అనర్థాలకు   మూల కారణం  పిరికితనమే.  ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి   ఎన్నడూ ఒదులుకోవద్దురా ఓరిమి   అన్నట్టు  రామబాణం లాంటి గురి కలిగిన    ధైర్యాన్ని ఆయుధం గా కలిగి ఉండాలంటారు ... కురుక్షేత్ర యుద్ధం లొ   శ్రీకృష్ణుడు  ఎలా వ్యూహ రచన చేసాడో  ఎలాంటి  నాయకత్వ లక్షణాలు  ప్రదర్శించాడో  అలాంటి  నాయకత్వ సామర్థ్యాన్ని  కలిగి ఉండాలంటారు. సమర్థవంత సామర్థ్యం ఉంటే   ఎలాంటి సమరం లోనైనా  ఘన విజయం సాధించగలరు.    కాలక్షేపమ్ కోసం ఊసుపోని కబుర్ల కోసం  స్నేహం చేయకు.  పనికి మాలిన అడ్డగాడిదలతో తిరిగే బదులు  లైబ్రరీ కెళ్ళి  మంచి పుస్తకాలు చదువుకో .. కనబడే ప్రతీ వీధి కుక్క తో దొమ్మీ లకు దిగకు.  కయ్యానికైనా నెయ్యానికైనా  సరి జోడు కాదు .....  సరియైన కారణం ఉండాలి. .... చేతిలో ఆయుదం ఉంది కదా... అని మెదడులో తెలివి ఉంది కదా  అని   లేని శతృవులను   సృష్టించుకొని   యుద్ధాలు చెయ్యకు.   ఊహలలో  గాల్లో మేడలు మిద్దెలు కట్టకుండా వాస్తవిక దృక్పధాన్ని  కలిగి ఉండు.  కాకిలా కలకాలం బ్రతకాల్సినవసరం లేదు.  ఎవరికీ చివరికి నీకు నీవు  కూడా ఉపయోగపడకుండా వందేళ్ళు బ్రతకడం వలన ఉపయోగం  ఉందా...  భగత్ సింగ్  ఎన్నేళ్ళు బ్రతికాడు, స్వామి వివేకానంద ఎన్నేళ్ళు బ్రతికాడు.  రాశి కాదు  వాసి  కావాలి...


పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచినా
అర్థం ఉన్న  ఓ
పదం కానిదే అర్థం ఉండునా

నీది అయినది నిర్వచనం  ఇచ్చుకో
జీవితానికి ఏం  చేసినా

      అర్థం లేని పనుల కలయిక కాదు జీవితం అంటే...... అర్థవంతమైన   లక్ష్యభరితమైన  ఉపయోగపూరితమైన కార్యక్రమాల మేలుకలయికే   జీవితం.    విధాత నీవే    విజేత   నీవే....

              బాణాల్లాంటి   మాటలతో  సుతి మెత్తగా   యువత ఉద్బోధ కలిగించే ఈ గీతం   యువతకు ఎలా దశా దిశా నిర్దేశం చెబుతుందో వేరేగా చెప్పక్కర్లేదు.   '' అర్థరాత్రి ఉదయించే సూర్యుడు   సిరివెన్నెల'' అని  త్రివిక్రమ్  గారు ఊరికే చెప్పలేదు..    సిరివెన్నెలగారి కలానికి   ఆయన మేథస్సుకు   యువత పట్ల  ఈ జాతి భవిష్యత్  పట్ల ఆయనకున్న నిబద్ధతకు శిరస్సు వంచి పాదాభివందనాలు  తెలియచేసుకుంటూ.....

                                          ...............   అలజంగి ఉదయ కుమార్
                                                    trainerudaykuaar@gmail.com