Sunday, 7 September 2014

.. గురుభ్యో నమ:.............



పాదాభివందనాలు వద్దు

పుష్ప గుచ్చాలసలే వద్దు 

బహుమానాలు వద్దు 


సన్మానాలసలే వద్దు

మీరేదో ఫీజులు కట్టారు కాబట్టి 


మాకొచ్చిన రెండు ముక్కలు చెప్పామనుకోడానికి 


మా పాఠశాల పచారి కొట్టు కాదు 


చదువిక్కడ అంగటి సరుకు కాదు 


మీరు చెల్లించేది మా శ్రమకే గాని


మేమందించే జ్ఞానానికి కాదు


మీలో మేం కలిగించే ఆత్మవిశ్వాసానికి కాదు


అంత ఎత్తుకు ఎదిగారంటే 


నిచ్చెన మెట్లలా ప్రతి ఉపాధ్యాయుడు తోడ్పడితేనే


డాలర్ల సేద్యాన్ని సాగిస్తున్నారంటే 


ఆనాడు నాగలి గా మే మేథస్సును సుసంపన్నం చేయబట్టే గదా

మీరు సాధించిన విజయాలు చూసి మేం ఉప్పొంగిపోతాం 


ఫలసాయం చేతికొచ్చిన రైతులా మైమరచిపోతాం

మీనుండి మేం ఆశించేది ఓ పలకరింపు 


నిండిన గౌరవం తో మీరిచ్చే ఓ చిరునవ్వే......

వెటకారాలు ఒద్దు. వెక్కిరింతలొద్దు 


చాటుగా మాటుగా సన్నాయి నొక్కులొద్దు....


వ్యంగ్య బాణాలొద్దు..వ్యతిరేకభావనలొద్దు

గురుశాపాలుండవు గాని గురు శోకం మాత్రం ఊరికే పోదు,,,,

Tuesday, 26 August 2014

మనుష్యులం కదా


మనుష్యులం కదా 
మూర్ఖత్వాన్ని
మొండితనాన్ని
పక్కనబట్టి 
అహాన్ని,ఇజాల్ని,  భేషిజాల్ని 
ఏదో ఒక మూలన దాచి పెట్టి
కొంచెం మానవత్వం తో బ్రతుకుదామా.....
గుర్తించబడాలనే కోరిక మంచిదే
నలుగురిలో గొప్పగా
తలెత్తుకోవాలనే తపన తప్పేమీ కాదు
ఒక గీత పెద్దది కావాలంటే 
పక్క గీతలని చెరపాల్సిందేమీ లేదు భాయీ 
అందరికన్న మిన్నగా ఉండేందుకు 
నీలో ఉన్న ఆ ప్రతిభని ప్రదర్శిచేందేకు ప్రయత్నించు
అవకాశం రాలేదా అధైర్య పడకు 
నాలుగేళ్ళు మొలకగా బ్రతికిన
చైనా వెదురు మొక్క 
నిరీక్షణ ఫలించిన తర్వాత 
నింగే తన హద్దుగా ఎదగడం తెలియదా 
ఏనుగు వెళుతుంటే 
అస్థిత్వం  ఏమవుతుందేమో
అంటూ అరిచేది వీధి శునకమే.. 
మనం మనుష్యులం కదా 
ఎదిగే వాళ్ళను చూసి ఆనందిద్దాం.
ప్రతిభ ఎవ్వరిలో కనబడినా 
మనస్ఫూరిగా అభినందిద్దాం. 
మనదైన రోజు వచ్చే వరకు 
కొంచెం మౌనంగా ఉందాం.  
మనశ్శాంతితో జీవిద్దాం. 
వాడిని వీడిని  ఎవడినీ కెలక్కుండా
కవ్వించకుండా  క్రమశిక్షణతో బ్రతికేద్దాం. 

trainerudaykumar@gmail.com

Tuesday, 3 June 2014

గుండెలో తడి ని సజీవంగా నిలిపే చిత్రం మనం


ఈ రాజకీయాలు, ఎన్నికలు, లెక్కింపులు, గెలుపులు , ఓటములు, ఇవన్నీ చూసి చూసి అలిసి పోయారా?  ఏ చానెల్ చూసినా, ఏ పేపర్ చూసినా   ఏవి నమ్మాలో. ఏవి అనుసరించాలో తెలియక యాంత్రికత అలవరుచుకొని  జీవితం లో జీవాన్ని కోల్పోయారా?...  వేసవి లో ఉష్ణతాపాన్ని తట్టుకోలేక తల్లడిల్లి పోయారా? గుండెలో తడి ఆరి పోయి ఆర్ద్రత అంతా ఇంకిపోయి మోడిబారిపోయారా????? 

      ఎడారిలో ఎండమావులవెంట పరుగులెత్తిన వారికి ఖర్జూరపు తోటలతో నిండిన ఒక ఒయాసిస్సు లా, మండువేసవిలో తల్లడిల్లినవారికి ఒక చల్లని జలపాతం హాయిగా  సేద దీర్చే అతి చక్కని చిత్రం " మనం "
  
            ఇక వెంటనే సకుటుంబ సపరివార సమేతం గా " మనం" సినిమాకి వెళ్ళండి. బాగుందట, బాగో లేదట   మగధీర, మూగ మనసులు సినిమాల్లా  పునర్జన్మ తో కూడిన సినిమా అట. అదట ఇదట  అంటూ అందరూ చెప్పిన మాటలు పక్కన పెట్టండి.  లాజిక్కుల్ని, హేతువాద  విశ్లేషణల్ని పక్కన పెట్టి  సినిమా లో పూర్తిగా నిమగ్నమవ్వండి.   కలకాలం గుర్తుంచుకోతగ్గ గుండెను పిండే ఒక రసానుభూతి తో బయటకు వస్తారనడం లో ఏ మాత్రం సందేహం లేదు. 
    భావకవి గా పేరు గాంచిన కృష్ణశాస్త్రి  అడివి అందాలు చూడాలంటే కళ్ళతో కాదు .. ఆకు లో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై అంటూ ఆయా అంశాలతో నిమగ్నమై చూస్తేనే రసస్పూర్తి పొందుతారని వర్ణించారు. ఆరవ బర్త్ డే  ఆనందంగా జరిగి, ఊహించని బహుమానాలతో అందరితో ఆనందించి, తల్లిదండ్రులు అన్యోన్యంగా కీచులాడుకోకుండా ఉండాలని కేక్ కట్ చేసేటపుడు మనస్పూర్తిగా కోరుకున్న ఒక చిన్నారికి మరుసటి దినమే విగత జీవులై తల్లిదండ్రులు కనిపిస్తే , వారు తన నుండి ఏమి కోరుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక వీడియో రూపం లో అందిస్తే అది చూస్తూ పెద వాడైన ఆ బాలునికి తన తల్లి, తండ్రి మరలా కనిపిస్తే.....      ఆ   పాత్రలో  మిమ్మల్ని మీరు ఊహించుకోగలిగితే లేదా కనీసం ఎంపతీ తో ఆలోచించ గలిగితే .....  తాను ఎలాంటి అనుభూతిని పొందనో   తన కడుపును పుట్టిన మరో పాత్ర అదే అనుభూతి పొందితే.....  ఇది కేవలను మాటలతో చెప్పలేని ఒకభావన....   ఎక్కడా ఏ మాత్రం  అసహజం అని అనిపించనీయకుండా  వస్త్రధారణ తో పాటు  గోల్డ్ స్పాట్   సీసా  తో  పాటు అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని ఒక శిల్పం లా మలచిన తీరు చూస్తే దర్శకుడిని అభినందించకుండా ఉండలేరు.  ఒక కుటుంబం మొత్తం  ఆ  కుటుంబం ఎదుగుదలకు మూలవిరాట్టు అయిన ఆ మాహానటునికి ఇచ్చిన ఘన నివాళి ఈ సినిమా.    నట వారసత్వాన్ని  ఒక తరం నుండి మరో తరం అందిప్ అందిపుచ్చుకున్న తీరుని హర్షించకుండా ఉండ లేము.  ఎవరు ఎలా నటించారు, కథ ఏమిటి ఇవన్ని చెప్పాలా?  మీ అనుభూతులు ఎలా ఉండాలో చెప్పడానికి మేం ఎవరం.  చక్కగా సినిమా చూసి ఆనందించండి.  అందరినీ అభనందించండి. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నట్టయితే మనసా వాచా కర్మేణా ప్రేమించండి. ఒక వేళ మన మధ్య లేకపోతే ఏదో ఒక రూపం లో ఎప్పుడో ఒకప్పుడు కనబడతారని ఆశిస్తూ జీవించండి. కళామతల్లి ముద్దుబిడ అక్కినేనికి ఘన నివాళు అర్పించండి. మన తెలుగువాడయినందుకు గర్వించండి.     .. by  A. Uday Kumar

Tuesday, 11 February 2014

Do the work you LOVE


ప్రేమించే పని చేయలంటే గట్స్ ఉండాలిరా అబ్బాయి!
మనం చేసే పని మనకు నచ్చిందే అయితే 
మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేదే అయితే
ఆ కిక్కే వేరురా అబ్బాయి!
సమయం ఎప్పుడైపోతుందో తెలీదు
శరీరానికి అలసట అంటే తెలీదు 
సృజనాత్మకతయే ఆలంబనగా   
రోజూ చేసే పని లో ప్రయోగాలు చేస్తూ 
పరిపూర్ణత్వం వైపు నడుస్తుంటాం. 
ఎవ్వడేమంటున్నాడో
ఎవడు  పలకరిస్తున్నాడో  
ఎవడు పరిహసిస్తున్నాడో 
ఎవడు కలహిస్తున్నాడో
ఎవడు కలహిస్తున్నాడో 
ఎవడు కవ్విస్తున్నాడో 
ఎవడు కలవర పెడుతున్నాడొ
ఆలోచించడానికే సమయం దొరకదు 
చేసే పనిలో నిరంతరం 
ఓ మునిలా
ఓ ధ్యానిలా
ప్రాపంచిక లోకంతో 
లాభనష్టాల బేరీజుతో
ఏ లెక్క లేదన్నట్టు మునిగిపోవడమే 
చేతికి వచ్చే సంపాదన కన్నా
గుండె లో నిండే సంతృప్తి 
యావత్ లోకాన్నే నీ కాళ్ళకింద దాసోహం చేస్తుంది 
కాని అది అంత సుళువు కాదురా చిన్నా 
ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు
ఎవరి సహాయాలు ఉండవు
ఎవరి సూచనలు ఉండవు
లోకం నిన్ను గుర్తించేంత వరకు 
నీ ఆకలి, నీ అవసరాలు
నిరంతరం నీకు గుర్తు చేస్తూనే ఉంటాయి 
ఎవడు మనల్ని తక్కువగ చూస్తున్నాడో అనే
ఆత్మన్యూన్యత  అసలు నిదురే పోనియ్యదు 
ఎవడిని కలిసినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా
అవహేళనా జ్వాలలు గుచ్చుకుంటూనే ఉంటాయి 
నమ్ముకున్నవారికి బరువు అవుతున్నామేమో అన్న వ్యథ 
నిలువెల్లా కాలుస్తునే ఉంటుంది 
ఎదురు చూసే క్షణం నీదైనంతవరకు 
కలలు సాకరమై ఎదురుగా నిలిచేంతవరకు 
జీవితంతో ఫొరాడే ఓపిక, ఓరిమి
నీ ఆయుధాలుగా మలుచుకునే నైపుణ్యం ఉంటేనే
నీవు ప్రేమించే పని జీవితాంతం చేయడానికి సిద్ధపడు 
లేదా మనసు చంపుకొని నాలుగు రాళ్ళు సంపాదించేందుకు 
దొరికిన పని చేస్తూ ప్రతి క్షణం చస్తూ జీవించు...  
  


Sunday, 12 January 2014

సినిమాని లాజికల్ గా ఆలోచిస్తూ చూడాలా?????

సినిమాని లాజికల్ గా  ఆలోచిస్తూ చూడాలా?????
                              సినిమా అనేది మనల్ని ఒక ఊహా లోకం లో ఉంచుతూ కొన్ని వాస్తవాల్ని కొన్ని అభూత కల్పనల్ని  మేళవించి ఆనందాన్ని, వినోదాన్ని, కొన్నిసార్లు విజ్ఞనాన్ని  అందిస్తుంది. వాస్తవానికి బయట ప్రపంచంలో ఎవరూ పాటలు ఫాడుకుంటూ నృత్యాలు చేయరు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. అన్నీ లాజికల్ గా ఉండాలంటే కుదరదు. మన కలలబేహారులు సినిమాలు నిర్మించేవారు.  అవతార్ సినిమాలో లాంటి మానవరూపమో జంతురూపమో తెలియని వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తుంటే  ఆహో  ఓహో  అంటూ ఎగబడీ చూస్తాం. హాలీవుడ్ సినిమల్లో లాజిక్ లు, అవాస్తవాలు వెతకం. ఎందుకంటే వాటిని ఆనందిచిండానికే ప్రాధాన్యత ఇస్తాం, విమర్శించటానికి మాత్రం కాదు. మిష్టర్ ఇండియా  సినిమాలో అనీల్ కపూర్ వాచీ చేసిన విన్యాసాలు కుర్చీనుండి దొర్లిపడీ మరీ ఆనందిచాం.  సోషియా ఫాంటసీ, సైంటిఫిక్ ఫాంటసీ అంటూ తరువాత తమాయించుకుంటాం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల అయిన మొదటి వారం రోజులు పిచ్చిముదిరి ఇలాంటి సినిమా తీసారని విమర్శకులు నాలుకలకి పనిచెప్పారు. కాని పటిస్టమైన  స్క్రీన్ ప్లే. చిరంజీవి ఈజ్ తో చేసిన నటన, శ్రీదేవి అందచందాలముందు అంతా ఔరా అని ఇదొక నూతన ప్రయోగం అని సర్టిఫికేట్ ఇచ్చారు. 
        2001 లో తీసిన అ బ్యూటిఫుల్ మైండ్  అనే సినిమా నోబుల్ బహుమానం పొందిన గణిత శాస్త్రజ్ఞుడు  జాన్ ఫోర్బ్స్ నాష్  జీవిత ఆధారంగా వచ్చిన సినిమా నాలుగు ఆస్కార్ అవార్డ్స్ పొందటమే కాకుండా మరో నాలుగు అంశాలలో ఆస్కార్ నామినేషన్ కూడా పొందింది. దీట్లో హీరో కి కనబడేవారు ఇతరులకి కనబడరు. అమెరికా గూడచారి  సంస్థ తనకు అతి ముఖ్యమైన పని అప్పచెప్పారని భావిస్తుంటాడు. తనకు కనబడే పాత్రలు ఎవరికీ కనబడవు. స్కీజోఫేనియా అనే వ్యాధి తో ముడిపడిన ఇతని పాత్ర అందరికీ విస్మయం కలిగిస్తుంటుంది 
           ఇంచుమించు ఈ సినిమా ప్రేరణ తో తీసిన వన్ నేనొక్కడినే రోటీన్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంది. ఈ సినిమా మీద భారీ అంచనాలుండటం, వన్  నేనొక్కడినే అని టైటిల్ పెట్టడం తో  ఇతర అభిమానుల మధ్య అనవసర పోటీ లాంటి ఆలోచనలు కలిగించడం తో  ఈ సినిమా మొదటి రోజు చాలా భయంకరమైన టాక్ వచ్చింది. మేం తీసుకున్న  టికెట్ లలో ఒకటి ఎక్కువ అవడంతో దానిని  వదిలించుకోడానికి    చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

     ఎవరు ఏమనుకున్నా విభిన్నతలను, ప్రయోగాలను మెచ్చుకునే సహృదయత, కళాభిమానం ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ప్రతీ సీన్ లో రిచ్ నెస్, చివరి వరకు స్టోరీ లో జతచేయబడుతున్న అంశాలు ప్రేక్షకుడ్ని ఆలోచింపచేస్తుంది. దర్శకుడి శ్రమ, తల్లిదండ్రులగురించి మహేష్ బాబు పడే వేదన మంచి సెంటిమెంట్ పండిస్తుంది.  ఒక్కసారి లాజిక్కులకు పోకుండా అర్థం చేసుకోదానికి ప్రయత్నిస్తూ చూడండి. పక్కవాడు ఫాలో అవుతున్నాడో, అర్థం కాక హేళన చేస్తున్నాడో పట్టించుకోకుండా  ప్రతీ క్షణాన్ని, ప్రతీ సీన్ ని  అనందించండి.   కొంత నిడివి తగ్గించబోతున్నారు కాబట్టి  ఈ సినిమా మరో వారం రోజుల్లో  నెమ్మదిగా మంచిటాక్ వస్తుంది. మహేష్ బాబు నటన అందరికీ నచ్చుతుంది. అవసరం లేని రెండుపాటలు కూడా తీసేస్తే ఇంకా మంచిది.  ప్రయోగాలు చేసే టప్పుడు మసాలా ఫార్ములా ల గురించి ఆలోచించకూడదు.  ఇదే ఏ హిందీ సినిమా  కాని ఇంగ్లీష్ సినిమా కాని అయివుంటే తెగ సంబరపడిపోతూ సర్టిఫికేట్స్ ఇచ్చేవారు చాలామంది .