Tuesday, 14 July 2015

హాట్సాఫ్ రాజమౌళి...... శతకోటి ప్రణామాలు



శిలల పై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టి కే  అందాలు తెచ్చినారు   అంటూ ఆనాడు  అమరశిల్పి జక్కన్న సినిమాలో ఒక పాట  ఉంటుంది.  రాజమౌళి  గారిని  ఆయన సన్నిహితులు జక్కన్న  అంటూ ఎందుకంటారో  ఎవరికైనా ఆ మాత్రమో  ఏ మాత్రమో  సంశయం ఉంటే   ఇక అది చెల్లా చెదురు కావలసిందే......

కేన్స్ ఫెస్టివల్ , ఆస్కార్ అవార్డ్  ఫంక్షన్  లేదా   ఏ అంతర్జాతీయ  చలన చిత్ర పండుగ కానీయండి ..  అసలు సిసలైన ప్రతిభకు పురస్కారమిచ్చే  అంతర్జాతీయ వేదిక ఏదైనా కానీయండి ... జేమ్స్ కామరూన్, స్పీల్ బర్గ్  లాంటి ఉద్దండులు    నిస్తేజులై,  చేతలు మాని చేతులు కట్టుకొని  సృజనాత్మకత  తమ తాతగారి సొత్తు అంటూ విర్రవీగిన తమ తలలు ఎక్కడ పెట్టుకొవాలో  తెలియక  తల్లడిల్లుతుంటే  తెలుగు కళామతల్లి  నిండు ముత్తయిదువులా  పట్టుచీర కట్టుకొని    వినయం విధేయతలతో కూడిన గర్వంతో అగ్రాసనాన్ని చేరి  ఉన్నతాసనం పై అధిరోహించిన అవకాశాన్ని కల్పించిన రాజమౌళి  ప్రతిభా పాటవాల్ని   ఎలా చెప్పినా  ఎంత చెప్పినా ... తక్కువే.......

ఈ  సినిమాలో   దొంగల స్థావరంలో  మద్యం  అమ్మే  వర్తకుని పాత్రలో కొన్ని నిమిషాలు  కనబడతారు రాజమౌళి  గారు......  కథానాయకుడు  ప్రభాష్  వచ్చి  మద్యం  అడుగుతాడు.  ఇచ్చిన ప్రతీ చిన్న పాత్రను  ఆవల త్రోసి  ఇంకా భారీ మొత్తంలో  అక్కడకి వినోదం కోసం, వ్యాపకాల కోసం వచ్చిన అందరికీ సరిపడేలా  ఇమ్మని అతని ముందు తాను  తెచ్చిన బంగారు నాణేలు  కుమ్మరిస్తాడు. దాంతో   తన దగ్గర ఉన్న సరుకు మొత్తం  వారి ముందుంచుతాడు... ఈ   సినిమా కూడా అంతే.. వినోదం కావాలంటే  కొసరు కొసరు కాదు   మొత్తం అందరికీ సరిపడేలా  ఇమ్మని అడిగినట్టు   రాజమౌళి తన ప్రతిభ యావత్తూ  ప్రేక్షకుల  ముందు  పరిచివేశాడు.  మరి కథానాయకుడు ఆ కుండలు బ్రదలుగొట్టి  అందరినీ మద్యం మత్తులో ముంచినట్టు  ఈ సినిమా లొ ప్రతీ పాత్ర రస హృదయులైన ప్రేక్షకుల్ని  తన్మయత్వంలో ఆనందపారవశ్యంలో     ముంచి వేస్తుంది......

ఎపుడో  మాయాబజార్  నిర్మించారట . ఇంకెప్పుడో .లవకుశ  కలర్  లొ చిత్రీకరించారట . ఒకానొక సమయంలో .అల్లూరి సీతారామరాజు  సినిమాను అడవిలో ఎన్నో రోజులు  నివసించి తీసారట.... ఇది చరిత్ర   ఈనాటి  తరానికి  తెలియని కేవలం చెబితే విని రాస్తే చదువుకొనే  సత్యాలు..    కాని  ఈ రోజు   ప్రతీ తెలుగు సినిమా ప్రేక్షకుడు  లేదా ప్రతీ తెలుగువాడు   నిజంగా గర్వించదగ్గ విషయం ఏమిటంటే   ఈ అద్భుతం  జరుగుతున్నప్పుడు మనం కూడా   సమకాలీనుకులం  కావడం. ఒక చరిత్ర రాయబడుతున్నప్పుడు మనం కూడా  సాక్షీభూతులం  కాగలగడం, రాజమౌళి మన కాలం నాటి వాడు కావడం  మనవాడు కావడం ..   మన అదృష్టం........

సినిమా ఎలా ఉంది ?  కథ ఏమిటీ?   ఏ రీవ్యూ  లొ ఎవరు ఏమిటి  రాసారు?   ఈ  సినిమాకి ఇచ్చిన రేటింగ్   ఎంత?   ఈ   సినిమా కలెక్షన్స్   ఎలా ఉన్నాయి?   ఈ  ప్రశ్నలు   వేసుకోవడం  అనవసరం......  అసలు రీవ్యూ   అంటే    మళ్ళీ   చూడండి   అని అర్థం    రీవ్యూ   చదవకుండా మళ్ళీ  చూడండి ....  కథ గురించి ఆలోచించక్కరలేదు .. కథనం లొ లీనమవడమే ......  లాజిక్కులు గురించి  విశ్లేషించక్కరలేదు.. రాజమౌళి మేజిక్కు ను ఆస్వాదించడమే...  ఆ పాత్రకు ఈ  పాత్రకు  ఏమిటి సంబంధం  అని ఆలోచించక్కరలేదు.  దేవుడిచ్చిన ఈ రెండు  కళ్ళకు చాలని అంత పెద్ద తెరపై  మనమూ ఒక పాత్రధారులమే అనే భావనతో    కనబడే   ప్రతీ ఫ్రేం లొ   ఒక భాగస్వాములై  రసస్వాదన చెయ్యడమే...........  తమన్నా ఒంటి మీద వాలే సీతాకోక చిలుక అవుతారో ,  తమన్నా ఒంటి పై  పచ్చబొట్టు  వేసే  ప్రభాష్  చేతిలో కుంచె   అవుతారో ....   నీటి కొండ పై ఉరకలెత్తే జలపాతం అవుతారో  అనుష్క ఏరుకొనే కర్రముక్క అవుతారో , అది మీ ఇష్టం.   సినిమాలో  ప్రతీ సన్నివేశం  లొ ప్రేక్షకులు  కుర్చీలను అంటిపెట్టుకొని తనువులు మరచిపోవడం ,,,,  థియేటర్  నలుమూలలా  వ్యాపించిన నిశ్శబ్దం,  ప్రేక్షకులలొ ప్రతి ధ్వనించే  హృదయ స్పందన  ఈ సినిమా   సత్తాకు  సాక్ష్యం...

సినిమా అర్థాంతరంగా   ఆపివేశాడు ...అనే విమర్శ  ఉంది అంటారా?   ఇంతకీ సినిమా పేరు  సరిగా చదివారా ?  బాహుబలి , డి బిగినింగ్    అంటే ఎండింగ్   ఇంకా ఉందనే కదా!   వారపత్రికలకు  వార్తా పత్రికలకు   తేడా తెలియని రోజులలో   వార పత్రికలకు  క్రేజీ   తెచ్చిన యండమూరి సీరియల్స్ ... ప్రతీ వారం ఒక ఊహించని  మలుపు తొ  ఆపేవారు.   తదుపరి  పత్రిక ఎప్పుడు వస్తుందా అంటూ  ఆ పత్రికల గేట్ల వద్ద   ఎంతో ఆసక్తి తొ   పాఠకులు బారులు తీరేవారు.    అభిలాష,  తులసిదళం   ప్రతీ వారం అనూహ్యమైన ఉత్కంఠత  రేపేవి.   దానికి కారణం  యండమూరి  ప్రతీ వారం కథ అంత ఉద్వేగ భరిత ముగింపుతో  ఆపేవారు..... రాజుల రక్షణ కొరకు అంకితమైన  ఒక  బానిస ప్రజల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న  రాజునే  వెన్నుపోటు తొ చంపాల్సిన  పరిస్థితి ఏమిటి?   అనే ఉత్కంఠత  తొ సినిమా   మొదటి భాగం  అంతమవుతుంది...

సినిమా చూస్తున్నంత సేపు కన్నా  థియేటర్  నుండి బయటకు వస్తున్నపుడు ప్రతీ ప్రేక్షకుడు  ఒక అనుభూతితో  మంచి కళాఖండాన్ని   దర్శించిన  గర్వంతో   బయటకు వస్తాడు... ఆ రోజంతా రాజమౌళి  వారిని ఊరికే వదలడు. వారి ఆలోచనల్లో  మిత్రులతో జరిగే   చర్చల్లో  వారి ప్రతి స్పందనల్లో    ఈ  సినిమా మొదటి అంకంలో   ప్రభాష్  ఊహల్లో మెరిసిన తమన్నాలా  దోబూచులాడుతూనే ఉంటాడు...  ఎంతో  అమాయకంగా  కనబడే రాజమౌళి   చలనచిత్ర అభిమానుల చిత్తాలను  అతి చిత్రంగా కొల్లుగొట్టుకుపోయి   దొంగల స్థావరం లొ  మద్యం వ్యాపారి లా సొమ్ము చేసుకుంటున్నాడు .....

మరి ఈ  సినిమా పై  విమర్శలంటారా ???   ఇదేమైనా   ఇంట్లో పెళ్ళాం చేసిన  పకోడీ నా   లేక గోదుమనూక ఉప్మానా !!!  ఉప్పు తక్కువైంది. కరివేపాకు ఎక్కువైంది .. జీడిపప్పు ఉంటే  బాగుండేది  అనే భాష్యాలు చెప్పడానికి...  నచ్చలేదా మళ్ళీ చూడండి.  నచ్చిందా మళ్ళీ చూడండి.. ఎందుకంటే  ఈ సినిమాకి మీలాంటి రసహృదయుల ఆశేర్వాదం అవసరం.....   మరణం అంటే  కళను అవమానించడం..... మరణం అంటే  ఒక సృజనాత్మక  దర్శకుని ప్రతిభను  ప్రోత్సహించక పోవడం...   మరణం అంటే   తెలుగువాళ్ళమై  ఉండి  ప్రపంచ చలనచిత్ర యవనిక మీద విజయధరహాసం చేస్తూ  ఎగురుతున్న ఒక తెలుగు చలన చిత్ర ప్రాభవాన్ని కళ్ళుండీ దర్శించలేకపోవడం..   చేతులుండీ చప్పట్లు కొట్టకపోవడం.  మనసు  ఉండీ.. స్పందించకపోవడం.....

హాట్సాఫ్  రాజమౌళి......  శతకోటి  ప్రణామాలు

రాజన్ పారయామసి  పారయామాసి  రాజన్  పారయామసి
రాజన్ పారయామసి  పారయామాసి  రాజన్  పారయామసి
పారయామసి పారయామసి 
నవో భవతి జయమానోహ్నం కేతు రుష సామేత్యగ్రే 
భాగం దేవేభో విడదా త్యాయ రాస్తున్ప్రచంద్ర మా స్తిరతి దీర్ఘమాయు;


శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి 

ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు   ..........

అలజంగి  ఉదయకుమార్
trainerudaykumar@gmail,com