ఏ కథ అర్థాంతరంగా ముగియదు
అర్థ రహితంగా మిగలదు
అహంకారంతో మొదలెట్టామా
అవమానాలతో అంతమవుతుంది
అత్యాశాలతో అడుగుపెట్టామా
అడియాశలతో అంతరిస్తుంది
అనుమానాలతో అడుగు అడుగు చూసుకుంటూ
అనుక్షణం భయపడుతూ
ముందుకు సాగామా
అపార్థాలతో శాపనార్థాలతో సెలవుతీసుకుంటుంది
ఎవరు ఎవరి జీవితంలో అడుగుపెట్టినా
ఎవరు ఈ యవనిక నుండి నిష్క్రమించినా
నిక్కచ్చైన హేతువేదో ఉండే ఉంటుంది.
నిబద్ధత నీలో నిలువెల్లా ఉన్నప్పుడు
నిస్వార్థం, నిష్కపటం నీ వెంట నీడలై నడిచేటపుడు
సహనం, సంస్కారం పెట్టని కోటలై ఉన్నపుడు
ఏ బంధం నిన్ను బందీని చేయలేదు
ఏ రాగం నీతో పెడ రాగాలు పెట్టించలేదు
నిన్ను ఒంటరిని చేసి వ్యాకులత కలిగించలేదు
ఏ స్నేహం నీ సున్నితత్వాన్ని గాయపరచలేదు
ఆత్మీయతను పంచుకునేవారు ఆత్మబంధువులై నిలుస్తారు
అంతుబట్టని ఎజెండా తో కలిసినవారు రాబందువులై పీడిస్తారు
trainerudaykumar@gmail.com