నిజమే
అవినీతిపరుల్ని ఏకి పారేద్దాం
పీకి పాతరేద్దాం
ఉతికి ఆరేద్దాం
కాని ఎప్పుడు?
హెల్మెట్ పెట్టుకొని బండి నడపగలిగితేనే,
చుట్టూ ఎంత స్థలం వదలాలో అంత వదిలి
నియమాల ప్రకారం ఇళ్ళు కట్టుకోగలిగితేనే,
సెల్‌లో మాట్లాడుతూ బండి నడపకుండా ఉండగలిగితేనే,
సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయగలిగితేనే,
ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ లేకుండా
నిఖార్సైన ఒరిజనల్ పత్రాలతో
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందగలిగితేనే,
టాక్స్ కన్సల్టెంట్ చాకచక్యాల సహాయం తీసుకోకుండా
నిక్కచ్చిగా టాక్స్ మినహాయింపులు లేకుండా కట్టగలిగితేనే
మీటర్ రీడింగ్ మతలబుల కోసం
చేతికి తడి అంటించకుండా కరెంట్ చార్జీలు కట్టగలిగితేనే
ఫుట్ పాత మీదా, జీబ్రా గీతల మీదే నడవగలిగితేనే,
నూటికి నూరుమంది ఓటుహక్కు వినియోగించుకుంటేనే
విశ్వవిద్యాలయాల్లో కులగజ్జికి జాలీమ్ లోషన్‌తో
స్నానం చేయించగలిగితేనే,
ఏ గైడ్ కి చంగాగిరీ చేయకుండా, కాపీ కానటువంటి
ఒరిజినల్ పరిశోధనా పత్రాలు నివేదించగలిగితేనే,
కస్టమ్స్ కళ్ళు కప్పి కనీసం కారప్పోడి కూడా
తీసుకెళ్ళకుంటేనే,
తీసుకునే జీతంలో ప్రతీ పైసా కి న్యాయం చేయగలిగితేనే,
తప్పుడు సమాచారంతో తెల్ల కార్డులు తీసుకోకపోతేనే,
వాస్తవాదాయం తగ్గించి ప్రభుత్వ స్కాలర్ షిప్
పొందకపోతేనే,
తనిఖీకి వచ్చిన పాస్ పోర్ట్ ఉద్యోగికి చిల్లర
సమర్పించకపోతేనే,
ఇవన్నీ చదువుతున్నప్పుడు భుజాలు తడుముకోకపోతేనే,
నిజంగా అవినీతిని పాతరేద్దాం
దుమ్ము దులిపేద్దాం
గురివిందవైఖరికి సలాం కొట్టి
ఆత్మ పరిశుద్దం గావించుకొని
అన్న హజరే ఫోటో పట్టుకొని పవిత్ర నినాదాలు
మనమూ చేద్దాం
అంతర్గత అవినీతికి మంగళం పలికి
నిక్కమైన నీతి పునాదులమీద
భవిష్యత్ భారతావనిని నిర్మిద్దాం
భావితరాలను సగర్వంగా జీవించే
సువర్ణావకాశం కల్పిద్దాం...