Tuesday, 11 February 2014

Do the work you LOVE


ప్రేమించే పని చేయలంటే గట్స్ ఉండాలిరా అబ్బాయి!
మనం చేసే పని మనకు నచ్చిందే అయితే 
మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చేదే అయితే
ఆ కిక్కే వేరురా అబ్బాయి!
సమయం ఎప్పుడైపోతుందో తెలీదు
శరీరానికి అలసట అంటే తెలీదు 
సృజనాత్మకతయే ఆలంబనగా   
రోజూ చేసే పని లో ప్రయోగాలు చేస్తూ 
పరిపూర్ణత్వం వైపు నడుస్తుంటాం. 
ఎవ్వడేమంటున్నాడో
ఎవడు  పలకరిస్తున్నాడో  
ఎవడు పరిహసిస్తున్నాడో 
ఎవడు కలహిస్తున్నాడో
ఎవడు కలహిస్తున్నాడో 
ఎవడు కవ్విస్తున్నాడో 
ఎవడు కలవర పెడుతున్నాడొ
ఆలోచించడానికే సమయం దొరకదు 
చేసే పనిలో నిరంతరం 
ఓ మునిలా
ఓ ధ్యానిలా
ప్రాపంచిక లోకంతో 
లాభనష్టాల బేరీజుతో
ఏ లెక్క లేదన్నట్టు మునిగిపోవడమే 
చేతికి వచ్చే సంపాదన కన్నా
గుండె లో నిండే సంతృప్తి 
యావత్ లోకాన్నే నీ కాళ్ళకింద దాసోహం చేస్తుంది 
కాని అది అంత సుళువు కాదురా చిన్నా 
ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు
ఎవరి సహాయాలు ఉండవు
ఎవరి సూచనలు ఉండవు
లోకం నిన్ను గుర్తించేంత వరకు 
నీ ఆకలి, నీ అవసరాలు
నిరంతరం నీకు గుర్తు చేస్తూనే ఉంటాయి 
ఎవడు మనల్ని తక్కువగ చూస్తున్నాడో అనే
ఆత్మన్యూన్యత  అసలు నిదురే పోనియ్యదు 
ఎవడిని కలిసినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా
అవహేళనా జ్వాలలు గుచ్చుకుంటూనే ఉంటాయి 
నమ్ముకున్నవారికి బరువు అవుతున్నామేమో అన్న వ్యథ 
నిలువెల్లా కాలుస్తునే ఉంటుంది 
ఎదురు చూసే క్షణం నీదైనంతవరకు 
కలలు సాకరమై ఎదురుగా నిలిచేంతవరకు 
జీవితంతో ఫొరాడే ఓపిక, ఓరిమి
నీ ఆయుధాలుగా మలుచుకునే నైపుణ్యం ఉంటేనే
నీవు ప్రేమించే పని జీవితాంతం చేయడానికి సిద్ధపడు 
లేదా మనసు చంపుకొని నాలుగు రాళ్ళు సంపాదించేందుకు 
దొరికిన పని చేస్తూ ప్రతి క్షణం చస్తూ జీవించు...