Time
Management అనేది ఈ రోజుల్లో అత్యంత తరుచుగా చర్చించబడే విషయం
అయిపోయింది. ఇంతకు ముందు ఈ విషయం కేవలం కార్పోరేట్ సంస్థలలో ఉన్నత స్థాయి
అధికారులకు, కార్యనిర్వాహకులకు మాత్రమే సంబంధించిన విషయంగా పరిగణించే
వారు.
నర్సరీ పిల్లాడి నుండి విశ్రాంత జీవనం గడిపేవారి దాక ఈ రోజుల్లో
అందరినోటినుండి వచ్చే మాట ఒక్కటే. సమయం చాలడం లేదు. ఒక్కోసారి పిల్లలు
తమ తల్లిదండ్రులను అడుగుతుంటారు '' రోజుకి ఇరవై నాలుగంటలే ఎందుకు మరో రెండు
గంటలు ఎక్కువ చెయ్యవచ్చు కదా.'' అని. మనలో కొందరికి నిజమే కదా అనే
ధర్మసందేహం కూడా వస్తుంది. పూర్వం వ్యవసాయ ప్రధాన మరియు ఉమ్మడి కుటుంబాలు
ఉండే సమయాలలో ఉన్న సమయం అందరికీ సరిపోయేదేమో కాని నేటి ఆధునిక,
పారిశ్రామిక, వ్యష్ఠి కుటుంబాల కాలం వచ్చే సరికి రోజు రోజుకి
విస్తృతమౌతున్న పని ఒత్తిడి ఏ పని సమయానికి అనుకున్నట్టు గా జరగనీక తీవ్ర నిరాశకు నిస్పృహలకు అంతే కాకుండా పలుచనైపోతున్న ఆత్మీయ బంధాలకు దారి తీస్తుంది.
ఇంతకీ టైం మేనేజ్ మెంట్ అంటే ఏమిటి ? అందులో
ప్రధానమైన విషయాలేమిటి ? మనకు దైనందిన వ్యవహారాల్లో ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే విషయాల
గురించి తెలుసుకుందాం. బయట కంపెనీల్లో పనిచేసేవారికైనా లేదా ఇంట్లో ఉండే గృహుణులైనా తాము అయినా
చేయవలసిన పనులను శాస్త్రీయంగా ఎలా నిర్వహించవచ్చో తెలుసుకుందాం. దీని వలన
మాకేమి ఉపయోగం ? ఇలా అయితే పనులు తగలడి నట్టే అనే ఆలోచన వస్తుందా?
ముందు మనస్సులోంచి తొలగించి సానుకూలంగా ఆలోచిస్తూ మీకు ఉపయోగపడేవి మరియు
పాటించడానికి వీలున్నవి వీలైనంత వరకు పాటించండి.
టైం మేనేజ్ మెంట్ నిర్వచనం;
టైం మేనేజ్ మెంట్ ( సమయ పాలన) అంటే నిర్ధిష్టమైన పనులను
చేపట్టేడపుడు అందుబాటులో ఉన్న సమయాన్ని, సక్రమంగా వినియోగించుకునేందుకుతగిన
పద్ధతులు, నైపుణ్యాలు, చిట్కాలు, విధానాలు వినియోగించడమే.
అంటే మనం
ఏదైనా పనిని చేపట్టేడపుడు మనకు అందుబాటులో ఉన్న సమయం లో ఆ పని ఎలా పూర్తి
చేయాలో అందుకు ఏ పద్ధతులు అనుసరించాలో తెలియచేసే కార్యనిర్వాహక ప్రణాళిక.
టైం మేనేజ్ మేంట్ లో ప్రధానమైన అంశాలు
planning, ; ప్రణాళిక
Division of work ; పని విభజన
allocating, ; పనిని కేటాయించుట
setting goals, ; లక్ష్య నిర్దేశన
delegation, ;అధికారాన్ని బాధ్యతలను బదిలీ చేయుట
analysis of time spent, ; పూర్తయిన సమయాన్ని పున; పరిశీలించుట ·
monitoring, పర్యవేక్షణ
organizing, నిర్వహణ
scheduling, సమయాన్ని పనులకు అనుగుణం గా కేటాయించుట
prioritizing. పనుల ప్రాధాన్యతలను బట్టి వర్గీకరించుట
పైన పేర్కొన్న మేనేజ్ మెంట్ పదాలను చూసి ఇదేదో మనకు
సంబందించని లేదా మనకు సంబంధం లేని విషయాలు అనుకోకండి. ఇవన్నీ మీరు నిత్యం
ఇంట్లో బయట అన్ని విషయాలలో పాటిస్తున్నవే.
OBSTACLES : ఆటంకాలు ; ప్రతి ఒక వ్యక్తి సమయానుకూలంగా తన పనులను, సమయానికన్నా ముందుగా చేయాలనుకుంటాడు. కావాలని సమయాన్ని ఎవరూ వృథా చేసుకోడు. అయినప్పటికీ కొన్ని అనివార్యమైన పరిస్థితుల ప్రభావం వలన లేదా తన చేతిలో లేని బయట కారణాల వలన తన ప్రమేయం లేకుండా సమయం వృథా అవడమే కాకుండా అనుకున్న పనులు వాయిదా పడుతుంటాయి. ఈ ఆటంకాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. అవి.
A. బహిర్గత ఆటంకాలు External Obstacles B. అంతర్గత ఆటంకాలు Internal Obstacles వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
A. బహిర్గత ఆటంకాలు External Obstacles ;
బహిర్గత ఆటంకాలంటే మన ప్రమేయం లేకుండా మన పనులకు ఆటంకం కలిగించేవి. అవి. 1. అంతరాయాలుః (Interruptions): మెయిల్స్, చాటింగ్, ఫేస్ బుక్, ఫోన్స్ మొదలగునవి మనం చేసే పనిని నిలుపుదల చేసి అసలు పని మాని లేనిపోని విషయాలతో సమయాన్ని వృథా పరుస్తుంటాయి.
2. బాతాఖానీలు (Socializing conversations): ఆఫీస్ లో గానీ ఇరుగు పొరుగు తో ఖానీ అదేపని గా ప్రపంచంలో అన్ని విషయాలు, రాజకీయాలు, వార్తా పత్రికల్లో విషయాలు, క్రికెట్ మ్యాచుల పై విశ్లేషణలు, టీ.వీ. సీరియళ్ళ పై వ్యాఖ్యానాలు ఒకటేమిటీ అనేకరకాలైన పిచ్చాపాటి కబుర్లతో గంటలు గంటలు భోంచేస్తూ బ్రేవ్ మని తేన్చుతుంటారు. తీరా సమయం వృథా అయిన తర్వాత తీరిగ్గా ఎదుటివారివలనే సమయం పాడయిపోయిందని బాధపడుతుంటాం. వాళ్ళుకూడా అలాగే భావిస్తుంటారని మనకు తెలియకపోవడం ఒకవిధం గా మన అధృష్టమే.
౩. అనేక పనులు ఒకేసారి చేయడం ( Multi Tasking): సవ్యసాచుల్లా రెండు చేతులతో నాలుగు పనులు ఒకేసారి నెత్తిన వేసుకోవడం వలన ఏ పని పూర్తికాకుండా అన్ని పనులు చెడగొట్టుకుంటుంటారు చాలామంది. ఇలా అనేక పనులు ఒకేసారి చేయాలనుకోవడం కూడా ఒకవిధంగా పనులు సమయానికి జరగడానికి ఆటంకమే.
4. అనుకోకుండా వచ్చే అతిథులు (Unscheduled Visitors): తిథి, వారం, నక్షత్రం చూడకుందా వచ్చే వాళ్ళే అతిథులంటారట. కాని మనం ఏదైనా పనికోసం బయలుదేరుతున్నప్పుడు అతిథులు గాని ఎవరైనా మనతో పని కోసం వస్తే తప్పనిసరిగా మన పనిని వాయిదా వేసుకొని వాళ్ళకు మనం సమయం కేటాయించవలసి వస్తుంది. అలా అని మన పనులకోసం వాళ్ళతో సమయం గడపకపోతే మన మర్యాదకే లోపం ఏర్పడుతుంది. మన పనులు సమయానికి జరగకపోడానికి మనింటికి ముందస్తు సమాచారం లేకుండా వచ్చే సందర్శకులు కూడా ఒక కారణమే.
5. అస్తవ్యస్తంగా ఉన్న పని పరిస్థితులుః (Poor Work Environment) కంపెనీలో గాని. ఆఫీస్ లో గాని ఇంట్లో గాని పరిసరాలు సరిగా లేకపోతే చేసే పని సమయానికి జరగకపోవచ్చును. అస్తవ్యస్తంగా ఉన్న పరిసరాలు చికాకు పెడుతూ, ఏ వస్తువు సమయానికి దొరకక, నిత్యం కావలసిన వస్తువుల కోసం వెతుక్కుంటూ సమయం వృథా అవుతుంది. ఎక్కడ ఏ వస్తువు ఉందో, కాళ్ళకు ఏదో వస్తువు తగులుతూ ఉంటే అరికాలమంట తలకెక్కుతూ ఉంటుంది. కాలుష్యం, వేడి, దుర్గంధం మొదలైనవి శ్రామికుల ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని ఎల్టన్ మేయో అనే మేనేజ్ మెంట్ నిపుణుడు ఎప్పుడో నిరూపించాడు.
6. అస్పష్టమైన లక్ష్యాలు ( Unclear Goal): చేయవలసిన పని మీద సరియైన స్పష్టత లేకపోతే, ఒక పని ఎందుకు చేయాలో, ఎప్పుడు చేయాలో ఒక అవగాహన మరియు స్పష్టత ఉంటే ఆ పని సమయానికి జరగడానికి అవకాశం ఉంటుంది. లక్ష్యం ఉన్న వ్యక్తి వంద తప్పులు చేస్తే లక్ష్యం లేని వ్యక్తి వేయి తప్పులు చేస్తాడని స్వామి వివేకానంద అన్నాడు. అస్పష్టమైన లక్ష్యాలు మన పనులు సమయానికి జరగక పోడానికి సమయం వృథా కాడానికి ఒక కారణం మరియు అతి ముఖ్యమైన ఆటంకం.
7. ఇతరుల సహకారం పై అతిగా ఆధారపడటం ( Too much dependency on others' cooperation): మన పనులు మనంతట మనం చేసుకోవడం మాని ఇతరుల సహకారం మీద అతిగా ఆధారపడటం కూడా సమయం వృథా అవడానికి ఒక కారణం. కంపెనీ లో అన్ని విభాగల మధ్య సమన్వయం, సహకారం లోపిస్తే పనులు సకాలం లో జరగక పనుల్లో స్తబ్దత ఏర్పడి కాలహరణం జరుగుతుంది.
8. ఉద్యోగ స్వామ్యం ( Bureaucratic Red Tape) : ఇది సంస్థలలో పనులు జరగడానికి వ్యవస్థాపితమైన క్రమానుగత శ్రేణిని అనుసరించి నియమాలకు అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. ఒక ఫైల్ అన్ని విభాగాలకు వెళ్ళి రావాలంటే చాలా సమయం పడుతుంది. అలా అని నియమాలను ఉల్లఘించినట్లైతే అది అధికార దుర్వినియోగమవుతుంది. ఇది చాలా కాలయాపనకు ,జాప్యతకు దారి తీస్తుంది.
B. అంతర్గత ఆటంకాలు Internal Obstacles :
అంతర్గతమైన ఆటంకాలంటే కేవలం మన అలవాట్లవలన, ప్రవర్తన వలన మన దృక్పథాల వలన మన పనుకు జరగడానికి ఏర్పడే ఆటంకాలు.
1. వాయిదా వేసే గుణం ( Procrastination): కొంతమంది పనులను తీరిగ్గా వాయిదా వేస్తూ, తీరా గడువు సమీపించేసరికి హైరానా పడుతుంటారు. " కొండలా కోర్సు ఉంది. ఎంతకీ తగ్గనంది, ఏందిరా వింత గొడవా? ఉందిలే సెప్టెంబర్ మార్చి పైన, వాయిదా పద్ధతుంది దేనికైనా" అని అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాలో ఒక పాట ఉంటుంది. అలా ప్రతి పని పని వాయిదా వేస్తుంటారు. దీనివలన చివరి నిమిషంలో పని జరగకపోవడం లేద పెద్ద మొత్తం లో డబ్బు చెల్లించవలసి రావడం జరుగుతుంది. చాలామంది ప్రయాణాలు ముందుగా వెళ్ళలని తీర్మానించుకున్నప్పటికీ చివరి నిమిషం వరకు రిజర్వేషన్ చేయించరు. ఈ వాయిదా గుణాన్ని బాగా అర్థం చేసుకున్న అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తత్కాల్ స్కీమ్ ప్రవేశపెట్టి ఇండియన్ రైల్వేస్ ని లాభాల బాట పట్టించారు. విమానంలో ప్రయాణించేవారు కూడా ముందుగా రిజర్వ్ చేసుకుంటే చాలా తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాని చాలా మంది చివరి నిమిషం వరకు వాయిదా వేస్తూ ఆయా విమానయాన సంస్థలను పోషిస్తూ ఉంటారు.
ఈ వాయిదా వేసే తత్వం మన వాళ్ళల్లో ఎంత పురాతనమైనదో చెప్పడానికి కబీర్ మహశయుడు ఒక చక్కని దోహే లో ఇలా చెప్పాడు.
కల్ కరే సో ఆజ్ కర్ ఆజ్ కరే సో అబ్ కర్ పల్ మే పర్లయ్ హోయేగీ బహురీ కరోగే కబ్ దీని అర్థం ఏమిటంటే రేపు చేయాలనుకున్నదీ ఈ రోజే చెయ్యు. ఈ రోజు చెయ్యాలనుకున్నది ఇప్పుడే చెయ్యు. క్షణకాలంలో ప్రళయం రావచ్చు. తర్వాత ఏమి చెయ్యగలవు. కాబట్టి వాయిదా వేసే తత్వం మంచిది కాదని. అతని అభిప్రాయం.
2. ప్రణాళిక లేక పోవడం ( Lack of Planning) : ఏదైనా పని చేసే ముందు పని ఎలా చెయ్యాలి. దానిని వివిధ భాగలుగా విభజిస్తూ ఒక ప్రణాళిక అవసరం. If you fail to Plan, You plan to fail అన్నది ఆంగ్ల సామెత. అంటే ప్రణాళిక వేయడం లో విఫలమైతే, విఫలమవడానికి ప్రణాళిక వేస్తున్నట్టే అని అర్థం. ప్రణాళిక వేయడం ఎంత ముఖ్యమో దానిని అనుకున్నట్టుగా అమలు చేయడం అంతే ముఖ్యం. Plan without Action is Futile but Action without plan is fatal. ప్రణాళిక ఉండి అది అమలు చేయకపోతే అది వ్యర్థం కాని అసలు ప్రణాళిక లేకుండా పని చేస్తే అది ప్రమాదకరం. ప్రణాళిక లేకుండా పని చేయడం వలన తక్కువ సమయంలో పూర్తి కావలసిన పనులు ఆలస్యం కావచ్చును.
3. ప్రాధాన్యతల క్రమం లేకపోవడం ( Lack of Prioritization) : నేటి ఆధునిక కాలంలో మనిషి చాలా బిజీ అవుతున్నాడు. ఉన్న కొద్ది సమయంలోనే అనేక పనులు చేయవలసి వస్తుంది. ఏ పని వెంటనే చేయాలి. ఏ పని ఇతరులకి అప్పగించాలి ఏ పని తరువాత చేయవచ్చు అనే విషయం లో అవగాహన లోపించడం వలన ముందు చేయవల్సినది వెనుక, తరువాత చేయవలసినది ముందు చేస్తూ తన జీవితాన్ని కిందా మీదా చేసుకుంటున్నాడు. ప్రధాన మంత్రి కైనా, తపాలా బంట్రోతుకైనా ఉన్న సమయం రోజుకి ఇరవై నాలుగు గంటలే. ఉన్న సమయాన్ని తన ప్రాధాన్యతల ప్రకారం ఉపయోగించుకోవాలి.
4. సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోవడం ( Indecisive Nature): సరియైన సమయంలో సరియన నిర్ణయం తీసుకోవడం లో విఫలమైతే దాని ప్రభావం మన సమయం పై పడుతుంది. the decision that delayed is the decision not taken అని అంటారు. ఆలస్యం గా చేసిన నిర్ణయం అసలు నిర్ణయమే కాదని. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే దాని అమలులో మరింత ఆలస్యమవుతుంది. పని సకాలంలో పూర్తి చేయడం కూడా కష్టమవుతుంది. దాని ప్రభావం ఇతర పనులపై కూడా పడుతుంది.
5. పరిపూర్ణత్వానికై పరితపించుట ( Perfectionism) : చాలా మంది పనులు చేసే టపుడు నూటికి నూరుపాళ్ళు ఖచ్చితంగా జరగడానికి చూస్తుంటారు. ఉన్నంతలో పరిపూర్ణతకోసం ప్రయత్నించడం మంచిదే కాని ఆ క్రమంలో అన్ని పనులు ఆపి ఆ ఒక్క పనిలో నిమగ్నమైతే ఉన్న సమయం కాస్త గడిచిపోతుంది. ఎంత బాగా చేసినా ఏదో ఒక తప్పిదం జరగడానికి అవకాశం ఉంటుంది. అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపనంత వరకు అలా వదిలేస్తే మంచిది. అలా కాదని చేసిందే చేసుకొని కూర్చుంటే అది ఒక Obsession Compulsion Disorder అనే మానసిక జాడ్యానికి దారి తీస్తుంది.
6. మానసిక, శారీరక అలసట ( Mental and Physical Exhaustion) : పనికి పనికి మధ్య తగిన విశ్రాంతి తీసుకోకుండా అదే పనిగా కొనసాగించడం వలన శారీరకంగా, మానసికంగా అలసిపోవడం వలన చేస్తున్న పనులు ఆలస్యమై ఏ పని సరియైన సమయానికి జరగదు. సాధ్యమైనంతవరకు అలసట ఉన్నప్పుడు చేస్తున్న పని ఆపి విశ్రాంతి తీసుకోవడం మంచిది.
7. మొహమాటం ( Not being able to say NO) : చాలామంది తమకు తమపై అధికారి గాని లేదా స్నేహితులు గాని ఏదైనా పని అప్పచెబితే అది వారి వలన సాధ్యం కాకపోయేటప్పటికీ మొహమాటం కొద్దీ ఆ పనిని చేస్తామని ఒప్పుకుంటారు. ఆ పని చేయలేక చేయలేమని ఒప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అందరి వద్ద చివరికి మాట పడటమే కాకుండా వాళ్ళ పనికూడా పూర్తి చేయలేకపోతారు. అందరినీ సంతృప్తి పరచడం చాలా కష్టం. ఎంత మంచి అనిపించుకోవాలని ప్రయత్నిస్తే అంత చెడ్డ అనిపించుకోడానికి అవకాశం ఉంటుంది.
8. క్రమబద్ధత లేకపోవడం ( Lack of Orderliness): చాలామంది తాను పని చేసే చుట్టూ ఉన్న పరిస్థితులు, తాను ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచుతూ, పని అయిన తర్వాత వాటిని యథాస్థానంలో ఉంచుతారు. ఈ రకమైన క్రమశిక్షణ వలన మరలా ఆ వస్తువులు అవసరమైనప్పుడు వెతుకుతూ సమయాన్ని వృథా చేస్తుంటారు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని, పనిచేసే ప్రదేశాన్ని చూసి పనితనాన్ని చూడాలంటారు. జపాన్ వారి పద్ధతి అయిన 5S బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణం చాలా మందిలో ఈ క్రమశిక్షణ లోపించడమే.
9. తగిన ప్రేరణ, ఉత్సాహం లేకపోవడం ( Lack of Motivation and encouragement ) : చాలామంది స్వతహాగా చాలా నెమ్మదిగా, నిస్తేజంగా పని పట్ల ప్రత్యేకమైన ఉత్సాహం లేకుండా తక్కువ ప్రేరణ తో ఉంటారు. వారికి తగిన గుర్తింపు లేకపోవడం వలన గాని, వారిలో ప్రేరణ కలిగించకపోవడం వలన గాని monotony కి లోనై ఏ పని పైన శ్రద్ధ చూపరు. దీని వలన అనుకున్న సమయానికి పనులు జరగవు. అందుకే అన్ని సంస్థలలో ఉద్యోగులలో ప్రేరణ కలిగిస్తూ వారికి తమ పని పట్ల ఉత్సాహం, ఉత్తేజం కలిగించడాని మానవ వనరుల అభివృద్ధి విభాగం ఏర్పాటు చేయడం, సాంస్కృతిక కార్యకలాపాలకు, సెలవుతో కూడిన విహారయాత్రలకు అవకాశం కల్పిస్తుంది.
10. ఒత్తిడి ( Stress): ఈ రోజుల్లో సమాజంలో అన్ని వర్గాల వారి లో పని వలన వచ్చే ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. Unrealistic deadlines, Inspections, Review meetings, Report Submissions ఒకటేమిటి అన్ని రకాలుగా తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. ఇది ఉద్యోగుల పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో కూడా తెల్లవారి పిల్లలను స్కూల్ కి పంపించడం వారికి కేరేజ్ కట్టడం, శ్రీవారికి ఇస్త్రీ బట్టలు అందించడం మొదలుకొని ఆఫీస్ కి పంపించడం ఇలా అనేక పనుల మధ్య ఒత్తిడితో అపర కాళిక మాతల్లా ఉంటారు. ఇలా ఒత్తిడికి గురయ్యే వారిలో హర్మోన్ల సమతౌల్యం కూడా దెబ్బతిని వారి ఉత్పాదక సామర్ధ్యం తగ్గుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
ADVANTAGES OF GOOD TIME MANAGEMENT : సమయాన్ని సరిగా నిర్వహించుకోడానికి ఉపయోగపడే వివిధ పద్ధతులు, చిట్కాలు, నైపుణ్యాలు గురించి తెలుసుకునే ముందు అసలు సమయాన్ని సరిగా నిర్వహించడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుంటే వాటిపై మనకు ఆసక్తి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
1.Goals and Objectives are Achieved: లక్ష్యాల సాధనః సరియైన టైం మేనేజ్ మెంట్ పద్ధతులను అలవరుచుకుంటే మన లక్ష్యాలు, ఉద్ధేశ్యాలు మనం సకాలంలో ఎటువంటి హైరానా లేకుండా నెరవేర్చుకోడానికి అవకాశం ఉంటుంది. 2.Confidence and Good will are increased: ఎప్పుడైతే మన పనులను సకాలంలో , సక్రమంగా పూర్తి చేయగలుగుతామో మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ఇతరులలో మన పట్ల గురి పెరుగుతుంది. ఏ పని సరిగా చేయకపోతే మన విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా ఇతరులు మనల్ని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది. 3.Stress will be reduced:( ఒత్తిడి తగ్గుతుంది) సరియైన టైం మేనేజ్ మెంట్ పద్ధతుల్ని అలవాటు చేసుకుంటే ఒక క్రమ పద్ధతిలో మన పనులు మనం సకాలం లో పూర్తి చేయడం వలన మనపై ఎటువంటి ఒత్తిడి, చిరాకులు ఉండవు. ఇతరులతో చిన్న చిన్న విషయాలకు చిరాకు పడాల్సిన అవసరం ఉండదు. 4.Peace of Mind and Sense of Achievement:(మానసిక ప్రశాంతత మరియు సంతృప్తి): పని పట్ల సరియైన క్రమశిక్షణ అలవడుతుంది. తత్ఫలితంగా పనులు సరిగా జరగడం వలన మానసిక ప్రశాంతత అలవడుతుంది. లక్ష్యాలు సాధించామనే తృప్తి కలుగుతుంది. 5.Increased energy: పనులు సరిగా పూర్తి కాక హైరానా పడుతూ ఉన్న శారీరక మానసిక శక్తులను దుర్వినియోగపరచుకోవలసిన స్థితి ఏర్పడదు కాబట్టి సమయ పాలన సరిగా చేసుకొనే వారికి శక్తి పెరుగుతుంది. 6.Increased Productivity: చేస్తున్న పని సమయానికి పూర్తికావడం వలన ఇంకా ఎక్కువ పనులు చేయడానికి సమయం మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ పనులు చేయడం ద్వారా తన ఉత్పాదకత పూర్తిస్థాయిలో ఉండే విధంగా పనిచేయగలడు. 7.Financial stability (ఆర్ధిక సుస్థిరత): శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అన్నాడో కవి. ఎప్పుడైతే తన కర్తవ్యాలని సరిగా నిర్వహించ గలుగుతాడో తన రంగం లో ఉన్నత స్థానానికి చేరుకోడానికి అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా ఆర్ధికంగా కూడా ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది. 8. Promotion in the Job ( ఉన్నత స్థాయికి ఎదుగుదల). ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగం పొందినపుడు తన విధులను ఎటువంటి జాప్యత లేకుండా సరిగా చేయగలగడం ద్వారా ఉన్నతాధికారుల ధృష్టిలో పడతాడు. నేటి కార్పోరేట్ రంగం లో కేవలం పనితీరు బట్టే ప్రమోషన్లు ఉంటాయి. ఉన్న పని చేయడానికి పరేషాన్ అయ్యేవాడికి ప్రమోషన్ కాదు ఫైరింగ్ ఆర్డర్ సిద్ధంగా ఉంటుంది. 9. Maximum Utilization of Time; (సమయాన్ని గరిష్టంగా సదుపయోగం చేయగలడం) ఒకే పని నాన్చుకుంటూ చేస్తుంటే సమయం వృథా అవడమే కాకుండా సమయ గరిష్ఠ వినియోగం తగ్గిపోతుంది. ఒక పద్ధతి ప్రకారం పనిచేసే వారు సమయాన్ని గరిష్ఠంగా వినియోగించుకోగలుగుతారు. 10. Stronger Family Bonds ( కుటుంబ బాంధవ్యాల అభివృద్ధి) చాలా మంది ఆఫీస్ లో పని సకాలంలో పూర్తిచేయలేక ఆ ఫైళ్ళన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో వారితో ఉలుకు పలుకు లేకుండా ఫైళ్ళల్లో మునిగిపోతారు. కంపెనీ విషయాలు చర్చిస్తూ ఆ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు అంటూ ఫోన్ లో కూడా తోటి ఉద్యోగస్తులతో చర్చిస్తూ ఇంట్లో వారిని ఉపేక్షిస్తుంటారు. దానివలన కుటుంబ సభ్యులలో నిర్లిప్తత ఏర్పడుతుంది. అలా కాక సమయపాలన సరిగా చేస్తూ ఎక్కడ పనులు అప్పటి కప్పుడే పూర్తిచేయగలిగితే ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. అందరి మధ్య ప్రేమాభిమానాలు పరిడవిల్లుతాయి.
WHAT IS THE VALUE OF THE TIME....
value of One Year: ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే ఒక విద్యా సంవత్సరం కోల్పోయిన విద్యార్థిని అడిగితే తెలుస్తుంది. EAMCET లేదా I.I.T. లో రాంక్ రాకపోవడం వలన ఆ విద్యార్థి లాంగ్ టెర్మ్ కోచింగ్ తీసుకుంటే తరువాత సంవత్సరం కోర్సు లో జాయిన్ అయితే ఆ విద్యార్థి ఉద్యోగం పొందినంతవరకు విద్యా సంవత్సరం లో ఎందుకు తేడా వచ్చిందో వివరించాల్సి ఉంటుంది. అంతే కాక తనతో చదువుకునే వాళ్ళకు జూనియర్ అవుతాడు. ఒక సంవత్సరం విలువ ఆ విద్యార్థి కి బాగా తెలుస్తుంది.
value of One Month: ఒక నెల విలువ తెలుసుకోవాలంటే ఎనిమిదో నెల గర్భం తో ఉన్న ఒక స్త్రీ గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్తే ఆమె తనని పరిశీలించి అత్యవసరంగా సిజెరియన్ చేసి బిడ్డయొక్క రక్షణ్ దృష్ట్యా బయటకు తీసి ఇంక్యుబేటర్ లో ఒక నెల రోజులు ఉంచితే ఆ బిడ్డ సంరక్షణ కోసం తల్లడిల్లే ఆ తల్లికి ఒక నెల యొక్క విలువ తెలుస్తుంది.
value of One Week:
ఇంకా ఉంది.............