ఓ సంపూర్ణమైన ప్రేమ కు పరిపూర్ణమైన
ప్రతిబింబం,
క్రిష్ జాగర్లమూడి దార్శినికత కు
నిలువెత్తురూపం " కంచె"
ప్రేమించడం అంటే బ్రతికించడం ..కేవలం
మనుషుల్ని కాదు .. ఆశలను బ్రతికించడం ..ఆపన్నులను బ్రతికించడం, అనుచరులను బ్రతికించడం, ఆశయాలను బ్రతికించడం, ఇచ్చిన మాటను బ్రతికించడం..
రాయల్ ఆర్మీని జర్మనీ సైన్యం
చుట్టుముట్టినప్పుడు లొంగిపోతే తన అనుచరుల ప్రాణాలు మిగులుతాయని లొంగిపోవాలని
నిర్ణయించిన కమాండెంట్ గాని , లొంగిపోయిన వారిని మ్యూనిచ్ ఒప్పందాన్ని
ఉల్లంఘించి చంపబోతున్న జర్మనీ సైన్యం నుండి
వారి ప్రాణాలను కాపాడటానికి వారిని అనుసరించిన వరుణ్ తేజ బృందం కాని, బాత్ రూమ్ లొ దాగుకున్న సైనికుల్ని
కాపాడటానికి తానూ స్నానం చేస్తున్నట్లు తెలియచేయడానికి నగ్నంగా వారి ముందు నిలబడిన జర్మనీ యువతి కాని, ఒక యూదు తల్లికి పుట్టిన కారణంగా ప్రాణం కోల్పోతున్న చిన్నపాప ప్రాణాన్ని
కాపాడటానికి తమ ప్రాణాలకు లెక్క చేయకుండా తెగించి తిరగబడిన వరుణ్ తేజ బృందం కాని, చివరికి తనని ద్వేషించే ఈశ్వర్ ప్రాణాలను
కాపాడటానికి తన ప్రాణాలకు తెగించిన సంఘటన గాని, చివరికి తనవారిని కాపాడటానికి రేపటి ఉదయం కోసం ఆశగా జీవిస్తున్నవారికి
జీవితాన్ని కల్పించడానికి ఒక సమిధగా మారడంలో గాని ప్రేమే కనబడుతుంది. తన ఇష్టమైన ప్రాణాన్ని కోల్పోయినవానికే ప్రాణం
విలువ తెలుస్తుంది.
వసుధైక కుటుంబ భావనతో తన పట్ల సంపూర్ణమైన ప్రేమ కలిగినవానికి ఎటువంటి ఉనికిని
చాతుకోవాలనే ఆలోచనలు ఉండవు. ఉనికి ని
చాటుకోవాలి అనుకునేవారు మనుషులమధ్య కులం,గోత్రం, వర్గం, వర్ణం, జాతి, మతం అనే ద్వేషాలను రగిలిస్తారు. నిజమైన
ప్రేమకోసం జీవించేవారు తమ ఉనికినే ఆహుతి చేస్తారు. యుద్ధం, ప్రేమ ఒకటే
రెండింటిలోను పోరాటం ఉంటుంది. తెగింపు ఉంటుంది. అంతమై పోయే ప్రమాదం
ఉంటుంది.
ఒక చక్కని ప్రేమకథకు, రెండవ ప్రపంచ నేపథ్యాన్ని జోడించి, ప్రపంచ వ్యాప్తంగా నైనా లేదా ఒక మారుమూల గ్రామంలోనైనా వ్యక్తులమధ్య తమ ఉనికి ని, పెత్తందారీ తనాన్ని, అజమాయిషీ ని చేలాయించుకొనాలనువాళ్ళ మధ్య
సామాన్యులు తమ హృదయాలలో ప్రేమ భావనను మరచి కంచెలు ఎలా
కట్టుకుంటున్నారో హృదయాన్ని
హత్తుకునేటట్టుగా చూపించడం లొ దర్శకుడు నూటికి నూరు పాళ్ళు విజయవంతం అయ్యారు.
ఈ సినిమా ఎలా ఉంది? అని ఎవరినీ అడగనవసరం లేదు. ఎవరి అనుభూతులు
వాళ్ళవి. మీకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం, ఆలోచనలు ఎలా ఉంటాయో అలానే ఈ సినిమా చూస్తె మీ అనుభూతులు ప్రత్యేకంగా ఉంటాయి.
మానవత్వాన్ని, మనిషిని మనిషి ప్రేమించడం మరచి అర్థం లేని గెలుపుల కొరకు వ్యర్థమైన తలపులతో జాతి, మతం, వర్ణం.
కులం అంటూ పనికిమాలిన కన్చేలతో విడిపోతున్న ఈ సమాజానికి ఈ సినిమా ప్రశ్నించే ప్రశ్నలు , పరిష్కార
మార్గాలను సిరివెన్నెలగారి పాత ద్వారా తెలియచేస్తారు...
నీకు తెలియనిదా నేస్తమా
చెంత చేరననే పంతమా
నువ్వు నేనని విడిగా లేమని
ఈ నా శ్వాసని నిను నమ్మించని
విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వేషం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అది మనిషిది అవుతుందా
అడిగావా భూగోళమా నువ్వు చూసావా ఓ
కాలమా
రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్ధం
ఇది కాదంటూ సరిహద్దుల్ని చెరిపే సంకల్పం అవుదాం
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా ||ప్రేమను ||
ఆయువు పోసిందా ఆయుధమేడైనా
రాకాసుల మూకల్నే మార్చేదా పిడివాదం
రాబందుల రెక్కల సడి ఏ జీవనవేదం
సాధించేముంది ఈ వ్యర్థ విరోధం
ఏ సస్యం పండిచదు ఈ మరుభూముల సేద్యం
రేపటి శిశువులకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం || రా
ముందడుగేద్దాం ||
అందరికీ సొంతం అందాల లోకం
కొందరికే ఉందా పొందే అదికారం
మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషి తోటి బంధం
ఏ కల్యాణం కోసం ఇంతటి కల్లోలం
నీకు తెలియందా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం
చెంత చేరననే పంతమా
ఖండాలుగా విడదీసే జెండాలను వీడి
తలవంచే తలపే అవుదాం
ఆ తలపే మన గెలుపని అందాం
ఈ ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉందా?
కనీసం ఈ పరష్కార మార్గాలను పాటించే సంసద్ధత ఉందా ?
విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించే
మానవతా వాదుల స్వప్నం సాకారం కావాలని జాగర్లమూడి
చేసిన సంకల్పం ... రసహృదయులైన తెలుగు
ప్రేక్షకుల అభిరుచికి శుచితో కూడిన స్వచ్చమైన ప్రేమకథా చిత్రం “” కంచే’’
ఇది నా అనుభూతి మాత్రమె. నా అభిప్రాయం ఎవరిమీద రుద్దాలనే ప్రయత్నం మాత్రం కాదు.
No comments:
Post a Comment