పదవ తరగతి ఫలితాలను ఇంటర్ నెట్ లో చూసుకొని చాలా ఆనంద పడింది మాలతి. తనకు 9.5 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. స్కూల్ లో ఎప్పుడూ 9.2
కన్నా ఎక్కువ వచ్చేవి కావు. పబ్లిక్ పరీక్షల్లో బాగా కష్టపడటం వలన బాగా వచ్చాయి. ఇంటికి వచ్చి
అమ్మకు చెప్పింది. కాని తల్లి నుండి స్పందన సరిగా రాలేదు. 10/10 వస్తాయని
మన చుట్టాలందరికీ చెప్పాను. ఇప్పుడు
వాళ్లకు నా మొహం ఎలా చూపించను అంటూ బాధపడింది. ఇంతలో ఆవేశంగా ఆఫీస్ నుండి నాన్నగారు వచ్చారు. ఏమిటీ మార్కులు మా ఆఫీస్ లో అటెండర్ కూతురికి 9.8 గ్రేడ్ మార్కులు వచ్చాయి.
వేలకు వేలు ఫీజులు కట్టి చదివిస్తే ఇదా నీవు చేసిన ఘనకార్యం అంటూ కూతురి పై కేకలు
వేసాడు. బిక్కమొహం వేసుకొని తన గదిలో భోజనం మాని పడుకొని ఒంటరిగా రోదించసాగింది
మాలతి.
ఇదేదో టీ.వి. సీరియల్ కథ కాదు. చాల
ఇళ్ళల్లో పదవ తరగతి ఫలితాలు వచ్చేటప్పుడు
ఇంచుమించు గా జరిగే అతి సాధారణ సన్నివేశం.
రెండు రోజుల్లో
పదవతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠత పిల్లలలో కన్నా వారి తల్లి దండ్రుల్లో అధికంగా
ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు.
పిల్లవాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన కన్నా ఒకవేళ తక్కువ మార్కులు వస్తే నలుగురిలో ఎలా చెప్పుకోవాలో అనే బాధ చాలా మంది తల్లిదండ్రులలో
కనబడుతుంది. ఈ ధోరణి విద్యార్థుల వ్యక్తిత్వం మీద మరియు వారి
భవిష్యత్తు చదువులమీద తీవ్రమైన ప్రభావం
చూపుతుందని మానసిక విశ్లేషకుల
అభిప్రాయం. పదవ తరగతి ఫలితాలు విడుదల
అవుతున్న సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కొన్ని విషయాలను దృష్టి లో ఉంచుకోవాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు, రచయిత
అలజంగి ఉదయ కుమార్ ఈ అంశాలను తెలియ చేస్తున్నారు.
తల్లిదండ్రులకు సంబంధించి :
1.
మార్కులు అనేవి
విద్యార్థుల తెలివితేటలకు కొలబద్దలు కావు.
పరీక్ష రాస్తున్న సమయంలో అనేక అంశాలు పిల్లలు పరీక్ష వ్రాసేటపుడు ప్రభావం
చూపుతాయి.
2.
పిల్లల మార్కులు తమ పట్ల తమకు అవగాహన కలిగిస్తాయి. రాబోయే రోజుల్లో ఎలా
చదవాలో, ఎలా మార్పులు చేసుకోవాలో, తమ లోపాలు ఏమిటో, తమ సామర్థ్యాలు ఏమిటో తెలియ చేస్తాయి.
3.
పిల్లల మార్కులు నలుగురి లో ప్రకటించుకొని గొప్పతనం ప్రదర్శించుకోవడం అజ్ఞానానికి,
అవగాహనరాహిత్యానికి పరాకాష్ట. ఫేస్ బుక్ లో మార్కుల కాపీ కూడా పోస్ట్ చేసి లైక్ లు
కామెంట్లు లెక్కపెట్టుకోవద్దు. ఒకవేళ పాఠశాల వారు ప్రకటించుకుంటే అది వారికి సంబంధించినది. టీ.వీ లలో వచ్చే
వివిధ పాఠశాల వ్యాపార ప్రకటనలతో మీ పిల్లల మార్కులను తక్కువ చేసి చూడకండి.
4.
పిల్లలకు నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని
తల్లిదండ్రులు పెంచే విధంగా ప్రవర్తించాలి తప్ప , జరిగిపోయిన విషయాలు త్రవ్వి వారి
మానసిక ఒత్తిడి ని పెంచకూడదు.
5.
గ్రేడ్ మార్కులు తగ్గడం అనేది అనేక అంశాల మీద ఆధార
పడి ఉంటుంది. పదవ తరగతి లో ఉండే చాలా
సబ్జెక్ట్స్ తదుపరి చదువులో ఉండవు. అందువలన కొన్ని సబ్జెక్ట్స్ లో మార్కులు తగ్గినందువలన భవిష్యత్ చదువుకు పెద్దగా జరిగే నష్టం ఉండదు.
6.
అతిగా పొగిడినా లేక అతిగా మందలించినా అనుకోని దుష్పరిమాణాలు జరగవచ్చు.
7.
పిల్లలు మానసికంగా బాధపడుతుంటే ఒంటరిగా వారిని విడిచిపెట్టకూడదు.
వారు భవిష్యత్ చదువు పై సానుకూలంగా దృష్టి
పెట్టేటట్టు చర్యలు తీసుకోవాలి.
8.
పిల్లల ముందు వారు చదివిన పాఠశాలను కాని ఉపాధ్యాయులను కాని ఎట్టి పరిస్థితుల్లో
నిందించరాదు.
విద్యార్థులకు
సంబంధించి:
1.
పదవ తరగతి లో మీరు సాధించిన గ్రేడులు ఆ సమయంలో మీరు చేసిన
కృషికి ఫలితమే అని తెలుసుకోవాలి. అంతే తప్ప
తెలివితేటలకు మార్కులే ప్రమాణం కాదని గ్రహించాలి.
2.
విజయం అనేది ఒక గమనం అంతే కాని గమ్యం కాదు. పదవతరగతి కేవలం మొదటి మెట్టు
మాత్రమే.. ఇంకా చాలా సుదూరం ప్రయాణించాలని తెలుసుకోవాలి.
3.
తమ మిత్రుల మార్కులతో పోల్చుకోవడం కాని ఎక్కువ గ్రేడులు వచ్చిన వారి పట్ల ఈర్ష్య
అసూయలు పెంచుకోవడంగాని, తక్కువ వచ్చిన
వారిని హేళన చేయడం గాని చేయరాదు.
4.
మంఛి
మార్కులు వస్తే అదే స్థాయిని
ప్రమాణాలను ఉన్నత చదువుల్లో కొనసాగించాల్సిన గురుతర భాద్యత మీ పై ఉంటుందని గ్రహించండి. తక్కువ మార్కులు వస్తే లోపం ఎక్కడ ఉందో, మీ బలహీనతలేమిటో
తెలుసుకొని వాటిని సరిదిద్దుకోడానికి ప్రయత్నించండి.
5.
జీవితం మొత్తం లో పదవ తరగతి అనేది చాలా చిన్న విషయం.
ఇంకా ఎన్నో గమ్యాలు చేరాలి. ఇంకా ఎన్నో నైపుణ్యాలు పెంచుకోవాలి అని
గ్రహించండి.
6.
ఎవరు నిరుత్సాహ పరిచినా, ఎవరు అతిగా పొగిడినా ఒకేలా తీసుకొని భవిష్యత్ లో ఎలా
చదవాలో ప్రణాళిక వేసుకోండి.
7.
స్నేహితుల విజయాలను అభినందించండి. ఉన్నత లక్ష్యాలవైపు ముందుకుసాగండి.
విష్ యు గుడ్ లక్
అలజంగి
ఉదయ కుమార్
trainerudaykumar@gmail.com
Useful...good
ReplyDelete