ఆలోచనలకేం పరి పరి విధాలుగా ఉండొచ్చు
ఆకాశానికి నిచ్చెన వేసి అందలమెక్కించవచ్చు
అదే క్షణం లొ అథో పాతాళానికి తొక్కించవచ్చు
అందంగా, ఆకర్షించే విధంగా ఉన్నాయని
ఊరిస్తున్నాయని, ప్రేరేపిస్తున్నాయని
తర్క వితర్కాలను ప్రక్కనబెట్టి
ఆలోచనల్లో చిక్కుకున్నావా?
అన్యాయంగా సాలెగూడులో కీటకంలా
చటుక్కున చిక్కుకొని గిలగిల లాడక తప్పదు
ఏ ఆలోచన అయినా నీకు మాత్రమె పరిమితం
అంతర్గతంగా చెలరేగే ఆ పరంపరని నీలోనే ఉండని
ఆలోచన ఆచరణగా మారాలంటే
అనంతమైన విచక్షణ ఉండాలి
నీ ఆలోచనలెవరూ గుర్తించలేరు గాని
నీవు వేసే ప్రతి అడుగుని భూతద్దం పట్టుకొని
శోధించడానికి, సాధించడానికి
అంగుళానికొకడుంటాడు
అనుక్షణం అహరహం నీడలా
ఒళ్ళంతా కళ్ళుచెసుకొని నీవెంటే సాగుతుంటారు
మయసభని మరిపించే మాయాలోకం ఇది
ఏది నిజమో ఏది భ్రాంతో
ఏది సన్మార్గమో ఏది కుమార్గమో
వింత వింత వ్యామోహాలతో
అనంతమైన ఆకర్షణలతో
ఉన్న మతిని పోగొట్టి ఉన్మాదిని చేసి
నీ ఆలోచనలే నిన్ను ప్రక్కదారి పట్టించవచ్చు
అర్థరహితైన, అప్రయోజకమైన ఆలోచనల సమాహరాల్ని
మస్తిష్కపు కుహారాల్లో నిశ్శబ్దంగా ఉండనీ
వాటికి నీవు భాధ్యుడివి కావేమో
కాని వేసే ప్రతి అడుగుకి మాత్రం జవాబుదారీ మాత్రం నీవే
నీ గమనం నీ గమ్యం వైపు సాగాలి
నీ ఆచరణ నలుగురికి ఆదర్శప్రాయంగా సాగాలి
నీ ప్రవర్తన ప్రభోధదాయకంగా సాగాలి
మనసుని గెలుచుకున్నవాడే మనీషి
అంతే కాని 'మనీ' కి 'షి' కి లొంగే వాడు కాదు
మనసు మాయాజాలంలో పడి దోర్లేవాడు కాదు
trainerudaykumar@gmail.com
No comments:
Post a Comment