Tuesday, 3 June 2014

గుండెలో తడి ని సజీవంగా నిలిపే చిత్రం మనం


ఈ రాజకీయాలు, ఎన్నికలు, లెక్కింపులు, గెలుపులు , ఓటములు, ఇవన్నీ చూసి చూసి అలిసి పోయారా?  ఏ చానెల్ చూసినా, ఏ పేపర్ చూసినా   ఏవి నమ్మాలో. ఏవి అనుసరించాలో తెలియక యాంత్రికత అలవరుచుకొని  జీవితం లో జీవాన్ని కోల్పోయారా?...  వేసవి లో ఉష్ణతాపాన్ని తట్టుకోలేక తల్లడిల్లి పోయారా? గుండెలో తడి ఆరి పోయి ఆర్ద్రత అంతా ఇంకిపోయి మోడిబారిపోయారా????? 

      ఎడారిలో ఎండమావులవెంట పరుగులెత్తిన వారికి ఖర్జూరపు తోటలతో నిండిన ఒక ఒయాసిస్సు లా, మండువేసవిలో తల్లడిల్లినవారికి ఒక చల్లని జలపాతం హాయిగా  సేద దీర్చే అతి చక్కని చిత్రం " మనం "
  
            ఇక వెంటనే సకుటుంబ సపరివార సమేతం గా " మనం" సినిమాకి వెళ్ళండి. బాగుందట, బాగో లేదట   మగధీర, మూగ మనసులు సినిమాల్లా  పునర్జన్మ తో కూడిన సినిమా అట. అదట ఇదట  అంటూ అందరూ చెప్పిన మాటలు పక్కన పెట్టండి.  లాజిక్కుల్ని, హేతువాద  విశ్లేషణల్ని పక్కన పెట్టి  సినిమా లో పూర్తిగా నిమగ్నమవ్వండి.   కలకాలం గుర్తుంచుకోతగ్గ గుండెను పిండే ఒక రసానుభూతి తో బయటకు వస్తారనడం లో ఏ మాత్రం సందేహం లేదు. 
    భావకవి గా పేరు గాంచిన కృష్ణశాస్త్రి  అడివి అందాలు చూడాలంటే కళ్ళతో కాదు .. ఆకు లో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై అంటూ ఆయా అంశాలతో నిమగ్నమై చూస్తేనే రసస్పూర్తి పొందుతారని వర్ణించారు. ఆరవ బర్త్ డే  ఆనందంగా జరిగి, ఊహించని బహుమానాలతో అందరితో ఆనందించి, తల్లిదండ్రులు అన్యోన్యంగా కీచులాడుకోకుండా ఉండాలని కేక్ కట్ చేసేటపుడు మనస్పూర్తిగా కోరుకున్న ఒక చిన్నారికి మరుసటి దినమే విగత జీవులై తల్లిదండ్రులు కనిపిస్తే , వారు తన నుండి ఏమి కోరుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక వీడియో రూపం లో అందిస్తే అది చూస్తూ పెద వాడైన ఆ బాలునికి తన తల్లి, తండ్రి మరలా కనిపిస్తే.....      ఆ   పాత్రలో  మిమ్మల్ని మీరు ఊహించుకోగలిగితే లేదా కనీసం ఎంపతీ తో ఆలోచించ గలిగితే .....  తాను ఎలాంటి అనుభూతిని పొందనో   తన కడుపును పుట్టిన మరో పాత్ర అదే అనుభూతి పొందితే.....  ఇది కేవలను మాటలతో చెప్పలేని ఒకభావన....   ఎక్కడా ఏ మాత్రం  అసహజం అని అనిపించనీయకుండా  వస్త్రధారణ తో పాటు  గోల్డ్ స్పాట్   సీసా  తో  పాటు అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని ఒక శిల్పం లా మలచిన తీరు చూస్తే దర్శకుడిని అభినందించకుండా ఉండలేరు.  ఒక కుటుంబం మొత్తం  ఆ  కుటుంబం ఎదుగుదలకు మూలవిరాట్టు అయిన ఆ మాహానటునికి ఇచ్చిన ఘన నివాళి ఈ సినిమా.    నట వారసత్వాన్ని  ఒక తరం నుండి మరో తరం అందిప్ అందిపుచ్చుకున్న తీరుని హర్షించకుండా ఉండ లేము.  ఎవరు ఎలా నటించారు, కథ ఏమిటి ఇవన్ని చెప్పాలా?  మీ అనుభూతులు ఎలా ఉండాలో చెప్పడానికి మేం ఎవరం.  చక్కగా సినిమా చూసి ఆనందించండి.  అందరినీ అభనందించండి. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నట్టయితే మనసా వాచా కర్మేణా ప్రేమించండి. ఒక వేళ మన మధ్య లేకపోతే ఏదో ఒక రూపం లో ఎప్పుడో ఒకప్పుడు కనబడతారని ఆశిస్తూ జీవించండి. కళామతల్లి ముద్దుబిడ అక్కినేనికి ఘన నివాళు అర్పించండి. మన తెలుగువాడయినందుకు గర్వించండి.     .. by  A. Uday Kumar

1 comment: