జడబారిన హృదయాల్లో జడివానలాంటి ఆలోచనలు రేకెత్తించే చిరు(గ)జల్లు.......
తండ్రి అడుగుజాడల్లో ప్రస్థానాన్ని ప్రారంభించిన తండ్రికి తగ్గ తనయ చిరంజీవి సంస్కృతి...
సంగీత మరియు సాహిత్య ప్రియులకు గజల్ శ్రీనివాస్ సుపరిచితులు. ఆలోచనాంబుధిలో ఓలలాడించే సరస సాహిత్య ప్రక్రియ అయిన గజల్ ను విదేశాలనుండి దిగుమతి చేసుకున్నప్పటికీ మన సంస్కృతి, మానవీయ విలువలతో ఒక వినూత్న గానసరళి లో తనదైన ప్రత్యేక శైలిలో తెలుగు గజల్ కు దశా దిశా నిర్దేశం చేసిన గజల్ శ్రీనివాస్ ఈ రచనా ప్రక్రియని పదిమందికి తెలియచేస్తూ ఎందరో గజల్ రచయితల గజల్లను తెలుగు శ్రోతలకు పరిచయం చేస్తూ కొత్త ఒరవడి ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగమే ఇటీవల విడుదల అయిన చిరు(గ)జల్లు ఆడియో సి.డి.
ఈ తెలుగు గజల్ అడియీ సి.డి. ప్రత్యేకత మరియు ఆయన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఓ మైలురాయి ఏమిటంటే ఈ సి.డి లో గజల్లను తన ముద్దుల కుమార్తే చిరంజీవి సంస్కృతి చే పాడించడం. విశ్వవ్యాప్తంగా గజల్ గానంతో స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ గజల గాన వైతాళికుని వారసురాలుగా సంస్కృతి పాడిన తీరు, మధురమైన, గుండెల్లో మెళికలు తిప్పే కొన్ని సున్నితమైన భావాలను పలికిన తీరు మంద్రమైన స్వరం లో కొన్ని భావాలను వ్యక్తపరచిన తీరు సంగీతం లో ఏ మాత్రం ప్రవేశం లేని వారితో సైతం శభాష్ అనిపిస్తాయి. సంగీతం తెలిసినవారికి రాగయుక్తం గా ఎక్కడా శృతితప్పకుండా పాడిన విధానం ఔరా అనిపించి నిండైన మనసుతో ఈ చిన్నారి దీవెనల పెనుజల్లు కురిపిస్తాయి.
గజల్ శ్రీనివాస్ గారి పరిచయ వాక్యాలతో ప్రారంభమయ్యే ఈ సి.డి లో మొత్తం 7 గజల్లు ఉన్నాయి. మొట్ట మొదటి గజల్ గురుదేవులు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు రచించిన '' మంచుపొగలుండేవి మరికొద్ది క్షణాల్లే - ఆ పిదప నిండేవి ఆదిత్య కిరణాలే '' అనే గజల్ నిండైన వ్యక్తిత్వపు నమూనా ను ఆవిష్కరిస్తుంది. ఇదే పంథాలో మంచి సహితీ విలువలతో కూడిన భావపరంపర ను కలిగించే '' జీవిత సత్యాల గురించి చెట్టేమని అంటుంది" అంటూ డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారి గజల్, " నమ్మదగిన మనిషేది అమ్మ తప్ప " అంటూ శ్రీ రెంటాల వెంకటేశ్వర రావు గారి గజల్ మరియు " ఎంత గాయం చేసినా " అంటూ శ్రీ సురారం శంకర్ గారి గజల్ తెలుగు భాష లో గజల్ ప్రక్రియ ద్వారా తేలికైన పదాలతో బరువైన భావాలను ఎలా వ్యక్తపరుస్తాయి.
ఈ చిరు గజల్లు ఆడియో సి.డి ప్రత్యేకత మరియు తలమానికంగా చెప్పే గజల్లు ఏమిటంటే మన చిన్నారులు కార్పోరేట్ విద్యా విధానం వలన, బిజీ బిజీ బ్రతుకుల్లో బానిసలమవుతూ మనం విస్మరిస్తున్న అరుదైన బాల్యం పడుతున్న గాయాల గురించి తెలియచేయడమే కాకుండా వింటున్న ప్రతీ తల్లిదండ్రులు భుజాలు తడుముకునే విధంగా , తాము వెంటనే తెలుసుకోవలసిన తమ పిల్ల హృదయాల వేదన గురించి కర్తవ్య బోధన చేస్తాయి. ముఖ్యంగా డాక్టర్ తటపర్తి రాజగోపబాలం రచించిన " అమ్మ చేతి ముద్దలు" అనే గజల్ హాస్టల్ లో ఉండే పిల్లల అవ్యక్త వేదనను కన్ను చమర్చేలా వివరిస్తుంది. డాక్టర్ ఎం.బీ.డి. శ్యామల గారు రచించిన " అందమైన బాల్యానికి గాయం అయిందా?" అనే గజల్ నేటి విద్యా వ్యవస్థ లో నలుగుతున్న పిల్లల అత్యంత విలువైన సహజ హక్కు అయిన బాల్యం పడుతున్న వేదన మనలో మానని గాయాలను రగిలిస్తుంది.
ఈ ఆడియో సి.డి లో చివరి గజల్ ప్రేమాభిమానలతో, ముద్దు ముచ్చట్లతో కోలాహలంగా ఉండాల్సిన ఇంట్లో చిన్న పిల్లలు ఒంటరి తనాన్ని ఎందుకు ఎలా అనుభవిస్తున్నారో తెలియచేస్తుంది. నీ పిల్లలకు నీవిచ్చే గొప్ప బహుమతి ఒక గంట వారితో గడపటం అనే మాట నిజమనిపిస్తుంది. ప్రేమాభిమానాలనే నీరుపోసి పెంచాల్సిన ఈ పాదులు ఎలా ప్రేమరాహిత్యమనే ఎడారికి ఎలా బలవుతున్నాయో తెలియచేస్తుంది. తల్లిదంద్రుల ప్రధమ కర్తవ్యం మంచి భవిష్యత్తు ఇవ్వడం మాత్రమే కాదు బంగారు బాల్యాన్ని ఆనందంతొ తనివితీరా అనిభవించే అవకాశం కలిపించాలనే కర్తవ్య బోధన చేస్తాయి.
ఈ గజల్లు వింటే పన్నెండు సంవత్సరాల లే లేత ప్రాయం లో ఉన్న ఒక పసిగొంతు పాడిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.. '' ఇలా తయారు చేసారు దేశాన్ని ఏం త్రాగి బ్రతకాలి కంటి చెమ్మ తప్ప ?'' ఏవేవో పోయాయని ఏడుస్తారెందుకు.. ఏం పట్టుకొచ్చారు జన్మ తప్ప ? అని ఆరిందలా ప్రశ్నిస్తుంటే భావ వ్యక్తీకరణలో ఆ గొంతు గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
బాల్యం ఎదుర్కుంటున్న సమస్యల పట్ల వారి బాల్యాన్ని వారు అనుభవించాల్సిన ప్రాధాన్యత ను గుర్తు చేసే
అంశాలతో కూడిన గజల్లను ఎన్నుకోవడం హర్షించతగ్గ విషయం. ప్రతీ తల్లిదండ్రులు తప్పక వినాల్సిన ఆడియో సి>డి. పుట్టినరోజు లకు కానుక ఈ ఆడియో సి.డి ఇస్తే అంతకు మించిన విలువైన కానుక ఏదీ ఉండదు.
చిరంజీవి సంస్కృతికి హార్ధిక అభినందనలు. తండ్రి వారసత్వానికి తొలి అడుగు వేల వేల మైళ్ళ ప్రయాణం కావాలని సంగీత ప్రపంచం లో చిరస్థాయి స్థిర స్థాయిగా నిలవాలని ఆశీర్వదిస్తూ.....
అలజంగి ఉదయ్ కుమార్
koodali.org, haaram, jalleda, telugu gazels, gazal srinivas, trainer uday kumar
గజల్ శ్రీనివాస్ గారి గొంతు విలక్షణం.అలాగే వారమ్మాయి గొప్ప గాయని కావాలని కోరుకుంటూ ఆమెకు అభినందనలు.
ReplyDelete