Thursday, 9 February 2012

భజగోవిందం - వ్యక్తిత్వ వికాసం( 4)


            శంకరాచార్యులవారి ఈ శ్లోకాలన్నింటిని కలిపి మోహముద్గారంఅని అంటారు.  జీవితం పట్ల విపరీతమైన కాంక్షను కలిగి యుండి శరీరం పట్ల విపరీతమైన మోజును కలిగి ఉండి చివరలో  ఈ జీవితాన్ని విడిచి పెట్టవలసిన సమయంలో తీవ్ర దుఃఖానికి లోనవుతారని ఈ శ్లోకం లో హెచ్చరిస్తున్నారు.
                                      నలినీదళగత జలమతి తరళం
                                       తద్వజ్జీవితమతిశయచపలం
                                       విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
                                       లోకం శోకహతం చ సమస్తం .. 4
( భావం;  తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.)
      అచంచల స్వభావం కలిగిన జీవితాన్ని తామరాకు పై నీటి బొట్టు తో శంకరాచార్యులు పోల్చుట జరిగింది. ఒకసారి వృద్ధాప్య దశకు చేరిన వారిని ఎవరినైనా కదిపినట్లైతే ఇంకా మొన్న మొన్నే స్కూల్ కి వెళ్ళి నట్టుంది, ఈ మధ్యే వివాహం అయినట్టుగా ఉంది, చూస్తుండగానే అరవై ఏళ్ళు గడచాయంటే  అసలు నమ్మబుద్ధి కావట్లేదంటారు.  తామరాకు పై నీటి బొట్టు తో జీవితాన్ని పోల్చడం లో  రెండు ముఖ్యమైన విషయాలు తెలియచేస్తున్నారు
   1.  జీవితం అత్యంత అస్థిరమైనది. నీటిబొట్టు తామరాకు పై బాహ్యంగా జరిగే ఏ ప్రభావానికైనా కదులుతూ ఉంటుంది. నేను గొప్ప. నేను శాశ్వతం అనే ఆలోచనలో అహంభావ ప్రదర్శన చేసే వారు  గ్రహించవలసిన విషయం ఇది. అమెరికాలో  1923 అమెరికా దేశంలో అత్యంత సంపన్నులైన ఎనిమిది మంది ఎడ్జ్ వాటర్ బీచ్  హోటల్  నందు సమావేశమై అమెరికా లో అందరి వద్ద కలిపితే ఎంత సంపద ఉందో  తమ ఎనిమిది మంది వద్ద అంత సంపద ఉందని ప్రకటించి, అమెరికా ఆర్ధిక వ్యవస్థనే ప్రభావితచేయగలమని ప్రకటించారట.  1929 లో సంబంవించిన ఆర్ధిక మాంద్యం ప్రభావ ఫలితంగా  కొంతకాలానికి  ఈ  ఎనిమిది మందిలో ముగ్గురు  ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, ఇద్దరు  దివాళా పిటీషన్ తెచ్చుకొని పేదరికంలో మరణించడం జరిగింది, ఒక్కరు పిచ్చెక్కి మరో ఇద్దరు జైలు జీవితంలో  మరణించడం జరిగింది.  నాది నాది అనుకునేది నీది కాదురా  అని ఒక సినీ కవి చెప్పినట్టు  తామరాకు పై ఉన నీటిబొట్టు ఏ మార్పు జరిగినా ఏల నేలకు రాలిపోతుందో మానవ జీవితమ్ కూడా అంతే.  
 2.  తామరాకు పై నీటిబొట్టు తో జీవితాన్ని పోల్చడంతొ  మనిషి ఈ జీవితాన్ని ఎలా  బ్రతకాలో కూడా  శంకరాచార్యులవారు  తెలియచేస్తున్నరు. నీటిబొట్టు తామరాకుపై ఉన్నప్పటికీ తామరాకుతో ఎటువంటి సంబంధం లేకుండా పూర్తి detachment  తో ఉంటుంది.  నా శరీరం, నా సంపద, నా సంతానం, నా ఆస్తి,  నా సౌందర్యం అనే బంధాల్లో చిక్కుకున్న మనుషులు పై శ్లోకంలో చెప్పినట్టు శోకానికి గురు అవుతున్నారు. ఏదీ నీది కాదని అనుకో అనే తత్వ విచారమున్నట్లైతే ఎటువంటి బాధ మనసుకి అంటదు.  ఒకతను తెల్లవారి లేచి పెద్ద పెద్ద కేకలతో ఏడవడం మొదలుపెట్టాడట. అందరూ చేరి కారణమేమిటని అడిగారట. కలలో తనకు వజ్రాలు, బంగారం, అందమైన భార్య దొరికాయని తీరా నిద్ర లేచి చూస్తే అవన్నీ పోయాయని ఏడుస్తున్నానని సమాధనం చెప్పాడట. అంతా వాడిని చూసి పిచ్చివాడని ఎగతాళి చేయడం మొదలుపెట్టారట. దానికి ఆయన వాళ్ళతో  జీవితం కూడా  ఒక పెద్ద కల లాంటిదే  ఎప్పుడైతే మీలో  నిజమైన జాగృతావస్థ  వస్తుందో  ఈ బందనాల పట్ల విముఖత కలిగి ఈ బంధనాలనుండి విముక్తులవుతారు అని బోధించాడట.
                   ఈ శ్లోకంలో  తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే  The more you are attached to the worldly mundane attachments, the more you will suffer.  ఎన్ని బంధాలు, వ్యామోహాలు పెట్టుకుంటే అంత బాధపడాల్సి ఉంటుంది. ఎప్పటికైనా వీటిని పోగొట్టుకోవలసి వస్తుంది అనే త్యాగ భావనతో  మన కర్తవ్యాల్ని విస్మరించకుండా ముందుకుపోవాలి. Let us have detached attachments in our outer life.  శరీరం పొందే ఏ అవస్థ యొక్క ప్రభావం మనసుపై పడకుండా ఉండగలిగితే శొకరహితంగా జీవించవచ్చని శంకరుల అభిప్రాయం.


No comments:

Post a Comment